మా ఊరిదేవత - అచ్చంగా తెలుగు

మా ఊరిదేవత

Share This

మా ఊరిదేవత

- ఆదూరి.హైమావతి.

మాఊర్లో బస్ దిగ్గానే ఆశ్చర్యంతో తల తిరిగిపోయింది! కాలిబాట , బళ్ళబాట , ముళ్ళబాట వర్షంవస్తే బురద బాట తప్ప లేని ఊరు!, మైన్ రోడ్లో బస్ దిగి ఆరు మైళ్ళు నడిస్తే తప్పఊర్లోకి అడుగుపెట్ట లేని ఊరు!, అలాంటిది ఒక్క ఐదేళ్ళలో ఎలా ఇంతగా మారి పోయింది!?ఉర్లోకే తారురోడ్లు ! హోటల్సు! పెద్ద షాపింగ్ మాల్స్!!, బస్టాండు ! ! దానికి ఇరువైపులా అంగళ్ళు , ఆటోలు! బాబోయ్! అంతాఆశ్చర్యమే! ఏ దేవుడ న్నా వరమిచ్చాడా! లేక’ మాయా బజారు’ సినిమా లోలామాయేమైనా జరిగిందా?!! ‘ - అని నేను ఆశ్చర్యం లోంచీ తేరు కోక ముందే పక్కనే ఉన్న తోపుడు బండి’ వ్యాపారమ్మ ‘ నన్నుపలక రించింది.
" అయ్యా! దిష్టి దుర్గమ్మ కాడికేగా, అదురుట్టంతులు పెందల కాడే వచ్చిండ్రు , ఇదో ఈ బుట్టట్టు కెల్లి ఎదా రంగున్న ఆ రోడ్డంటే ఎల్లి ఎడం సందు తిరగండి బాబూ!. డబ్బులేడికిపోతై రిటర్నులో ఇద్దురుగాన్లే " అంటూ పండ్లూ, పూలూ, కొబ్బరి కాయా,తలవెంట్రుకల పాయలూ, పసుపు, కుంకుమా, వత్తులూ, నూనే, కర్పూరం ఇంకా ఏవేవో వున్న బుట్టనాచేతు లో పెట్టిదారిచూపింది.అయోమయంగానే, ’ చూద్దాం ఇదేంటో ని ’ ఆమె చూపిన దారెంట భుజాని కున్న సంచీ పైకి జరుపు కుంటూ ముందుకు సాగాను..
అక్కడి కెళ్ళే సరికి బ్యారికేట్ల లైన్లో అప్పటికే జనం ఓ ఇరవై మంది వరకూ ఉన్నారు. అందరి చేతుల్లో నూ బుట్టలు , కొన్ని నా చేతులో వంటివైతే, మరి కొన్నింట్లో గుమ్మడి పండూ వగైరాలు, ఇంకా మరి కొంత ఎక్కువ సరంజామా కూడా ఉంది. క్యూ ఎంతకూ కదలదు! ఎందు కొచ్చిన బాధని ఓ అర్ధ గంటయ్యాక బయటి కెళ్ళి పోదామని వెను దిరిగి చూద్దును కదా! నావెనక వంద మంది వరకూ ఉన్నారు. బ్యారికేట్స్ నిండిపోయిఉంది క్యూ! వెనక్కు వెళ్ళలేనూ , ముందుకు కదల్లే నూ!. ఏమీ చేయలేక అలాగే మరో అర్ధ గంట నిల్చున్నాక క్యూ కదల సాగింది . అప్పుడు మొదలైంది’ మజా’ [డ్రింకుకాదు] వెనుక నుంచీ తోసే వారూ, ముందు నుంచి వెనక్కు నెట్టేవారు, మధ్యలోవారు క్రింద పడుతున్నారు.
వాలంటీర్స్ వచ్చి పెద్ద లాటీల్లాంటి కర్రలతో బ్యారికేట్స్ మీద కొట్టి [మనుషుల్నికాదులేండి]క్యూ సరిచేశారు . బ్రతి కానురా బాబూ’ ‘ఎరక్కపోయి వచ్చానూ, ఇరుక్కు పోయా’ ను అనుకుంటూ, క్యూలో నడవ కుండానే వెనుక వారు తోస్తుండగా ముందుకు సాగాను. కాస్తంత ముందు కెళ్ళాక ,కొన్ని కౌంటర్స్ కనిపించాయి . అక్కడ ఉన్న వాలంటీర్స్ తెల్లస్కార్ఫులు మెడ చుట్టూ వేసుకుని కూర్చుని ఉన్నారు.
"స్పెషలా! సూపర్ స్పెషలా! ఆర్డీనరీనా? "అని అడిగారు. నాకేమీ అర్ధంకాక మౌనంగా ఉండగా , " ఓహో తొలి సారా? కొత్త ముఖంలా ఉంది ? ఆర్డినరీ ఇవ్వు." అని అతడన గానే , మరో వాలంటీర్ ఒక చీటీ నాచేతి కిచ్చి, ”యాభై ఇవ్వు " అన్నాడు .యాంత్రికంగా యాభై తీసిచ్చి , ఆచీటీ అందుకుని ముందుకు కదిలాను . మరో అర్ధ గంటయ్యాక మెట్లెక్కి లోపలికెళ్ళాక, నా చేతిలో చీటీచూసి అక్కడి వాలంటీర్స్ నన్ను ఒక గదిలోకి పంపారు ,లోపలి కెళ్తూ పక్క నున్న గదులు చూశాను , వాటి గుమ్మాల మీద , స్పెషల్ , సూపర్ స్పెషల్ అనీ ,నేను అడుగు పెట్టిన గుమ్మంమ్మీద ’ ఆర్డినరీ’ అనీ రాసి ఉండటం గమనించాను. నేను కూర్చు నున్న గదిలో ఒకరు "ఇంకా ఎంత ఆలస్యముంది? " అని అడగ్గా , వాలంటీర్ “మరో ఐదు నిముషాలే,’అమ్మ’ పూజ పూర్తైంది.ఇహ వచ్చేస్తారు.ముందు ఆర్డినరీ వారినే చూస్తారమ్మా!"అని చెప్పాడు. నేను ఆలోచనలో పడ్డాను. హగ్గింగ్ అమ్మలూ, బ్లెస్సింగ్ అమ్మలూ ,హిట్టింగ్ అమ్మల గురించీ విన్నాను కానీ ఈమె ఏరకం అమ్మో తెలీక ' తికమక పడ్డాను. ఇంతలో మా ఎదురుగా ఉన్న హాలు తలుపు తెరుచు కుంది. ముందుగా ఇద్దరు వాలంటీర్లు ఇరు వైపులా వస్తుండగా ఒక మహిళ షు మారుగా 70 సం. ఉండ వచ్చు , పచ్చ గా పసుపుతో ఉన్న ముఖాన పాత పెద్ద రాగి కాణంత ఎర్రని కుంకుమ బొట్టుతో, అనుభవంతో పండిన తెల్లని వెండి కడ్డీల వంటిజుట్టుముడి లో నిండా మల్లెపూల మాలతో, మెడలోనల్లని నల్ల పూసలదండ తో, ఆరంజి రంగు ముతక నేత చీరలో, పసుపు రాచు కున్న పాదాలు ముందుకు కదులు తుండగా ఆస్త్రీమూర్తి బయటికి వచ్చింది. ముఖమంతా పులుముకున్న చిరునవ్వుతో ఆమెను చూడగానే ఎవరికైనా చేతులెత్తి నమస్కరించాలని పిస్తుం ది, పార్వతీదేవో, విజయవాడ కనకదుర్గమ్మో నడిచి వస్తున్నట్లుంది. అంతా కూర్చీ ల్లోంచీ లేచి నమస్కరించారు. ముందుగా మాగది కేసి నడుస్తూ ఎదురుగాఉన్న నన్నుపరీక్షగా చూస్తున్నఆమె ముఖం ఎక్కడో ఎరిగున్నట్లనిపించింది. ఇంతలో ఒక వాలంటీర్ పరుగు పరుగున ఆమెవద్ద కువచ్చి ,
" అమ్మా! కేంద్ర మంత్రిట వీ.ఐ.పీ సూపర్. స్పెషల్ దిష్టి ! వస్తున్నారమ్మా! “ అన్నాడు.
ఆమె" సరేపంపు" అని పక్కనే ఉన్న మరో గదిలోకి నడిచింది .నేను పక్కనే ఉన్న వ్యక్తిని అడిగాను. "కేంద్ర మంత్రి రావట మేంటీ !" అని. " మీరు కొత్తలా ఉన్నారు. అలాంటివారు వస్తూనే ఉంటారు.’ దుర్గ మ్మ దృష్టి ‘ తీసిందంటే ఎలాంటి రోగమున్నా ఇట్టేపోతుంది లెండి , ఏదురదృష్ట మున్నాదోష నివారణై పోతుంది.అందుకే ఇంత రష్" అన్నాడు.
" మరి ఈ ప్రత్యేకత లేంటీ! స్పెషల్ , సూపర్ స్పెషల్ ,ఆర్డినరీ !" అని అడిగాను.
" ఓ అదా! మామూలు దృష్టి దోషానికి ఆర్డినరీ దిష్టి , పెద్ద ఉద్యోగాల్లో ఉండి ఎక్కువ జీతం తీసుకునే వారికి దిష్టి ఎక్కువ కదండీ ! వారికి స్పెషల్ దిష్టి , నూనెదీపం ,కొబ్బరికాయ ,ఎర్రనీళ్ళు ,ఇంకా పెద్దపదవుల్లో ఉండే వారికి సూపర్ స్పెషల్ దిష్టి , వారిపై అనేక మందికళ్ళు పడుతుంటాయి కదండీ , పైగా ఎందరోవారికి హాని చేయను ప్రయత్నిస్తుంటారాయె అలాంటివారికి గుమ్మడికాయ, కూడా కలుస్తుంది ఇందాక చెప్పిన వాటికి." అని వివరంగా చెప్పాడాయన.
" మరి సెంట్రల్ మినిస్టర్ దిష్టీ ? " మళ్ళా అడిగాను.
" ఓహో అదా! వీ.ఐ.పీ. సూపర్ . అంటే కర్పూరం,నూనె దీపం, ఎర్ర నీళ్ళతో పాటుగా గుమ్మడీ, బూడిద గుమ్మడీ, కోడిగుడ్లూ, ఎండుమిరపకాయలూ, కేజీ జీడి పప్పూ కూడా దిష్టి తీస్తారు. దానికి ఎక్కువ సమయం అవుతుంది కదా! పైగా వచ్చిన వారు గొప్పపదవు ల్లోఉండే ప్రజా నాయకులాయె! అందువల్ల అలాంటి దిష్టికి ఐదు నుంచీ పదివేల వరకూ చెల్లించాలి . దుర్గమ్మ దిష్టి తీశాక ఆమె చెప్పే నియమాలు పాటిస్తే ఎంతటి రోగ మైనా తగ్గి తీర వలదిందే నండీ! ఏ వైద్యునీ సంప్రతించాల్సిన అవసరం లేదు ,చూస్తారుగా! ఐతే నియమ నిబంధనలు తప్పక పాటించాల్సి ఉంటుంది. " అని వివరంగా , అమితోత్సా హంగా చెప్పాడాయన.
" అంతేకాదండీ! ఈ ఊరు ఇంత వృధ్ధి చేందను ఈ’ దిష్టి దుర్గమ్మే’ కారణం. అంతకు ముందు కనీసం కూర లైనా దొరకని ఈ ఊరు ఇప్పుడు టౌన్ లా మారిపోను ఈ తల్లే కారణం , మంచి సూపర్ స్పేషాలిటీ హాస్పెటల్ , కాలేజ్ మాత్రమేకాక పేదల కోసం , ఉచిత వైద్యశాల, పేదపిల్లలకు ఉచిత విద్యాసౌకర్యం , ఊర్లోకి బస్ సౌకర్యం ఏర్ప డ్డాయి. షాపులు, హోటల్స్, ముఖ్యం గా ఈ ఊరిలోని శివాలయం, విష్ణ్వాలయం ,హనుమాన్ ,దుర్గామాతల గుళ్ళు పూర్వ రాజులు కట్టించినవి , శిధిలావస్థలో ఉంటే పట్టించుకునే నాధుడే లేక పోయాడు. ఇప్పుడు చూడండి కొత్త గుళ్ళలా ఎలా ఉన్నాయో ! అంతా ఈ అమ్మ దయ. ఈ ఊరి దేవత , మా మంచి తల్లి " అంటూ చేతులెత్తి నమ స్కరించాడు మరొకాయన.
మధ్యాహ్నానికి నా ఛాన్స్ వచ్చింది. నా టోకన్ చూసి నన్ను పక్కనే ఉన్న మరో గదిలోకి పిలిచారు, లోపలికి వెళ్ళగానే ఆ దిష్టి దుర్గమ్మ ,“ మీరంతా బయటికెళ్ళండి " అని వాలెంటీర్స్ ను సైతం పంపేసి , నన్ను దగ్గరికి పిల్చింది,నావేపు పరీక్ష గా చూసింది.
" ఏరా రామూ! బావున్నావా? నన్ను గుర్తు పట్టలేదా ? " అని అడిగింది. ఆ స్వరం అంత దగ్గర నుంచీ విన్నాక నాకు బాగా తెల్సిన వ్యక్తే అనిపించింది . పైగా పేరు పెట్టి పిలవ డం తో "మీరూ.. మీరూ " ఆంటూ నాన్చాను.
" ఓరీ !రామూ ! నేనురా ! నీపెద్దమ్మను .పదేళ్ళవుతున్నదాయె నన్ను చూసి, మారిపోయాను కదా! అందుకే గుర్తు పట్ట లేక పోయావు. బావున్నావా నాయనా!" అంది. " బావున్నాను పెద్దమ్మా! ఇదంతా ఏంటి? అమ్మ పోయాక నాకెవ్వరూ ఇక్కడ లేరాయె అందువల్ల నేను ఇక్కడికి వచ్చి ఐదేళ్ళైంది . నిన్నుచూసి పదేళ్ళవుతోంది, నేను ఊరువిడచి వెళ్ళినప్పుడు నీవు ఇక్కడలేవు. ఊరెంత మారిపోయిందీ !" అన్నాను ఆశ్చర్యంగా .
" మరేరా రామూ! మన ఊరు ఇంతగా మారి వృధ్ధిచేందటానికి కారణం ఆ హనుమాన్ జీ , దుర్గాదేవేనురా! " అంది దిష్టి దుర్గమ్మ అనే మా పెద్దమ్మ .
"అదేంటిపెద్దమ్మా ! ఇదంతా నీవల్లేని అంతా అంటున్నారు !" అన్నాను. " అంతా అలా అనుకోడం సహజమే కానీ అంతా భగవంతుని దయే! నేను నిమిత్త మాత్రురాల్ని. మనూరు బాగు చేయాలని మేమంతా ఒక గ్రూప్ గా చేరి ఒక పాతిక మందిమి MLA వద్దకెళ్ళాం. పదిసార్లు వెళ్ళినా ఆయన మమ్మల్ని కనీసం పలకరించ లేదు. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎలక్షన్స్ టైంకాదుగా! చివరి సారి మేము వెళ్ళినపుడు రెండు గంటల సేపు కూర్చున్నాక, అతడి కొడుకు నడుస్తూ కాలు జారి పడ్డాడు మా ముందే, లేకలేక పుట్టాడులే!. ఆయన ప్రాణాలన్నీ వాడి మీదే! ఐదేళ్ళవాడు . కానున్నMLA నో M.P నో కదా![ నవ్వింది] ,వెంటనే నేను వెళ్ళి పట్టుకుని మెలితిరిగిన కాలు సరిచేసి, వేడినీళ్ళు తెప్పించి, నా దగ్గరున్న తువ్వాల ముంచి కాపడం పెట్టాను. MLA వచ్చి హడావిడి పడ్డాడు..
”అయ్యా! మేము పల్లె టూరివాళ్ళం ఐనా మాక్కొంచెం వైద్యంతో పాటుగా,దృష్టి దోషంగురించీ బాగా తెల్సు ను. ఈ పిల్ల వాడికి దృష్టి దోషం బాగా ఉంది , మీరు ఒప్పుకుంటే వెంటనే దృష్టి తీసేస్తాను . దోష నివారణకై కొద్దిగా జాగ్రత్తలు చెప్తాను." అన్నాను. అతడి భార్య పల్లెటూరి అమ్మాయి, ఆమె తల్లి పక్కా పూర్వకాలపు మనిషి, ఆమె అత్త ఉత్త అనుమానాల పుట్ట . ఆమె కూడా వచ్చి , " దేవుడు పంపినట్లువచ్చావు పెద్దమ్మా! దిష్టి తియ్యమ్మా ! నీకుపుణ్యం ఉంటుంది. " అనింది..
నేను వెంటనే రంగంలోకి దిగి , దీపదృష్టి, లవణ దృష్టి ,గుమ్మడి దృష్టీ, ఎర్రనీళ్ళదృష్టీ , ఎండు మిర్చిదృష్టీ తీసి, కొంచెం బాగానే హంగా మా చేశాన్లే . ప్రతిరోజూ హనుమాన్ చాలీసా, దుర్గా పూజా ప్రత్యేక రీతిలో నిష్టగా చేయా లని, 40 రో.తర్వాత అభిషే కాలు చేయాలని చెప్పాను. అవి చేసే పధ్ధతి నాకు తెలుసనీ,మన ఊళ్ళో పురాతన కాలపు అతి మహిమాన్వితమైన ఆలయాలు ఉన్నాయనీ , అక్కడికి వస్తే నేనే దగ్గరుండి చేస్తాననీ చెప్పాను. కాలు మెలితిరగడం నేను సరిచేయటం చూసిన వారికి నాపై నమ్మకం కుదిరింది. మనఊరికి వచ్చారు దుర్గాదేవి , హనుమాన్ ఆలయాల్లో పూజలకోసం. వారి కారు ఊళ్ళో కి రావడం కష్టమైంది .
ఇహ చెప్పక్కర్లేదుగా ' రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవాని ', అలా వారు, వారి ఇలాకా వారు ఒక్కొక్కరే ‘దృష్టి’ తీయించుకోను రావటం, నేను చెప్పే ఆరోగ్య సూచనలు పాటించి , మన ఊరి గుళ్ళలో పూజలు చేయించుకోడం మొదలైంది., దానికై ఇక్కడ రోడ్డు సౌకర్యం వచ్చింది , బస్ వచ్చింది, ఆ MLA కూడా ,యం.పీ గా పోటీ చేసే ముందు నా దగ్గరికి వచ్చి’దృష్టి’ తీయించుకుని తాయత్తు కట్టించుకున్నాడు. నేను అప్పుడే చెప్పాను,' అయ్యా! ఈ ‘ఆంజనేయ తాయత్తు’మీరు మంచిపనులు చేసినంత కాలం మీకు కల్సి వస్తుంది , ఆతర్వాత రక్షణ నివ్వదు.మీరు ప్రజలకు ఉపయోగ పడే లా సేవలు చేయండి’ అని చెప్పాను. ఆయన సెంట్రల్ మినిస్టరై ఈరోజు మళ్ళామరో తాయెత్తు కట్టించుకుని, ‘దిష్టి’ తీయించుకోను వచ్చాడు. ఆయనే మనూరికి ఇన్ని సౌకర్యాలు చేశాడు. గుడులు బాగు చేయించాడు తన గ్రాంటు సొమ్ముతో. నా కోరిక మేరకు కాలేజీలూ, వైద్యాలయా లూ అన్ని ఏర్పరచాడు. అలా ఊరు బాగుపడింది. ఊరి జనాభా బాగా పెరిగింది. నగరం తో పోటీ పడుతున్నది మన ఊరు ఇప్పుడు. అందుకే నేను స్వార్ధం లేకుండా మనూరి కోసం 'దిష్టి దుర్గమ్మ ’గా మారి ,పూజ చేసిన కుంకుమ , విభూది, తాయెత్తు లూ ఇస్తూ, జనం ఇచ్చినడబ్బు తో ఒక అనాధ శరణాలయం, వృధ్ధాశ్రమం నడుపుతున్నాను. ఈ సంపాద నంతా వాటికోసం ఖర్చుపెడు తున్నాను." అనిచెప్తున్న మా పెద్దమ్మ నిజంగా నే దుర్గమ్మ తల్లంత శక్తి వంతురాలనిపించింది.
***************************

No comments:

Post a Comment

Pages