స్త్రీలకు రక్షణ కల్పించాలి - అచ్చంగా తెలుగు

స్త్రీలకు రక్షణ కల్పించాలి

Share This

స్త్రీలకు రక్షణ కల్పించాలి 

- భావరాజు పద్మిని

ఒక్కసారి నేటి స్త్రీల పరిస్థితి చూస్తే, 'అసలు వీరికి రక్షణ ఎక్కడ ?' అనిపించక మానదు.
కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే ఆమెకు గండం మొదలు. భూమ్మీద పడుతుందని, పడ్డా వడ్ల గింజ నోట్లో వేసి చంపుతారో, లేక చెత్తకుప్పల మీద కాకులకు, గద్దలకు బ్రతికుండగానే ఆహారంగా వేస్తారో తెలీదు. ఈ మధ్య చండీగర్ లో జరిగిన సంఘటనకి మొత్తం నగరం దిగ్భ్రాంతి చెందింది. చాలా పేరున్న ఒక స్కూల్ లో చదువుతున్న ఐదేళ్ళ పాపపై , ఆ స్కూల్ బస్సు క్లీనర్ అత్యాచారం చెయ్యసాగాడు. ఇంట్లో చెబితే, ఆ పాపను స్కూల్ మేడపై నుంచి విసిరేస్తాను అని బెదిరించాడు. పాప ఒంటిపై ఏవో గుర్తులు చూసిన పాప తల్లి, నెమ్మదిగా బుజ్జగిస్తే, పాప ఈ సంగతి చెప్పింది. వెంటనే, ఆ తల్లి, స్కూల్ యజామాన్యాన్ని సంప్రదిస్తే వారూ పోలీస్ కేసు పెట్టక తాత్సారం చెయ్యసాగారు. ఆపై తల్లిదండ్రులే పోలీస్ కేసు పెట్టారు. నిందితుడిని నిలదీస్తే, 'పాప తల్లి తనను తిట్టిందని, అందుకే పగ తీర్చుకుంటున్నానని,' అన్నాడట. నిర్భయ కేసు లో ఆమె బట్టలు కారణం, ఇక్కడ పగ కారణం... అంతేకాని, వారి చెడు దృక్పధం కాదు, యెంత బాగుందో కదా ! ప్రభుత్వం స్పందించి, ప్రైవేట్ స్కూల్ బస్సులకు లేడీ అటెండరు ఉండాలని, కొన్ని నిబంధనలు విధించగానే, ఊకుమ్మడిగా ప్రైవేట్ బస్సు వారంతా స్ట్రైక్ చేసారు. తల్లిదండ్రులు పిల్లల్ని దింపుకు తెచ్చుకోలేక, తంటాలు పడ్డారు. చివరికి వీళ్ళు తేల్చిన న్యాయం - అన్ని ప్రైవేట్ బస్సు లలోనూ, కెమెరా లు పెట్టి... అందుకు అయ్యే ఖర్చును, తల్లిదండ్రులపైనే, పెరిగే బస్సు ఫీజు ల రూపంలో రుద్దడం.
పంజాబ్ ముఖ్యమంత్రి నడిపే ఒక ప్రైవేట్ బస్సు సర్వీస్ లో ఒక తల్లీ, 14 ఏళ్ళ పిల్లా ఎక్కారు. అందులో ఉన్న కండక్టర్ పాపతో చాలా దారుణంగా ప్రవర్తించబోగా , ఆమె అతన్ని ఎదిరించి, అరవసాగింది. మాట వినలేదని కోపం వచ్చిన కండక్టర్ పాపను, ఆమె తల్లిని రన్నింగ్ బస్సు లోనుంచి తోసేసాడు. ఆ పాప అదే బస్సు చక్రాల క్రింద పడి మరణించింది. తల్లి గాయాలతో బ్రతికింది. షరా మామూలే, కొన్నాళ్ళు నిరసనలు, బంద్ లు... ఆపై నష్టపరిహారం ఇచ్చి, చేతులు దులుపుకోవడాలు...
నిహారిక (పేరు మార్చబడింది ) సంగతి ఇంకోలా ఉంది. ఆమె చాలా కష్టపడి, ఇంటీరియర్ డిసైనింగ్ కోర్స్ చేస్తోంది. తను బాగా నమ్మిన స్నేహితురాలి ద్వారా ఆమె డ్రగ్స్ విష వలయంలోకి లాగబడింది. అలా ఆమెను అశ్లీలమైన భాషలో బెదిరించి, భయపెట్టి, హింసించి... ఒకరోజు సుమో లో తీసుకువెళ్ళి, కాలవలో కూరి చంపేశారు. అతిగా డ్రగ్స్ తీసుకుని, అందులో పడి చచ్చింది అన్నారు. కాని, ఆమె ఒక తెలివైన పని చేసింది. తన మొబైల్ లో వేధింపుల తాలూకు స్క్రీన్ షాట్స్ దాచింది. దానితో మొత్తం డ్రగ్స్ గ్యాంగ్ పట్టుబడింది... తాను చనిపోయినా, ఆమె మరికొంతమంది ఆడపిల్లలు వీరికి బలి కాకుండా రక్షించింది. తర్వాత ఏం జరిగిందో తెలుసాండి... జైలులో ఉన్న ఆ నిందితులకు వినోదం లేదని, మొన్న పంజాబ్ వారి నూతన సంవత్సరం ' బైశాఖి ' కి జైలుకే ఐటెం డాన్సర్ లను పిలిపించి, పోలీస్ లు, నిందితులూ కలిసి కుమ్మక్కై వేడుకలు చేసుకున్నారు.  ఈ సంఘటన టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చింది... సదరు అధికారులు... పరార్...
వాణి(పేరు మార్చబడింది ) కధ మరోలా ఉంది. ఈమె ఆఫీస్ లో తన బాస్ ద్వారా లైంగిక వేధింపులకు గురౌతోంది. చట్టాలున్నాయి కదా, నోటితో కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటాయి, అని అతనిపై కేసు పెట్టింది. వేధించేటప్పుడు గుర్తుకురాని పెళ్ళాం పిల్లలు, అతనికి ఇప్పుడు గుర్తుకొచ్చారు. ఎలాగో కాళ్ళా వెళ్ళా పడి, ఆమెను బ్రతిమాలితే, కేసు ఉపసంహరించుకుంది. ఇక అక్కడితో మొదలు... ఆఫీస్ లో పనిచేసే ప్రతీ పురుషుడు... 'వచ్చిందమ్మా, సత్తె కాలపు తల్లి... ఇదిగో, నీ భుజంపై చెయ్యి వేసాము, కేసు పెట్టు... నిన్ను లాగుతాము... కేసు పెట్టు..' అంటూ వేధించేసరికి, ఆమె తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది.
లోపం ఎక్కడుందంటారు ? పస లేని మన చట్టాల్లో ఉంది. బలహీనులను వంచించే బలవంతుడి కాముకతలో ఉంది. ఇంకా... మనుషుల దృక్పధంలో ఉంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక స్త్రీ అంటూ ఉంటుంది. అది అమ్మైనా, చెల్లైనా, అక్కైనా, భార్యైనా... కూతురైనా... అరాచకాలకు పాల్పడే ముందు... ఒక్కక్షణం వారిని గుర్తుచేసుకుని, తాము ఎంతగానో ప్రేమించే స్త్రీమూర్తికి ఇటువంటి కష్టమే వస్తే... అని ప్రతి వ్యక్తి ఆలోచిస్తే, న్యాయం ఇంత అధ్వానంగా ఉండదేమో ! కనీసం, మన చుట్టుప్రక్కల ఉన్న పాపలు, స్త్రీల యోగక్షేమాలు కనిపెట్టుకు ఉండే ప్రయత్నం చేద్దాము. స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో... స్త్రీ బైటికి అడుగుపెట్టాలంటే, హడిలి చచ్చే ఈ స్థితిని మార్చేందుకు, మనవంతు ప్రయత్నం చేద్దాం.
వసంత సుమాల వంటి తాజా రచనలతో వచ్చిన ఈ సంచికలో సందెల్లో రంగుల వంటి కధలు, తొలకరి జల్లుల వంటి సీరియల్స్, ప్రముఖ నటులు ఎల్.బి.శ్రీరామ్ గారితో ముఖాముఖి, బ్నిం గారు పరిచయం చేసిన నర్తకి శ్రీలక్ష్మి గారి నాట్యవేదం వంటి అనేక ఆకర్షణీయమైన రచనలు ఉన్నాయి. చదివి ఆనందించండి, మీ కామెంట్స్ తో ఎప్పటిలాగే ప్రోత్సాహం అందించండి.
కృతజ్ఞతాభివందనాలతో,
అచ్చంగా తెలుగు సంపాదక వర్గం తరఫున
భావరాజు పద్మిని .

No comments:

Post a Comment

Pages