మీ గురించి సమాజం ఏమనుకుంటుందో తెలుసా ? - అచ్చంగా తెలుగు

మీ గురించి సమాజం ఏమనుకుంటుందో తెలుసా ?

Share This

 మీ గురించి సమాజం ఏమనుకుంటుందో తెలుసా ?

 - బి.వి.సత్య నగేష్ 


మీరు నిజమైన అర్హతలున్న వ్యక్తి అయినపుడు మీకు గౌరవం దొరకకపోతే మీరెంటో తెలియజేయడంలో ఓడిపోవద్దు. అదే కొనసాగితే మీ ఉనికి సమాధి అవుతుంది. మీకున్న ప్రతిభతో పాటు అది ప్రకటితం చెయ్యడం కూడా మీకెంతో అవసరం. ఈ విధంగా చెయ్యకపోతే సమాజం గుర్తించదు........

God gives us faces, we create our own expressions
మనం నవ్వు, కోపం, జుగుప్సలాంటి అనేక రకాలైన భావప్రకటనలను ముఖ కవళికల ద్వారా వ్యక్త పరుస్తాం. పుట్టుకతోనే వున్న మన ముఖంతో ఎన్నో భావాలను ప్రకటించినట్లు, మన జ్ఞాన సంపద, నైపుణ్యలతతో మన శక్తి యుక్తులను సమాజంలో ప్రకటితం చెయ్యాలి. ఆ తర్వాత వచ్చేదే సామాజిక గుర్తింపు. (SS SSocial recongnition )
          ‘ఎదుటివారు నన్ను ఏ విధంగా గౌరవించాలనుకుంటున్నానో, ఆ విధంగా నన్ను నేను గౌరవించు కుంటున్నానా?’అని ప్రతీ మనిషి ప్రశ్నించుకోవాలి.
‘అతను Low profile maintain చేస్తాడు’
‘అతను డౌన్ టు ఎర్త్ టైపు’
‘ఫరవాలేదు....ఏమనుకోడు’
‘అతన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదు’
          ‘ఏం కాదులే, మనోడే, తర్వాత చూసుకుందాం’
          ఇలాంటి వ్యాఖ్యలు మీ గురించి మీరు వినవలసి వచ్చిందంటే మీ ‘సామాజిక గుర్తింపు’ బాగాలేదనే చెప్పొచ్చు. మీ విషయంలో సమాజం Take him for granted అనే ధోరణిలో ఉందన్నమాట.
          నిజంగానే మీకు సమాజంలో మంచి గుర్తింపు లేదు. లేదా ‘జంటిల్ మెన్ సిండ్రోమ్’ అనే మానసిక సమస్యతో వున్నారని అర్ధం. ఇది నిజమైతే మీరు మేల్కొనాలి. సమాజం మిమ్మల్ని గుర్తించటంలేదని తెలుసుకోవాలి. మీరు నిజమైన అర్హతలున్న వ్యక్తి అయినవుడు మీకు గౌరవం దొరకకపోతే మీరేంటో తెలియజేయడంలో ఓడిపోవద్దు. అదే కొనసాగితే మీ ఉనికి సమాధి అవుతుంది.
          మీరేంటో తెలియజేయడంలో ఓడిపోయి, పైన పేర్కొన్న వ్యాఖ్యలు వింటూ బాధపడుతూ వుంటే...
ఎందుకు ఓడిపోయారనే వివరాలు సమాజానికి అవసరం లేదు. సమాజమే కాదు.... కుటుంబ సభ్యులు కూడా అడగరు. అది లోకం తీరు. మీకున్న ప్రతిభతోపాటు అది ప్రకటితం చెయ్యడం కూడా మీకెంతో అవసరం. ఈ విధంగా చెయ్యకపోతే సమాజం గుర్తించదు. ప్రతిభ తక్కువే వున్నప్పటికీ ప్రచారం ఎక్కువగా వుండటం వలన కొందరు మంచి గుర్తింపు పొందుతూ ఉంటారు.
ప్రతిభ వుండి కూడా సమాజంలోకి చొచ్చుకుని పోలేక పొతే నీకు ‘ఇంట్రోవర్డ్’ అనే బిరుదు కూడా ఇస్తారు. ప్రతిభ వుండి కూడా ప్రకటితం చెయ్యకపోతే మీరు ‘స్వసానుభూతి’ (self pity) తో బాధ పడుతున్నారంటారు. ‘జీవితంలో పైకి రాడు’ ‘అతనికి వున్న ప్రతిభకు ఎంతోస్థాయికి ఎదగవచ్చునని తెలుసుకోలేని స్థితిలో వున్నారు’ ‘జీవితంలో ఓడిపోయేడు’ ‘ఇంకేం పైకి వస్తాడు!’ ‘వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు’ అనే వ్యాఖ్యలు కూడా వింటారు.
ఈ సందర్భంలో డాక్టర్ సి. నారాయణ రెడ్డిగారి కలం నుంచి వచ్చిన ఆణిముత్యాలను చదవండి.......
ఎవడికి కావాలోయ్ ఓడిన వాడి సంజాయిషీ!
వాలుకు కొట్టుకు పోయిన వాడికి లోకం జలసమాధి కడుతుంది.
గెలిచినా వాడికి అదేలోకం ఒంగి సలామ్
కొడుతుంది.
పరుగు పందెంలో గెలిచినా వాడికే పట్టం కడుతుందీ సమాజం. ఓడిన వాడెందుకు ఓడిపోయేడనేది అనవసరం. గెలిచిన వాడిని చూసిన సంబరంలో వున్న వ్యక్తికి ఓడిన వాడిని చూస్తే జుగుప్స కూడా కలుగుతుందేమో! ఎక్కడో ఒకరిద్దరు జాలిపడినంత మాత్రాన ఓడిన వాడికి ఒరిగేదేముంది? నిరాశ నిస్పృహ తప్ప!
          సమాజంలో వుంటున్న మీరు ఈ సమాజానికి మీ ఉనికిని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రతిభ వుంటేనే సమాజం పట్టం కడుతుంది. అయితే ప్రకటితం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది.
          ఒక గుర్తింపు వచ్చిన తర్వాత మీ మాటలు తేనెలూటలౌతాయి. మీరేం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అపుడు మీ ప్రతిభ, స్థాయి గురించి చెప్పుకోనవసరం లేదు. ఎన్నో రంగాలకు చెందిన ఈనాటి ప్రముఖులు కొంతకాలం క్రితం వారెవరో తెలియదీ సమాజానికి. ఈ రోజు వారు చెప్పిన ప్రతీ విషయం చాలా విలువైనదౌతుంది. ఒక్కొక్కసారి సంచలనం సృష్టిస్తుంది కూడా. అందుకని సమాజంలో గుర్తింపు పొందడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. అలాగే ప్రకటితం చెయ్యాలి కూడా.
నిజమే మరి !
            నీ ప్రతిభను ప్రకటితం చేస్తే, నీ ప్రగతికి తిరుగు లేదు. నీ ప్రగతి గొప్పదైతే, నువ్వేం చెప్పుకోనవసరం లేదు. నీకా ప్రగతి లేకపోతే, నువ్వేం చెప్పినా లోకానికి అవసరం లేదు. నీకైనా, నాకైనా ఎవరికైనా ఈ లోకం తీరు అదే కదా!
          భూమిలో రత్నాలున్నా... తెలియనంతవరకు ఆ భూమికి సాధారణ విలువే వుంటుంది. ఒకసారి రత్నాలున్నాయనే విషయం తెలిసిన తర్వాత భూమి విలువ ఆకాశాన్నంటుతుంది. అలాగే మీలోని ప్రతిభకు పట్టం కట్టి, చేతలతో ప్రకటితం చేస్తేనే మీకు గుర్తింపు వస్తుంది. మరి ఇక ఆలస్యమెందుకు!
“Express yourself to impress for progress in social status”
 (వ్యాసకర్త: హైదరాబాదులోని మైండ్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ పర్సనల్ ఎక్సలెన్స్ డైరెక్టర్ )      

No comments:

Post a Comment

Pages