మనసు చదివిన కుంచె.. - అచ్చంగా తెలుగు

మనసు చదివిన కుంచె..

Share This
 మనసు చదివిన కుంచె..
(చిత్రకారిణి చెరువు శ్రీలక్ష్మీసుబ్రహ్మణ్యం గారి ప్రత్యేక పరిచయం...)
-      కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్


ఆమె కుంచె కదిలిస్తే.. ఊహలకు ఊపిరులొస్తాయ్.. బొమ్మలకి ప్రాణం వస్తుంది.. ఆలోచనలు ఆకృతిదాలుస్తాయ్.. ఏడురంగులు హోళీలాడతాయ్.. తెలుగు బొమ్మకు విశ్వఖ్యాతి అందిస్తాయ్ ఆమె కుంచె రంగులో ముంచితే... రాధామాధవులు నృత్యం చేస్తారు... అడవమ్మ కోయిలై కూస్తుంది.. జాణతనం కొంటెగా పిలుస్తుంది.. అభాగ్యుడు బ్రతుకింతేనా అనిపిస్తాయ్ ఆమె కాన్వాస్ పై అద్దిన రంగులు.. కొత్తప్రపంచంలోకి అలవోకగా తీసుకెళతాయ్.. వేలెత్తి సమాజాన్ని దూనమాడతాయ్..!  ఎన్నో ఖళాకండాలకు తన కుంచె తో రంగులద్దుతూ... కృష్ణతత్వాన్ని కాన్వాస్ ఎక్కించి.. పలువురు కళాకారులకు ఆదర్శంగా నిలిచిన చిత్రకారిణి..చెరువు శ్రీలక్ష్మిసుబ్రహ్మణ్యం..!

కలకంఠి వంటింటి కుందేలు కారాదని.. పురుషునికి ఏమాత్రం తీసిపోని ధీరత్వం మహిళలలో దాగుంటుందని.. చిత్రకళ  కూడా పురుషులకే కాదని మహిళలలో కూడా చేయితిరిగిన కళాకారిణులుంటారని.. పుట్టుకొస్తుంటారని చెప్పకనే  చెబుతున్న శ్రీలక్ష్మి సుబ్రహ్మణ్యం అంతరంగం ఈ నెల తెలుగు బొమ్మలో తెలుసుకుందాం...!
ఎలా మొదలైంది..? 
ఒకరోజు స్కూల్లో డ్రాయింగ్ టీచర్ చిన్నారులందరినీ బొమ్మలేసుకురమ్మన్నారు.. బుజ్జిబుజ్జి చేతులతో బొమ్మలేయడం రాని ఓ చిన్నారి అక్కలను ఆశ్రయించేది.. అక్కలు హోం వర్క్స్ తో బిజీగా ఉన్నప్పుడు బొమ్మ వేసిచ్చే వరకూ..బుంగమూతితో కూర్చునేది..  చివరకు తనలో కసి రగిలింది... అక్కలేయగ లేంది తానెందుకేయలేనూ అని తనలో తాను ప్రశ్నించుకుంది. ఆనాడు బొమ్మలు గీయడం  మొదలెట్టిన చేతులు ఇంకా బొమ్మలు గీస్తూనే వున్నాయ్.. పథం మార్చుకుని ముందడుగు వేస్తూనే, కొత్తపుంతలు తొక్కి అందరినీ ఆశ్చర్యచకితులని చేస్తున్నాయ్.ఆమే చెరువు శ్రీలక్ష్మిసుబ్రహ్మణ్యం.

ఎవరీమె.. ఏమిటీ నేపథ్యం..?
నాట్యంలో అవధాన ప్రక్రియకు ఆద్యులు ఎన్నో నాట్యావధానాలు చేసి ప్రపంచ డా. ధారా రామనాధ శాస్త్రి, సావిత్రమ్మ గార్ల గారాలపట్టి ఈ శ్రీలక్ష్మి. ఈమె 7 ఫిబ్రవరి 1975 న ధారా దంపతులకు జన్మించారు.  అయిదుగురు అక్కలు ఒక అన్నల ల ముద్దుల చెల్లి గా ఎదిగారు శ్రీలక్ష్మి . వీరి స్వగ్రామం ప్రకాశం జిల్లా కేంద్రం.. ఒంగోలు.. ఈమె బొమ్మలు వేయడంలో ఏకలవ్య పోకడ సుస్పష్టమౌతోంది.  చిన్ననాట రవివర్మ , బాపూ చిత్రాలను అనుకరిస్తూ ఆ బొమ్మలలో తాను గీసిన చిత్రంలోని అందాన్ని బేరీజు వేసుకుంటూ బొమ్మలు గీయడం పై ఆసక్తి ఇనుమడింపజేసుకుంది. తండ్రి తెచ్చి ఇచ్చిన సినీ ఆర్టిస్ట్ గంగాధర్ గారి బొమ్మలను ఎంతో నిశితంగా పరిశీలిస్తూ చూసి వేసేది. పెన్సిల్ ఆర్ట్, వాటర్ ఆర్ట్, అయిల్ పెయింటింగ్, ఆక్రిలిక్ పెయింటింగ్, రియలిస్టిక్ పెయింటింగ్ నుంచి మోడ్రన్ పెయింటింగ్ వరకూ ప్రతిభ కనబరిచిన ఆమెకు గురుబోధ అవసరపడలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంటిలోని సాహిత్య సంగీత, నాట్య నేపథ్యాలు ఆమెను అలా ముందుకు నడిపించాయనే చెప్పొచ్చు.
అసలు నేటికీ గురువు లేరా..?
తొలినాళ్ళలో బొమ్మలు గీయడంలో, అక్క చెరువు లలితా కుమారిను అనుసరించేవారు శ్రీలక్ష్మి.. అక్క చక్కటి చిత్రకారిణి కావడం తనలో చిత్రకళ ఆసక్తి పెరగడానికి ముఖ్య కారణం అని చెబుతుంటారు శ్రీలక్ష్మి. వీరి విద్యాభ్యాసం మొత్తం ఒంగోలులోనే సాగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సాంఘీక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ  పొందారు శ్రీలక్ష్మి. విద్యాభ్యాసం అనంతరం... చెరువు సీతారామశాస్త్రి , సరోజినీ దేవి గార్ల కుమారుడు సుబ్రహ్మణ్యంతో ..ధారా శ్రీలక్మికి 2001 లో వివాహం అయింది. శ్రీలక్ష్మిసుబ్రహ్మణ్యం దంపతులకు ఏకైక కుమారుడు  సాయి కృష్ణ సుహాస్. పెళ్ళైన నాటి నుండి చెరువు శ్రీలక్ష్మిగా మారిన ఈమె చిత్రకళ గురించి తెలుసుకున్న భర్త సుబ్రహ్మణ్యం ఆమె ప్రతిభను బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం మొదలెట్టారు. ఈమెలో ఉన్న ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు  ప్రముఖ చిత్రకారులు సృష్టి ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి తిమిరి రవీంద్ర గారి వద్ద శిష్యత్వం ఇప్పించారు..అంత వరకూ తనకు తానుగా పలు చిత్రాలు చూసి బొమ్మలకు ప్రాణం పోసిన శ్రీలక్ష్మీసుబ్రహ్మణ్యం గురువు వద్ద శిక్షణలో రియలిస్టిక్, మోడ్రన్ ఆర్ట్స్ లో మెళుకువలు నేర్చుకున్నారు.. కలర్ మిక్సింగ్ లో గురు శిక్షణ ఈమెకు అక్కరకొచ్చింది..
 ఆర్ట్ లో కృష్ణం వందే జగద్గురుం ప్రత్యేకత ఏమిటో..ఆమె మాటల్లోనే.. "
అవతారాలన్నింటిలోకీ ఉత్కృష్టమైన అవతారం. శ్రీకృష్ణుని జననమే ఓ అద్బుత ఘట్టం.. చిన్నారులు చేసే అల్లరికి కృష్ణుడే ఆద్యుడు. అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్న, వన్నెల చిన్నెల కన్నెల మనసు  దొంగిలించినవాడు కొంటె కృష్ణయ్య...... మహాభారత యుద్ధంలో కీలకం కృష్ణుడు.. గీతాభోధతో జగత్తును తట్టిలేపినంది కృష్ణుడు.. ప్రణయగీతికి ప్రేరణ రాధాకృష్ణుడు.. అలాంటి గొప్పతత్వం ..శ్రీకృష్ణ తత్వం.  అందుకే శ్రీకృష్ణుని జననం నుంచి... అవతార పరిసమాప్తి వరకూ  72 మినీ యేచర్స్ తో (36x48 సైజు) ఒకే కాన్వాసు పై గీశాను.... ఎందరినో ఆకట్టుకుంటున్న ఈ బృహత్తర చిత్రం నాకు చాలా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా..ఇలాంటి ప్రక్రియ చిత్రకళలో మునుపెన్నడూ ఎవ్వరూ చేయలేదు.." అని సంతోషంతో  తన భావాలను 'అచ్చంగా తెలుగు' తో పంచుకున్నారు. శ్రీలక్ష్మిసుబ్రహ్మణ్యం   నిజంగానే ఇప్పుడు ఆమె గీసిన కృష్ణం వందే జగద్గురుం పెయింటింగ్ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఇంతవరకూ ఎవరూ వేయని... తరహా లో 72 మినీ యేచర్స్ తో 36x48 సైజులో కృష్ణుని తత్వాన్ని..కాన్వాస్ ఎక్కించారు. వివాహం తర్వాత భర్త సుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో ..సృష్టి ఆర్ట్స్ అకాడమి కార్యదర్శి తిమిరి రవీంద్ర సూచనలతో... తన ఆలోచనలకు...కృష్ణం వందే జగద్గురుం అని నామకరణం చేసి.. కృష్ణుని పుట్టుక నుంచి నిర్యాణం వరకూ చిత్రించారు. కాగా అమె గీసిన అనేక చిత్రాలకు ఎన్నో అవార్డులు వరించాయి. 

అవార్డులు - రివార్డులు...
ఆమె గీసిన చిత్రాలు ఒకదానికి మించి ఒకటుంటాయి. వాటిలోని చిత్రరాజాలైన... 'కొండకోన' చిత్రానికి, రీగల్ స్ప్లెండర్  చిత్రానికి, ఓల్డ్ స్పయిస్ చిత్రానికి  ఎన్నో ప్రశంసలు, అవార్డులు ఈమెను వరించాయ్.   సృష్టి ఆర్ట్స్ అకాడమి చిత్రకళా మహోత్సవం 2010 లో ఉత్తమ చిత్రకారిణి అవార్డు.. సుప్రియ కళానిలయంలో ఉమెన్ జ్యూరీ అవార్డు.. అజంతా కళారామం , తెనాలి వారు నిర్వహించిన జాతీయ చిత్రకళా ప్రదర్శ్నలో ఎస్.ఎ.కె.అవార్డు. కొనసీమ చిత్రకళా పరిషత్ , అమలాపురం వారు నిర్వహించిన జాతీయస్థాయి చిత్రకళా మహోత్సవం లో జ్యూరి అవార్డు. అమీర్ ఆర్ట్స్ అకాడమి వారు నిర్వహించిన జాతీయస్థాయి ప్రదర్శనలో ' కొండకూన ' చిత్రానికి కొండపల్లి శేషగిరిరావు అవార్డుతో సన్మానం . వంటి అవార్డ్ లు ప్రశంశాపత్రాలు ఆమె  షోకేస్ లో వచ్చి చేరాయ్.. చేరుతూనే వున్నాయ్.. ఇప్పటి " కృష్ణం వందే జగద్గురుం" చిత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మిరకిల్ వరల్డ్ రికార్డ్స్ కు ఎంపికై, ఆమోదం.. కోసం వేచి చూస్తున్నారీమె. 
ఏమిటి శ్రీలక్ష్మి లక్ష్యం.. 
రాష్ట్రపతి అవార్డు గ్రహీత టి.నరసింహారావు మాస్టరు చేతుల మీదుగా ఓల్డ్ స్పైస్ చిత్రానికి కోనసీమ అవార్డ్ అందుకోవడం, బాలబంధు బి.ఎ. రెడ్డి గారి చేతుల మీదుగా కొండకూన చిత్రానికి అవార్డ్ అందుకోవడం తన అదృష్టంగా చెప్పే శ్రీలక్ష్మిసుబ్రహ్మణ్యం  మహిళా శక్తిని చాటి చెప్పేలా " మహిళా సాధికారత "ను కాన్వాస్ పై ఎక్కించాలనేది తన జీవితాశయం అని ఆమె అంటున్నారు.. తన చిత్రాల ప్రదర్శనల ద్వారా వచ్చే సొమ్మును అనాధ, వృద్ధశరణాలయాలకు అందించి..సమాజ శ్రేయస్సుకు తనవంతు సాయమందించాలన్నదే తన అభిమతం అని ఆమె చెబుతున్నారు..   మరి శ్రీలక్ష్మి ' కృష్ణం వందే జగద్గురుం' చిత్రానికి  వరల్డ్ రికార్డ్స్ వెల్లువ .. ఈ తెలుగుబాల - తెలుగు బొమ్మకు   ప్రపంచ స్థాయి ఖ్యాతి రావాలని కోరుకుంటూ చిత్రకళాకారిణి  శ్రీలక్ష్మిసుబ్రహ్మణ్యంకు "ఆల్ ది బెస్ట్" చెబుదామా మరి..!
ఏదైనా ప్రత్యేకత చాటాలనుకున్న శ్రీలక్ష్మిసుబ్రహ్మణ్యం గురువు రవీంద్ర గారి పర్యవేక్షణలో తండ్రి డా. ధారా రామనాధ శాస్త్రి గారి సూచనలతో గీసిన " కృష్ణం వందే జగద్గురుం" ఇప్పుడు ఓ సంచలనం అనే చెప్పాలి.. ఈ కృష్ణ తత్వ ఏకచిత్రం  ఇప్పుడు ఎన్నో అవార్డులకు పోటీలో ముందుంది.

No comments:

Post a Comment

Pages