నవోదయం

- పూర్ణిమ సుధ 

గరికిపాటిగారి నవజీవన వేదం చూస్తున్న అమంత (అలివేలుమంగ తాయారు - ముద్దు పేరు) గడియారం వైపు చూడ్డం ఇది పదకొండో సారి. ఇంకా రాలేదేంటి అమ్మాయి అని ? ఇంతలో గేటు చప్పుడైంది. ముఖం వికసించింది. వస్తూనే సోఫాలో కూలబడింది సమంత. ఇద్దరూ కవలలో, అక్క చెల్లెళ్ళో అనుకుంటారేమో. అత్తా కోడళ్ళు, అని చెప్తే తప్ప తెలియనంత ఆప్యాయంగా ఉంటారు.
"ఏంటి ? మళ్ళీ మీ ముచ్చు మొహం బాస్ తిక్కమీదున్నాడా ?" అంది, ప్లేట్లోని జంతికలు అందిస్తూ...
"గుర్తు చెయ్యకమ్మా...! విసిగించేస్తున్నాడు. ఇంకా వాడు బతికున్నాడంటే, ఖచ్చితంగా నేను జైలుకెళ్ళాసొస్తుందనే... అరె... తెలుగు సరిగా రాని వాడు, నా పనిని విశ్లేషిస్తాడు. సామెతలు తెలీవు. మీడియాలో ఒక వ్యక్తిని తీసుకునేప్పుడు, ఇంత తలతిక్కగా, తెలుగు తెలీని వాళ్ళని తీసుకున్నందుకు, మా హైరార్కీని అనాలి... "అంటూ రెండు పలుకులు నోట్లో వేసుకుంది అమాంత.
" సర్లేరా...! ఇప్పుడు ఇదే ట్రెండు. ఒకట్రెండు తెలుగు ముక్కలు, బాగా ఇంగ్లీషు వచ్చి, అర్హత లేని వాళ్ళంతా అందలమెక్కుతున్నారు. సర్లే, మధ్యాహ్నం ఆ లక్కపిడత అంత బాక్స్ లోది, మీ బకాసురులు పడి నీకేమీ మిగిల్చి ఉండరు... స్నానం చేసి రా..! వేడిగా, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం...! నీకిష్టమని పెసర పచ్చడి, వంకాయ కారం పెట్టిన కూర చేసాను. అన్నట్టు, రాహుల్ ఫోన్ చేసాడు... " అని అర్థోక్తిలో ఆగిపోయింది. వినీ విననట్టు, స్నానం చేయడానికి ఉపక్రమించింది సమంత.
"విన్నదా ? మళ్ళీ చెప్పనా ? అనుకుంటూ భోజనాల దగ్గర మళ్ళీ ప్రస్తావన తెచ్చింది. వంకాయ కూరలో నిన్ను కొట్టేవాళ్ళు లేరు, ఎలా చేస్తావత్తయ్యా ?" అంటూ మాట మార్చింది.
కాసేపు కబుర్లాడి ఇద్దరూ నిద్రకి ఉపక్రమించారు... కాదు... అని నమ్మించారు. ఇద్దరూ రెండేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన గురించే ఆలోచిస్తున్నారు...
**********
సంబంధం చూసి, అన్నీ మాట్లాడుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని, కలిసి గడపబోయే జీవితం మీద ప్రణాళికలు వేసుకుని, చూడముచ్చటైన జంటగా, అందమైన ప్రారంభాన్నిద్దామనుకున్నారు. నిశ్చితార్థానికి, పెళ్ళికి ఎనిమిది నెలల విరామం వచ్చింది. అంతా భయపెట్టారు... ఇంత కాలం ఆగకుండా ఏ పెట్టుడు ముహూర్తాలతోనో, పెళ్ళి చేసెయ్యడం ఉత్తమం అని. కానీ, వీళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. మాకూ అర్థం చేసుకోడానికి, కొంత సమయం దొరుకుతుంది, ముహుర్తబలం ఎప్పుడు బావుంటే అప్పుడే పెళ్ళి అని ఇద్దరూ అనడంతో, చేసేదేం లేక ఊరుకున్నారు.
గోపి - విప్రోలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. చూట్టానికి పక్కింటి అబ్బాయిలా, యండమూరి నవల్లో హీరోలా కాకపోయినా, ఆకర్షణీయమైన వాక్చాతుర్యం, స్వఛ్ఛమైన నవ్వు, అమ్మాయిల్ని గౌరవించే తత్వం వెరసి, సమంతకి నచ్చేలా ఉంటాడు. సమంత కూడా అంతే, మీడియాలో చేస్తుందన్న మాటే కానీ మేకప్ లేకపోయినా బావుండే, లక్షణమైన తెలుగమ్మాయి. ఇద్దరూ రోజూ ఆఫీసయిపోగానే, ఏ ఐస్క్రీం తినడానికో వెళ్ళి కాసేపు కబుర్లాడుకుని, ఇళ్ళకి బయలుదేరేవాళ్ళు. వీధిలో వాళ్ళు నోళ్ళు నొక్కేసుకోవడం చూసి, ఒక్కోసారి సమంత నవ్వుకునేది, ఒక్కోసారి తిట్టుకునేది. ప్రతీ ఆదివారం, అయితే - గోపి, వాళ్ళ అమ్మ సమంత వాళ్ళింటికి వచ్చేవాళ్ళు. లేదా, వీళ్ళే వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళు. కతికితే అతకదన్న సామెతని తోసిరాజని వీళ్ళు, వీళ్ళ కుటుంబాలూ ఇంతలా కలిసిపోవడం చూసి, ఆఫీసులో కొంతమంది, నిజం చెప్పు, మీది మేనరికం కదూ ! అని ఆట పట్టించేవాళ్ళు. ఇంతలా కలిసిపోయి, భవిష్యత్తు గురించి బంగారమంటి కలల్లో తేలిపోతున్న సమంత జీవితంలో అనుకోని షాక్, బ్యాచిలర్స్ పార్టీ పేరుతో తగిలింది. అస్సలు తాగే అలవాటు లేని గోపిని, బలవంతంగా, రివాజు ప్రకారం బ్యాచిలర్స్ పార్టీ ఇమ్మంటూ, తన కొలీగ్స్ వేధించి, తనిచ్చే పార్టీలో తను తాగకపోతే ఎలా అని, అలవాటు లేదన్నా వినకుండా, పెగ్ కలిపారు. వారు చూడకుండా తాగినట్టు నటించి, తప్పించుకున్న గోపి... అజయ్ ప్లాన్ కి బలయ్యాడు... పోనీ కోక్ తాగమంటూ, అందులో కలిపేసి, ఇచ్చాడు. తాగింది కోక్ కదా అని ధైర్యంగా, అర్థరాత్రి 1:30 దాటుతుండగా, కారులో, నేరుగా విడిదింటికి రమ్మని అమ్మ ఫోన్ చేస్తే అటే బయలుదేరాడు... ఫ్లై ఓవర్ పనులతో రోడ్డంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎదురుగా వస్తున్న లోడ్ లారీ అమాంతం కార్ ని హైస్పోడ్లో గుద్దేసింది.
సమంత తెల్లవారితే తన జీవితంలోకి వచ్చే అరుణ రేఖలని ఊహిస్తూ, తన చేతిలో పూసిన గోరింట మందారాన్ని చూసి మురిసింది... గోపి అక్కడ ఇంకో ఎరుపు రంగులో నిర్జీవంగా పడి ఉన్నాడని తెలుసుకుని, ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంత కలివిడిగా ఉంటే ఇలాగే అవుతుంది. ఇప్పుడు పీటల మీద పెళ్ళి ఆగిపోతే, ఎవరు చేసుకుంటారంటూ తలా ఒక మాట అనేసి, ఇంటికెళ్ళి ఉడకేసుకోవాలనుకుంటూ వెనుదిరిగారు. ఒక్కగానొక్క కూతురి జీవితం ఇలా అవడంతో, నెలరోజుల తేడాలో అమ్మానాన్నల్ని కోల్పోయిన సమంత, ధైర్యంగా నిలబడడానికి గోపి వాళ్ళ అమ్మ చాలా సహకరించింది. ఎందుకో తెలీదు. సమంతని చూడగానే నా కోడలు అని మనసులో ముద్రించేసుకుంది. కానీ ఇలా అన్యాయమైపోతుందని తెలీలేదు. అందరు అత్తగార్లలా, ఏ ముహూర్తాన, ఈ పెళ్ళికి ఒప్పుకున్నామో, నా కొడుకుని మింగేసింది లాంటి ఆలోచనలు లేకుండా, కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది. తనకీ ఒక్కడే కొడుకు, భర్త పదేళ్ళ క్రితం గుండెపోటుతో పోవడంతో, ఇద్దరు ఒంటరివాళ్ళు కలిసి, జీవిత ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టారు.
ఎప్పుడూ చలాకీగా ఉండే సమంత, ఈ ఘటనతో నెమ్మదిగా మారిపోయింది. సముద్రంలా ఎగసిపడే తను, నదిలా నర్మగర్భంగా మసులుకుంటోంది. పాతికేళ్ళు కూడా లేని సమంతని మళ్ళీ పెళ్ళి చేసుకోమని అమంత (ఈ పేరు కూడా, సంబంధం ఖాయమనుకున్నాక తనే పెట్టింది) ఎన్ని సార్లడిగినా, తన జవాబు నో అయింది. కానీ ఈ మధ్య, రాహుల్, అని తన ఆఫీస్ లో పనిచేసే సహోద్యోగి, ఈ విషయమై ఎన్నో రకాలుగా వత్తిడి తెస్తున్నాడు. ఇంటికొచ్చి, అమంతతో మాట్లాడాడు. కానీ సమంత మాత్రం ఒప్పుకోవట్లేదు.
************
ఎవరికి నిద్ర పట్టినా, పట్టకపోయినా, టైం ప్రకారం సూర్యారావుగారు, కిటికీలో నించి, కళ్ళల్లో గుచ్చి, మరీ లేపాడు... అమంత అప్పటికే సుప్రభాతం వింటూ, దొడ్లో పూసిన మందారాన్ని కోసుకురావడానికి వెళ్ళింది. సమంత కూడా లేచి, ఎక్కడుందా అని వెతుకుతూ... పెరట్లోకొచ్చి, అర్రె, "ఈ చామంతి మొక్క ఎందుకు ఎండిపోతోంది ? మొన్నటిదాకా బానే ఉంది కద ?" అంటూ చెంబుతో నీళ్ళు తెచ్చిపోసింది.
"ఏముంది, పోషణ సరిగ్గా లేదేమో ?" అని అదను కోసం చూస్తున్న అమంత అంటూ, వంటింట్లోకి వెళ్ళింది.
"ఇంకేం పోషణ ? కుండీ నిండా మట్టి, నీళ్ళు, సూర్యరశ్మి పడే చోటు... ఇంకేం కావాలి ? ఒక మొక్క ఎదగడానికి ?" అంది.
"అవి బేసిక్... మరి ఎక్సెల్ కావాలికదా ", అంది అమంత.
"అబ్బో..! ఏంటత్తయ్యా ? టెక్నికల్ భాష ?" అన్నది సమంత.
"చూడమ్మా...! నువ్వు నాకు మామూలుగా టైం ఇవ్వట్లేదు. ఏదో ఒక వంక పెట్టి, నీకు చెప్పాలనుకున్నది చెప్పేస్తా..! అనుకున్నాను... ఇప్పుడు సమయం దొరికింది. ఒక మొక్కైనా - జీవితమైనా, ఎండిపోతోంది అంటే, ఏదో ఒకటి చేసి, చిగురింప చేస్తాం... చెయ్యాలి. నేనింకా ఎన్నాళ్ళుంటాను చెప్పు ? ఒకసారి తప్పు జరిగిందని, ప్రతీసారీ అలాగే జరగదు కదా ? ఇప్పుడు జీవితం బాలేదా అంటే బావుంది... కానీ ఎన్నాళ్ళు ? నా కూతురు లాంటి దానివి. సమాజం  నష్టజాతకురాలివి అని ఎన్నన్నా, మనం ఎదురీదలా ? అదేగా జీవితం ? ఇప్పుడు రాహుల్ తనంత తానుగా నిన్ను ఇష్టపడ్డాడు. నువ్వెందుకు అడ్డు చెప్తున్నావో తెలీదు ? ఇద్దరూ మీడియా వాళ్ళే కాబట్టి నిన్ను వృత్తిరిత్యా కూడా అర్థం చేసుకునే మనిషి..." అంటుండగా...
"కానీ అత్తయ్యా, రేప్పొద్దున్న వాళ్ళ అమ్మా నాన్నా, నిన్ను చూసుకోడానికి ఒప్పుకుంటారో లేదో ? నువ్వు నాకు ముఖ్యం", అంటూ సమంత గట్టిగా వాటేసుకుంది.
"పిచ్చిదానా..! ఆ అబ్బాయి ఆ విషయం కూడా  మాట్లాడాడు. వాళ్ళ అమ్మనాన్నలకి ముందే చెప్పాట్ట. అన్నీ తెలిసే ఒప్పుకున్నార్రా..! చూడు, విధెప్పుడూ మనకి చీకటే కాదు, వెలుగు కూడా చూపిస్తుంది. నా మాట విని ఒప్పుకో", అంది.
"కానీ..." అంటూ ఇంకా సమంత ఏదో చెప్పబోతుంటే, తనకిష్టమైన ’ వో ష్యామ్ కుఛ్ అజీబ్ థీ... ఏ ష్యామ్ భీ అజీబ్ హై’ పాటని పెద్దగా ప్లే చేస్తూ నాకేం వినపడట్లా - అని వంటింట్లోకి వెళ్ళింది. దేవుడిచ్చిన అత్తయ్య అమ్మయినందుకు, ఆనందపడ్తూ రాహుల్ తో మాట్లాడటానికి ఒప్పుకుని, ఆఫీస్ కి బయలుదేరింది సమంత... అమంత - వెంకన్న స్వామికి నమస్కరిస్తూ... హమ్మయ్య ఇప్పుడు మనసు తేలిక పడింది అని మనసారా నిట్టూర్చింది.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top