Saturday, May 23, 2015

thumbnail

కుక్క పిల్ల (కథ )

కుక్క పిల్ల (కథ )

- చెరుకు రామమోహనరావు 

అది ఒక మహా నగరం. అందులో ఒక ప్రాంతము. ఆ ప్రాంతము ధనికుల మరియు అత్యంత ప్రముఖ ప్రభుత్వభృత్యుల కావాసము. అందులో వున్నది వైయక్తిక సేవల కంకితమైన,అతిపెద్ద వార్దుషీ శాఖ(A Big Bank's branch, వార్దుషి=Bank అన్నది నాకు నచ్చిన సంస్కృత సమానాంతరపదము.) ఆ బేంకికి ఉన్న నలుగురు కాపులలో (security,  అసలు COP అన్న పదము 'కాపు' నుండి వచ్చిందేమో!) మన కథానాయకుడు ఒకడు.కథానాయకునికి మరి పెరుండవద్దూ. 'శూలపాణి' .పేరు తగినదా కాదా నెమ్మదిగా చూస్తాము.మరి నాయకుడుంటే ఖల నాయకుడు (ఖలుడు=దుర్మార్గుడు) వుండవలె కదా! అవునవును వుండాలి, కాబట్టి అతని పేరు మన్మద్ (manmad, man తరువాత ఒక space ఇచ్చి చదువుకోండి, పైగా ఈయనది'ద' కారమె గానీ  పొక్కిలి లేదు.) ఈ మన్మధుని మనోభావాలేమిటో తెలుసుకొందాము.ఆయన ఆ శాఖకు cash custodian(CC).అంతే కాక కొన్నికొన్ని వున్నవి లేనివీ పనులను నేత్తికెత్తుకొని తనవల్లనే ఆ శాఖ నడుచుచున్నదన్న భావము branch manager (BM)లో కలుగవలెనని తపించేవాడు. 'శాఖ' అంటే ఒక branch manager, ఒక accounts' manager(AM) కూడా వుండాలి కాబట్టి వుంచుకొందాము. మేనేజరు ఒక 'స్త్రీ' ఆమె పేరు 'మోహిని', accounts manager ఈ కథలో అంత ప్రముఖుడు కాకున్నా పెరుండాలి కాబట్టి అతని పేరు 'యుగంధర్'.పాత్రల పరిచయాలు ముగిసినవి కదా ఇక కథ లోనికి నడుస్తాము.
ఆ ప్రాంతము అంతా ధనికులు , ప్రభుత్వ హోదాలు, గొప్పగొప్ప ఉద్యోగాలు, చేసే సంసారాల నెలవు కావడముతో, వారికి కుక్కలపై మక్కువ ఎక్కువ కావడంతో, వేల ఖరీదు చేసే పెంపుడు కుక్కలు అక్కడ వెలసినాయి. ఒక శుక్ర వారము రోజు ఒక అతిముచ్చట గొలిపే కుక్కపిల్ల బేంకు సమయము ముగిసిన పిదప శులపాణి డ్యూటీ లో వున్నపుడు బేంకు గృహప్రవేశము చేసింది. అది తిరిగి బయటికి పోకుండా వుంటే , చూద్దాం ఎవరన్నా అడిగితే ఇస్తాం లేకుంటే ఇంటికి తీసుక పోతామనుకొన్నాడు శూలపాణి. వెంటనే కుక్కను ఒక మూల గది వద్ద, కష్టమర్లకు సులువుగా కనిపించని రీతిలో,కష్టపడి ఒక తాడు వెదకి తెచ్చి కట్టినాడు.తెల్ల వారింది. శనివారము కావున 1/2 రోజే బేంకి. మొదట cash custodian వచ్చి అక్కడ కుక్కపిల్లను చూసినాడు. అప్పుడు డ్యూటీ లో వున్న security ని అడిగితే దానిని శూలపాణి కట్టి అక్కడ వుంచినాడని చెప్పినాడు. ఆ కుక్కపిల్ల తనవంటి వాని వద్ద వుండాలనుకొన్నాడు మన్మద్. ఇంతలో యుగంధర్ వచ్చినాడు కానీ ఆ విషయము తెలిసినా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక BM మోహిని గారు రంగ ప్రవేశము చేసినారు. ఆమె పేరుకు తగ్గ అందము చందము కలిగిన వ్యక్తి. కుక్కపిల్ల మోజులో ఆమె కూడా పడిపోయింది.
 branch లో ఇంకా కొంతమంది స్త్రీలు కూడా పనిచేసేవారు. మన man mad (మన్మద్) కు మనసులో ఎప్పుడూ అక్కడ పనిచేసే ఆడవారందరూ తన ఆకర్షణకు లోనయినవాళ్ళే అన్న భ్రమ. అందుకు తగినట్లుగానే, వారి కళ్ళలోని జుగుప్స గమనించకుండా, అనవసరముగా రాచుకొంటూ పూసుకొంటూ  తిరిగేవాడు. అతని పై గల అసహ్యమంతా మనసులోనే దాచుకో పనిచేసేవాళ్ళు ఆ ఇల్లాళ్ళు. క్రింద చెప్పబోయేది కథకు సంబంధము నేరుగా వున్నట్లు కనిపించకున్నా అంతర్లీనంగా అతని మూర్ఖత్వమును తెలియబరచుతుంది కాబట్టి మీరు చదువుటకు వ్రాస్తూ వున్నాను.
మధ్యాహ్నము తెచ్చుకొన్న లంచ్ బాక్స్ ముగించిన వెంటనే పురీషమునకు(toilet) అతడు పోవలసిదే. అది అతని
దినచర్య. కాని అది అక్కడ ఆగలేదు . అతను AM వద్దకు వచ్చి తన చేతి గుడ్డతో మూతి తుడుచుకోవడము తో ముగుస్తుంది. యుగంధర్ తన లంచి ముగించి ఒక సహచారునితో సరదాగా మాట్లాడుతూ వుండినాడు. CC తనను దాటి టాయిలెట్ కు పోవుట చూసి, అతను కనుమరుగైన తరువాత తన సహచరునితో ' నీవు నవ్వనని మాట ఇస్తే నేను అతను తిరిగి వచ్చేటపుడు ఒక ప్రశ్న వేస్తా. అతను చెప్పే జవాబుకు నవ్వ వద్దన్నాడు.సరేనన్నాడు సహచరుడు. మన్మద్ రావటము మూతి తుడుచుకో బోవటము,భోజనమైనదా అని యుగంధర్ అడగటము, అనుచరుడు ఆపుకోలేనంతగా నవ్వటము జరిగిపోయినాయి. మన్మద్ బిక్క  మొగము వేసి ఎందుకు నవ్వుతున్నావు అని అనుచరుని అడిగినా, నవ్వుతూనే ఉండిపోయిన అతని నుండి జవాబు రాకపోతే యుగంధరే కలుగజేసుకొని నేను వేసిన joke కు నవ్వుతున్నాడని అంటున్నా వినిపించుకోకుండా విసుగ్గా  వెళ్లి పోయినాడు.
ఇక కథలోకి వస్తే కుక్కపిల్ల పై శూలపాణికి, మన్మద్ కు, మోహినికి కళ్ళు పడినాయి అని ముందే చెప్పుకొన్నాము.
అవకాశము ఎక్కువగా వున్న శూలపాణి అదను చూసి శునకాన్ని ఇల్లు చేర్చుకొన్నాడు. ఆదివారమైనా ఎదో పని ఉంటుంది ఆఫీసర్లకు కాబట్టి అందులో మేనేజరు , అందులోనూ స్త్రీ , మరి మన mad రాకుండా ఉంటాడా! వచ్చినాడు. good morning మేడం అంటూ ఆవిడ కేబిన్ లో ప్రవేశించినాడు. ఆమాట ఈమాట ముగిసిన తరువాత  మోహిని ఆ కుక్క పిల్ల పై తన మనసు పార వేసుకొన్న విషయము మన్మద్ తో చెప్పింది. manmad కు గొంతులో పచ్చి వెలగకాయ పడింది.
అప్పుడు డ్యూటీ లో వున్నsecurity ని అడిగితే 'ఎవరూ అడుగనందువల్ల శూలపాణి నగరానికి దూరంగా వుండే పల్లె లో తన ఇంటికి తీసుకపోయినాడు' అని చెప్పినాడు.  ఆమె వెంటనే అతని ఇంటికి పోదామంటూ,ఈ రోజు నేను కారు తేలేదు కాబట్టి ఆటోలో పోదామన్నది. కుంచించుకు పోయిన manmad మోము వికసించింది. తన పూలు పుటికే లో పడినట్లై నది. వెంటనే  ఆటో తెస్తానన్నాడు. ఆతనను ఎదో ప్రయాణములో పదనిసలతో శూలపాణి వూరువెళ్ళవచ్చునని ఎంతో సంతోషముతో మురిసి పోయినాడు. ఎట్టకేలకు తుట్టతుదకు, కట్ట కడపటికి,చిట్టచివరికి
అతని ఇల్లు తెలుసుకొన్నారు. మోహిని తెలివిగా తానూ రిక్షాలోనే ఉంటూ మన్మద్ ను వెళ్ళి విచారించమన్నది. ఆమె తానంటే తపించి పోవుట చేత ఈ పనులన్నీ చేబుతూన్నాదని తలచినాడు ఆ మూర్ఖుడు.
శూలపాణి ఇంటి తలుపు తట్టగానే ఒక అందమైన అమ్మాయి తలుపు తెరిచింది. మన్మద్ దుర్బుద్ధి కూడా తలుపు తెరిచింది.ఇంట్లో ఎవరైనా వున్నారా అనిఅడిగినాడు. వాకిలికి అడ్డం గానే నిలబడి ఆ అమ్మాయి 'ఎవరూ లేరు ' అని బదులు చెప్పింది. 'నేను బెంకి CC ని. మీ నాయనకు బాస్ ను'అంటూ విసురుగా ఆ అమ్మాయి చేతిని త్రోసి ఇంటిలోనికి ప్రవేశించినాడు. 'ఏడీ మీ నాన్న, కుక్క పిల్ల ఎక్కడ' అని మొదలు బెట్టి ప్రకోపించిన పైత్య కారుని వలె మాట్లాడుతూ ఆ అమ్మాయి సౌందర్య వర్ణన లోనికి దిగి ఆ అమ్మాయిని బలవంత పరుప మొదలు పెట్టినాడు.' ఆ అమ్మాయి అతనిని విదిలించుకొని తెరిచిన తలుపు గుండా వీదిలోనికి వచ్చేసింది. తిరిగి బయటికి వచ్చుట తప్ప వేరు గత్యంతరములేని మన్మద్ మూలన వున్న కుక్క పిల్లను చూసి దానిని తీసుకొని తన దురదృష్టానికి చింతిస్తూ వెళ్లి ఆటో ఎక్కినాడు. 'వినాశ కాలే విపరీత బుద్ధి ' అంటే ఇదేనేమో!
ఆటోలో అమ్మ గారితో మన అయ్య గారు శ్వాన(కుక్క) సమేతంగా బేంకి చేరినారు. అప్పటికే అక్కడ నిలిచియుండిన ఆ కుక్క స్వంతదారురాలైన యువతీ , ఇరువురికి thanks చెప్పి కుక్కపిల్లను తీసుకొని వెళ్లిపోయింది. ఎదో బెంకి పని చూసుకొని మోహిని వెళ్లిపోగా , తన దురదృష్టాన్ని దూరుతూ (తిడుతూ) manmad కూడా ఇంటి దారి పట్టినాడు. ఇంతసేపూ మన్మద్ వయసు చెప్పలేదు కదా. అప్పటికతని వయసు 48. ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు.
సోమవారము గడిచింది. పండుగ అగుటతోమంగళవారము బెంకికి శెలవు అయినది. ఆరోజు security సరిగా పనిచేస్తున్నారా లేదా అని తనిఖీ చేయుట CC బాధ్యత. శెలవు దినములలో అతను రాక తప్పదు. ఆ సమయములో శూలపాణి డ్యూటీ లో వున్నాడు . వీరిద్దరూ తప్ప వేరెవ్వరూ లేరు.ఇంకా లోపలి సరిగా అడుగు పెట్టకుండానే ప్రశ్నించాడు మన్మద్.
మన్మద్ : "ఏమి? shoes వేసుకు రాలేదే."
శూలపాణి : "ఆఫీసుకు ఆలస్యమౌతుందని సార్.మీకన్నా ముందు వుంటేనే  కదా మీ సేవ  చేసుకోగలుగుతాను. రేపటినుండి మరచిపోకుండా వేసుకు వస్తాను సార్."
శూలపాణి సింహద్వారము మూస్తూవుంటే "ఎందుకు తలుపు వేస్తున్నావు" అని అడిగినాడు మన్మద్. " సార్ మీరు check చేసేటపుడు మీతోటే వుండవలె" నన్నది కదా మీ ఆదేశము. మరి లోనికి ఎవరైనా వస్తే తెలియదు కదా ! అందుకని సార్" అన్నాడు.
మన్మద్ : "సరే సరే""
ఇరువురూ currency chest వుండే గది లోనికి ప్రవేశించినారు. శూలపాణి ఆ తలుపులు వేస్తుంటే 'ఎందుకు' అన్నాడు మన్మద్. 'ఇప్పుడే చెబుతాను సార్' అన్నాడు శూలపాణి.
విస విసా అతని వద్దకు వెళ్ళి తిట్టిన తిట్టు తిట్టకుండా ,నోటిని మూత పెట్టకుండా తిడుతూ (అత్యంత చెడ్డ తిట్లను మీకు తెలిసిన రీతిలో ఊహించుకోండి) కాలికి వున్న పాదరక్షను తీసి తన శక్తి ఉన్నంత వరకు , కాదు కాదు, శక్తి సన్నగిలినా చెప్పు తెగేవరకు పదే  పదే తనకు ఇష్టమైన చోట్ల ,ఇష్టమైన రీతిలో మన్మద్ శరీరము పై వడ్డించినాడు.
శూలపాణి : "నీకీ శాస్తి ఎందుకు చేసినానో తెలుసు కదా. ఇప్పటికైనా పరాయి ఆడపిల్లలను గౌరవించడము నేర్చుకో. నా మీద కోపముంటే దిక్కున్న చోట చెప్పుకో."
అని వెళ్ళి తలుపులు అన్నీ తెరచినాడు. మన్మద్ , శెలవు దినము కాబట్టి, ఏమీ చేయలేక ఈడుపు కాళ్ళతో ఏడుపు మొగముతో ఇల్లు చేరుకొన్నాడు. తరువాత రోజు మోహినితో మాట్లాడి, అసలు కారణము చెప్పకుండా, శెలవు పెట్టి అటు management, ఇటు union చుట్టూ తిరిగి వాళ్లకు మౌఖికముగా లిఖితముగా విన్నపములు సమర్పించుకొని ఇల్లు చేరినాడు.
మేనేజ్ మెంట్  union తో కలిపి ఒక కమిటీని వేసి branch కి పంపింది. అంతవరకు అసలేమి జరిగినది అన్న విషయము మోహినికి తెలియదు. కమిటీ ద్వారా, ఏక పక్ష విషయము (అంటే ఇంకా శూలపాణి నోరు విప్పలేదు కదా!) విని ,నిట్టుర్చి వారికి మేడపైన ఒక గది ఖాళీ చేయించి యిచ్చింది. ఇక అక్కడ విషయ సేకరణలు, వాద ప్రతివాదాలు మొదలైనాయి.
కమిటీ సభ్యుల పేర్లను C1, C2, C3 గా పెట్టుకొందాము.
C1 : నీ పేరేనా  శూలపాణి
శూలపాణి : అవును సార్ మా తల్లిదండ్రులు బ్రతికినంతవరకు అట్లే పిలిచేవారు సార్
C2 : ఈయన ఎవరో తెలుసునా ?
శూలపాణి : ఒక watch man తన పై అధికారి ఎవరో తెలియకుండా ఎట్లు ఉద్యోగము చేస్తాడు సార్.
మన్మద్ తో C2 : "మీ పేరు?"
మన్మద్ : "మన్మద్ సార్."
 C3 : " ఎంత కాలమైంది మీరీ బ్రాంచి లో పని చేయబట్టి? "
మన్మద్ : " సంవత్సరము పైనే అయ్యింది సార్ "
ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత అదేవిధమైన ప్రశ్నలు శూలపాణి ని కూడా అడిగి, తరువాత అసలేమి జరిగింది అని మన్మద్ ను అడిగినాడు C1. మన్మద్ ఉద్వేగ పూరితంగా జరిగినదంతా ఏకరువు పెట్టినాడు.ఇక శూలపాణిని అడగటము మొదలైనది.
C1 : " CC గారు చెప్పినది నిజమేనా? "
శూలపాణి : సార్ CC గారు  మా పై అధికారి. మేమంతా వా వారి క్రింద పనిచేసే వాళ్లము. ఆయన మాకు దేవునితో సమానము. దేవుడిని ఎవరైనా కోడతారాసార్? ఆయన దేవునితో సమానము కాబట్టి అబద్ధాలు చెబుతారా సార్?
అయినా మీరు ఆయనకు పై అధికారులు. ఆయన చెప్పే మాటలోని నిజానిజాలు తెల్చేదానికే గదా సార్ మీరు వచ్చింది. మీరే చూసుకోండి సార్.
C2 : ఆయన మీ ఇంటికొచ్చినపుడు ఏమి జరిగినదని మీ కుమార్తె చెప్పింది.
శూలపాణి : "ప్రత్యేకముగా ఏమీ జరిగినట్లు చెప్పలేదు సార్. సారెంతో మంచివారని ,ఎంతో అభిమానముగా మాట్లాడినారని, నా పై అధికారి కాబట్టి ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి కాఫీ తయారుచేసి ఇచ్చిందని చెప్పింది సార్.
పై పెచ్చు అధికారులలో అంత మంచివాళ్ళు కూడా ఉంటారా నాన్నా అని నన్నడిగింది సార్. వెళ్ళేటపుడు కూడా ఆయన ఎంతో మరియాదగా అమ్మా! నాన్న వస్తే నేను వచ్చి కుక్కపిల్లను తీసుకు వెళ్ళినానని చెప్పు అని కూడా చెప్పిపోయినారట సార్."
3 : "మరి నీవాయనాను కొట్టనేలేదా?"
శూలపాణి :"ఇటువంటి ఒక మాట నా జీవితములో వినవలసి వస్తుందనుకోలేదు సార్. ఈ రోజు ఆయనను కొట్టి రేపు ఆయన వద్ద పని చేయగలుగుతానా సార్?"
అంతా విన్న తరువాత కమిటీ బెంకికి రిపోర్ట్ సబ్మిట్ చేసింది.బేంకి శూలపాణి తప్పు చేయలేదని నిర్ధారిస్తూ , అనవసరంగా బేంకి సమయాన్ని వృధా పుచ్చినందుకు మన్మద్ ను త్రవ్వినా నీరు దొరకని ఎడారి ప్రాంతానికి transfer చేసిది. ఆతను వెళ్ళిన తరువాత బ్రాంచి లోని స్త్రీలు శూలపాణిని సన్మానించినట్లు సమాచారం.
నీతి : సమయానుసారముగా కట్టుకొన్న భార్యలో కూడా తల్లిని చూడమని ఆదేశించిన భూమి మనది.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information