నీలకంఠేశ్వర శతకము - బళ్ళ మల్లయ్యకవి

- దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవిపరిచయం:
బళ్ళ మల్లయకవి తూర్పుగోదావరి జిల్లా, రాజోలు తాలూకాలోని పుల్లేటికుర్రు వాస్తవ్యులు. తండ్రి కనకయ్య, తల్లి అచ్చమాంబ. మల్లయ్య వీరి ప్రధమ పుత్రుడు. వీరు శివభక్తులు. వీరు ఈశతకాన్ని సుమారు 1930 ప్రాంతాలలో రచించారు. తన శతకంలో ఈ కవి తన గురించి ఈ విధంగా చెప్పుకున్నారు.
వసుధ శ్రీదేవలబ్రహ్మవంశోద్భవుం, డాశ్వలాయన సూత్రుఁ డార్యనుతుఁడు
లలిత బళ్ళాన్వ్య జలనిధి చంద్రుఁడు, మన్మహా ఋషి గోత్ర మహితయశుఁడు
ప్రవిమల గౌరమాంబకు మల్లికార్జునా, హ్వయునకుఁ దనయుండు వరగుణుండు
అచ్చమాంబా హృదయాంబుజ భానుండు, భవ్య సద్యోజాత ప్రవర ఘనుఁడు
నైన కనకాఖ్యునకుఁ బ్రధమాత్మజుండ
మల్లయాభిఖ్య కవినభిమాన ధనుఁడ
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
శతక పరిచయం
నీలకంఠేశశతకము భక్తిరస సీసపద్య  శతకము. "దగ్గులూరి నివేశ! పాతకవినాశ! నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!" అనే మకుటంతో చక్కని శబ్ధాలంకారములతో ప్రాచీన కవితాశైలిని పోలి, చదువరులకు మానోల్లాసం కలిగించే శతకము. భాష సరళం. ఒకే సీస పద్యంలో ఇష్టదేవతలను, ప్రాచీనకవులను ఎంతచక్కగా స్మరించారో చూడండి
బంధురవిఘ్నాభ్ర పటల ప్రభంజను, సదయాత్ముఁ గజరాజవదనుఁ దలచి
కంజజోదర్ రాణిఁ గవితామ తల్లిని, శారదాంబను మదిన్ సంస్తుతించి
కవి తల్లజుల వ్యాస కాళిదాసుల నెంచి, యాంధ్ర కవీంద్రుల నభినుతించి
తల్లికిన్ స్వర్గ సంధాముఁడౌపితకున, త్యంత భక్తి నినతులాచరించి
పూజ్యులగు వారలన్ హృదిఁ బూజసల్పి
సీసశతకంబు నీమీఁద జేయుచుంటి
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
చక్కని అంత్యప్రాస సీసాలను చూడండి
శ్రీగిరి రాట్సుతా చిత్తాబ్జ మధుపాన, బంభరా! పాహితుభ్యం నమోస్తు
కామాదిరిపు మదగజ కుంభవిదళిత, పంచాస్య! పాహితుభ్యం నమోస్తు
తాపత్రయా భీలదంత శూకాశన, బర్హిణా! పాహితుభ్యం నమోస్తు
పటుతర ప్రారబ్ధ పర్వత విధ్వంస, వజ్రమా! పాహితుభ్యం నమోస్తు
భావజో న్మదభంగ! తుభ్యం నమోస్తు
వరద! సర్వేశ శర్వ! తుభ్యం నమోస్తు
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
ఈ క్రింది పద్యంలో మకుటవదిలి మొదటి అక్షరాలతో శివపంచాక్షరీ వస్తుంది చూడండి
ఓంకార నిలయాయ యుర్వీ శతాంగాయ, వందిత భక్తాయ వందనంబు
నగరాజ సుతమనో నాళీక ఖేలనా, నంద సంభరితాయ వందనంబు
మఖవాది సురగణ మౌనీంద్ర సేవిత, పాదారవిందాయ వందనంబు
శివదేవ ధారుణీ ధవపుత్ర భళ్ళాణ, వరసతి బాలాయ వందనంబు
వాగధీశ్వర వినుతాయ వందనంబు
యమవినాశాయ వందనంబయ్య! శర్వ!
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
ఈశతకంలోని ప్రతిపద్యంలో భావ భక్తావేశాలు సమపాళ్ళలో పొంగిపొర్లుతుంటాయి. మచ్చుకి కొన్ని పద్యాలను చూద్దాం.
నీ కృపచేఁ గాదె? నిఖిలమున్ సృష్టించు, నమిత ధీశక్తి యా యజునకబ్బె
నీ కృపచేఁ గాదె? నిఖిల జీవులఁ బ్రోచు, దాక్షిణ్య మది రమా ధవునకబ్బె
నీ కృపచేఁ గాదె? నిఖిల లోకవ్యాప్త, దార్ఢ్యంబు పంచ భూతములకబ్బె
నీ కృపచేఁ గాదె? నిబిడాంధను బాపు, వరతేజ మిందు భాస్కరుల కబ్బె
నీదు సత్కృపచేఁ గాదె నిర్జరేంద్రుఁ
డాది గాఁగల దేవత లధికులైరి
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
మరోక అందమైన పద్యం
ఘోరకృత్యము లెన్నొ కోరిచేసిన ఘన, పాపుండ నంటిఁ గాపాడు మంటి,
సతి సుతాదులఁ బెంచఁజాలని దారిద్ర్య, వంతుండ నంటిఁ గాపాడు మంటి,
భక్త జనావన~! భవ వార్ధితరణ! నీ, భక్తుండ నంటిఁ గాపాడు మంటి,
బండిత పాల! నీయండఁ జేరఁగ నున్న, వాఁడను నంటిఁ గాపాడు మంటి,
భక్త వత్సలుడని బుధుల్బల్కగ వింటిఁ
బ్రాణ లింగమ! నన్నుఁగాపాడుమంటి
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
ఈ అధిక్షేపణ చూడండి
రాజ్యార్థులకును సామ్రాజ్యంబు లొసఁగియుఁ, గొండపైఁ గాపురంబుండినావు
వస్త్రార్థులకునున్న వస్త్రంబు లర్పించి, గబ్బి మెకము తోలుఁగట్టినావు
భూషణార్థులకున్న భూషలన్నియు నిచ్చి, పుట్ట పుర్వుల మేనఁ బెట్టినావు
విభవార్థులకుఁగల విభవాదులను నిడి, వెఱ్ఱెత్తి బిక్షకై వెడలినావు
వాహనార్థుల కిడి బహువాహనములు
బక్క చిక్కిన యెద్దుపై నెక్కినావు
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
రమణియ తరమైన రౌప్యా చలము నీకుఁ, బూరింటిలోనఁ గాపురము నాకు
నరి లోకభంజనంబైన శూలము నీకు, భుక్తిఁ గూర్పఁగ గట్టెపుల్ల నాకు
భనుకోటి ద్యుతిఁ బరగు దేహము నీకు, నతి హెయమైన కాయంబు నాకు,
బ్రహ్మాది దివిజుల ప్రార్థనంబులు నీకుఁ, బలువురిలో నగుబాట్లు నాకు
నధిక విఖ్యాతి పదవి నీవందుకొనియు
హీన పదవిని నిడితె నాకిందుమౌళి!
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
మరొక్కటి:
పయనంబునకు నీకు బలసిన యెద్దున్నఁ, గదలి పోవఁగ నాకుఁ గాళ్ళు గలవు,
పదునాల్గు లోకముల్ బాలింప నీకున్న, నడిగి తినుటకు నాకు నవని గలదు,
పావన చరితలౌ భార్యలు నీకున్నఁ, బడసి యుంతిని నేను భార్య నొకతె,
శయనించుటకుఁ బుష్పశయ్యలు నీకున్న, నా కున్నదొక తాటియాకుచాప
గొప్ప దేవుండనని నీవు కులుకుచుండ
మేటి పల్గాకినై నేను మెలగుచుంటి
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
భక్తిరస ప్రధానమైన ఈ పద్యం ఎంత చక్కగా ఉన్నదో. ఆస్వాదించండి.
భక్తాళిపైఁ బ్రీతి భావముంచుటఁ జేసి, "భక్త వత్సలుఁ" డనఁ బరగు దీవు,
పశుతుల్య జీవులఁ బాలించుటం జేసి, "పశుపతి" యని పిల్వఁ బడుదు వీవు,
గంగను ఉత్తమాంగమునఁ దాల్చుటఁ జేసి, "గంగాధరుం" డనఁ గ్రాలు దీవు,
ఘనభయంకరమగు గరళమూనుటఁ జేసి, "గరళకంఠుం" డన వరలుదీవు,
మృత్యుదేవత పాలిట మిత్తి వగుటఁ
జేసి "మృతుంజయాఖ్య" ను జెలఁగు దీవు
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
భక్తిమయ పద్యాలతోపాటి అనేక శివలీలలను అద్భుతమైన పద్యాలలో వర్ణించారు. క్షీరసాగరమధన సమయంలో హాలాహల భక్షణ ఘట్టం ఎంత బాగా వర్ణించారో తిలకించండి.
సురల సురులు గూడి సుధకునై క్షీరాబ్ధిఁ, దరువఁగా మందర గిరిని దెచ్చి
వాసుకీంద్రుని జుట్టి వడివడిఁ ద్రచ్చంగ, ఛటఛటా ర్భటులతోఁ చదలు వగుల
ధూమాగ్ని జ్వాలలతో బ్రభవించిన, విసమున కడలి వా "రసమనయన!
పశుపతీ! పరశివా! పాహిమాం" యని మొఱ, వెట్టఁ దద్విషమును బట్టి వేడ్క
ఫలము వోలెను మ్రింగియు గళమునందు
చిహ్నమటులఁ దాల్చవే? చిద్విలాస!
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
రామాయణంలోని ఈ ఘట్టం చూడండి
శ్రీమహా విష్ణ్వాంశఁ జెన్నొంది జగదైక, వీరుఁడై వేదాంత వేద్యుఁడైన
రాముండు భార్యకై రావణ బ్రహ్మను, నిలఁగూల్చి తద్దోష మినుమడింప
దైవజ్ఞ నిర్దిష్టితంబైన సుముహూర్త, మందున రామలిం గాభిధేయ
మునఁ బ్రతిష్టించి నిన్ ముదముతోఁ గొన్నాళ్ళు, పూజించి పాపవిముక్తినొందె
భళిర! శ్రీరామునంతటి ప్రభువుఁబట్టి
బాధలిడు బ్రహ్మహత్యను బాపినావు
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
పౌలస్త్యుఁడాశతోఁ బ్రార్ధింపఁ గడుమెచ్చి, నవ నిధులొసఁగవే! నాగభూష!
అగరాజ సుతభక్తి నర్చింపఁగా నుబ్బి, సామేను నీయవే! చంద్రజూట!
ఫల్గుణుఁడర్ధియై ప్రణుతంచినన్ బోరి, పాశుపతంబీవె! భవనినాశ!
ఆర్తులు దీనులై యాసింప ముదమంది, కోర్కులఁ దీర్పవే! కుధరనిలయ!
భక్తులందున నీకృప ప్రబలియుంటఁ
గామితార్ధంబులొడఁగూర్చి కాతువయ్య
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
మరిన్ని అమూల్య పద్యరత్నాలు చూద్దాం:
అర్ధ శరీర మంద మరెను ముదియాలు, పెన్నెఱుల్ గుంపులో బిన్నయాలు,
గబ్బిమెకముతోలు కటిబద్ధ మగుశాలు, బుస పుర్వులొడలిపై భూషణాలు
రుదురాకపు సరంబులెదను మెండుగవ్రేలు, దండిగాఁ జుట్టు భూతాల చాలు
కర్కశదనుజుల ఖండించుఁజేవాలు, పొక్కిలి పసిబిడ్ద పునుక డాలు
పట్టఁగను నుండగను మేటి పర్వతాలు
సకలవేదాలు చదువు నీ సన్నుతాలు
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
ఆరోహ ణావరోహణముల శృతిఁ గల్పి, వాణీ మహాదేవి వీణ మీట
నక్షర కాలంబు నావంతఁ దప్పక, యంబు జాసనుఁడు దాళంబుగొల్ప
శబ్దతరంగముల్ చదలంట శ్రీహరి, మించి మద్దెలను వాయించుచుండ
కఠిన పాషాణముల్ గరఁగెడివో యన, సుర సార్వభౌముండు మురళినూద
సల్పుచుందువు నాట్యంబు సంజవేళ
లందు నిత్యంబు జగదంబ ముందు భర్గ
దగ్గులూరి నివేశ! పాతకవినాశ!
నీలకంఠేశ! నన్నేలు నిరత మీశ!
ఇలా చెప్పుకుంటే పోతే ఈ శతకము మొత్తం భక్తి, అధిక్షేప పద్యాలతో లలిత మాధుర్య శబ్ధాలంకారలతో నిండిఉన్నది. ప్రతి పద్యం ఒక ఆణుముత్యమే. ప్రతివొక్కరు చదవవలసిన శతకము. మీరు చదవండి ఇతరులతో చదివించండి

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top