కోలంక శ్రీ మదనగోపాల శతకము - అచ్చంగా తెలుగు

కోలంక శ్రీ మదనగోపాల శతకము

Share This
కోలంక శ్రీ మదనగోపాల శతకము - వంకాయలపాటి వేంకటకవి
పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 

కవిపరిచయం:
కోలంక శ్రీ మదనగోపాల (మదనగోపాల) శతకకర్త వంకాయలపాటి వేంకటకవి గోదావరీ మండలములోని కోలంక వాస్తవ్యుడు. ఈతడు అనేక కృతులను వ్రాసిన కవి. ఈకవి రమారమి క్రీ.శ. 1800 ప్రాంతమువాడు. ఈకవి పోలిపెద్ది వేంకటరాయకవి సమకాలీనుడు. తనగురించి ఈక్రింది పద్యంలో తెలుపుకొన్నాడు.
"గురుతర గౌతమ గోత్ర పవిత్రుండ, ప్రధిత వంకాయలపాటి కులుఁడ
వేంకయ మంత్రి సాధ్వీమణి కామమాం, బ గర్భవార్ధి జైవాత్రకుండ
గుండు వేంకటరామ కోవిద గురుదత్త, శుద్ధపంచాక్షరీ సిద్ధ యుతుఁడ
సకల లక్షణ లక్ష్య సాహితీ నిపుణుండ, శైవ వైష్ణవ సదాచార రతుఁడఁ
వేంకటాఖ్యుడ"
పై పద్యాన్ని బట్టి ఈ కవి గౌతమగోత్ర ఆర్వేలనియోగి బ్రాహ్మణుడు. ఆపస్తంభ సూత్రుడు.  వేంకయ్య, కామమాంబ ల పుత్రుడు, గుండు వేంకటరాముని శిష్యుడు. పంచాక్షరీ సిద్ధి పొందినవాడు. శైవ వైష్ణవ సదాచారరతుడు. ఇతని ఇతరరచనలు మాత్రం లభ్యం కాలేదు.
శతక పరిచయం:
కోలంక శ్రీ మదనగోపాల శతకము "భూరిమయవాస! కోలంకపురనివాస, మదనగోపాల రాధికా హృదయలోల!" అనేమకుటంతో వ్రాయబడిన శిసపద్య అధిక్షేప (నిందాగర్భ) శతకము.
భక్తి, నీతి, శృంగార భావములు- సజ్జన దుర్జన లక్షణములు- రాజుల క్రూరవర్తనము,- దుష్టచిత్తవృత్తి,- కలియుగ ధర్మములు- సాంసారిక జీవనము, కవుల మనస్తత్వము, మొదలైన అంశములు ఈశతకములో అధిక్షేపధోరంఇలో వ్యక్తీకరించబడినవి. వ్యక్తీకరణ విధానముకూడా కొంతవరకు విశిష్టం గా ఉంతుంది.
భక్తిరసముట్టిపడే ఈ పద్యం చూడండి.
దండంబు దోర్ధండ మండిత కోదండ, దండంబు భూరిప్రతాపచండ
దండంబు పాలితా ర్తస్తుత్య వేదండ, దండంబు ముని వరదాన శౌండ
దండంబు దండితాతత నిశాచరకాండ, దండంబు వైరి రౌద్ర ప్రకాండ
దండంబు భక్త సంత్రాణమహోర్ధండ, దండంబు బ్రహ్మాండ ధరపిచండ
దండమో పాపతిమిర మూర్తాండ నీకు
ననుచు మ్రొక్కెద ననుబ్రోవు మయ్యవేగ
భూరిమయవాస! కోలంకపుర నివాస
మదనగోపాల! రాధికాహృదయలోల!
ఈకవి ప్రభువులను, అధికారులను వారి దుస్చర్యలను అధిక్షేపించినప్పుడు వారిచర్యలను మాత్రమే సామాన్యీకరించి నిరసించినాడు కానీ వారి పేర్లను పేర్కొనలేదు.
పిడికెడు బిచ్చంబుఁ బెట్టజాలనిదాత, యిష్టార్థ సంసిద్ధు లివ్వఁగలఁడె
చేని గట్టే దాటలేని గుఱ్ఱము వైరి, గిరి దుర్గములకు లంఘించగలదె
యూరబందికి భీతినొంది పారిన బంటు, దాడి బెబ్బులుల వేటాడ గలఁడె
కొలుచువారికి జీతములు నొసంగని దొర, యర్ధుల బిలిచి వెయ్యారు లిడునె
బట్టు బొగడిన నొకపూట బత్తెమిడని
యతినికృష్టుఁడు సత్కృతుఁలందగలడె
భూరిమయవాస! కోలంకపుర నివాస
మదనగోపాల! రాధికాహృదయలోల!
తల్లిని వేరుంచి తమ్ముల విడఁదోలి, అక్కచెల్లెండ్ర సొ మ్మపహరించి
బంధువులను తృనప్రాయంబుగా నెంచి, యొరుల మాపఁగ మది నూహఁజేసి
తనకన్నఁదెలిసిన జనుఁ డెవ్వఁడని క్రొవ్వి, యించుకంతయు ధర్మ మెఱుగకుండి
లోపల బహు దురాలోచనంబులు జేసి, పైకి నీతులుఁ బెక్కు పలుకుచుండి
బుధులకొక కీడు సేయంగఁ బూనఁ జూచు
నిట్టి పురుషాధముని జన్మ మెందుకొఱకు
భూరిమయవాస! కోలంకపుర నివాస
మదనగోపాల! రాధికాహృదయలోల!
సామాన్య నీతులు సజ్జన-దుర్జన లక్షణములు బోధించునప్పుడూ ఈకవి కొంతవరకు భర్తృహరి ని అనుసరించినట్లు కనపడుతుంది. మూర్ఖుల చిత్తవృత్తిని వివరించుటలో ఈ కవి ఒక ప్రత్యేక మార్గాన్ని అనుసరించాడని చెప్పాలి. కొన్నిచోట్ల ఈ కవి మోటుపదాలను కూడా వెనుకాడలేదు. ఈ క్రింది పద్యాలను గమనించండి.
దురితాత్మునకు దేవ గురుపూజనంబేల, కర్ణ హీనునకుఁ జౌకటు లవేల
జ్వరరోగ కృశునకు హరి చందనం బేల, పరమ లోభికి దాన పటిమ యేల
కర్మ బాహ్యునకు గంగా స్నామమేటికిఁ, గామాంధునకుఁ దపః కాంక్ష యేల
తిండిపోతుకు నిత్య దేవతార్చన లేల, వెట్టివానికి సద్వివేక మేల
మూర్ఖ జనునకు సతత ప్రమోద కరణ
సాధు సజ్జన గోష్ఠి ప్రసంగమేల
భూరిమయవాస! కోలంకపుర నివాస
మదనగోపాల! రాధికాహృదయలోల!
ధర్మంబు వీసమంతయుఁ దల్పఁగా నాస్తి, దాన మన్నది కలలోన సున్న
అర్ధపాలనము రవంతగానఁ గవట్టిఁ, సత్య వాక్యంబు లేశంబు లేమి
కారుణ్యభావంబు గోరంతయునుఁ గల్ల, శమద మాసక్తి కొంచము హుళుక్కి
స్నాన సంధ్యాద్యనుష్ఠాన కర్మం బిల్ల, సైవ వైష్ణవభక్తి త్రోవజబ్బు
యిట్టి మూఢులఁ బుట్టించి నట్టి బ్రహ్మ
ననఁగవలె గాక వీండ్రఁ దిట్టను బనేమి
భూరిమయవాస! కోలంకపుర నివాస
మదనగోపాల! రాధికాహృదయలోల!
సుగుణదుర్గుణములను సజ్జనదుర్జనులను తారతమ్యదృష్టితో పరిశీలించి శతకములో పొందుపర్చిన విధానం ప్రత్యేకముగ గమనింపదదిన అంశము. దుర్గుణములను నిషేధ రుపమున వివరించి, సద్గుణములను కర్తవ్యములుగా ఈ శతకములో కవి ఉపదేశించాడు.
ఈ క్రింది పద్యం ఆనాటికే కాదు ఈనాడుకూడ ఎంతో చక్కగా సరిపోతుంది
కన్నగానికి జూదగాఁడు మిత్రుఁడు మద్య, పానవృత్తికిఁకులభ్రష్టు గురువు
పరమలోభికి మలభక్షకుం డధిపతి, గుణహీనునకుఁ బల్గుకొయ్య తండ్రి
ధర్మశూన్యునకుఁ గృతఘ్నుండు చుట్టంబు, మొండివానికి దుర్ణయుఁ కొడుకు
కర్మబాహ్యునకు సంకరకులుం డాప్తుండు, దొంగముండకు లంజ తోడు నీడ
యగుచు నన్యోన్య సంబంధ మమరియున్న
యట్టి వారలె సిరిగాంచిరీ ధరిత్రి
భూరిమయవాస! కోలంకపుర నివాస
మదనగోపాల! రాధికాహృదయలోల!
నేటి తల్లితండ్రులపై ఏమాత్రం గౌరవంలేని వారికి ఒక గుణపాఠంలాంటి పద్యం
తండ్రి దూషించి పెద్దల నుతింపఁగనేల, తమ్ములఁ జెఱపి సద్ధర్మమేల
తల్లిని దన్ని బాంధవ పూజనంబేల, మిత్రుని విడచి పై మేళ్ళవేల
గురుని నిందించి భూసురుల వేఁడఁగ నేల, బిడ్దనమ్మి యొకండ్రఁ బెంచనేల
యాశ్రితు నటుదోలి యర్ధి రక్షణమేల, పెనిమిటి దిట్టు దైవ నుతి యేల
యెఱుఁగనేరని మూఢులకేమి చెప్పఁ
దెలియఁబడవచ్చు యమసభస్థలము నందు
భూరిమయవాస! కోలంకపుర నివాస
మదనగోపాల! రాధికాహృదయలోల!
ఈశతకములో నానా విధములుగా ఉన్న అధిక్షేప ధోరణులలో సౌమ్యతతో పాటు తీవ్రదృష్టి కూడా ఉన్నది. ప్రతి పద్యము సూక్తిప్రాయమైనది. అధిక్షేపణలొ అడిదము సూరకవి ధోరణి, బూతుపదప్రయోగములో కవిచౌడప్ప ధోరణులు ఈ శతకంలో అనేకచోట్ల కనిపిస్తాయి. అన్యోపదేశముగా అధిక్షేపించిన సందర్భములలో కవి దృష్టికి వచ్చిన వ్యక్తులు వారి దుర్గుణములు స్ఫురిస్తాయి. భావోన్నతికి అనుగుణమగు భాష, నిశితపరిశిలనానుభవముతో చెప్పిన విషయములు, హృదయానికి హత్తుకునే విధంగా వ్యక్తీకరించిన భావములు ఈ శతకాన్ని ప్రజలలో అత్యంత ఆదరణ  పొందేటట్లు చేసాయి. సమకాలీన వ్యవస్తకు అద్దంపట్టే ప్రశస్తమైన శతకంగా ఈ శతకం రాణించింది.
మీరుకూడా చదవండి. మీ మిత్రులచే చదివించండి

No comments:

Post a Comment

Pages