నాలో నేను ... - అచ్చంగా తెలుగు

నాలో నేను ...

Share This

నాలో నేను ... 

- పూర్ణిమ సుధ 


అమ్మగోరూ...! ఏటండీ ? ఈ మజ్జ రోజూ చపాతీలే చేత్తన్నారూ ? మీకిట్టముండదుగా ? అంది రేణు - మా పనమ్మాయి - నాకు అలా పిలిస్తే నచ్చదు. నా సోదరి అనాలనిపిస్తుంది. కల్మషం లేని దాని మాట, అడక్కుండానే చేతిలో పని అందుకుని చేసే దాని కలుపుగోలుతనం, ఎంతలో ఉండాలో తెలిసిన దాని విచక్షణ... ఒకటేంటి... అన్ని విధాలా, అది నా చెల్లెలే...!
సార్ కి అవే నచ్చుతాయి రేణూ..! మళ్ళీ నా ఒక్క దానికోసం ఏం వండాల్లే అని నేనూ అదే తినేస్తున్నా..!
సరే గానీ అమ్మగోరూ...! ఈ మజ్జ దీపికా పడుకుని అని ఈరోయిన్ ఆడోళ్ళెలా అయినా ఉండొచ్చని ఏదో సెప్పిందట. ఏటమ్మా అది ?
అదా... మై ఛాయిస్ అని... ఏదోలే... వాళ్ళ గొడవ వాళ్ళది అని తేల్చేసాను. అదేటమ్మ గోరూ, మనమూ ఆడోళ్ళమే కదా ? అంటే మనక్కూడా కావాల్సింది ఉండుంటది కదా ? అంటూ దీర్ఘాలు తీసింది.
నీకు ఐ. క్యూ ఎక్కువయిందే బాబూ..! పని కానీ ముందు అంటూ యథాలాపంగా పేపర్ తిరగేసాను. పది నిమిషాల్లో నా ముందు కూర్చుంది. సెప్పండమ్మా..! అంటూ. ఇంక తప్పలేదు...
రేణూ..! నీ కూతురు జానకి, కాలేజ్ లో ఏ గ్రూప్ తీసుకుంది ? అనడిగాను. నాకేటి తెల్సండి..? మీరే కదా సేర్పించారు ? అంది. హు... నువ్వో పిచ్చి మాలోకం. అందరూ ఇంజనీరంటంటూంటే, తనూ అదే చదువుతానందా ? అంతా ఇంజనీర్లయితే, గంజినీరుక్కూడా గతుండదు... అమ్మగారు చెప్పినట్టు చదువని తిట్టి మరీ, కామర్స్ తీసుకునేలా బలవంతం చేసాం... అలా కాకుండా, నా ఇష్టం... అనే ఒక పదం వాడి, ఆ దీపికా అమ్మాయిలకి కూడా ఇష్టాలుంటాయి అని చెప్పింది. ఇంతేనా ? అంటూ దీర్ఘం తీసింది రేణు. అమ్మగోరూ, గడేసుకోండి. సాయంత్రం బేగొస్తా...! అంటూ వెళ్ళిపోయింది. నేను ఆలోచనలో పడ్డాను... నిజంగా అంతేనా ? ఒక్కసారిగా, ఆలోచనలు ముసురుకుని, ఙాపకాల దొంతర్లని ఒక్కోటిగా తియ్యడం మొదలుపెట్టింది.
స్కూల్ రోజుల్లో, ఎంతో చక్కగా చదివే నన్ను తీసుకెళ్ళి ఏడో క్లాసు నుంచీ గర్ల్స్ స్కూల్లో వేసారు. కో-ఎడ్ స్కూలైతే ఏమైందంటే, ఇప్పుడేం తెలీదు... అని తిట్టి ముందు జాగ్రత్తగా ఈ స్కూల్లో వేసారు. ఇంటర్మీడియట్ లో డాక్టర్ చదువు నా వల్ల కాదన్నా వినకుండా, బలవంతాన బై.పి.సి ని రుద్దారు... నెత్తురు చూస్తేనే కళ్ళు తిరిగే నేను, కప్పలు బొద్దింకలు కోసి, వారాలకి వారాలు తిండి తినలేక, ఎంసెట్ లో ర్యాంకు రాకూడదని రాసినా, అదేమిటో ఖర్మ కొంచెం మంచి ర్యాంకే వచ్చింది. కాస్త డొనేషన్ అయితే అయిందని చేర్పించేసారు... ముక్కున పెట్టుకు తుమ్మినట్టు చదివి, ఇంకో డాక్టర్నే ఇచ్చి చెయ్యాలని, కనీసం నా అభిప్రాయం కనుక్కోకుండా డాక్టర్ మనోజ్ కి ఇచ్చి చేసారు. నేను ఎన్నో సార్లు తనతో మాట్లాడుదామనుకున్నా. కానీ కుదర్లేదు. పెళ్ళయ్యాక తెల్సింది, తనకి నేను ప్రాక్టీస్ కాదు కదా, మామూలు ఫ్యాకల్టీ గా చెయ్యడం కూడా ఇష్టం లేదని. నాకింట్లో కూర్చుంటే ఏం తోచట్లేదంటే, ఏమైనా చదువుకో... అన్నారు. అలా అని నెట్ లో ఏదైనా చూద్దామంటే, అనుమానం. నేనేమైనా టీనేజ్ పిల్లనా ? హు... మై ఛాయ్స్ ?
...................................................................................................................................
దివ్య - పేరుకి తగ్గట్టే అమ్మాయి కూడా దివ్యంగా ఉంటుంది. చదువులో, పాటల్లో, సాంప్రదాయ నృత్యంలో, ఒకటేమిటి అన్నిట్లోనూ ఫస్టూ బెస్టూ అయిన తనని ప్రేమించమంటూ వెంటబడ్డాడు. ఇంట్లో చెబితే, నువ్వేమాత్రం చనువివ్వకపోతే, వాడంత ముందడుగేస్తాడని, చదువు మాన్పిస్తారనే భయంతో, చెప్పలేదు. ఏకాగ్రత లోపించింది. మార్కుల్లో వెనకబడింది. తన తప్పే మాత్రం లేకపోయినా, శిక్ష అనుభవించింది. ఇప్పుడు ఒక మామూలు ఉద్యోగంతో జీవితాన్ని లాక్కొస్తోంది. హు... హర్ ఛాయిస్ ?
.....................................................................................................................................
రాహుల్ రమ్య ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు... ఈ మధ్య తరచూ గొడవ పడుతున్నారు. స్వతంత్ర్య భావాలున్న పిల్లగా తన అభిప్రాయాలు గౌరవించాలని రమ్య, అమ్మాయిలకి అంత ’ఇగో’ పనికి రాదని రాహుల్, ఇలా వాళ్ళ ’కకూన్’ నుండి బయటకి రాకుండా ఉండిపోయారు. ఏ రోజైనా రాహుల్ అనునయించడానికి, అటు తిరిగి పడుకున్నావే ? ఇటు తిరుగు అంటే, సారీ నాకింట్రెస్ట్ లేదని హఠం వేసుక్కూచునేది. ఫర్లేదు - నేను చూసుకుంటాగా ? అంటూ ఎ’టెంప్ట్’ చెయ్యబోయి, భంగ పడ్డ సందర్భాలూ, చేసిన సందర్భాలూ కోకొల్లలు... ఇదా సంసారం ? హు... హర్ ఛాయిస్ ?
.....................................................................................................................................
సరోజ - కెరీర్ పరంగా ఎంతో ఉన్నత లక్ష్యాలున్నాయి. బ్యాంక్ లో స్కేల్ ఫోర్ ఆఫీసర్ అవాలని తన కల. పెళ్ళిచూపులప్పుడే, నా కల ఇది అని చెప్పి, పెళ్ళికొడుకుని ఒప్పించి మరీ చేసుకుంది. తీరా చేసుకున్నాక, పది రోజులకే అప్పాయింట్మెంట్ లెటర్ వచ్చినా - భర్త, తండ్రి ఇద్దరూ వద్దంటే వద్దని ఒక్కటే బ్రెయిన్ స్టార్మ్ చేసి మొదట్లో మూణ్ణెల్లకోసారి, తర్వాత మూడేళ్ళకోసారి బదిలీలు, ఎందుకని కౌన్సిలింగ్ చేసారు. తీరా ఏదో టుమ్రీ ఉద్యోగం చేసుకుంటుంటే, పిల్లలు... ఆ ఉద్యోగం కూడా మానేసేయాల్సొచ్చింది. అమ్మాయిలకి కెరీర్ - కుటుంబమే... హు... హర్ ఛాయిస్ ?
......................................................................................................................................
కార్తీక్ - కావ్యల కథ ఇంకోటి... ఇద్దరిదీ అర్థం చేసుకునే తత్వమే. కానీ అభిరుచులే... ఒక్కటి కూడా కలవ్వు... స్వీటు - హాటు, వేడి - చల్లదనం, ఉప్పు - నిప్పు, సుబ్బులక్షి - బ్రిట్నీ స్పియర్స్ లాగా... టి.వి లో కహోనా ప్యార్ హై లోని చాంద్ సితారే పాటొస్తోంది. ఆహా... ఎన్నాళ్ళైందో ఈ పాట చూసి అనేలోపే - తప్పుకో - అవతల వింబుల్డన్ లో షరపోవా ఆట. అంత సెక్సీ గేమ్ వదిలేసి, ఈ తొక్కలో ఫేసా ? అంటూ అర్జంటుగా చానల్ మార్చాడు. హు... హర్ ఛాయిస్.
...........................................................................................................................................
ఇన్ని పిట్ట కథల్లోనూ - ఉన్న ఒకే ఒక్క దిట్టమైన విషయం... వోగ్ - ఎంపవర్ : మహిళా సాధికారత గురించి దీపికా చెప్పిన మాటలో నిజం ఉందో లేదో డిబేట్ అనవసరం... కానీ నాలో నేను, నాలా నేను, నాకై నేను, నాతో నేను ఉంటే చాలు. ఇది స్వార్థం కాదు. అసలైన సాధికారతకు నిదర్శనం. నచ్చిన వంట, నచ్చిన పాట, నచ్చిన చదువు, నచ్చిన మనువు... లాంటివి ఉంటే చాలు. సమానత్వం పేరుతో విశృంఖలత్వం అఖ్ఖర్లేదు. తనున్న సర్కిల్ కి, అర్థరాత్రి మూడింటికి, సాయంత్రం ఆరింటికి, వివాహానికి ముందు, వివాహేతరాలు చాలా చిన్న విషయాలేమో...  కానీ తనని ఆదర్శంగా తీసుకునే అమ్మాయిలపైన అవెంత దుష్పరిణామాలు చూపిస్తాయో తెలుసుకుని ఆ తర్వాత ఇలాంటి షార్ట్ ఫిలిం లు తియ్యడం మంచిది. ఎందుకంటే - మహిళకి మై ఛాయిస్ అనేది ఒక విమర్శనాస్త్రంగా ఉండాలే తప్ప వినాశనాస్త్రంగా కాదు.

No comments:

Post a Comment

Pages