శ్రీధరమధురి – 15

( ఇతరులను నిందించే అలవాటును మానుకోమంటూ తెలిపే, పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృతవాక్కులు )

మీరు ఇతరుల పద్ధతిని విమర్శిస్తూ తీర్పులు చెప్తే, శనిదేవుడు మిమ్మల్ని విచారిస్తాడు. విమర్శించే వారి ప్రవర్తనను  విచారించడం శనిదేవుడి పని. అందుకే ఎవరి తప్పొప్పులూ ఎంచకుండా ఉండండి. ఇతరులు ఏంచేస్తారు అన్నదాని గురించి మీకెందుకు?
ఎవరినీ విమర్శించకండి. మనకు దైవం నుంచి కావల్సింది "క్షమ", "న్యాయం", కదు. మీరు ఇతరుల తప్పొప్పులు ఎంచుతూ, వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, దైవం మిమ్మల్ని తప్పక విచారిస్తారు. మనం కర్తలం కాదు. దైవమే కర్త. ఇది మీ ఆలోచనలో, చర్యల్లో జీర్ణమైతే తప్ప, మీకు ముక్తి రాదు. మనం ఇక్కడికి మన అధికారాన్ని చాటుకొనేందుకో, న్యాయవిచారణ చేసేందుకో రాలేదు. వినయం, దయ, ప్రేమ , క్షమ, సంరక్షణ, ఇతరుల్ని అర్ధం చేసుకోవడం అనేవి మనం ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకోవాల్సిన అంశాలు. మనం అప్రమత్తంగా, నోరుజారకుండా ఉండాలి. ఇతరులను విచారిస్తూ, దైవాని యధేచ్చగా స్వీకరించండి. ఆయన దయ అందరికీ సమానం. "క్షమ" అనేది మాత్రమె మనం రోజూ కొరదగినది. ఇది కూడా మీకు కేవలం ఆయన దయ వల్లే ప్రాప్తిస్తుందని నాకు తెలుసు. అంతా దైవానుగ్రహం.
లక్ష్యం లేని జీవితాన్ని గడపండి. జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదించండి. బుద్ధిని హృదయం అధిగమించేలా చూడండి. కొంత కాలానికి తెలివి కంటే మనసు ఎక్కువగా కనిపించాలి. ఈ సృష్టిని ఆశ్చర్యంగా చూడండి. పసిపాపలా గమనిస్తూ  ఆశ్చర్యపోండి. మీరు ఆశించే పై పై ఙ్ఞానాన్ని వదిలేయండి. సంపూర్ణంగా బేషరతుగా దైవాన్ని శరణు వేడడం ఒకటే దారి. కారణాలు వెతకడం అనేది అందరాని పండును అందుకోవడం వంటిది. మీరు దాన్ని అందుకోలేరు. బేషరతైన ప్రేమ, జీవితాన్ని వాస్తవికంగా అంగీకరించడం అనేవి మిమ్మల్ని దైవానికి చేరువ చేస్తాయి. దైవాన్ని అన్నిటా, అంతటా చూడండి. తప్పొప్పులు ఎంచకండి. మీరు ఇతరుల పద్దతిపై తీర్పులు చెప్పేందుకు ఇక్కడకి రాలేదు. నవ్వుతూ ఉండండి. వివాదాల్లో పాలుపంచుకోకండి. మిమ్మల్ని మీరు ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆటను ఆస్వాదించండి, అప్రమత్తంగా ఉండండి. అంతా దైవానుగ్రహం.
ఇతరుల గురించి విషయాల్ని మోయకండి. ఇతరుల గురించి మీకు తెలిసిన అంశాలను ఎక్కడా వెల్ల్డీంచకండీ. చాడీలు చెప్పకండి. ఒక వేళ ఎవరైనా మిమ్మల్ని ఇతరుల గురించిన సమాచారం అడిగితే, తెలియనట్లుగా నటించండి. అంతే కాక మీకు తెలిసింది సగం కధే కావచ్చు. మీరు ఇక్కడికి వార్తలు మోసేందుకో లేక ఇతరుల జెవితాన్ని విచారించడానికో రాలేదు.
మీ మనసును ఇతరుల 'కంప్లైంట్ &సజెషన్ ' రిజిస్టర్ గా మార్చకండి. దైవం మీకు మార్గదర్శి. మీ అంతర్వాణిని వినండి. ఆయన స్వరాన్ని విన్నాకా, మీ స్పందన చాలా విశిష్టంగా ఉంటుంది. ఇతరుల్నివిమర్శించడం మానేసినప్పుడు, మీరు మరింత మానవత్వాన్ని కలిగి ఉండడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. తర్వాత మీలో బేషరతైన ప్రేమ ప్రవహిస్తుంది. మిమ్మల్ని మీరు అంగీకరించండి. ఒక వేళ మార్పు అవసరమైతే సూచనలు మీలోనుండే వస్తాయి. సలహాలకోసం మీకెవరూ అక్కరలేదు. మీలోని ఆత్మే మీకు నిజమైన గురువు. కాబట్టి, ఎవరైనా మీరు మారాలి అంటే, వారిని చూసి చిరునవ్వు నవ్వండి, విని వదిలెయ్యండి...శ్రద్ధగా ఆలకించండి. మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. దైవం కోరుకున్న ఆకృతి లో మీరు చక్కగా ఉన్నారు. ఒకవేళ మీ దృక్పధంలో మార్పు అవసరమైతే, మీలోని పవిత్రాత్మ చిన్న చిన్న సూచనలను మీకు అందిస్తుంది.  కావలసిన మార్పును మీకు తెస్తుంది. బయటి రణగొణధ్వనుల కంటే మీ అంతరాత్మను వినండి. మీలోనే పెద్ద రేడియో స్టేషన్ ఉంది. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైనది, భక్తియుతమైనది. మీ అంతర్వాణిని వినడం మీకు శాంతిని , ధైర్యాన్ని బ్రతికేందుకు స్థైర్యాన్ని ఇస్తుంది. వీటికి తగిన నమ్మకాన్ని కలిగిఉండాలి. మీ హృదయలో కూర్చొని ఉన్న దైవం పట్ల మీకుండే అపారమైన నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది. దైవం మీగురించి శ్రద్ధ వహిస్తారు. మీ అంతర్వాణి దైవం ఆలపించే గేయం, దాన్ని వినండి. అంతా దైవానుగ్రహం.
ప్రతివారినీ నిందించేవారిని సమాధాన పరిచేందుకు ప్రయత్నించకండి. అటువంటివారు మానసిక రోగులు. వాళ్ళు నిజాన్ని తెలుసుకునేందుకు మీరు చేసే ప్రయత్నం, తిరిగి మీకే హాని కలిగిస్తుంది.
ఈ ప్రపంచంలో మనకు అనేక రకాల బంధాలు ఉన్నాయి. బంధువులు, మిత్రులు, ఉద్యోగులు, స్నేహితులు, క్రిందిస్థాయి ఉద్యోగులు....వీరిలో చాలామంది మనతో సన్నిహితంగా మెలుగుతారు, మనం కూడా వారికి దగ్గరౌతాము. వీరివద్ద ఉచితంగా లభించేది, ‘ఉచిత సలహా ‘. అడక్కుండానే లభిస్తుంది. నేను మీ బంధాన్నో, సాన్నిహిత్యాన్నో వ్యతిరేకించట్లేదు, కానీ నేను మిమ్మల్ని వీరి స్పష్టమైన దృక్పధం గురించి హెచ్చరిస్తున్నాను. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారిగా వారు అడక్కుండానే సలహాలు ఇవ్వటం మొదలుపెట్టగానే, విషయం మార్చి, వేరేదైనా మాట్లాడండి. మీ స్థానాన్ని వారు ఆక్రమించుకునే అవకాశం ఇవ్వకండి. వారి ఇష్టమొచ్చినట్లుగా మిమ్మల్ని నియంత్రించే స్థాయికి చనువు ఇవ్వకండి. అంతా దైవానుగ్రహం.
అతిగా చర్చల్లో పాల్గొనకండి. చాలా మంది ఇతరుల్ని నిందిస్తూ, వారిపట్ల హీనమైన భాషను వాడుతుంటారు. కొన్నిసార్లు బాగా చదువుకుని, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం తెలియకుండానే కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. వారిపట్ల కూడా అసహ్యాన్ని పెంచుకోకండి. మనం కేవలం నాటకాన్ని చూస్తూ ఉండాలి. దైవం మీకు నిజాన్ని వెల్లడి చెయ్యాలని అనుకున్నారు. అందుకే, అప్రమత్తంగా ఉండండి. పరిస్థితిని అర్ధం చేసుకునేంత జాగరూకతతో మెలగండి. మనం నేర్చుకోవచ్చు. కొందరినుంచి మనం ‘ఎలా ప్రవర్తించాలో’ నేర్చుకోవచ్చు... కొందరిని చూసి, ఎలా ప్రవర్తించకూడదో నేర్చుకోవచ్చు. ఎలా ప్రవర్తించాలో నేర్పడం తేలిక, కాని, ఎలా ప్రవర్తించకూడదో నేర్పడం కష్టం. అందుకే మౌనంగా గమనించండి. మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. దైవం యొక్క విధానాలు గుప్తమైనవి, వెల్లడించనలవి కానివి. దైవం యొక్క డిజైన్ ను అర్ధం చేసుకోవడం అసాధ్యం. మనం చెయ్యగలిగింది, కేవలం ఆశ్చర్యపోవడం. కేవలం నమ్మకం మాత్రమే మిమ్మల్ని దైవానికి చేరువ చేస్తుంది. జ్ఞానం ఉన్నవారు సైతం ఏదో చెబుతుంటే గమనించండి. ఏదో ఒకప్రక్కన చేరి, అతనికి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టకండి. అప్పుడు మీరు వాస్తవం అనే వెలుగును ఆస్వాదించలేకపోవచ్చు. అంతేకాక, మనం సత్పురుషులపై వ్యాఖ్యలు చేసే వరుసను చేరి మాట్లాడేంత గొప్పవాళ్ళం కాదు. సత్పురుషులు దైవం యొక్క అవతారాలు. వాళ్ళని ‘అవధూతలు’ అంటారు. ‘అవధూత’ ఒక మామూలు సన్యాసి కాదు. అతనికి ఎటువంటి నియమనిబంధనలు ఉండవు. అతని దృష్టిలో అంతా ఒక్కటే, పక్షపాతం ఉండదు. ఆయనే స్వయంగా దైవం . అంతా దైవానుగ్రహం.
నేడు చాలా మందికి అతిగా వాగే అలవాటు ఉంది. అందుకే మీ గురించిన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు చెప్పేముందు అప్రమత్తంగా ఉండండి. అంతేకాక, అందరికీ మీ గురించి తెలుసుకునేందుకు అత్యుత్సాహం ఉంటుంది.... వారికి అన్నీ వెల్లడించకండి. వారి ఉత్సుకతను తీర్చేందుకు మీరు వారికి మీ వ్యక్తిగత సమాచారం అందించి, వారికి వినోదం కల్పించకూడదు. ఆఫీస్ లో కాని, వ్యాపారంలో కాని మీ వ్యక్తిగత జీవితాన్ని గురించి చర్చించకండి. ఆఫీస్ అనేది ఎక్కువగా బుద్ధితో పనిచేసే చోటు, హృదయానికి సంబంధించిన అంశాలను ఇక్కడ చర్చించలేము. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. ప్రేమగా, దయగా, సున్నితంగా, నవ్వుతూ వ్యవహరించండి. కాని, ఇతరులు తమ ఇష్టానుసారం మిమ్మల్ని పరిగణించే అవకాశం ఇవ్వకండి. వారు మీ గురించి ఏదైనా వ్యక్తిగత సమాచారం అడిగితే, చెప్పేందుకు నిరాకరిస్తూ చిరునవ్వు నవ్వండి. ఆఫీస్ లో మీరు యెంత నిక్కచ్చిగా, నేర్పుతో వ్యవహరిస్తారో, వ్యక్తిగత విషయాల్లో కూడా తగని సమాచారం కోరినప్పుడు అలాగే వ్యవహరించాలి. అందుకే అప్రమత్తంగా ఉండండి, మీ వ్యక్తిగత విషయాల్ని బహిర్గతం చెయ్యకండి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top