Friday, May 22, 2015

thumbnail

మన భాగవత మధురిమలు

మన భాగవత మధురిమలు 

- భావరాజు పద్మిని 


అపురూపమయిన నిధుల వంటి కావ్య సంపద మన భారతీయుల సొంతం. కావ్యాల ద్వారా నీతిని ఉపదేశించడం మన దేశంలో అనాదిగా వస్తున్నా ఆచారం. ఈ లోకంలో మానవులు పాటించి తీరవలసిన ఆత్మగౌరవం, సమయస్పూర్తి, ధర్మాచరణ, కార్య దీక్ష, సంఘ సేవ, దానం, పరోపకారం, త్యాగం, వంటి సద్గుణాలను అవి అతి రమ్యంగా, నర్మగర్భితంగా వివరిస్తున్నాయి. సంప్రదాయ సాహిత్యంలో వర్తమానకాలాన్ని సరిదిద్దగల ఉజ్వల సత్యాలు ఉన్నాయి. అటువంటి భక్తి రహస్యాలను, తత్వాన్ని బోధించే విశిష్టమయిన పురాణం భాగవతం.
వేద విభజన, పురాణ రచన చేసినా వ్యాసుడికి అశాంతీ, అసంతృప్తి తొలగలేదు. నారదుడి ప్రేరణతో, వ్యాస మహర్షి అంతరంగం నుంచి ఉబికి వచ్చిన మధురామృత సారం భాగవతం. అసలే భక్త హృదయ  భృంగాలకు మకరందం వంటి భాగవతం... 'పలికేది భాగవతమట ...పలికించు వాడు రాముడట...' అంటూ...రాసేది తానుకాదని, రామచంద్రుడేనని చెప్పుకుని, ప్రతి పద్యాన్ని రామాంకితం చేస్తూ, ఒక మమైక స్థితిలో పారవశ్యంతో, మహాభక్తుడయిన పోతన తెనిగించాడు.భాగవతం  వేదమనే కల్ప వృక్షము నుంచి ఉద్భవించినది. శుక యోగీంద్రుని ముఖము నుండి భావుకుల రసాస్వాదనకు వేలివడిన అమృత రస ఫలము. శ్రీమద్భాగవతం సర్వపాపాహారం, శ్రవణానందకరం. అంతర్లీనంగా భాగవతంలో దాగున్న కొన్ని జీవిత సత్యాలను చదవండి.
అనుకోకుండా వచ్చి పడే ఆపదల అందకారాలు తోలగాలంటే, లక్ష్మీపతి స్తోత్రమనే సూర్య కిరణాలు కావాలి. భాగవత ఆరంభంలోనే, " కలియుగంలో మనుషులు శరీరబలం లేని నీరసులవుతారు. వారికి సత్కార్యాలు, తప్పస్సు, క్రతువులు చేసే శక్తి ఉండదు. అందుకే కలి యుగంలో తరించడానికి హరి నామస్మరణ, హరికధా శ్రవణం ఈ రెండే మార్గాలని"  చెప్పబడ్డాయి. అందుకే శక్తి లేని వారు, చాందసంగా ఉపవాస దీక్షలు అవి పాటించనక్కర్లేదు. యే పని చేస్తున్నా, హరి నామ స్మరణలో మనస్సు లయం అయ్యి ఉంటే చాలు. అదే ముక్తికి మార్గం.
కాల ప్రభావము (ప్రధమ స్కందము ) : ఆకాశంలో మేఘాలు గాలి ప్రభావం వల్ల ఎలా కలుస్తూ, విడిపోతూ ఉంటాయో, ఈ ప్రంపంచంలోని సమస్త జీవులూ అలా కలిసివిడి పోతూ ఉంటారు. ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కాలమే అన్నీ నడిపిస్తూ ఉంటుంది. అతి విచిత్రమయిన ఈ కాలాన్ని దాటడానికి ఎంతటి వారికయినా సాధ్యం కాదు.
శ్రీహరిని చేరే మార్గము(ప్రధమ స్కందము): గోపికలు కామోత్కంతట వల్ల, కంసుడు భయం వల్ల, శిశుపాలాదులు విరోధంతో, యాదవులు బందుత్వంతో, శ్రీహరిని చేరుకున్నారు. ఎలాగయినా శ్రీహరిని చేరవచ్చు.
సృష్టి క్రమము ( ద్వితీయ స్కందము ): శ్రీహరి నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి జీవరాశులు, ఉద్భవించాయి. అన్నిటికీ మూలమయిన నారాయణుడు జన్మ- మృత్యువు వంటివి అంటని అనంతుడు, సర్వసంపన్నుడు, ఆదిమధ్యాంత రహితుడు. అతనిచే సృష్టించబడిన వాటిని గురించి తర్కించే వాళ్లకి దుర్లభుడు.
భగవంతుడిని పూజించే విధానం( చతుర్ధ స్కందము ): నారద మహాముని, శ్రీహరి అనుగ్రహం కోసం తపస్సు చెయ్యడానికి వెళుతున్న చిన్నారి ధ్రువుడితో ఇలా చెబుతున్నారు. ఆ శ్రీహరిని పూజించుటకు భక్తితో సమర్పించిన గడ్డి పరకలయినా చాలు. కలువకన్నుల ఆ స్వామికి కలువ పూవులయినా చాలు. తులసీదామధరునికి తులసి దళములయినా  చాలు. ఆ నిర్మల చరితుడికి వన పుష్పాలే చాలు. ఆ పక్షి వాహనుడికి పత్రీపత్రాలే చాలు. ఆ ఆది మూలుడికి కంద మూల నైవేద్యమే చాలు. ఆ పీతాంబరుడికి నార వస్త్రాలే చాలు. అతిశయించిన భక్తితో, మట్టితో గానీ, రాతితో గానీ, చెక్కతో గానీ, చెయ్యబడిన విగ్రాహాల యందు,  పుణ్య తీర్దాల యందు, పద్మనాభుడిని పూజించాలి.
పాలకుల ధర్మము- అధర్మ పరిణామము (చతుర్ధ స్కందము): శ్రీమన్నారాయణుడు పృధు చక్రవర్తితో  ఇలా అంటున్నారు. పాలకులకు ప్రజలను రక్షించడమే పరమ ధర్మం. ప్రజలు చేసే పుణ్య కార్యాలలో ఆరవ వంతు పాలకులకు లభిస్తుంది. ప్రజలను సక్రమంగా పాలించకపోతే, వారు చేసే పాపాల ఫలం పాలకులే అనుభవించ వలసి ఉంటుంది.
ఇప్పటి పాలకుల గురించి ఆలోచించండి. పరిపాలన సరిగ్గా లేదు కనుక ప్రజలు అధర్మ వర్తనులు అవుతున్నారు. కాబట్టి పాలకులు ప్రజలు చేసే పాపాల ఫలం ఏదో ఒక రూపంలో అనుభవిస్తున్నారు. ఎలాగంటారా...నేటి పాలకులు నిత్య భయగ్రస్తులు. సప్తమ స్కందం లో అజగర వ్రతం చేస్తున్న ఒక ముని - ప్రహ్లాదునికి ఇలా చెబుతున్నాడు.
"ధనవంతులకు నిద్రాహారాలు ఉండవు. దొంగలు, రాజులూ తమ ధనాన్ని అపహరిస్తారని భయపడతారు. మిత్రులను కూడా సందేహిస్తారు. తాము అనుభవించలేరు, ఇతరులకు ఇవ్వలేరు. ధనవంతులకు, అక్రమార్జన పరులకు నిత్యమూ భయమే. ఆశ అటువంటిది. ఆశ వల్లనే శోకం, మొహం, భయం, క్రోధం, రాగం, శ్రమ కలుగుతూ ఉంటాయి."
 బాహ్య శత్రువులు- అంతశ్శత్రువు (సప్తమ స్కందము): ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో  ఇలా అంటున్నాడు. దారి తప్పిన మనసు కంటే వేరే శత్రువు లేదు. లోకాలన్నింటినీ గడియలో జయించావు కాని, తండ్రీ, నీ లోపలే ఉన్నా అరిశాద్వార్గాలనే ఆరుగురు శత్రువులను, పంచేంద్రియాలను, మనస్సును జయించలేక పోతున్నావు. వాటిని కనుక జయిన్చావంటే, ఈ ప్రపంచంలో నీకు విరోధి అంటూ ఎవరూ ఉండరు.
జయాపజయాలు (అష్టమ స్కందము): జయాప జయాలు, సంపదలూ ఆపదల వంటివి. గాలికి ఊగే దీపపు జ్వాల లాగా చలిస్తూ ఉండేవి. చంద్ర కళలలా, తరగల్లా, మేఘాల్లా, మెరుపుల్లా నిలకడ లేనివి. అందుకే విగ్నుదయినా వాడు జయాపజయాలను సమ భావంతో స్వీకరించాలి.
తృప్తి( అష్టమ స్కందము): ఏదయినా కోరుకున్నది దొరకగానే పొంగిపోక, దొరికినది తక్కువని బెంగపడక, లభించినదే ఎక్కువ అనుకుంటూ తృప్తి చెందని మనిషికి సప్తద్వీపాలూ ఇచ్చినా సంతోషం ఉండదు.
పరోపకారము (అష్టమ స్కందము): దీనుల, ఆర్తుల బాధలను పోగొట్టినప్పుడే పాలకుల కీర్తి వ్యాపిస్తుంది. రక్షణ కోరి వచ్చినా ప్రాణులను కాపాడడమే ప్రభుధర్మం. ప్రాణాలు క్షణికాలని భావించి, ఉత్తములు తమ ప్రాణాలనయినా ఇచ్చి, ఇతరులను కాపాడతారు. ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకూ ఇష్టుడవుతాడు. పరులకు మేలు చెయ్యడాన్ని మించిన ధర్మం లేదు.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information