వెన్నెల యానం

భావరాజు పద్మిని


ఆకాశాన్ని తాకుతూ రాజులా ఠీవిగా నిల్చున్న పాపికొండల నడుమ, గోదారమ్మ ముగ్ధలా ఒదిగి ఒదిగి సాగుతోంది. లయబద్ధమైన అలల సడితో కొండలను ముద్దాడుతూ హొయలు పోతోంది.
గోదారమ్మ వెన్నెల జలతారు చీరను ఒళ్ళంతా కప్పుకుంది. ఆకాశంలో మెరిసే తారలతో, గోదావరిపై మెరిసే వెన్నెల జిలుగులు పోటీ పడుతున్నాయి. చలిగాలులు నదికి తెరచాపలా పరుచుకుని, గిలిగింతలు పెడుతున్నాయి. ఇసుక తిన్నెలు వెన్నెల్లో, వెండి తివాసీలు పరిచినట్లు మెరుస్తున్నాయి.
మనోహరంగా, మౌనంగా ఉన్న ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ఒక చిన్న పూల పడవలో ప్రయాణిస్తున్నారు శరత్, చంద్రిక. ఆ పడవ చుట్టూ మల్లెలు, జాజుల మాలలు, సంపెంగలు అలంకరించి ఉన్నాయి. చంద్రిక అసలే చాలా అందగాత్తేమో, కొత్తపెళ్లికూతురన్న సూచనగా ఆమె బుగ్గన ఉన్న చుక్క, చేతి గాజుల గలగలలు, కట్టుకున్న తెల్లటి చీర, జడలోని జాజులు, మరింత అందంగా అమరి, ముత్యానికి ముస్తాబు చేసినట్లు ఉన్నాయి. ఆమె నేలకు దిగిన జాబిల్లిలా ఉంది.
“శరత్... నీ పేరూ వెన్నెలే ! నా పేరూ వెన్నెలే, ఇప్పుడు ఈ వెన్నెల్లో తడిసి ముద్దౌతుంటే, ఈ పూల పరిమళాలు పులకింతలు రేపుతుంటే, నాకు ఈ ప్రకృతిలో నిలువెల్లా కరిగిపోతున్నట్టు ఉంది. యెంత చిత్రమైనదో కదా జీవితం ! ఎవరు, ఎప్పుడు ఎక్కడ కలుస్తారో, ఏ మనసులు ఎలా ముడిపడతాయో, ఎంతటి విచిత్రం ! ఇదిగో, ఈ గోదారమ్మ లాగే, ఎక్కడో పుట్టిన నేను, ఉరకలూ పరుగులతో దూకుడుగా ఎక్కడెక్కడో సాగి, చివరికి ఈ పాపికొండల నడుమ ఈ నది ఒదిగినట్లు నీ ప్రేమలో మునిగాను. మందగమననై లలితంగా సాగుతూ, వెన్నెల సముద్రం వంటి నీలో ఏకమవ్వాలని తపించే ఈ క్షణం ఎంత మధురంగా ఉంది...”
ఆమెనే మైమరచి చూస్తూ, ఆమె మాటలు వింటున్న శరత్, ఆమె పడవ చివరికి వెళ్ళడంతో, కంగారుగా...
“ ఇదిగో పిల్లా ,ఆగాగు, అటు వెళ్ళకు, పడవ కుదుపుకి బోల్తా పడుతుంది. అసలే ఇక్కడ గోదారి లోతెక్కువ. నేనేం పడవ నడిపేవాడిని కాదు, జాలరినీ, గజ ఈతగాడ్ని కాదు. ఏదో నీ బలవంతం మీద, ఈ తెడ్లు ఆడిస్తున్నానని మర్చిపోకు,” అన్నాడు.
“ తెల్సులేవోయ్ సుబ్బారావు, అలా కోప్పడుతుంటే నువ్వు నాకు భలే ముద్దొస్తావనుకో. ఇప్పుడే నాకో ఐడియా వచ్చింది, నువ్వు కూడా తెడ్లు వదిలేసి వస్తే, ఈ వెన్నెల్లో పడవ అంచున మనిద్దరం టైటానిక్ జంటలా నిల్చుంటే యెంత బాగుంటుందో కదా ! రా ఇలాగ !”
“అమ్మా తల్లీ ! మానవమాత్రులకు కలిగే కోరికలు ఏవీ నీకు కలగవా ? మా బామ్మ ఇంత చక్కటి పేరు పెడితే, సుబ్బారావు, అప్పారావు అని పిలుస్తావే ? వెన్నెల్లో హనీమూన్ అన్నావ్. ఎలాగో కష్టపడి, ఈ పడవ నడపడం నేర్చుకున్నా ! ఇద్దరికీ బాగా ఈతోచ్చు కదా, కాబట్టి నీకోసం సాహసం చెయ్యొచ్చని, ఇదిగో కూడా ఈ లైఫ్ జాకెట్స్ తెచ్చాను. మున్ముందు ఇంకేం చెయ్యమంటావో ! అమ్మా, కరణం మల్లేశ్వరీ ! దిల్సుక్ నగర్ బాబా గుడి వద్ద  నిన్ను మొదటిసారి ఎప్పుడైతే చూసానో, అప్పటి నుంచి నా గ్రహాలే కలవరపడి ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నాయి...” అన్నాడు, తన అక్కసంతా ఒక్కసారే వెళ్లగక్కుతూ, బుంగమూతి పెట్టి.
వెంటనే పడవ కొస నుంచి ముందుకు వచ్చి కూర్చుని, “ఏంటి ? కరణం మల్లేశ్వరా ?నువ్వు నన్ను మొదటిసారి కాలేజి బస్సు లో చూడలేదా ? బాబా గుడి దగ్గర చూసావా ? మన పెళ్లి పుస్తకంలో ఈ అధ్యాయం తెలియకుండా ఉండకూడదు. కాసేపు నేను తెడ్డు వేస్తా కాని, నువ్వు గింగిరాలు తిరుగుతూ, నీ నుదుటిపై ఉన్న శోభన్ బాబు రింగ్ తిప్పుకుంటూ, గత జ్ఞాపకాల్లోకి వెళ్ళు చెప్తా !” అంది హుషారుగా .
చంద్రిక సంగతి బాగా తెల్సు కనుక, కొత్త పెళ్ళాం ముచ్చట కాదనలేక, వెనక్కి వెళ్ళే అలల్ని చూస్తూ ఇలా చెప్పసాగాడు శరత్.
దిల్సుక్ నగర్ బాబా గుడి... సమర్ధ సద్గురు సాయినాధుడు సమస్త జగతికి మకుటం లేని మహారాజులా సింహాసనం అధిష్టించి ఉన్నారు  ప్రేమస్వరూపుడైన ఆయనను పూజించి, బాబా కృపను పొందాలని, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, ఎంతోమంది వేచిఉన్నారు.
గుళ్ళోంచి శ్రావ్యమైన భక్తి గీతం వినిపిస్తోంది...
ద్వారకామాయి వాసా సాయి
నీదరి చేరితి దయగనవోయి
సాయి రూపమే పరమశివం
సాయి నామమే పరమపదం
నిన్ను కన్నంతనే కలుగును హాయే
నిను నమ్మి కొలిచితె కలతలు పోయే
నీ కృప కలిగితే తొలగును మాయే
నీ చరణమ్ములే వరములు వేయే // ద్వారకామాయి //
మది నీ మందిరం సాయి దేవా
శ్రద్ధ సబూరి నిరతమునీవా
ప్రేమతో పిలిచితి కావగ రావా
భక్తుల పెన్నిధి నీవే కావా ? / / ద్వారకామాయి //
గాయకుడి చక్కటి గొంతులోని మార్దవం భక్తుల మనసులు కరిగిస్తోంది...
ఆ పాడింది ఎవరో కాదు, నేనే !
అంటూ, ఆశ్చర్యంగా నోరు తెరుచుకు చూస్తున్న చంద్రిక ముందు చిటికేసి,  “ చూడమ్మా, నీకు తెలీదు కదూ, నేను పాడతాను. నువ్వలా లంకిణి లాగా నోరు తెరుచుకు కూర్చున్నావే అనుకో, పాపం ఈ చల్లగాలికి ఎగిరే రెక్కల పురుగులు, చిట్టి హనుమంతుల్లా నీ నోట్లోకి దూరి, అన్యాయంగా చస్తాయ్... ఇదేముంది, ఇంకా విను, ఇప్పుడుంది అసలు కధ ! “ అంటూ ఇలా కొనసాగించాడు శరత్.
ఎందుకో చిన్నప్పటి నుంచి నా మనసు బాబా మీద లయమైపోయింది. ఆయనే నాకు సర్వస్వం. రోజూ గుడికి వెళ్లి కూర్చునేవాడిని. అమ్మ నేర్పిన సంగీతం, నాకున్న రచనాపటిమ కలిపి, బాబాపై పాటలు రాసి, పాడుతూ ఉండేవాడిని. ఆ రోజు నా మనసులో మరింత ఆనందం. ఎందుకంటే... ఆ రోజు కాంపస్ సెలక్షన్ లో నాకు MCA లో సీట్ వచ్చింది.
ఎంతో ఆనందంగా గుడి బయటకు వచ్చిన నాకు, బయట ఏదో కొట్లాట కనిపించింది.
ఒకమ్మాయి, ఒకతని కాలర్ పట్టుకు పైకి లేపుతోంది. వాళ్ళ ప్రక్కన ఒక బైక్ పడుంది. ‘ ఏరా ! యెంత ధైర్యం ఉంటే, నా మెళ్ళో చైన్ లాగే ప్రయత్నం చేస్తావ్ ? ఎవరనుకున్నావ్ ? కరాటే లో బ్లాక్ బెల్ట్. మార్షల్ ఆర్ట్స్ లో మాష్టరమ్మని. ఎక్కడ ఎలా కొడితే, ఏం జరిగి, ప్రాణాలు వాయిదా పద్ధతిలో పైకి పోతాయో ప్రత్యేకంగా నేర్చుకున్నా ! పీక దగ్గర ఒక్క దెబ్బ కొట్టానంటే చచ్చూరుకుంటావ్ ! ఆడాళ్ళ మెళ్ళో గొలుసులు, మంగళసూత్రాలు లాగి నీ సరదాలు తీర్చుకోడానికి సిగ్గు లేదూ ! నాలుగు తన్నానంటే, కాళ్ళూ చేతులూ విరిగి, ఆ అడుక్కు తినే వాళ్ళ లైన్ లో కూర్చోవాలి ‘, అంటూ ఎవడినో వాయించేస్తోంది.
నాకు చిన్నప్పటి నుంచి కొట్లాటలు, గొడవలంటే చాలా భయం. ఊహతెలిసాకా ఎవరినీ కొట్టలేదు, తన్నులు తినలేదు. అందుకే భయమేసి, ఒకాయన వెనకాల దాక్కుని చూస్తున్నా !
ఆ అమ్మాయి చిలకాకుపచ్చ పరికిణీ, రాణి రంగు ఓణి వేసుకుంది. పొడవాటి జళ్ళో సింహాచలం సంపంగి మాల, మెళ్ళో ముత్యాల హారం. అందానికి చిరునామాలా ఉంది. వెంటనే నాకొచ్చిన సందేహం ఆపుకోలేక, ముందున్న ఆయనతో...
‘ ఏవండి ? అచ్చ తెలుగు పిల్లలా ఉన్న ఆ అమ్మాయి ఆహార్యానికి, తీరుకి అసలు సంబంధం ఉందా ? కలర్ డ్రెస్ లో ఉన్న కరణం మల్లేశ్వరీ లాగా అతన్ని ఒంటి చేత్తో ఎత్తి, ఎలా భయపెడుతోందో చూడండి...’ అన్నాను.
వెంటనే ఆయన కోపంగా... ‘కొట్టక, నీలా ఇతరుల చాటున దాక్కుంటుందా ? అయినా చూస్తూ ఊరుకోడానికి దాన్ని నేను ఆడపిల్లలా పెంచలేదు, మగరాయడిలా పెంచాను. అవును, తను , నా కూతురు. పోన్లే పాపం అని వదిలేస్తున్నాను. ఇంకో క్షణం ఇక్కడ కనిపిస్తే, నీపని కూడా పట్టమని ఇటు పిలుస్తాను, జాగ్రత్త ! ‘ అన్నారు.
అంతే ! నేను పరుగు పందెంలో పాల్గొనే మగ పి.టి. ఉష లాగా ఆదరాబాదరాగా అక్కడినుంచి మాయం... ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే... అంటూ అర్ధోక్తిలో ఆగి, అల్లరిగా చంద్రిక వంక చూసాడు శరత్.
“ తెల్సులే ! నేనేగా ! ఆ రోజు మేము హైదరాబాద్ లో ఉన్న మా అత్తయ్య ఇంటికి వచ్చాము. మా నాన్న గుడి నుంచి అత్త ఇంటికెళ్ళాకా, ఎవరో తన వెనుక దాక్కున్నారని చెప్తే, ఒకటే నవ్వు తెల్సా ! అంత  పిరికివాడేనా ఇలా నట్టేట్లో నావ నడుపుతున్నదీ, అని అనుమానం !” ఆటపట్టిస్తూ అంది చంద్రిక.
“అవును భామినీ ! ప్రేమ గుడ్డిది కదా ! అందుకే, నిన్ను చూడగానే కళ్ళు మూసేసుకున్నా ! నీ ప్రతాపం చూడలేక ! ఇదేం చూసావు, నిన్ను రెండోసారి కాలేజీ బస్సు లో చూసినప్పుడు చెప్పాలి, నా అవస్థ !”
“ఓహో, చెప్పు చెప్పు... మన ప్రేమ కధ నీ నోట వింటుంటే, బహు ముచ్చటగా ఉంది ప్రేమికా ! మన కధను ఎవరైనా కాపీ కొట్టి... వెన్నెల్లో లవ్ స్టొరీ’ అని సినిమా తీసేస్తారేమో అని కూడా అనుమానంగా ఉంది...” అంటూ..
 దూరంగా ఇసుకతిన్నెల్లో మసగ్గా కనిపిస్తున్న కోయ గూడాల్లోని, వెలుగు వంక చూస్తున్న శరత్ ను గమనించి, అతన్ని దృష్టి మళ్ళించకూడదని, చెంపకు చెయ్యి ఆనించుకుని, ఆసక్తిగా శరత్ కేసి చూడసాగింది చంద్రిక.
(తరువాతి భాగం క్రింది లింక్ లో చదవండి..)
http://acchamgatelugu.com/%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%B2-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-2

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top