మనసా.. తెలుసా..?
నూజిళ్ళ శ్రీనివాస్
 94408 36041

ఏమిటని మురిసేవు?
ఎందుకని వగచేవు..?
ఏమి ఆశించేవు..? మనసా!
ఈ భోగ భాగ్యములు ...
ఈ కీర్తి కానుకలు
శాశ్వతమ్ములు కాదు తెలుసా...!

బాల్యాన చాపల్య భావాలలో మునిగి
ఆటలతొ గడిపేవు మనసా...
యవ్వనంలో కోటి ఆశలే ముసరగా..
నవ్వులను రువ్వావు మనసా ...
సంసారమున చేరి, సంతానమును పొంది,
బంధాలు పెంచావు మనసా...
అన్నిటికి మించు ఆనందమందించేది
‘శివ’నామమని నీకు తెలుసా...?

వయసు మీరిన కాని విషయ వాంచల పైన
మోహమది ఏలనే మనసా...?
మనిషి జన్మము నంది మంచి నేర్వక నీవు
వ్యర్ధమ్ము చేతువా మనసా?
కాటికెళ్ళే వేళ ఆసన్నమైనాను
కాసుపై ఆశేల మనసా...?
కాశిలో కొలువున్న విశ్వేశ్వరుని తలపె
మోక్ష దాయకమంచు తెలుసా...? 
రాజ్యాలు పోయినవి, కోటలేకూలినవి,
రాజులే కనుమరుగు మనసా...
ఆ డాబు, దర్పాలు, ఆ ఠీవి, కాంక్షలు
మట్టిలో కలిసాయి మనసా...
మనిషి పోయిన వెనుక, మంచి యొకటే మిగులు
సర్వమ్మశాశ్వాతం మనసా....
కాశిలో కాలేటి కట్టె చూసిన వేళ
కనువిప్పు నీకగును తెలుసా...?

ఒంటిలో ఓపికది ఉన్న రోజులలోనె
మంచి పని చేయవే మనసా...
శాశ్వతమ్మైనట్టి సామ్రాజ్యమందించు
శివుని దయ కోరవే మనసా...
ఆర్తితో, భక్తితో ఆది దంపతుల
చరణాలపై వాలవే మనసా...
పూర్వజన్మల పాపమంతయును హరియించి
తరియింప జేయునే తెలుసా...!

--:o:--

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top