ఇలా ఎందరున్నారు ?- 8 - అచ్చంగా తెలుగు

ఇలా ఎందరున్నారు ?- 8

Share This
 ఇలా ఎందరున్నారు ?- 8  
అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేత గురించే ఎక్కువగా ఆలోచిస్తూ, ఆమెతో సమయం గడపాలని అనుకుంటూ ఉంటాడు... ఇక చదవండి... )
నీలిమ ఎప్పుడైనా కాంచనమాల ఇచ్చే జీతం డబ్బులను తన అవసరాలకు ఖర్చు పెట్టుకుంటుంది. మిగిలినవి దాచుకుంటుంది. అలా దాచుకున్న డబ్బులతో మార్కెట్ కి  వెళ్ళినపుడు దగ్గరలోఉన్న హోటల్‍కి వెళ్ళి వరమ్మకోసం బిరియాని కొన్నది.
          హోటల్లోంచి బయటకొస్తుంటే రోడ్డు ప్రక్కన స్కూటీని పట్టుకొని నిలబడిఉన్న పల్లవి కనిపించింది పల్లవిని చూడగానే బిరియానిని దాచేసింది. తనకి ఎన్నో రోజులుగా వరమ్మకి బిర్యాని తెచ్చి పెట్టాలని ఉంది. కాంచనమాల కావాలనే ఇంట్లో ఆ ఐటమ్‍ని చెయ్యనియ్యదు. అత్తగారి కోరిక తనెందుకు తీర్చాలన్న పంతం కాబోలు. ఎంతైనా వరమ్మ కోరిక తీర్చబోతున్నందుకు తృప్తిగా ఉంది నీలిమకు.
          పల్లవికి మాత్రం నీలిమను చూడగానే దేవుడే దిగివచ్చినట్లు అన్పించి త్వరగా రా అన్నట్లు చేయిఊపి సైగ చేసింది.
          నీలిమ వస్తున్న నవ్వును ఆపుకుంటూ ‘నువ్వెందుకు సైగ చేస్తున్నావో నాకు తెలియదా? ఆ స్కూటీని రన్నింగ్‍లో ఉన్నప్పుడు తప్ప ఆపితే నువ్వు పట్టుకోలేవు. పడేస్తుంటావు. చూడటానికేమో నలుగుర్ని పడేసి కొట్టేలా ఉంటావు. ఆగిఉన్న స్కూటీని పట్టుకొని స్టాండ్ వెయ్యలేవు (పార్క్ చెయ్యలేవు). పైగా ఆ స్కూటీకి నీకున్న లింకేంటో తెలియదు కాని అది నీ ఒక్కదానికి మాత్రమే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందంటే చాలు వెనుక నిలబడి ఉన్నవాళ్ళు ఆ పొగపీల్చలేక చావాలి. ఆ డొక్కు స్కూటీతో ఇంకా ఎన్నిరోజులు వేగుతావో ఏమో!’ అని మనసులో అనుకుంటూ పల్లవివైపు వెళ్ళింది.
          “ఏంటీ! ఏదో అనుకుంటూ వస్తున్నావు?”
          “ఏం లేదు మేడమ్! స్కూటీని ఎక్కడ పడేస్తావో అని త్వరత్వరగా వస్తున్నాను…” అంటూ నీలిమ వెళ్ళి స్కూటీని పట్టుకునే లోపలే కింద పడేసింది పల్లవి.
          కిందపడిన స్కూటీని కాలితో ఓ తన్ను తన్ని నీలిమవైపు కోపంగా చూస్తూ “తిన్నగా రాలేవా? మాట్లాడకుండా ఉండలేవా? అసలే ఈ రోజు ఇది నాలుగోసారి పడెయ్యడం… స్కూటీని ఆపాలంటేనే భయంగా ఉంది” అంది.
          “ఆపకండి మేడమ్! ఈ అవస్థ ఎవరు పడతారు?”
          “అంటే ఎప్పటికీ స్కూటీమీదనే ఉండమంటావా?” కొట్టేలా చూసింది పల్లవి.
          “కూల్ కూల్ మేడమ్ ఇప్పుడు కింద పడిన ఈ స్కూటీని లేపేముందు మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి…” అంది ఆ స్కూటీని ఏ మాత్రం తగలకుండా.
          అర్థం కాక “ఏంటీ?” అంది అరిచినట్లే పల్లవి.
          “నేను ఇంతకుముందే వరమ్మ బెడ్‍షీట్లు ఉతికి వచ్చాను. స్కూటీని ముట్టుకుంటే ఫరవాలేదంటావా?”
          పల్లవి తలను వేగంగా, అడ్డంగా ఊపుతూ “వద్దు తల్లీ! నువ్వు వెళ్ళు. నేణు ఎవరో ఒకర్ని పిలుచుకుంటాను…” అంది.
          నీలిమ అటు ఇటు చూసి “ఇక్కడెవరున్నారు ఖాళీగా! అదిగో ఆ చిత్తుకాగితాలు ఏరుకునేవాడు తప్ప. పిలువు నాకన్నా వాడే బెటర్ నీకునేను వెళ్తున్నా…”
          వాడిని చూడగానే వాంతి వచ్చినట్లయి “ఆగాగు నీలిమా!” అంటూ పిలిచింది పల్లవి.
          “నేను ఆగను… నీకు ఇంతకుముందే చెప్పాను స్కూటీపై ఎక్కడికి వెళ్ళినా సంకేత మేడమ్‍ను తీసికెళ్ళమని.. ఆ మేడమ్ అయితేనే ఆ బండిని బలంగా పట్టుకోగలదు”,
          “అంటే నేను బలంగా లేనా? నాది బలం కాదా? వాపా?” అరిచింది.
          “అని నేను అన్నానా? అన్నీ మీరే అనుకుంటారు. మళ్లీ బాధపడతారు కనీసం శివానీ మేడమ్ నైనా తోడుగా రమ్మనాల్సింది.” అంది అదోలా చూస్తూ…
          “సరేలే! వచ్చి దీన్ని లేపు”
          “నాకు పని ఉంది. నేను వెళ్తున్నా…” అంది స్కూటీని లేపకుండా వెళ్ళిపోతూ…
          వెళ్తున్న నీలిమను చూసి “ఎంత పొగరే నీకు! ఫ్యూచర్లో నాకు దొరక్కపోతావా! అంది పల్లవి గట్టిగా.
          నీలిమ నెమ్మదిగా వెనుదిరిగి చూసి “నాది పొగరు కాదు. నా పనులు మీకు నచ్చనప్పుడు మీ పనులు నేనెందుకు చెయ్యాలి? వరమ్మను అంటరానిదానిలా చూసే వాళ్ళెవరూ నాకు నచ్చరు. అర్థమైందా?” అంటూ వెళ్ళిపోయింది నీలిమ.
          ఇంటికి వెళ్ళగానే కాంచనమాలకి కన్పించకుండా బిర్యాని తీసికెళ్ళి వరమ్మకి పెట్టింది నీలిమ… అది రెండు ముద్దలు తినగానే ఆమె కోరిక తీరినట్లయింది.
          “నీలిమా! నాచేత   బిర్యాని తినిపించి నా కోరిక తీర్చావు. ఇది నాకు రుణమే! ఇదే కాదు. నువ్వు న్కు చేసే పనులన్నీ ఋణమే! నేనెలా తీర్చుకోను” అంది ఆలోచనగా… తన కొడుకు తీర్చలేని కోరికను నీలిమ తీర్చినందుకు కృతజ్ఞతగా చూస్తూ…
          ఆశ్చర్యపోయి చూసింది నీలిమ… “ఈ వరమ్మ ఏంటి ఇలా మాట్లాడుతోంది? ప్రతిదీ లెక్కలు కట్టుకుంటూ ఇప్పటికే చాలా జీవితాన్ని దాటుకుంటూ వచ్చింది కదా! ఇంకా ఈ ఋణాల ప్రసక్తి దేనికి? ఏంటో ఈ పెద్దవాళ్ళు! హాయిగా తినిపడుకోరు.’ అని మనసులో అనుకుంటూ…
          “ఎక్కువగా ఆలోచించకు వరమ్మా!” అంది నీలిమ ప్రేమగా వరమ్మ భుజంపై చేయివేసి…
          వరమ్మ మాట్లాడలేదు. అంతవరకు వరమ్మ చదువుతూ ప్రక్కనబెట్టిన ఆధయత్మిక పుస్తకాన్ని అందుకొని వరమ్మ చేతిలో పెడుతూ “ ప్రశాంతంగా చదువుకుంటూ కూర్చో వరమ్మా!” అంది నీలిమ…
          శివరామకృష్ణ గది బయట గోడకి అమర్చిన ఏ.సి. స్టాండులోంచి వస్తున్న శబ్దం వరమ్మ, నీలిమ చెవులకి వినిపిస్తోంది.
          వరమ్మ బెడ్ దగ్గర చీమలు కన్పించడంతో వాటిని దులిపి, శుభ్రం చేసి వెళ్ళింది నీలిమ.
          * *   * *  * *  * *  * *  * *  * *  * *  * *  * *  * *  * *  * *
కాలం వేగంగా కదులుతోంది. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికొస్తూ
          “అనంత్ విషయంలో నాకెందుకో భయంగా ఉంది పల్లవీ!” అంది సంకేత.
          “భయం దేనికి సంకేతా?” అర్థం కాక అడిగింది పల్లవి.
          “అతను ఈ మధ్యన నాతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నన్నే ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు. ఇంటికెళ్ళాక కూడా బయటకొచ్చి కాయిన్ బాక్స్ లోంచి కాల్ చేయమని అడుగుతున్నాడు. ఏం చేయనే అతను చెప్పినట్టే నాకూ చేయాలనిపిస్తోంది. కానీ చేయలేకపోతున్నా. అతను మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా. అతను ఒక్కరోజు మాట్లాడకపోయినా, నావైపు చూడకపోయినా ఎందుకు మాట్లాడటంలేదు? ఎందుకు చూడటం లేదు? అని ఒకటే ఆరాటంగా ఉంటోంది. నన్నేం చేయమంటావో చెప్పవే?” అడిగింది సంకేత.
          మౌనంగా చూస్తోంది పల్లవి.
          “ఇన్ని రోజులు నిద్ర లేచినా నిద్రపోతున్నా నాధ్యాసంతా చదువుమీదే ఉండేది. పుస్తకం చేత్లో లేకుంటే చేతులు రెండు పీకినట్లయ్యేది. ఇప్పుడు అలాలేదు పల్లవీ! నాలో ఏదో మార్పు… ఈ మార్పుకూడా బావున్నట్టనిపిస్తోంది. అన్పించడం కాదు. ఈ మార్పే బాగుంది. నేనేం చేయనే…” అంది సంకేత.
          లోలోన ఆశ్చర్యపోతోంది పల్లవి.
          ఈ మధ్యన నిజంగానే మారింది సంకేత.
          అనంత్ అప్పుడెప్పుడో “నీ బాడీ స్కిన్ లో సూపర్ లైటింగ్ ఉంది సంకేతా! ఇంకా కొంచెం ఉంటే ఖతర్నాక్ లా ఉంటావు.” అని అన్నాడని వెంటనే తన హాస్టల్ దగ్గరకి వచ్చి తనని డబ్బులు అడిగి తీసుకొంది. బ్యూటీ ప్రోడక్టులు అయిన ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్, స్క్రబ్, టోనర్స్, క్లెన్సర్స్ కొన్నది. అవి చూడగానే తనకి కళ్ళు తిరిగాయి. ఒకప్పుడు ఎలా ఉన్న సంకేత ఎలా మారింది? నిజం చెప్పాలంటే సంకేతకి ఫెయిర్ అండ్ లవ్లీ వాసన కూడా తెలియకుండా ఉండేది. బి.టెక్ చదువుతున్నావు స్కిన్ మీదకేర్ లేకపోతే ఎలా అంటే అవి ఒంటికి పడవు అనేది. ఇప్పుడేమో అనంత్ కోసం అందంగా ఉండాలనుకుంటోంది. ఉన్న అందాన్ని ఇంకా ఇంకా పెంచుకోవాలనుకుంటోంది.
          పల్లవి మాట్లాడకపోవడంతో నెమ్మదిగా తట్టి “నన్ను అర్థం చేసుకో పల్లవీ! నాకిప్పుడు మా తల్లిదండ్రులు గుర్తు రావడంలేదు. అలా రాకపోవడమే బాగుంది. వాళ్లెప్పుడు గుర్తొచ్చినా వాళ్ళు పొలం వెళ్ళి ఎండలో ఎండడం, వానలో తడవడం కళ్ళముందు కదిలి బాధగా అన్పిస్తుంది. ఆ బాధనెందుకో నా మనసు ఇప్పుడు స్వీకరించడం లేదు. ప్రతిక్షణం ఉల్లాసంగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని అలాంటి వాటినే గుర్తుచేసుకోవాలని ఉంది. అసలు నా మనసు మైదానం నిండా స్పోర్ట్ మేన్ లా అనంతే ఉన్నాడు. చాలా చాలా గ్లామరస్ గా ఆడుతున్నాడు. అద్భుతంగా పరుగులు తీస్తున్నాడు. నేనేం చేయను చెప్పు?” అంది సంకేత.
          సంకేత బాధ పల్లవికి కన్పిస్తూనే ఉంది. ఒకసారెప్పుడో “నువ్వు చాలా స్లిమ్ గా ఉన్నావు సంకేతా! ఇంకా స్లిమ్ గా ఉంటే బాగుంటావ్! అన్నాడట. అప్పటినుండి రోజుల తరబడి తిండి మానేసింది. ‘ఇదేం కర్మే నీకు?” అంటే “ఖర్మేంటీ? నేను డైటింగ్ లో ఉన్నా…” అనేది. “మాట్లాడే ఓపిక కూడా లేకుండా ఇదేం డైటింగే” అని అడిగితే ముఖం అదోలా పెట్టి…
          “ఏమోనే! అనంత్ అలా అన్నప్పటినుండి నోట్లో అన్నం ముద్ద పెట్టుకోవాలంటేనే దడగా ఉంది. ముద్ద, ముద్దకి  బెలూన్ లా ఉబ్బి పోతానేమో! గున్న ఏనుగులా కొండలా కనిపిస్తానేమోనని భయం… నేను కూర్చున్నా, నిలబడినా, నడుస్తున్నా అనంత్ కళ్ళకి అద్భుతంగా అనిపించాలి. అలా కన్పించాలి అంటే ఏం తినాలి? ఏం తినకూడదు? తింటే ఎంత తినాలి? తినకపోతే ఎన్నాళ్ళు మానేయాలి? ఈ సమాచారం కోసం ఇంటర్ నెట్ కి వెళ్ళాను. పత్రికల్లో వెదికాను. యోగా గురువు దగ్గరకి వెళ్ళాను. బ్యూటీషియన్ని, డైటీషియన్ని కలిశాను. “ అనేది.
          “అవన్నీ చేయాల్సింది నేను కదే! నీకెందుకీ బాధ? అయినా నీ పొట్ట నీ చేతిలో పడి అనవసరంగా ఘోష పడుతోంది. మనుషులకి ఉన్నట్లే శరీరభాగాలకి కూడా హక్కులు ఉంటే నీ పొట్ట నేరుగా వెళ్ళీ మానవ హక్కుల కమీషన్ ని కలిసేది. తాడో పేడో తేలేదాకా నిన్ను వదిలేది కాదు.” అని మాత్రం అనేది తను.
          అంతకన్నా ఎక్కువ అంటే తను పిలిచినప్పుడు స్కూటీ మీద బయటకి రాదేమో నని భయం. సంకేత రాకపోతే స్కూటీని ఆపినప్పుడల్లా దాన్ని పట్టుకోలేక ఆ స్కూటీతో పాటు తను కూడా స్కూటీమీద పడిపోతుంది. ఆ భయానికే స్కిన్ టైట్ డ్రస్సులు కూడా వేసుకోవడం మానేసింది.
          “మాట్లాడు పల్లవీ!” అంది సంకేత. నేనింత ఆపదలో ఉంటే నీ ఆలోచన ఏంటీ అన్నట్లు చూస్తూ…
          పల్లవి మన లోకంలోకి వచ్చి “అవునూ! మొన్న మీ మదర్ కి ఒంట్లో బావుండలేదని మీ ఊరినుండి ఎవరో వస్తుంటే మీ ఫాదర్ చెప్పి పంపారు కదా! వెళ్ళావా?” అంది.
          సంకేత ముఖం అదోలా పెట్టి “అది అనవసరమానే ఇప్పుడు? ఎప్పటిలాగే మా నాన్న మా అమ్మను మా ఊరిలో ఉండే ఆర్.ఎం.పి. డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళే ఉంటాడు. జ్వరమేగా! తగ్గి ఉంటుంది. అసలు ఆ రోజంతా అనంత్ నన్ను పార్క్ కి తీసికెళ్ళీ మాట్లాడుతూనే కూర్చున్నాడు తెలుసా! అందుకే మా ఊరు వెళ్ళలేకపోయాను…” అంది. చివరి వాక్యం అంటున్నప్పుడు ఆమె కళ్ళు అరక్షణం వెలిగి మళ్ళీ మామూలుగా అయ్యాయి. కన్నతల్లికన్నా అనంత్ ఎక్కువా? ఇది మరీ ఆశ్చర్యంగా అన్పించింది పల్లవికి…
          పల్లవికి సంకేతతో మాట్లాడాలనిపించలేదు. ఇప్పుడున్న అమ్మాయిలకి సంకేతకి ఏదో తేడా ఉందనిపిస్తోంది. అనంత్ పట్ల ఇంత అంకితభావం అవసరమా అన్పిస్తుంది. అందుకే “అవగాహన లేని స్వేచ్చ ప్రమాదకరం సంకేతా! అంది పల్లవి.
          “స్వేచ్చకు తావులేని అవగాహన అంతకన్నా నిరర్థకం పల్లవీ!” అంది సంకేత.
          “నువ్వు నడిచి వచ్చిన దారిని మరచిపోతున్నావ్!”
          “కాదు. కొత్త బాటను, నాకు నచ్చిన బాటను వేసుకొంటున్నాను. నచ్చిన బాట ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. కష్టం లేకుండా ఇష్టమైనది దొరకదు.” అంది సంకేత.
          “నువ్వు చదువును మరచిపోయి ప్రేమ, అనుభూతుల పేరుతో చెడిపోతున్నావ్!”
          “ఎంత చదివినా రాని ఆనందం నాకు అనంత్ ఆలోచనల్లో వస్తోంది. నేను పుట్టాక కలగని ఫీలింగ్స్ అనంత్ ఆలోచనలతో కలుగుతున్నాయి. వాటిని ఎంత వద్దనుకొని అదిమి పట్టుకున్నా స్ప్రింగులా లేస్తున్నాయి. ఇప్పుడు నామనసు అనంత్ మీదకి తప్ప చదువు మీదకి పోవడం లేదు”
          “చూడు సంకేతా! ఇప్పుడు మనం చేస్తున్న మన పనులు రేపటి మన గమ్యానికి దగ్గరకి తీసుకెళ్ళాలన్నా దూరంగా తీసుకెళ్ళాలన్నా కాలమే నిర్ణయిస్తుంది. అలాంటి అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనం అనుకున్న గోల్స్ ను చేరుకోగలుగుతాం. ఒక్క క్షణం తేడాతోనే అద్భుతాలను సాధించిన వాళ్ళున్నారు. చేజార్చుకున్న వాళ్ళున్నారు. నువ్వు అనంత్ ఆలోచనల్లోంచి బయటపడు. లేకుంటే అతని ఆలోచనలు నీ కాలాన్ని, నీ ప్రతిభను తన గుప్పెట్లోకి తీసుకుంటాయి. ఇప్పుడు నువ్వు నిస్సహాయురాలివి. నీ నిస్సహాయతకి నువ్వే కారణం. నువ్విలా తయారయితే నీ తల్లి దండ్రులు ఏమైపోతారో ఆలోచించు” అంది.
          “అబ్బా! టాపిక్ మార్చవే! నేనిప్పుడు అనంత్ ఆలోచనల ఆకలితో ఉన్నాను. ఆకలి లేనివాడికి అన్నం రుచి తెలియనట్లే నా ఆకలి నీకు అర్థం కాదు. కానీ ఎంత ఆకలిగా ఉందో అంత భయంగా కూడా ఉంది. ఆ భయం దేనికో నాకే అర్థం కావడంలేదు.” అంది సంకేత.
          పల్లవి మౌనంగా ఉంది.
          “మాట్లాడు పల్లవీ?” అంది సంకేత.
          పల్లవికి ఏం మాట్లాడాలో తోచలేదు. సంకేత అనంత్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటే, అతను సంకేతను పెళ్ళి చేసుకోకపోతే సంకేత ఏమైపోతుందో అని భయంగా ఉంది.
          అందుకే “ఏం చెప్పను సంకేతా! నాకు తెలిసిన ప్రపంచం వేరు. నువ్వు ప్రవర్తిస్తున్న తీరు వేరు. దేన్నైనా లైట్ గా తీసుకుంటేనే హాయిగా ఉంటుంది. మరీ ఇంత లోతుకి పోయి ఆలోచించకు. స్నేహం చెయ్యొచ్చు తప్పు లేదు. అనంత్ కీ నీకూ స్నేహం ఉండబట్టే అతను వెళ్ళి నీకోసం కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టి వచ్చాడు.
          కానీ ఫీజు కట్టాక నువ్వు కోచింగ్ సెంటర్ కు వెళ్ళిందే తక్కువ. కోచింగ్ కి వెళ్తున్నానని ఇంట్లోచెప్పి అనంత్  తో తిరుగుతున్నావు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఎంత ఫ్రెండ్ షిప్ చేసినా ఎన్ని గంటలు ఫోన్లో మాట్లాడినా ఉదయాన్నే నిద్రలేస్తున్నారు. కాలేజీలకి వెళ్తున్నారు. చదువుతున్నారు. కానీ నువ్వు వాళ్ళలా కాకుండా అనంత్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇది తప్పు…!
          అసలు ఈ ఫ్రెండ్ షిప్ అనేది ఎలా ఉండాలి అంటే సపోజ్ మనం స్టేషన్ వరకు వెళ్ళేంత వరకు బోర్ కొడుతుంది కాబట్టీ ఒక అబ్బాయితో ఫోన్ లో మాట్లాడాలి... ఆ తర్వాత బస్సు వచ్చేంతవరకూ వెయిట్ చెయ్యాలి. కాబట్టి బోర్ అనిపించకుండా ఇంకో అబ్బాయితో మాట్లాడాలి. ఫోన్ లోనే కాబట్టి, ఏం మాట్లాడినా తప్పులేదు. తర్వాత లైట్ తీసుకోవాలి. ఇది ఫాస్ట్ ట్రెండ్ ! అంతా ఫాస్ట్, ఫాస్ట్ గానే ఉండాలి...” అంది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages