ఇలా ఎందరున్నారు ?- 7

అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. మెట్లకింద గాలిలేక మగ్గుతున్నవరమ్మకు ఫ్యాన్ తెచ్చిపెట్టాలని చూసిన శ్రీహర్షను వారిస్తాడు అతని తండ్రి... నీలిమతో మాట్లాడుతూ ఉంటుంది సంకేత... ఇక చదవండి... )
“శ్రీహర్షకి పెళ్ళై కొడుకు పుడితే! ఆ కొడుకు శ్రీహర్ష భార్యను ఇప్పుడు వీళ్ళు వరమ్మను చూసినట్లే చూస్తాడు. అప్పుడు శ్రీహర్ష భార్య వరమ్మలా మెట్ల కింద ఉండదు. రాబోయే రోజుల్లో నేలకి షార్టేజ్ వస్తుంది కాబట్టి భూమిలోనే సెల్లార్ లాగా ఓ గుంట తీసి అందులో ఉంచుతాడు..” అంది.
          శ్రీహర్ష భార్య భవిష్యత్తు ఏమిటో ఫుల్ పిక్చర్లో కనిపించినట్లయి షాక్ తిన్నది నీలిమ. వెంటనే తేరుకొని, ‘ఆ’ అంటూ నోరు తెరిచింది. మరీ ఇంత ఘోరంగా ఉంటుందా అని మనసులో అనుకుంది. ఎపుడైనా ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెడ్‍కి మధ్యలో కూర్చుని తలమీదుగా దుప్పటి కప్పుకొని మనిషి కొంచెం కూడా కనిపించకుండా కూర్చుని చదువుకునే సంకేతేంటి ఇలా మాట్లాడుతుంది? చదివి చదివి అలిసి పోతుందని తను వెళ్ళి కాంచనమాలకు తెలియకుండా అప్పుడప్పుడు వేడి వేడి పాలు తెచ్చి ఇచ్చేది. అవి తాగుతూ కూడా పుస్తకంలో పేజీలు తిప్పుతూ క్షణం వృధా అయినా అది నీటి చుక్కలా ఆవిరై గతం ఖాతాలోకి వెళ్తుంది నన్ను మాట్లాడించకు అనేది. అలాంటిది ఇప్పుడేంటి ఇంత ఆవేశంగా మాట్లాడుతుంది? అని ఆశ్చర్య పోయింది నీలిమ.
          “నీకింకో విషయం చెప్పనా! ఎలక్ట్రికల్ షాప్ పెట్టిన దాస్ ఎవరో కాదు శ్రీహర్షకి ప్రాణ స్నేహితుడు. వాడు టెన్త్‍లో ఉన్నపుడు నైన్త్‍లో ఉన్న నాకు ఐ లవ్ యు చెప్పాడు. నేనిచ్చిన కంప్లైట్ తో సస్పెండై చదువు మానేశాడు. నాకు ఐ లవ్ యూ చెప్పడం అంత అవసరమా వాడికి” అంది. ఇన్ని రోజులు చెప్పని రహస్యమేదో ఇప్పుడు చెప్పినట్లు చెప్పి “దాసంటే నాకు అసహ్యం” అంది. ఆమెకు దాస్ గురించి అంత కన్నా ఎక్కువగా ఎలా చెప్పాలో తెలియలేదు. ఎంత చెప్పినా తక్కువే అన్నట్లు మాట్లాడింది.
          అది విని ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి చూపులు చూసింది. నీలిమ దాసంటే ఆ ఇంట్లో ఎవ్వరికీ అంత చులకన భావం లేదు. వరమ్మ కూడా దాస్ ని అప్పుడప్పుడు మెచ్చుకుంటూనే ఉంటుంది. చిన్నప్పటికీ ఇప్పటికీ దాస్ లో చాలా మార్పు వచ్చిందని ఒకప్పుడు ఎంత అల్లరి చేసేవాడో నవ్వుకుంటూ చెబుతుంది. అప్పుడప్పుడు దాస్ ని తన పక్కన కూర్చో బెట్టుకుని కబుర్లు కూడా చెబుతుంది.
          “ఇన్ని రోజులు చెప్పకుండా ఈ విషయంఇప్పుడెందుకు చెప్పానో నువ్వు గెస్ చెయ్యలేవు. అది కూడా నేనే చెబుతాను విను” అంది సంకేత.
          “నువ్వెన్ని చెప్పినా దాస్ బాబు అంటే నాకు మరీ అంత చెడు భావన లేదు. అందుకే నా మనసు నీ మాటల్ని అంగీకరించలేకపోతోంది.” అంది నీలిమ.
          “అబ్బా! నువ్వు మరీ అంత ఇదవ్వకు. అతన్ని నువ్వు పూర్తిగా చూస్తే అలా అనవు..” అంది సంకేత.
          “అతన్ని నేనెందుకు చూడలేదు..? మొన్ననేగా మన ఇంటికి వచ్చాడు” అంటూ ఆవులిస్తూ దుప్పటి కప్పుకుంది.
          “నేను కూడా చూశానులే! నువ్వు తిప్పుకుంటూ వెళ్ళి కాఫీ కూడా ఇచ్చావు.. నువ్వు మరీ అంత తిప్పుకోకు. వాడి చూపులు అంత మంచివి కావు. నీక్కూడా ఐ లవ్ యూ చెబుతాడు” అంది సంకేత.
          అదిరి పడి లేచి కూర్చుని “నాకా!!” అంది జీవితంలో ఎప్పుడూ తిననంతగాషాక్ తింది నీలిమ.
          “అవును నీకే! నీకేం తక్కువ? కాలేజీ అమ్మాయికి ఎక్కువ యూనివర్సిటీ అమ్మాయికి తక్కువ అన్నట్టు ఉంటావు. నీకు తెలుసో లేదో నీ అందం ప్యూర్ గోల్డ్. ఎలాంటి కాస్మోటిక్స్ అంటని స్వచ్చమైన ప్రకృతి సమానమైనది. ఏదో నీ ఖర్మ కాలి ఇక్కడొచ్చి పడ్డావు కాని హాయిగా ఆ అనాధ ఆశ్రమంలోనే ఉండి ఉంటే నీట్ గా చదువుకొని బ్రైట్ గా ఉండేదానివి. ఇప్పుడు చూడు ఏదైనా అవసరం ఉండి శ్రీ హర్ష పిలవగానే ‘యస్ సర్! ఓ.కె సర్! ఇప్పుడే తెస్తాను సర్! రెడీ అయింది సర్!” అంటూ పిచ్చి దానిలా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తుంటావు. నువ్వు శ్రీహర్ష పట్ల చూపే గౌరవాన్ని వినయాన్ని చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. చూడు నీలిమా మనం ఇస్తున్న గౌరవం కాని వినయం కాని అపాత్ర దానం కాకూడదు. అంది సంకేత శ్రీహర్ష మీద ఉన్న కోపంతో..
          వింటున్న నీలిమకు ఒకే ఒక్క విషయం దగ్గర ఆశ్చర్యం అనిపిస్తోంది. నిన్ననే శ్రీహర్ష సంకేత గురించి తనతో మాట్లాడాడు. అతను మాట్లాడిన ప్రతి మాటలో సంకేత పట్ల మంచి అభిప్రాయం ఉంది. అభిమానం ఉంది. అంతే కాదు సంకేతను చదువులతల్లిగా, సున్నితమైన అమ్మాయిగా భావిస్తున్నాడు. అతని భావన ఎక్కడ? సంకేత మాటలు ఎక్కడ? సంకేతకు అతనంటే ఇంత చిన్న చూపు ఉందని అతనికి తెలుసా?
            తెలిస్తే! సంకేత ఆత్మాభిమానం గల అమ్మాయి అని త్వరగా హర్ట్ అవుతుందని వాళ్ళ అమ్మకి కోపం వచ్చినపుడు సంకేతకి సపోర్టుగా ఉండమని తనతో ఎందుకు చెబుతాడు? సంకేతకి మొహమాటం అని కూడా చెప్పాడు. ఇదేనా మొహమాటం అంటే? ఆమె మనసులో తనకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియకుండా ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడినట్లున్నాయి శ్రీహర్ష మాటలు.
          దీన్ని బట్టి చూస్తుంటే శ్రీహర్ష సంకేతకు తెలియకుండా సంకేతను ప్రేమిస్తున్నట్లుంది. తెలియకుండా ఎంత ప్రేమించి ఏం లాభం? తెలిస్తే సంకేత ఒప్పుకుంటుందా?
          “ఏంటి నీలిమా? ఆలోచిస్తున్నావ్?” అడిగింది సంకేత.
          “ఆలోచించలేదు. నిద్రొస్తోంది మేడమ్!” చెప్పించి నీలిమ.
          “సరే! నిద్రపో! దాస్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు. శ్రీహర్ష కూడా అంత మంచివాడేం కాదు. డబ్బులేని వాళ్ళంటే అతనికి తక్కువ చూపు”
***
          సంకేత మనస్సంతా ప్రస్తుతం తను తీసుకోబోయే కోచింగ్ మీదనే ఉంది. కళ్ళు మూసినా, తెరిచినా అదే ఆలోచన, అదే తిండి. అదే నిద్ర. అదే జీవితం అయినట్లు అదే తపనలో ఉంది.
          గేట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకోవాలనుందని పల్లవితో చెప్పింది సంకేత.. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో తనకి మంచి మార్కులు వచ్చాయి అని కూడా చెప్పింది.
          పల్లవి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడడం లేదో సంకేతకి అర్థం కాలేదు. చెప్పగానే ‘వావ్!’ అనకుండా ఇంత నిస్తేజంగా ఉందేమిటి?
          పల్లవి నోరు విప్పి ‘హిందూకి చెప్పావా? అది నీ బెస్ట్ ఫ్రెండ్ కదా!” అంది.
          “చెప్పాను. హిందూ వద్దంటోంది. బి.టెక్ తోనే ఏదైనా జాబ్ చూసుకో అంటోంది. నాకు ఇప్పుడే జాబ్ చేయాలని లేదు. ఇంకా చదవాలని ఉంది. ఎం.టెక్ లో సీటొస్తే నేను మా పేరెంట్ మీదఈ మాత్రం కూడా ఆధార పడకుండా చదువుకోవచ్చు. పైగా యు.జి.సి వాళ్ళు ఇచ్చే మనీ లోంచి కొంత మిగిల్చి మా నాన్న కోసం నా కోసం చేసిన అప్పు కట్టొచ్చు. నువ్వు ఏమంటావు పల్లవీ?” అంటూ సలహా అడిగింది సంకేత.
          పల్లవి ఆశ్చర్య పోతూ “పోయి పోయి ఇలాంటి సలహాలు నన్నే అడుగు. నేను ఈ బి.టెక్ నే ఎక్కువ అనుకుంటుంటే నువ్వు ఎం.టెక్ కూడా చదువుతావా? నీదసలు బుర్రేనా ఇప్పటికే నా బుర్ర వేడెక్కి ఎప్పుడు బ్రేక్ అవుతుందో నని అప్పుడప్పుడూ డౌటొతుంది. నీకు రాదా?” అంది.
          “ నాకు రాదు. ఎందుకంటే మెదడుకున్న  కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఐన్ స్టీన్ అంతటి వాడు వాడుకున్నది టు పర్సెంటేనట. ఆఫ్ట్రాల్ మనమెంత? మనం వాడుకునేది ఎంత?” అంది సంకేత.
          పల్లవి “ఓ అలా ఫిక్సయ్యావన్నమాట.. మరి నీకు గేట్ లో సీట్ వస్తుందంటావా?”
          “తప్పకుండా వస్తుంది. నేను చిన్నప్పటినుండి చదివింది గవర్నమెంట్ స్కూల్లో. అందులో ఉన్న టీచర్స్ అంతా డియస్సీల్లో ఉత్తీర్ణులైనవారు. అదీకాక నేను స్టేట్ సిలబస్ మ్యాథ్స్ చదివాను. మ్యాథ్స్ విషయంలో సెంట్రల్ కంటే స్టేట్ సిలబస్ చాలా స్టాండర్డ్. కాబట్టి నేను తప్పకుండా గేట్‍లో సీటు సాధించగలను.” అంది కాన్ఫిడెంట్ గా సంకేత.
          పల్లవి మాట్లాడలేదు. ఆ తరువాత కొద్దిక్షణాలు నిశ్శబ్దం.
          పల్లవి మాట్లాడకపోవడంతో సంకేత నిట్టూర్చి”ఎందుకో చదువు పిచ్చి రోజురోజుకీ నాకు ఎక్కువవుతుంది పల్లవీ! ఇప్పుడు నీకీ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే మొన్న నువ్వు కాలేజీలో నా ఫైన్ కట్టినట్లే ఈ కోచింగ్ ఫీజు కూడా కడతావని.. ప్లీజ్ పల్లవీ! నాకు మనీ రాగానే ఇచ్చేస్తాను.” అంది రిక్వస్ట్‍గా.
          “నీ ఫైన్ కట్టింది నేను కాదు” అంది వెంటనే పల్లవి.
          “నువ్వు కాదా!! ఇంకెవరు? హిందూ కూడా కాదే…!” ఆలోచనలో పడింది సంకేత.
          “అనంత్!” చెప్పింది పల్లవి.
          ఆలోచన చెదిరి దిగ్భ్రాంతిగా చూసింది సంకేత.
          వెంటనే తేరుకొని “అనంత్ కట్టాడా? మరి నాకు చెప్పలేదేం?”
          “అనంట్ చెప్పొద్దన్నాడు.”
          ఈసారి ఇంకా షాక్ తినది సంకేత. హెల్ప్ చెయ్యకపోయినా చేసినట్లే పదిమందికి చెప్పుకునే వాళ్ళను చూస్తున్నాం.. హెల్ప్ చేసి కూడా ఇలా సైలెంటయిపోయేవాళ్ళు ఎక్కడైనా ఉంటారా? అనంత్ ఎంత మంచి వాడు. మంచివాడే కాదు, గొప్పవాడు కూడా.. తనున్న పరిస్థితిలో తనకి అలాగే అన్పిస్తున్నాడు మరి…
          “ఎందుకు చెప్పొద్దన్నాడు?” అడిగింది సంకేత.
          “ఇంత చిన్న విషయానికే నిన్ను డిస్టర్బ్ చెయ్యడం ఎందుకులే అని కావొచ్చు… తెలిస్తే నువ్విక దానిగురించే థింక్ చేస్తూ అతని డబ్బులు అతనికి ఇవ్వాలన్న ప్రయత్నంలో ఇబ్బందిపడతావని కావొచ్చు. ఇది కామన్ సంకేతా! లైట్ తీసుకో!” అంది పల్లవి.
          ఇది కామనా! ఇది చిన్నవిషయమా! డబ్బు విషయంలో ఎవరూ అలా ఉండరు. అదే శ్రీహర్ష కాని, దాస్ కాని అలా ఇస్తారా? ఒకవేళ ఇచ్చినా వెంటనే “నువ్వో రైతు కూలి కూతురువి…’ అన్నట్లు వాళ్ళు పెట్టే ఎక్స్‍ప్రెషన్స్ కి అక్కడికక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది. అందుఏ అనంత్ నిండుగా ప్రవహించే నదిలా అన్పిస్తే! వాళ్ళేమో త్రుళ్ళి త్రుళ్ళి పడే నీటిచుక్కల్లా అన్పిస్తున్నారు.
          “ఏంటి సంకేతా! ఆలోచిస్తున్నావ్? ఇలా ఆలోచిస్తావనే అనంత్ చెప్పొద్దన్నాడు. అనంతే కరెక్ట్!”
          “నాకు తెలిసివుంటే అనంత్ కి అప్పుడే థ్యాంక్స్ చెప్పేదాన్ని.. అలా చెప్పలేకపోయినందుకు గిల్టీగా ఉంది…”
          “…ముందు నీ సెల్‍ఫోన్లోంచి అనంత్‍కి కాల్ చెయ్యి అతనికి నేను అర్జెంటుగా థ్యాంక్స్ చెప్పాలి” అంది సంకేత.
          “నా సెల్‍ఫోన్లో బ్యాలెన్స్ లేదు” అంది పల్లవి.
          “ఇప్పుడెలా?” అంటూ టెన్షన్, టెన్షన్‍గా చూసింది సంకేత.
          “కొద్దిగా టైం తీసుకోరాదే! ఎందుకంత తొందర!”
          “ఇది తొందర కాదు. కృతజ్ఞత తెలుపుకోవాలనుకోవటం…”
          “చూస్తూనే తెలుస్తోందిలే! ఈ విషయంలో నువ్వెంత ఎమోషనల్‍గా ఉన్నావో! కాలేజి నుండి ఇంటికెళ్ళే ముందు మాట్లాడు. ఫోన్లోకన్నా డైరెక్ట్ అయితే ఇంకా బావుంటుంది” చెప్పింది పల్లవి.
          “సరే! కానీ ఎందుకో అతనితో మాట్లాడాలంటే భయంగా ఉంది. నువ్వు కూడా నాతో ఉండవా? ప్లీజ్!”
          “నా బైక్‍ను రిపేర్‍కి ఇచ్చాను. త్వరగా వెళ్ళి తెచ్చుకోవాలి. ఆరోజు యాక్సిడెంట్ అయినప్పటి నుండి రిపేర్ మీద రిపేర్ అవుతూ నా బైక్ అసలు కోలుకోవడం లేదు… నా బాడీకి కూడా రిపేర్ వచ్చిందో ఏమో ఒకటే పెయిన్స్.. ఏం చేయాలో తోచటం లేదు” అంటూ తనకి వీలుకాదని చెప్పకనే చెప్పింది పల్లవి.
          పల్లవి తనతో రాదని తెలిసిపోయింది సంకేతకి… పల్లవి ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉంటుంది. ‘ఎస్‍ఆర్‍నో’ చెప్పిందీ అంటే తర్వాత ఏది ఏమైనా రాజీపడదు.
          … కాలేజీ వదిలాక అనంత్‍కి థ్యాంక్స్ చెప్పాలనుకున్న విషయం హిందూకి చెప్పలేదు సంకేత. కారణం హిందూ కొన్నివిషయాలను ఒప్పుకోదు. డబ్బులు ఇచ్చేటప్పుడు చెబితే సరిపోతుంది కదా! ప్రత్యేకంగా అతని కోసం ఆగి థ్యాంక్స్ చెప్పడం దేనికి… అందరి దృష్టిలో పడడం దేనికి? అంటుంది. అందుకే హిందూకీ ఏదో పనిఉందని అబద్ధం చెప్పి కాలేజీలోనే ఓ చోట ఆగిపోయింది.
          సంకేత అనంత్ తన బైక్ దగ్గరకి వెళుతుండగా తను కూడా అటు వైపు వెళ్ళి “అనంత్! మీకు నేను థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను” అంది చాలా నెమ్మదిగా… ముందు ఏమో అనుకుంది కానీ ఆ తర్వాత ఆమె గుండె కొట్టుకోవడం ఆమెకి స్పష్టంగా వినిపిస్తోంది.
          ,,,స్టూడెంట్‍లు అంతా ఇళ్ళకెళ్తూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు.
          అనంత్ నవ్వి “గెస్ చేశాను” అన్నాదు.
          ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండి “అనంత్! మీ మనీ మీకు తిరిగి ఇవ్వాలంటే నాకు కొంత టైము కావాలి…” అంది.
          “ఎంత టైం కావాలన్నా తీసుకో… దీని గురించి ఎక్కువగా ఆలోచించకు… నువ్వు ఇవ్వకపోయినా ఏమీ అనుకోను… ఎందుకంటే నీలాంటి బ్రిలియంట్, హైపర్సంటేజ్ అమ్మాయికి హెల్ప్ చేయడం నాకు హ్యాపీగా ఉంది…” అన్నాడు. అతను బైక్‍స్టాండ్ తియ్యకుండా దాన్ని ఆనుకుని హుందాగా నిలబడ్డాడు.
          మళ్ళీ అతనే “నాకు చదువన్నా, బాగా చదివేవాళ్ళన్నా అప్పుడప్పుడు అలాంటి వాళ్ళతో మాట్లాడాలన్నా చాలా ఇష్టం. ఎందుకంటే నేను బాగా చదివేవాళ్ళతో పోటీపడి చదవలేను. అది నా బలహీనంగా” అన్నాడు. అదేంటి అన్నట్లు అతని వైపు చూసింది సంకేత.
          …అతను నిలబడిన విధానం చాలా స్ట్రైల్‍ గా, పాష్‍గా అన్పిస్తోంది, అతన్ని ఒక్కక్షణం అలాగే చూసి, కాలేజిబ్యాగ్ ఏదో బరువైనట్లు ఈ భుజం నుండి ఆ భుజానికి మార్చుకుంటూ “ఇంక నేను వెళ్తానండీ!” అంది సంకేత,
          అతను వెంటనే బైక్‍ను స్టార్ట్ చేసి “నేను వెళ్తున్నది కూడా అటువైపే! డ్రాప్ చేస్తాను రండి!” అన్నాడు చాలా క్యాజువల్‍గా
          “నో థ్యాంక్స్”
          షాక్ తిన్నాడు అనంత్…
          అనంతభుజం మీద చేయి పడడంతో సంకేతే తనని తడుతున్నదా అన్నంతగా ఉలిక్కిపడి, షాక్ లోంచి తేరుకున్నాడు,
          సంకేత కాదు. అనంత్ స్నేహితుడు! సంకేత తనని తిడుతున్నదా అన్నంతగా ఉలిక్కిపడి షాక్ లోంచి తేరుకున్నాడు.
          సంకేత కాదు. అనంత్ స్నేహితుడు! సంకేత ఎపుడో ఆటోఎక్కి  వెళ్లిపోయింది.
          స్నేహితుడితో మాట్లాడుకుంటూ బైక్ మీద ఇంటికెళ్ళాడు అనంత్. దారిలో బైక్ మీద ఉన్నప్పుడు “అనంత్! ఈ వీకెండ్ ఏ హోటల్ కి వెళ్దాం? మన ఫ్రెండ్స్ అంతా ఈ సారి అనంత్ కే వదిలేద్దాం అంటున్నారు. నువ్విప్పుడు చెబితే నేను అరేంజ్ చేస్తాను” అన్నాడు. అనంత్ ఏ విషయంలోనైనా బ్రాండ్ మెయిన్‍టెయిన్ చేస్తాడని ఫ్రెండ్సందరికీ తెలుసు. అందుకే వాళ్ళనంత్ ని బాగా ఇష్టపడతారు.
          “నాకెందుకో పార్టీలన్నా ఫ్రెండ్సన్నా బోర్ కొడుతోంది. కొద్దిసేపు ఒంటరిగా కూర్చుని గడపాలనిపిస్తోంది” అన్నాడు అనంత్.
          స్నేహితుడు అదిరిపడి “ఇలా ఎపుడనిపిస్తుందో తెలుసా! మన మనసు మనకు తెలియకుండానే అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నప్పుడు! నువ్వేమైనా అలా ఆలోచిస్తు న్నావా?
          “ఛ ఛ అలా ఆలోచించే అలవాటు నాకు లేదు.. నువ్వూ.?”?
          “ఎందుకాలోచించను! నాకు బాడీ లేదా? బాడీ కెమిస్ట్రీ లేదా? హార్మోన్స్ వర్కవుట్ కావా? నేనేమైనా ‘గె’నా?”
          “అలా అని నేనేమైనా అన్నానా?”
          “నువ్వు అనవులే! కానీ నేను పర్‍ఫెక్ట్‍లీ ఆల్‍రైట్! అయినా ఒక్క అమ్మాయి కూడా నాతోమాట్లాడడం లేదు. ముఖం మీదనే చెబుతున్నార్రా! ‘నీతో తిరిగితే టైం వేస్ట్!’ అని…”
          “టైం వేస్ట్ దేనికి?” ఆసక్తిగా చూస్తూ అడిగాడు అనంత్.
          “నా దగ్గర బైక్ లేదట. పబ్బులకి పార్టీలకి తిప్పలేనట! పైగా వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ కే ఎగ్జయిటై గంటలు, గంటలు మాట్లాడే రోజులు పోయాయట.. పైగా మీకూ, మాకూ తేడా ఏముంది? మీరు పార్టీలల్లో కూర్చుని తాగుతారు. మేం తాగము అంతేకదా! ఇప్పుడు ఆ తేడా కూడా కొద్దికొద్దిగా తగ్గిపోతుంది అంటున్నార్రా!
          ఇంతెందుకు మన ఫ్రెండ్ రాజీవ్ చచ్చీచెడి ఇన్‍స్టా‍మెంట్‍లో బైక్ కొన్నాడా! వాడసలు బైక్ కొన్నదే అమ్మాయిల్ని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టుకుని తిరగడానికి.. కానీ అది కొన్నప్పటినుండి ఒక అమ్మాయి కూడా ఎక్కట్లేదట.. అప్పు చేసైనా సరే ఆ బైక్ మీద అమ్మాయిల్ని ఎక్కించుకొని తిరగాలిరా! అంటున్నాడు. వాడి ప్రాబ్లమ్ వాడిది. నా ప్రాబ్లమ్ కూడా అదే! డబ్బు అసలు ఈ డబ్బునెందుకు కనిపెట్టారో కాని మనుషులతో ఆడుకొని చంపుతోదిరా! మనసుతో అవసరమే లేకుండా చేస్తోంది..” అన్నాడు స్నేహితుడు.
          అనంత్ ఏమీ మాట్లాడలేదు,
          “ఏంటోరా! రోజు రోజుకు నేటి స్టూడెంట్లు కొందరిలో  బాగా మార్పు వస్తోంది. అదీ కాక ఈ మధ్యన సుప్రీంకోర్టు ఇష్టపడిన వ్యక్తితో సహజీవనం చేస్తే తప్పు కాదని జారీచేయడం ఒక అడ్వాంటేజ్ అయిపోయింది మన అబ్బాయిలకి. ఎంత ఎంజాయ్ చేస్త్ అంత ప్రతిష్టగా భావించే అమ్మాయిలు  కూడా ఎక్కువే అయ్యారు. కాని వాళ్ళకు వాళ్ళు చేసే పనులు తప్ప మిగతావన్ని తప్పుల్లాగే తోస్తాయి. వాళ్ళ కర్తవ్యం, బాధ్యతను మరచి గొప్పలకు పోయి ముందు జీవితం గురించి మరచిపోతున్నారు. చదువు అనే ఉద్దేశ్యంతో పట్టణాల్లో పెద్ద కాలేజీల్లో చేరి హాస్టల్స్‍లో ఉండే కొందరు అబ్బాయిలు, కొందరు అమ్మాయిలూ చాలా వరకు చదువును పక్కన బెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఈ వయస్సులో కాక ఇంకెప్పుడు చేస్తాం అంటారు. మరి చదువు ఏ వయస్సులో చదువుతారో..? అన్నాడు స్నేహితుడు.
          ఆ మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తన గదిలో కూర్చున్నాడు అనంత్. ఎప్పుడైనా మనసనేది తనకి హాయిగా అనిపించే అంశాలనే తనని ఆహ్వానిస్తుంది. ఎంత మర్చిపోదామన్నా సంకేత తన బైక్ మీద కూర్చోకపోవడమే గుర్తొస్తోంది. ఎప్పటికైనా సంకేతను తన బైక్ ఎక్కేలా చెయ్యాలి. అది చూసి తన ఫ్రెండ్స్ అంతా అనంత్ గ్రేట్! అనుకోవాలి. ఇదే ఆలోచనలో ఉన్నాడు. అయినా తనేంటి సంకేత గురించి ఇలా ఆలోచిస్తున్నాడు? అని వెంటనే తల విదిలించి లాప్‍టాప్‍ని ముందు పెట్టుకొని ఏదో సైట్ ఓపెన్ చేసి చూస్తూ కూర్చున్నాడు.
(ఇంకా ఉంది...)

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top