నమ్మకం

­­చెన్నూరి సుదర్శన్

            
పూర్వం కాశీపట్నం రాజ్యాన్ని కాశీనాధుడు అనే మహారాజు పరిపాలించే వాడు. అతడికి దైవ భక్తి ఎక్కువ. ప్రజల్లో దేవుడు అంటే నమ్మకం వమ్ము గాకుండా శాయశక్తులా ప్రయత్నించే వాడు. వాడ వాడకూ దేవాలయాలు నిర్మించాడు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారో లేదో అని రహస్యంగా మారు వేషంలో పర్యవేక్షించే వాడు.
           ప్రతీ రోజు దైవ ప్రార్థనతో  రాజసభ ఆరంభమయ్యేది.. దైవ ప్రార్థనతోనే ముగిసేది. దేవుడు అంటే నేను నమ్మినంతగా మరెవరూ నమ్మరని కాశీనాథుని ప్రగాఢ విశ్వాసం. ఈ విషయాన్ని తరచూ తన మంత్రిగారైన మహాదేవునితో ముచ్చటించే వాడు. మహారాజు పదే పదే అలా తనను విసిగించడం మహాదేవునికి నచ్చేది కాదు. ఒక రోజు మహాదేవుడు ఇదే విషయాన్ని కాశీనాథునితో విన్నవించుకున్నాడు.
          “మహారాజా.. మన రాజ్యంలో దేవుడు అంటే నిజమైన నమ్మకం ఎవరికీ లేదు. దేవుడి పేరు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. దేవుడి పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. దేవుడి పేరుతో అంతా తమ పబ్బంగడుపుకుంటున్నారే తప్ప దేవుని మీద సరియైన నమ్మకం ఎవరికీ లేదు.. కోటి మందిలో ఏ ఒక్కరికో వుంటుంది.. అందులో మీరు ఉన్నారో లేదో ఖచ్చితంగా చెప్ప లేను. కాని సమయం వచ్చినప్పుడు అదే బయట పడ్తుంది” అని కొంచెం సాహసించి చెప్పేడు.
          కాశీనాథునికి ఎనలేని కోపం వచ్చింది. కాని మహాదేవుడు మహామంత్రి మాత్రమే గాకుండా తనకు ఆప్తమిత్రుడు కూడా.. బాల్యం నుండి వారిద్దరి స్నేహం కొన సాగుతునే వుంది. అయితే వంశాచారంగా కాశీనాథుడు మహారాజు కావడం.. మహా దేవుడు మహా మంత్రి కావడం సహజమే అయినా కాశీనాథునికి మహాదేవుడు అంటే ప్రాణం. దాని మూలాన తన కోపాన్ని బయటికి కనబడనీయకుండా జాగ్రత్త పడ్డాడు కాశీనాథుడు. ‘మహాదేవుడు అకారణంగా అలా అనడు.. ఏదో కారణముండి ఉంటుంది.. తెలుసుకుంటే మంచిది..’ అని మనసులో అనుకు న్నాడు.
          “మహామంత్రీ.. ప్రజలు దేవుని పేరుతో అలా బతుకుతున్నారంటే వారికి దేవుని మీద నమ్మకం ఉన్నట్లే కదా.. లేదంటావేమిటి?.. యింకా నాకు కూడా సరియైన నమ్మకం ఉందో..! లేదో..! అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నావు. రుజువు వేయగలవా?.. ” అంటూ ప్రశాంతంగా అడిగాడు.
          “మహారాజా.. రుజువు చేయడానికి ప్రయత్నిస్తాను.. కాని దానికి సమయం సందర్భం రావాలి..” అని విన్నవించుకున్నాడు.
           ‘‘సరే..’’ అన్నాడు కాశీనాథుడు.
          మరుసటి రోజు నుండి కాశీనాథుడు దేవునిపై తనకు ఉన్న నమ్మకాన్ని మహాదేవునితో చెప్పడం మరింత అధికమైంది. యిది మహాదేవునికి కంటకమైనా తప్పదు కదా.. ‘వినే వాడుంటే చెప్పేవాడికి లోకువ’.. సమయం కోసం వేచి చూడసాగాడు.
***
          ఆ సంవత్సరం కాశీపట్నంలో సకాలంలో వర్షాలు కురువక కరువు ఛాయలు కనబడసాగాయి. ప్రజలు మరో దేశానికి వలస వెళ్లే యోచనలో ఉన్నారు. యీ విషయాన్ని గాఢాచారులద్వారా  తెలుసుకున్నాడు కాశీనాథుడు. దానికి తరుణోపాయం కనుగొనే యత్నంలో మహాదేవుని సలహా తీసుకుని కాశీపట్నం లోని పుర ప్రముఖులతో అత్యవసర సభను ఏర్పాటు చేసాడు. యిదే సమయంలో ప్రజలందరికి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని మహాదేవునికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు కాశీనాథుడు.
          సభ యథావిధిగా దైవ ప్రార్థనతో ఆరంభమైంది.
          “వర్షాలు లేక ప్రజలు భయభ్రాంతులవుతున్నారు.. దానికోసం నేనొక ప్రణాళికను తయారు చేసాను. మీరంతా సరే అంటే వెంటనే అమలు పర్చుతాను..” అంటూ కాశీనాథుడు సభలో ప్రకటించగానే ముందుగా ఆ ప్రణాళిక ఏమిటో అనే ఉత్సుకతను చూపారు పురప్రముఖులు. మహాదేవునికి కూడా తనను సంప్రదించకుండా ప్రణాళికా? అని ఆశ్చర్యమేసింది. కాశీనాథుడు అందరి ముఖవర్చస్సులను అవగతం చేసుకొని తన కార్యాచరణ ప్రణాళికను బయట పెట్టాడు.
          “కాశీపట్టణ ప్రజలంతా దైవభక్తులు. వారికి దేవుని మీద అపారమైన నమ్మకం ఉంది. మనమంతా కలిసి వరుణ దేవుని యాగం చేద్దాం. అదీ మన ఆరాధ్య దైవమైన శివుని ప్రాంగణంలో..” అనగానే పుర ప్రముఖుల ముఖాలలో ఆనంద జ్యోతులు వెలిగాయి.
          శివుని ప్రాంగణం అనగానే అంతా తన్మయత్వం చెందారు. అందరి మనసుల్లో ఆ దైవప్రాంగణం దర్శనమిచ్చింది. కాశీపట్నం దక్షిణ భాగాన కొండ మీద కోనేటి ప్రక్కన శివాలయం.. శివాలయంలో శివలింగం మనోహరంగా దైవత్వం ఉట్టిపడుతూ వుంటుంది. శివాలయంలోని ‘ఓంకారనాదం’ ఒక్కసారిగా వారి చెవుల్లో మారుమ్రోగినట్లనిపించింది..  అంతా ఏకగ్రీవంగా తలలు వంచి తమ సమ్మతిని తెలియజేసారు.
          “నేను రాచమర్యాదాలేవీ పాటించకుండా ఒక సామాన్యమానవుడిగా.. నేనూ మీలో ఒకరిగా పాద యాత్ర చేస్తూ వస్తాను, మనమంతా స్వామి వారి సమక్షంలో వరుణ యాగం చేద్దాం.. మన ఆస్థాన పురోహితులు దానికి ముహూర్తం నిశ్చయిస్తారు..” అని ఉచ్చరించగానే పురోహితులు ముహూర్తం పెట్టడం క్షణాల్లో జరిగి పోయింది. మహాదేవుడు ముగింపు వాక్యాలు.. దైవ ప్రార్థనతో సభ ముగిసింది.
          మహారాజు సహితం తమతో ఒక సామాన్య పౌరునిగా రావడం ప్రజలకు ఎనలేని ఉత్సాహం వచ్చింది. అనుకున్న ముహూర్తానికి మంగళకర వాయిద్యాలతో.. మహిళలు మంగళ హారతులతో.. కాశీనాథుడు, మహాదేవులను అనుసరిస్తూ ప్రజలంతా దైవ ప్రార్థనలు చేస్తూ కదిలారు. కొండ ఓంకారమయమైంది. వాతావరణమంతా శివభక్తితో ఓలలాడింది.
          ఉన్నట్టుండి కాశీనాథుని దృష్టి ఒక పదేండ్ల ప్రాయపు పిల్లవాడిపై పడింది. అతడి చేతిలోని వస్తువు చూసి భృకుటి ముడిపడింది. రాజు ఆగిపోయాడు..
          ఏదైనా అపశకునం జరిగిందేమోనని ప్రజలు ఒకరి ముఖం మరొకరు చూసుకో సాగారు.
          రాజు ఆ పిల్ల వాడిని పిలిచి “మేమంతా భజనలు చేసుకుంటూ వస్తుంటే నీ చేతిలో అపశకునంగా ఆ నల్లని పిల్లి ఏంటి? నీకు దేవుని మీద నమ్మకంలేదా?” అని ప్రశ్నించాడు  కాశీనాథుడు.
          ప్రక్కనే ఉన్న మహాదేవుని ముఖం ప్రసన్నమైంది. ఆ పిల్లవాడు సామాన్యుడు కాడు.. అనుకున్నాడు మనసులో..
          అందుకా బాలుడు ఏమాత్రమూ  సందేహించకుండా  ధైర్యంగా సమాధాన మిచ్చాడు.
          “మహారాజా.. ఇది పిల్లి గాదు.. గొడుగు. మనమంతా వరుణయాగం చేస్తూ దేవున్ని వర్షాలు కురిపించమని వేడుకోబోతున్నాం కదా.. మన భక్తికి మెచ్చి మన తిరుగు ప్రయాణం లోనే  వర్షం కురిపిస్తాడని.. ఆ దేవునిపై నాకు గొప్ప నమ్మకం వుంది. అందుకే ముందు జాగ్రత్తగా యీ గొడుగు తెచ్చుకుంటున్నాను” అని తీసి చూపించాడు.
          “దేవునిపై నమ్మకం అంటే యిదే మహారాజా.. యింత మంది దైవభక్తులలో ఇతడికొక్కడికి మాత్రమే దేవునిపై సరియైన నమ్మకం ఉందని రుజువైందనుకుంటాను..” అన్నాడు.. సమయం కోసం వేచి ఉన్న మహాదేవుడు.
          యింతమందిలో తనూ ఒక్కడు.. అనే నిజాన్ని గ్రహింప జేసిన  మహాదేవున్ని ఆలింగనం చేసుకున్నాడు కాశీనాథుడు.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top