శ్రీ ఎల్.బి.శ్రీరామ్ గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

శ్రీ ఎల్.బి.శ్రీరామ్ గారితో ముఖాముఖి

Share This
శ్రీ ఎల్.బి.శ్రీరామ్ గారితో ముఖాముఖి  
భావరాజు పద్మిని 

మనసుని హత్తుకునే మాటలు రాయటంలో మేటి... చతురతతో కూడిన హాస్యాన్ని పండించడంలో ఆయనకు ఆయనే సాటి... నవరసాల్ని తన నటనలో నవనవోన్మేషంగా అందించగల నట చక్రవర్తి - లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి – ఎల్.బి.శ్రీరామ్ గారితో ఈ నెల అంటే మే 30 న వారి పుట్టినరోజు సందర్భంగా , ప్రత్యేక ముఖాముఖి... 
 ‘గమ్యం కాదు ... ఆ ప్రయాణం నాకిష్టం ‘ అన్న సూత్రాన్ని పాటించే ఎల్.బి.శ్రీరామ్ గారు,,, అంటే... నటులా, రచయతా, దర్శకులా ? మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారు ? 
 మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు కానీ... రచన, నటన, దర్శకత్వం, ఇవన్నీ నా జీవితంలో భాగాలు కానీ, ఈ మూడే నేను కాదు. ఈ మూడింటితో ముడిపడి, విడిపడి, నాకో పెద్ద జీవితం ఉంది. ఆ జీవితంలో నేను ముందుకు వెళ్తూ ఉండాలి కనుక, నేను ఎక్కడికక్కడ గమ్యాలు పెట్టుకుంటూ ఉండాలి. ఆ గమ్యాలు కొన్ని నేను చేరుకోవచ్చు, కొన్ని చేరుకోలేక నా జీవితం మలుపులు తిరుగుతూ ఉండచ్చు. ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని మార్పులు జరిగినా, ఎన్ని కష్టాలు- సుఖాలు, నష్టాలు –లాభాలు, జయాలు –అపజయాలు, పనిలేక పోవడాలు- టైం చాలక పోవడాలు, ఆనందాలు – విషాదాలు, ఇవన్నీ కలిపి నా జీవిత ప్రయాణం. ఆ ప్రయాణం మొత్తాన్నీ ఒక మనిషిగా ఎల్.బి.శ్రీరామ్ గా నేను ఇష్టపడాలి. ఇదొక ఆధ్యాత్మిక సూత్రం, నా జీవితపు ప్రతి క్షణాన్ని నేను ఇష్టపడాలి – అనేదే... ‘గమ్యం కాదు ... ఆ ప్రయాణం నాకిష్టం ‘ అన్న సూత్రానికి నేనిచ్చుకునే నిర్వచనం. 
‘షార్ట్ ఫిలిం’ గా చెప్పుకునే ‘హార్ట్ ఫిలిం’ తియ్యాలంటే ముందుగా మీపేరే గుర్తుకొస్తుంది. తాజాగా మీరు నటించిన ‘పల్లకి’ షార్ట్ ఫిలిం కధ, మీ మనసుకు ఎంతగానో హత్తుకుని, మీరు ఆ పాత్రలో మమేకమైపోయి నటించేలా చేసిందట. దీని గురించి చెప్తారా ? 
నేను మొట్టమొదట చేసిన షార్ట్ ఫిలిం పేరు – రాళ్ళు. అందులో నేను ఒక శిల్పి. ఏ శిల్పాన్నైనా చెక్కేందుకు నేను యెంత కష్టపడతానో, అంతకు మించి నేను ఆ రాయిని ఎంచుకునేందుకు కష్టపడతాను. ఎందుకంటే నేను కష్టపడి, నెలో, రెండు నెలలో శ్రమించి ఒక శిల్పాన్ని చెక్కితే, అది చివరికి పుటుక్కున కన్ను దగ్గరో, ముక్కు దగ్గరో విరిగిపోతే నా శ్రమ అంతా వృధా అవుతుంది. అందుకే రాయి ముందు మంచిది ఎన్నుకోవాలి. అలాగ ఒక నటుడిగా కూడా నేను మంచి పాత్ర దొరకాలి, మంచి కాన్సెప్ట్ తో ఉన్న కధ కావాలి, అని ఆశిస్తాను. నేను ఫలానా పాత్ర చెయ్యాలి అని ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు, అది నాకు నచ్చితే, ఇక అక్కడి నుంచి నా ఆరాటం మొదలౌతుంది. ఆ పాత్రను ఎక్కడినుంచి తీసుకోవాలి, దాని రూపురేఖలు ఎక్కడినుంచి మలచుకోవాలి, అని మాధనపడతాను, సాధన మొదలుపెడతాను, సాన పెడతాను. 
 ఇక పల్లకి గురించి – నిరతాన్నదాత్రి డొక్కా సీతమ్మ గారి అనిమనవడు డొక్కా ఫణి అని, అమెరికా లో ప్రసిద్ధ రైటర్. అతను రాసుకున్న కధే, పల్లకి. దాన్ని షార్ట్ ఫిలిం గా తియ్యాలని, ఎప్పటినుంచో ఆయన కల. ఇప్పుడు పెళ్ళిళ్ళ విధానం మారిపోతూ ఉండడంతో, ఆ ప్రవాహంలో మన గొప్ప గొప్ప సాంప్రదాయాలన్నీ కొట్టుకుపోతున్నాయి. వాటిలో పల్లకి ఊరేగింపు అనేది ఒకటి. కధలో పల్లకీవాడు ఒక వృద్ధుడు. ఎన్నో ఏళ్ళుగా మూలాన పడ్డ తన పల్లకీని, మంచానపడ్డ తన శరీరాన్ని తల్చుకుని, పోల్చుకుని కుమిలిపోతూ ఉంటాడు. అలాంటివాడికి ఉన్నట్టుండి ధాం – ధూం గా జరిగే ఒక పెళ్ళికి పల్లకీ కట్టే అద్భుత అవకాశం వస్తుంది. అక్కడినుంచి ముసిలాడు పొందిన ఆనందం, పడ్డ ఆరాటం, చేసిన హడావిడి, చివరికి ఆ బేరం కాన్సిల్ అయిపోవడంతో పొందిన ఆవేదన, తనూ, తన పల్లకీ కధ అంతరించిపోయిన విషాదం... ఇదండీ టూకీగా కధ. ఈ కధకి, హీరో ఎవరు అన్న వెతుకులాటలో డొక్కా ఫణి ఈ పాత్రకి నేనే కరెక్ట్ అని నన్ను సంప్రదించడం, నేను అదృష్టంగా భావించి ఒప్పుకోవడం, అతనే డబ్బు పెట్టి డైరెక్ట్ చెయ్యడం, మా కోనసీమ పల్లెటూళ్ళు అంతా షూటింగ్ – అదొక మధురానుభూతి. ఆ పల్లకీ వాడి పాత్ర చిన్నప్పటి నుంచి నేనేరిగినదే. బాగా చిన్నప్పుడు, నేను కూడా పల్లకి వెనుక తిరిగేవాడిని. ఆ పల్లకీ నన్ను మోయ్యనిస్తే బాగుండును, నేను అంత పొడుగ్గా ఎదిగిపోతే బాగుండును అని అనుకుని, ఆ పల్లకీ మోసేవాడిని చూసి, ఈర్ష్య పడేవాడిని. పెద్దయ్యాకా నా ఐదు రోజుల పెళ్ళికి, రోజూ పల్లకీలో ఊరేగుతూ, నన్నెత్తుకు మోసే పల్లకీ వాళ్ళను చూస్తూ, వాళ్ళని నా ఆత్మీయులుగా, నాకు అదృష్టాన్ని తెచ్చే దేవతలుగా భావించేవాడిని. కాలక్రమంలో మురిగి మూలనపడ్డ పల్లకీని చూసినప్పుడు నాకేదో దిగులుగా, గుబులుగా అనిపించేది. ఇదంతా తెలియబట్టేనేమో, నేను ఆ పాత్రతో అంతగా మమేకం చెందగలిగాను. డొక్కా ఫణికి ధన్యవాదాలు. 
సొంతఊరు సినిమా క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటించారు. ఇంత గొప్ప సినిమా గురించి మీ మాటల్లో చెబుతారా ? 
కొందరు నటుల వల్ల కొన్ని పాత్రలకు మంచి పేరు వస్తుంది, కొన్ని పాత్రల వల్ల నటులకు మంచిపేరు వస్తుంది. సొంతఊరు సినిమాలో ‘రుద్రస్వామి’ పాత్రవల్ల నటుడిగా నాకు జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. కాటికాపరిని మించిన గొప్ప క్యారెక్టర్ ఉండదని నా అభిప్రాయం. వాడు శివుడికి ప్రతిరూపం. మంత్రసాని నుంచి, కాటికాపరి దాకా మనిషి ప్రయాణమే జీవితం. చచ్చిన మనిషిని అయినవాళ్ళందరూ స్మశానంలో వదిలేసి వెళ్ళిపోయినా, కడదాకా ఉండేవాడు, కపాల మోక్షం కలిగించేవాడు, కాటికాపరి. వాడొక నిరంకుశుడు, నిర్వికారి, అనాకారి, అయినా గొప్ప సంస్కారి. జీవితాన్ని మృత్యువు కోణం నుంచి చూపించే గొప్ప చమత్కారి. మన నవ్వు వాడికి ఏడుపు, మన ఏడుపు వాడికి నవ్వు. మన చావు వాడి జీవితం. శవం కాలితేనే వాడికి వెలుగు. వాడు నిత్య మృత్యు అభిషిక్తుడు. దుఃఖం లో ఉంటూ దుఃఖం అంటనివాడు, అంటరాని పవిత్రుడు. చదువులేని పండితుడు, కూటికి లేని మహారాజు. మట్టిని, సృష్టిని చదివిన మహాజ్ఞాని. విషాదంలో నవ్వించేవాడు, తన హాస్యంతో ఏడిపించేవాడు. వాడిది రోదనను దిగమింగిన నిశ్శబ్దం. ఇలాంటి పాత్ర అపురూపం, ఈ చిత్రంలో దీని విస్తృతి బహురూపం. నవరసాల సమపాళ్ల సమ్మేళనం. తను బ్రతకడానికి మనిషి చావును కోరుకునే ఇలాంటి విచిత్ర పాత్ర, ఈ సెజ్ ల పేరు చెప్పి, తను ఉన్న ఊరే చచ్చిపోతుంటే, తిరగబడతాడు. అంటే, మనిషి ఎవడు చచ్చిపోతాడా, నాకు పని దొరుకుతుందా అని చూసే వీడు, ఊరు చచ్చిపోతుంటే మాత్రం తిరగబడతాడు. చావు మనిషికి ఉండాలి, ఊరికి ఉండకూడదు అని ఉద్యమిస్తాడు. వాడు చెప్పే జీవిత సత్యాలు సమాధులు తవ్వే గునపాల్లా ఉంటాయి. కట్టెని కాల్చే పుల్లల్లా ఉంటాయి. ఇంత మంచి పాత్ర ప్రతి నటుడికి దొరకదండి. నాక్కూడా దొరకలేదు, నాలోని నటుడి కోసం నాలోని రచయత కష్టపడి తయారుచేసాడు. దర్శకుడు సునీల్ కుమార్ తో ఏడాది కూర్చుని, ఆ పాత్ర చెప్తూ కధల్లి, స్క్రిప్ట్ తయారుచేసాను. గంధం నాగరాజు గారని, ఆయన సహకారం కూడా ఇందుకు చాలా ఉంది. ఈ సినిమా గెట్ అప్ కోసం రెండు నెలలు, షూటింగ్ కోసం ఒకనెలా కేటాయించాను. ఆ మూడునెలల్లో 11 కమర్షియల్ సినిమాలు వదులుకున్నాను. పర్వాలేదు, ఈ సినిమా నా లైఫ్ ఆంబిషన్. దీనికి బెస్ట్ ఫిలిం అవార్డు తో సహా నాలుగు నంది అవార్డులు వచ్చాయండి. వాటిలో నాకు నందులు వచ్చాయి – బెస్ట్ క్యారెక్టర్ ఆక్టర్ గా, బెస్ట్ డైలాగ్ రైటర్ గా. అనేక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ చిత్రం ప్రదర్శించబడి, ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా కోసం మట్టి పూసుకుని, గడ్డం పెంచుకుని, ఒక యజ్ఞం లా చేసాను కనుకే, ఇంత ఆదరణ దక్కింది. 
మానరిజం డైలాగ్ లు రాయటంలో మీకు మీరే సాటి. అసలు ఇంతగా జనాలకు చేరేటట్లు ఎలా రాస్తారు ? 
ప్రతి మనిషికి కొన్ని మానరిజమ్స్ ఉంటాయండి. కాకపొతే రైటర్ గా ఆ పాత్ర స్వభావాన్ని బట్టీ, కొన్ని లేనివి క్రియేట్ చేస్తూ ఉంటాము. దీనివల్ల ప్రేక్షకులకి చిన్న గిలిగింత కలిగించగలుగుతాము. మన పాత్రల్ని ప్రేక్షకులు మరింత ప్రేమించి ఓన్ చేసుకుంటారు. మన మాటలకు పేరొస్తుంది, సినిమా సక్సెస్ అవుతుంది, ఉదాహరణకి అప్పుల అప్పారావు సినిమాలో హీరో ఫస్ట్ డైలాగ్ ... అప్పు ‘డే’ తెల్లారిందా... హిట్లర్ సినిమాలో చిరంజీవి గారి డైలాగ్ అంతొద్దు... ఇది చాలు... అనేది ఎంతో పాపులర్ అయ్యింది. ఇవన్నీ ఊరికే వచ్చెయ్యవు. తపన పడాలి. మనుషుల్ని అబ్సేర్వ్ చేసి మనం రాయగలిగితే సహజంగా ఉంటాయి. 
మాటకు మీరిచ్చే నిర్వచనం ఏమిటి ?
ఒక మాటల రచయతగా చెప్పమంటే... మాటలు రాయడం మాటలు కాదు. మాట తేడా వచ్చినా మాట దక్కదు. మన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట రిలీజ్ అయిపోయిన సినిమానే. తేడా వస్తే పోస్టర్ చిరిగిపోయి నెత్తిన చెంగే ! ఎడంచేత్తో రాసేసి, కుడి చేత్తో ఫెయిర్ చెయ్యటం కాదు. ఒక్కమాట మనిషిని నిలువునా కుంగదీసేయ్యగలదు, కష్టాల్లో అనారోగ్యంతో ఉన్న మనిషికి ఓదార్పు మాట సలైన్ బాటిల్ లాగా ఎంతో బలాన్ని ఇవ్వగలదు. ఒక్కమాటలో చెప్పాలంటే, మాటకి పవర్ ఎక్కువ, అందుకే ఆచితూచి మాట్లాడాలి. మాట్లాడడం నేర్చుకోవాలంటే, వినడం నేర్చుకోవాలి. 
హాస్యం రాయాలంటే చాలా సెన్సిటివ్ గా ఉండాలి అంటారు. మీరు సెన్సిటివా ? 
సెన్సిటివ్ గా ఉండాలి కాని, బాగా అక్కర్లేదండి ! ఒక్క హాస్యం రాయడానికే కాదు, ఎందులోనైనా అంతే, ఎంతోకొంత సున్నితత్వం లేకపోతే స్పందన ఏముంటుందండి ? కితకితలు పెట్టినా, కాల్చి వాత పెట్టినా రియాక్ట్ అవ్వని మనిషికి, రాయికి తేడా ఏముంటుంది ? రాయి రాయలేదు కదా హాస్యం. కాబట్టి, సెన్సిటివ్ గా ఉండడం అవసరమండి. మంచి రచయత కావాలంటే మంచి పాఠకుడు అయి ఉండాలి అంటారు. 
మీ అభిమాన రచయత ఎవరు ? మీరు ఎటువంటి పుస్తకాలు చదివేవారు ? 
కొన్ని నిజాలు చెప్పేందుకు సిగ్గేసి, నేరస్తుడిలా తలొంచుకోవాల్సి వస్తుంది. నేను సినిమా వాడిని, కాని సినిమాలు చాలా తక్కువగా చూస్తాను. నేను నటుడ్ని, కాని ఏ ఆక్టింగ్ కోర్స్ లలోనూ డిప్లొమా చెయ్యలేదు. నేను రచయతని పుస్తకాలు చదవను. అయిష్టంతో కాదు, అవి చెయ్యాల్సిన రోజుల్లో నాకు టైం లేదు. ఒక రిక్షా కార్మికుడిలా నిత్యం శ్రమించేవాడిని .కొంత వయసొచ్చాకా చిన్న అలసత్వం. ఇప్పుడు అప్పుడప్పుడూ అర కొర కవితలు అందరివీ చదువుతాను. కాకపొతే గతం నుంచి నాకు ఇష్టమైన రచయతలు శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, ముళ్ళపూడి వేంకటరమణ గారు, ఆచార్య ఆత్రేయ గారు, చాసో, గోపీచంద్, తిలక్, శారద, రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. అందరివీ కొన్ని కొన్ని చదివాను. 
ఎవరి దర్శకత్వంలో చెయ్యడం అంటే మీకు ఇష్టం ? 
చాలా పెద్ద లిస్టు చెప్పాల్సి వస్తుంది. నాకు చాలా ఇష్టమైన దర్శకుల దగ్గర కొన్ని ఎక్కువ చేసాను, కొన్ని తక్కువ చేసాను. కాని, మళ్ళీ మళ్ళీ వారి దగ్గర్నుంచి పిలుపు వస్తే బాగుండు అన్నంత గొప్ప డైరెక్టర్లు ఉన్నారండి. కృష్ణవంశి ,గారు, వి.వి.వినాయక్, ది. నాగేశ్వర్ రెడ్డి, పూరి జగన్నాథ్, రాజమౌళి, తొలిప్రేమ కరుణాకరన్, కోడి రామకృష్ణ గారు, బోయపాటి శ్రీను, ఇంద్రగంటి మోహనకృష్ణ గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు... వీరి వద్ద మళ్ళీ మళ్ళీ చేస్తే బాగుండునే, అనిపిస్తుంది. నేను చెయ్యని డైరెక్టర్లు , నాకు ఇష్టమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. శ్రీకాంత్ అద్దాల, సుకుమార్, త్రివిక్రమ్ గారు... ఈ కోవలోకి వస్తారు. నాకు పైడిపల్లి వంశీ గారంటే చాలా ఇష్టం. కొత్త కొత్త పాత్రలతో వచ్చే ఏ కొత్త దర్శకుడైనా, ఆ పాత్రని బట్టి, అతను ఏమిటో అనలైజ్ చేసుకుంటాను నేను. అంటే యెంత చేసినా ఒక ఆక్టర్ కి ఒక అసంతృప్తి ఉండాలి అనుకుంటాను నేను. మనకున్న లిమిటేషన్ లలో యెంత బాగా చెయ్యగాలిగాము అన్నది ముఖ్యం. 
‘మీ రచనలు హృదయంలోంచి వచ్చినట్లు ఉంటాయి’- అన్నారు వి.వి.వినాయక్ హృదయానికి హత్తుకునే విధంగా ఇంత అద్భుతంగా ఎలా రాయగలరు ? 
హృదయం లోంచి రావాలంటే ముందు జీవితంలోంచి రావాలి. జీవితంలోంచి రావాలంటే జీవితాన్ని ప్రేమించాలి. మన జీవితాన్ని, మన చుట్టూ ఉన్న సమాజంలోని వారి అందరి జీవితాల్ని, వాటికున్న హైట్స్ ని లిమిటేషన్స్ ని, రాగాల్ని-ద్వేషాల్ని, మంచిని- చెడుని, అన్నింటినీ గమనించాలి, గౌరవించాలి. మనదైన స్పందన చూపించాలి. మనకు తెలిసిందే రాయాలి. తెలియంది తెలుసుకుని రాయాలి. పాత విషయాన్ని కొత్త విషయంగా రాయాలి. కొత్త విషయాన్ని అందరికీ అర్ధమయ్యీలా రాయాలి. రాయడం అంటే ఎడంచేత్తో రాసి, కుడి చేత్తో ఫెయిర్ చేసి ఇచ్చేయ్యడం కాదండి. రెండు చేతులతోనూ, బావిలోంచి నీళ్ళు తోడుతున్నట్టు గుండెల్లోంచి తోడాలి. ఇవన్నీ నేను చేసేస్తున్నాను అని కాదు, చెయ్యడానికి తపన పడుతూ ఉంటాను. అందుకే నేను టేస్ట్ ఉన్న రైటర్ నే కాని ఫాస్ట్ రైటర్ ని కాదు. ఏవైనా థాంక్స్ వి.వి.వినాయక్ గారు ఫర్ యువర్ కంప్లిమెంట్. 
ఉన్ననాడు పొంగిపోరు, లేనినాడు కుంగిపోరు, ఎప్పుడూ ఒకలాగే ఉంటారు ‘ అన్నారు మీ భార్య రామలక్ష్మి గారు. ఇంతటి సమతుల్యత ఎలా అలవడింది ? 
తనే కారణం అండి. బాగా చిన్నప్పుడే మా పెళ్లి అయిపొయింది. చిన్న చిన్న ఉద్యోగాలు, చాలని జీతాలు, పిల్లలు, పాలడబ్బాలు, ఇవి చాలక నాటకాలంటూ, సినిమాలంటూ , రచనలంటూ, నటనలంటూ ఎప్పుడూ కొండల్ని డీ కొనే టార్గెట్. టోటల్ గా లైఫ్ ఏంటంటే సముద్రంలో చేపపిల్ల. ఒక కెరటం పైకెత్తుకు పోతూ ఉంటుంది, మరో కెరటం లోపలి లాగేస్తుంది. అది, నిరంతర ప్రక్రియ అయిపోయి, అలావాటైపోయి, అనుభవంగా మారిపోయి, పాఠం గా మిగిలిపోతే, అందులోంచి నేర్చుకున్నదే మీరనే సమతుల్యత ఏమో ! సినిమా రంగం అంటే అందరికీ హరివిల్లులా కనిపిస్తుంది. 
ఈ తారాలోకంలో సితారగా మెరవాలని, ఆశిస్తూ వచ్చే భావి నటులకు మీరిచ్చే సందేశం ఏమిటి ? 
నా ఫిలాసఫీ ఒక్కటేనండి. జీవితం కష్టపడడానికి, సుఖపడడానికి కాదు. శోధించడానికి, సోమరితనానికి కాదు. శోధిస్తేనే సాధిస్తాము. చీమైనా అంతే, మనిషైనా అంతే. దానికి నిరంతర ప్రయత్నం అనే అలసట లేని ప్రయాణం కొనసాగాలి. ప్రయత్నం అంటే, ప్రతి రోజూ సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరగడం, ఫోన్లు కొట్టడం ,కాకా లు పట్టడం, ఇది కాదండి. ఇది ఒక దశలో కొంతవరకు అవసరమే కాని, అది రచనో, నటనో ఏదైనా – ముందు మనం అవ్వాలనుకుంటున్న దానికి, మనకున్న అర్హతలు ఏంటి ? అవి లేకపోతే ఎలా తెచ్చుకోవాలి, వాటిని వెలుగులోకి ఎలా తెచ్చుకోవాలి, అని అల్లోచించాలి. దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్నది మరో ముఖ్యమైన సాధన . ఒలింపిక్స్ లో చేరడానికి ముందు అర్హత కావాలి, తర్వాత అవకాశం రావాలి, తీరా వచ్చాకా ప్రాణాల్ని చావో రేవో క్రింద భావించి, నా ఓటమి నా ఒక్కరిదే కాదు, దేశానిది అన్న తపనతో దేశం కోసం పరుగు తియ్యాలి. 
 గొప్పవాడైపోయిన వాడిని చూసి, మనం వాడు చాలా తక్కువవాడని, ఏదో అదృష్టం కలిసొచ్చి, రాత్రికి రాత్రి అలా అయిపోయాడని అనుకోకూడదు. ఇవాళ కొందరు అలా అయిపోయినా కూడా, వాళ్ళనీ గౌరవించాలి కాని, విమర్శించకూడదు. నేను నాటకరంగంలో కృషి చేసి, ఒక స్థాయికి వెళ్ళాకా, సినిమా అవకాశాల కోసం వెళ్లాను. ఏదైనా ఒక జీవితకాలపు దీక్ష, తపన ఉండాలండి. అలా సాధించినదే రుచిగా ఉంటుందండి. అడ్డదారిలో అప్పనంగా వచ్చింది చప్పగా ఉంటుంది. అందుకనే, ఇదే మన జీవితానికి అగ్నిపరీక్ష అనుకుని, అందరినీ కష్టపడమని ,ఒక తీరని దాహంతో కృషి చెయ్యమని నా సందేశం. 
మీరు నటులుగా, రచయతగా, హాస్య నటులుగా అనేక అవార్డులు పొందారు. మీరు మర్చిపోలేని అనుభూతిని గురించి చెబుతారా ? 
పురస్కారాలు అవీ చాలా వచ్చాయి గాని, నేను రాష్ట్ర స్థాయి నటుడ్ని. నాకు నేషనల్ అవార్డు రాలేదు. 4 నంది అవార్డులు వచ్చాయండి, ఇవే నాకు దక్కిన హైయెస్ట్ హానర్. ఎల్.బి.శ్రీరామ్ అనగానే గుర్తొచ్చేది, ‘అమ్మో, ఒకటో తారీఖు’ సినిమా. అది నా ఒంటెద్దు బండి అనే నాటకం ఆధారంగా తయారైన సినిమా. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను, కాని నాకు దానికి నంది అవార్డు రాలేదు. మరి సొంతఊరు కి రెండు నంది అవార్డులు వచ్చాయి. మామూలుగా అలా ఒకే వ్యక్తికి రెండు నందులు ఇవ్వరు. కాని, కొన్ని ఎక్సెప్షనల్ కేసు లలో రచన, నటనా దేన్నీ వదిలెయ్యడానికి లేక అలా ఇచ్చారు. దానికి బాధ ఉంటుంది, దీనికి ఆనందం ఉంటుంది. అవార్డులు అనేవి మన ప్రతిభకు కొలమానాలు కావు. వాటి గురించి ప్రతి సారి కలలు కంటూ ఉంటే, అశాంతే తప్ప, మనఃశాంతి ఉండదు. 
మీ ‘డ్రీం రోల్’ ఏదైనా ఉందా ? మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
ఎన్ని చేసినా, ఇందాక చెప్పినట్టు, ఒక అసంతృప్తి ఉండాలండి. ఇదివరకు వచ్చిన విస్సు టైపు, గొల్లపూడి మారుతీరావు గారి సినిమాలు ఇలా మానవీయ విలువలున్న సినిమాలు నాకు ఇష్టం. ఇప్పుడు అలాగే తీస్తే ఇప్పుడు చూడరు, ప్రెసెంట్ ట్రెండ్ లో ఒక కొత్తరకంగా వాటిని ప్రాజెక్ట్ చెయ్యాలి. కొత్త రకంగా ఆలోచించాలి. మనిషి జీవితం మారిపోతోంది. ఇవాళ మోడరన్ మిడిల్ క్లాసు లో చాలా ఘర్షణ ఉంది. అది మంచి సబ్జెక్టు అవుతుంది. వంటకానికంటే ముందు వడ్డించే మనిషుండాలి, మనసుండాలి. ఇవి లేకుండా ఒకేరకం వండి, వడ్డిస్తుంటే, వెరైటీ ఉండదు. అందుకే నాకు షార్ట్ ఫిలిం లు చెయ్యాలని కోరిక. 400 కమర్షియల్ సినిమాలు చేసాను. 200 షార్ట్ ఫిలిం లు చెయ్యాలని ఒక కోరిక. ఎవరైనా నాతో షార్ట్ ఫిలిం లు తియ్యాలని అనుకుంటే, క్రింది ఈమెయిలు ను సంప్రదించండి... lbsreeram@gmail.com  

మా ‘ అచ్చంగా తెలుగు’ చదువరుల కోసం మీకిష్టమైన ఒక డైలాగ్ చెప్తారా ? 
తప్పకుండా. చాలా బాగుంది సినిమాలోని డైలాగు చెబుతానండి. అందులో పత్తిపంట పోయిన రైతు పురుగులమందు తాగి, దానివల్ల తింగర మాట అతనికి వచ్చేస్తుంది. వాడి కూతురు హీరొయిన్ . వారు కట్నం అడిగితే, ‘కట్నం ఏముంది నాదగ్గర మొలతాడుంది... కావాలంటే నా జేబులో ముప్పావలా ఎంతో ఉంది, ఏమే ఇలా పట్రావే’ అంటాడు. అటువంటిది, చివరికి కూతురి సంబంధం చెడిపోయేసరికి , అంతగా నవ్వించే మనిషి కంటతడి పెట్టించే డైలాగ్ చాలా బాగుంటుందండి. ఇది వాడుకూడా కంటతడి పెట్టుకుని చెప్పిన డైలాగ్. ఈ పాత్ర చూసి, ఆజాద్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ఇది కూడా బాగా పవర్ఫుల్ క్యారెక్టర్ అయ్యింది. నాటకరంగం నుంచి వచ్చి, స్వయంకృషితో రచనలో , నటనలో తనదైన ముద్ర వేసుకుని, మన అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న ఎల్.బి.శ్రీరామ్ గారి జీవన విధానం అందరికీ ఆదర్శనీయం. మన చదువరులు అందరి తరఫునా, వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందచేద్దమా ? శ్రీరాం గారితో నా ముఖాముఖి ని క్రింది లింక్ లో వినండి...

No comments:

Post a Comment

Pages