స్వయంవరం ..! - అచ్చంగా తెలుగు

స్వయంవరం ..!

Share This

స్వయంవరం ..!

సూర్య పి కుకునూర్


ఆదివారం కదా అని రోజూలా లేవకుండా మంచాన్నే అతుక్కుని పడుకున్నాను. మొబైల్ రింగ్ అవుతుంది . రెండు సార్లు ఆగకుండా రింగ్ అవటంతో ఎవరా అని తిట్టుకుంటూ దిండు పక్కనే ఉన్న మొబైల్ తీసి, హలో అన్నాను ..
“ఏరా ఇంకా లేవలేదా ?” అన్న నాన్న గొంతు విని , “మీరే లేపేసారు ..”, అన్నాను.
“అబ్బాయి ఫోటో చూసావా ? ఎలా ఉన్నాడు?”, అని ప్రశ్నలు మొదలుపెట్టారు.
“ప్చ్ .. అబ్బా ..”అని ఇష్టం లేనట్లు అనటంతో .. “ఒక్కసారి కలిస్తేనే కదా గందరగోళం పోతుంది  ..”, అన్నారు నాన్న..!
“ఊ ..” అన్నాను.
“ఏం చెప్పమంటావ్ వాళ్లకి ?” మళ్లీ అడిగారు.
“అబ్బా ... సరే. 4 గంటలకి కె.ఎఫ్.సి లో కలవమని చెప్పు. అయితే ఒకటి, నాకు నచ్చకపోతే మాత్రం ఒప్పించాలని ప్రయత్నించకూడదు “, అన్నాను కొంచెం విసుగ్గానే .
“హ్హ హ్హ అలాగే ..” అంటూ నాన్న అలవాటైనట్లుగా నవ్వి  “బై తల్లీ .. “, అంటూ కాల్ కట్ చేసారు.
నేను లేచి కూర్చుని , “ఒక్కసారి వెళ్లి కలిసి నచ్చలేదని చెప్పేస్తే సరి.. రోజూ ఇదొక గోల అయిపొయింది.. “, అనుకుంటూ ఉండగా వాట్సాప్ మెసెంజర్ కి తెలియని ఒక నెంబర్ నుండి సందేశం వచ్చింది.
ఎవరా ? ఏంటా ? అని చూస్తే, “కె ఎఫ్ సి లో కాదు కాఫీ డే లో నాలుగు గంటలకు కలుద్దాం”,  అని ఉంది.
కనీసం హాయ్! హలో! అని కనీసం విష్ చేయకుండా కాఫీ డే లో కలుద్దాం అంటున్నాడు.  పైగా నేను చెప్పిన చోటు కాదు అతను చెప్పిన చోటికి అంటున్నాడంటే పురుషాధిక్యత చూపిస్తున్నాడా ?
అయినా  నాలుగు మాటలు, కప్పు కాఫీతో ఒక మనిషి గురించి అర్ధమయిపోతుందా,  అనుకుంటూ ఆలోచనలతో టైం గడిచిపోయింది.
నాలుగు అవుతుండగా కాఫీ డే కి వెళ్లాను...
నాన్న పంపిన ఫోటో లోని బాబు ఇంకా రాలేదు. వాట్స్ ఆప్ కి సందేశం వచ్చిన నంబర్ కి ఫోన్ చేసాను.
మొబైల్ రింగ్ అవుతూ వినిపిస్తున్న “నిన్నొదల బొమ్మాలి.. వదల” కాలర్ ట్యూన్ విని, నవ్వుకుంటూ  ఫోన్ తీస్తాడేమో అని ఆ బొమ్మాలి గాడి గోల వింటూనే ఉన్నాను.
అబ్బే, బాబు నుండి ఎలాంటి స్పందన లేదు . వస్తూ ఉండి ఉంటాడులే అనుకుని కాపచినో తెమ్మని చెప్పి కూర్చున్నాను.
అరగంట అయిపొయింది. నాలుగు కప్పుల కాఫీ తాగాక కూడా బాబు ఇంకా రాలేదు.
ఫోన్ చేద్దామా అనుకుని, బొమ్మాలి గాడు గుర్తొచ్చి వద్దనుకుని, కాసేపు చూద్దాంలే అనుకుంటూ ఇంకో కాఫీ తెమ్మని చెప్పాను.
ఇంకో పావుగంట అయింది. అరె దేనికైనా హద్దు ఉంటుంది. కనీసం ‘ఆలస్యం అవుతుంది’ అని చెప్పాలని కూడా లేదు. ఈ అబ్బాయిలకి అసలు సమయం అంటే విలువే  ఉండదా? అయినా అసలు నాకే బుద్ది లేదు .స్కూల్ లో ప్రార్ధన మిస్ అవ్వని విద్యార్ధిలా ముందే వచ్చి కూర్చున్నాను, అనుకుంటూ నన్ను నేనే తిట్టుకున్నాను.
ఇంకో పది నిమిషాలు గడిచాయి. ఇంక ఇది అవ్వదులే అని అనుకుంటూ లేస్తుండగా, “మేడం మీ కాఫీ” అంటూ బాయ్ నా ముందు కాఫీ తీసుకొచ్చిపెట్టాడు. కప్పులో నురగ పై “హాయ్!” అని చాక్లెట్ తో రాసి ఉండటం చూసి, ఇది అతని పనే అయ్యి ఉంటుందని చుట్టూ చూసాను. అక్కడ ఒక మూల ఉన్న టేబిల్ దగ్గర  కుర్చుని ఉన్న ఒకతని వైపు చూడగానే,
“హాయ్ .. రండి “, అని పిలిచాడు.
“అసలు ఎప్పుడు వచ్చాడు? వచ్చిన వాడు దగ్గరకి రాకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు?” అని అనుకుంటూ అతని దగ్గరకి వెళ్లాను.
“హాయ్ సమీరా ..” అంటూ తీసుకొచ్చిన పూలను ఇచ్చాడు .
“థాంక్ యు “అంటూ ఏం పిలవాలా అనుకుంటుండగా , “నన్ను సాండి “అని పిలవచ్చు అన్నాడు.
“అబ్బో! “అని మనసులో అనుకుని .. “ఏంటి లేట్ అయింది ?” అడిగాను.
“నిజం చెప్పమంటారా? అబద్దం చెప్పమంటారా?” అన్నాడు.
“అదేంటి ?”
“కొన్ని కొన్ని సార్లు అబద్ధం చాలా అందంగా ఉంటుంది. నిజం నచ్చనట్లుగా అనిపిస్తుంది” ,అన్నాడు.
“నాకు అబద్ధం చెప్తే నచ్చదు”, అన్నాను.
“లంచ్ చేసి పడుకున్నాను. మీ మొదటి రింగ్ కి లేచాను. తయారయ్యి వచ్చేప్పటికి టైం పట్టింది”, కూల్ గా చెప్పాడు.
“వీడు తాపిగా నిద్ర లేచి వస్తే, నేను పిచ్చి దానిలా ఏదయినా పనిలో ఉన్నాడో? ట్రాఫిక్ లో ఉన్నాడో?” అని వీడి గురించి సానుకూలంగా అనుకున్నానా , అని కోపం వచ్చేసింది .
అనుష్కలా “నువ్వు నాకు నచ్చలేదు రా”, అని అరిచి అక్కడి నుండి లేచివెళ్ళిపోదామా, అని అనుకుని లేస్తుండగా .. బాబు కి కాల్ వచ్చింది.
కాల్ ఆన్సర్ చేసి, ‘అమ్మా! అమ్మాయి నాకు నచ్చింది. ఆ...ఆ.. మాట్లాడుతున్నాను .. సరే నేను తరువాత చేస్తాను బై ..’ అని ఫోన్ పెట్టేసాడు.
“అదేంటి ?నాతో ఏం మాట్లాడకుండా అసలేం ఆలోచించకుండా అలా ఎలా డెసిషన్ తీసేసుకుంటారు? “ అడిగాను.
“ఏం ఆలోచించాలి?చూడడానికి ఫోటోలో కంటే అందంగా, లక్షణంగా ఉన్నారు, మంచి ఫ్యామిలీ, మంచి ఉద్యోగం ,ఇంతకంటే ఇంకేం కావాలి?” అన్నాడు.
“అందం, ఆస్తులు ఉంటే చాలా అభిప్రాయాలు అవసరం లేదా?” అని అడిగి, నాతో  మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా ?” అన్నాను.
“ఐ సినిమా చూసారా ? దాని మీద మీ ఫీలింగ్ ఏంటి ?” అని సంబంధం లేకుండా అనటంతో...
“ఏమన్నారు?” అని అడిగాను.
“సారీ .. జస్ట్ కిడ్డింగ్”, అని నవ్వాడు.
“అది చూసి కొంచెం కోపంగానే, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను?” అన్నాను.
“ఏంటండి .. ఏమైనా పరీక్ష  పెడుతున్నారా?” అడిగాడు.
“అలాంటిదే అనుకోండి ?”
“సరే అడగండి .. “అంటూ బాయ్ తెచ్చిన కాఫీ లో షుగర్ వేసి కలుపుతూ అన్నాడు.
“పెళ్లి పై మీ అభిప్రాయం ఏంటి?” అడిగాను.
“ఇట్స్ ఏ గేమ్ ..” అన్నాడు.
“ఏంటి?”
“యా ఇట్స్ ఎ గేమ్.”
“ఏంటి వీడు పెళ్ళంటే ఆట అంటున్నాడు ,” అనుకుని “పెళ్ళయాక భార్యా భర్తల మధ్య ప్రేమ ఉండాలి కదా” , అడిగాను.
“అలా ఏం లేదే?” అన్నాడు.
“అంటే ఏం చేసినా పడుంటుంది అనుకుంటున్నాడా?” అనుకుని కోపాన్ని ఆపుకుంటూ, “పెళ్ళయాక మా ఇంటి పేరు వుంచుకోవచ్చా? మార్చుకోవచ్చా?” చివరిగా అడిగాను.
“మార్చుకోవాలి కదా”, ఏం పట్టనట్లుగా అన్నాడు.
“ఎంత పొగరు వీడికి , అయినా బలుపు ఉన్నోడు కదా. ఇలానే ఉంటాడు వీడితో ఉంటే  నేనంటూ నాకంటూ  ఏమి ఉండదు”, అని అనుకుని...
“మీరు ఎపుడు ఇలానే మాట్లాడతారా?” అడిగాను.
“లేదు .. మీతోనే ఇలా..  “
“నాకు మీరు నచ్చలేదు. పరీక్షలో మీరు ఫెయిల్ అయ్యారు. లైఫ్ అంటే స్పష్టత ఉండాలి. పెళ్ళంటే ఒక బాధ్యత. మీకు ఇవేం లేవు , అన్ని విషయాలను జోక్ గా తీసుకుంటున్న మీ లాంటి వాళ్ళకు ఒకరిని ఇబ్బంది పెడుతున్నానన్న ఆలోచనే  ఉండదు. ఐ యాం సారి .. “అని నేను లేచి వెళ్తుంటే ..
“బట్ ఐ లవ్ యు .. “,అన్నాడు.
“వాట్ .. “, అంటూ ఆగాను.
“ముందే చెప్పాను కదా నిజాలు నచ్చవని ..” అన్నాడు.
“ఏంటా నిజాలు .. “అలాగే నిలబడి అడిగాను.
“పెళ్ళంటే ఆట అంటే, అదేదో క్రికెట్టో ఫుట్ బాలో అని కాదు. జీవితాంతం ఇద్దరూ కలిసి  ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ గెలిచే ఆట. పెళ్ళయాక ఉండాల్సింది ప్రేమే కదా, అంటే అవును అని ఎందుకు చెప్పలేం అంటే జీవితానికి అదొక్కటే సరిపోదు, ఇంకా చాలా కావాలి .. నీది, నాది అన్న గీతలు చెరిగిపోవాలి, అహాలు ఒదిలి ఒకరికొకరు అండగా నిలవాలి, నమ్మకం ఉండాలి, కష్టసుఖాల్లో తోడూనీడగా ఉండాలి...
ఇంటి పేరు మార్చుకోవాలి అంటే, అదేదో నిన్ను తక్కువ చేయాలనో నీ గుర్తింపు మార్చేయాలనో కాదు, మా ఇంట్లోకి వచ్చే నీకు నువ్వు మా దానివని నీకు  మేము గౌరవం ఇస్తూ, మా ఇంటి బాధ్యత నీది అని నీకు   అప్పగిస్తాం. ఇంటిని ఒకటిగా ఉంచాలన్నా, విడగొట్టాలన్నా అది నీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే అప్పటినుండి నువ్వు మా కుటుంబానికి హృదయం వంటిదానవు.
స్పష్టత ఉండటం అంటే గంభీరంగా కూర్చుని రకరకాల సమాధానాలు చెప్పటం కాదు .. సరదాగా ఉంటూ నవ్వుతూ ఉంటే లెక్కలేనితనం అని కాదు ..
నువ్వు కాల్ చేసినపుడు నేను లేచాను అంటే నిన్ను పట్టించుకోలేదని  కాదు.. “ అంటూ ఆపకుండా చెప్పాలనుకుంటున్నది చెప్పేసి ..
“ఎనీ వే నైస్ మీటింగ్ యు .. “అని చెప్పి బాబు వెళ్తుంటే ..
నా నంబర్ కి  నాన్న కాల్ చేసారు.
“నాన్నా .. “
“ఏరా అబ్బాయిని కలిసావా ?“
“ఆ .. “
“పాపం రా నువ్వు కలుస్తావని చెప్పగానే బెంగుళూరులో ఉన్నా అని చెప్పాడు. సరే తరువాత వారం పెట్టుకుందాం అంటే లేదంకుల్ తనకంటే ఏదీ ముఖ్యం కాదు, నేను ఈరోజే కలుస్తా ..” అన్నాడు.
“అబ్బాయికి సరే అని ఇప్పుడే మెసేజ్ చేసాడు. మరి నువ్వేం అంటావ్ ...” అడిగారు నాన్న.
బాబు తాగకుండా వదిలేసిన కాఫీ కప్ లో కనిపించినది చూసి,
“నాన్నా ! నేను తరువాత చేస్తాను”, అని కాల్ కట్ చేసి , కాఫి డే నుండి బయటకి వెళ్లి
“సాండి!” అని పిలిచాను ...
బాబు , మహేష్ బాబులా టర్నింగ్ ఇచ్చి ...
“కారణాలు చెప్పి నిన్నుఇంప్రెస్ చేసి నా పై ఇంప్రెషన్ తెచ్చుకోవాలని అనుకోలేదు, కాబట్టే అబద్దం చెప్పకుండా నిజం చెప్పాను. నిన్ను నా గుండెకోటకు రాణిగా చూడాలనుకుంటున్నాను, అని భావుకతగా చెప్పను. కాని ఎప్పటికీ నా దానిగా కావాలనుకుంటున్నాను,” అన్నాడు.
“బొమ్మాలి కాలర్ ట్యూన్ ఏంటి?” అని అడిగితే , అనుష్క అంటే ఇష్టం అన్నాడు. మరి నేనో ? అని రెట్టిస్తే ఇప్పుడు నువ్వే నా అనుష్కవి అన్నాడు ..
“మరి స్వయంవరం లో గెలిచి వరమాల వేయించుకోకుండా వెళ్తున్నారేంటి ?” అని అడిగాను.
అంతే నండి , తరువాత వచ్చిన వైశాఖం లో మా పెళ్ళి అయిపొయింది.
చెప్పలేదు కదూ ... ఆ రోజు కాఫీ కప్ లో నేను చూసింది ... చాకోలేట్ టాపింగ్ తో  హృదయంలా ఉన్నతన పేరు మధ్య నా పేరుని ...!
పరిగెత్తుకెళ్ళి తనకి ఐ లవ్ యు అనే చెప్పాలనుకున్నాను కాని, చెప్పలేదు... ఇప్పటికీ చెప్పలేదు ...
తను నాకు చెప్పినప్పుడల్లా అడుగుతాడు నువ్వు ఎందుకు చెప్పవు అని ... నేను నీలోనే ఉన్నాను కదా అంటాను ...!
ఇదండీ మా స్వయంవరం కథ .. ఇప్పటికీ మేం ప్రేమించుకుంటూనే ఉన్నాం..!

No comments:

Post a Comment

Pages