శ్రీమతి రాధామోహన్ (సికింద్రాబాద్) - అచ్చంగా తెలుగు

శ్రీమతి రాధామోహన్ (సికింద్రాబాద్)

Share This
శ్రీమతి రాధామోహన్ (సికింద్రాబాద్)
-బ్నిం

పరిచయమైన కొద్దికాలంలోనే నువ్వు అనాలనిపించే ఆత్మీయత సంపాదించుకున్న రాధామోహన్ అష్టదళశక్తిపీఠాలు నృత్యరూపకం రాయమంది – తనకి చాలామంది శిష్యులున్నారనీ ... వాళ్ళందర్నీ ఎకామిడేట్ చెయ్యాలంటే ఇలాంటి బాలే చేయాలని అంది. నీ గురువులెవరూ .. నీ టేలంటేంటి .. నీ అనుభవం ఏపాటిది నాకు తెలియాలిగా .. అని
మనస్సులో అనుకున్న మాట నిజం!

మనసులో నామాట ఉండగానే .. ఆమె గురుపరంపరనీ అనుభవ విషయాలతో వివరించిదన్నమాట .. ఆ చురుకుదనమే సహజంగా నన్ను ఆకర్షించింది – ఆమె అష్టాదళశక్తిపీఠాల మేటరూ .. గట్రా సంపాదించుకునే వచ్చింది – ఏం రాస్తాం మొదటి అర్ధభాగంలో దాక్షాధ్వర విధ్వంసం అయిపోతుంది – ఆ తర్వాత ... గంటలో 18 సతీ ఖండాలు - ఖండవైశిష్ట్యం చెప్పేయడమే – ఉజ్యయిన్యా మహాకాళీ అంటూ ... లిస్టులోనే ఎడ్రస్ ఇచ్చేసాడు కవి ... మరి మనమేం చేదుము అనుకున్నా .. డ్యాన్స్ ఏమి చేస్తారు? ఆయా శక్తి స్వరూపాలకి శ్లోకాలేమున్నాయో అనుకునేంతలో ...

ఆమె సంగీత నిర్వహణకి అభ్యర్థించి జయించిన ప్రఖ్యాత గాయని, (నా నృత్య రూపకాలేన్నింటికో కూడా) స్వరకర్త ... శ్రీమతి వెంపటి శ్రీవల్లీ శర్మ ఆ బాధ్యతని సునాయాసంగా నిర్వర్తించి నృత్యరూపకానికి నిండుదనం తెచ్చారు - లక్కీగా ఆ శ్లోకాలు ఎప్పుడో తాను సేకరించి .. స్వరపరచి గానం చేసారట కూడా - సరే నేను కాస్త కాస్తా రాసి – రంపానా పెట్టి రాసిచ్చాను. రికార్డింగ్
వెళ్ళాను – మంచి హోస్టు కూడా అనిపించింది. ప్రదర్శన అంటారా – ఖర్చుకి వెనుకాడలేని భారీ ప్రాజెక్టు 10 ఫీట్లు భారతదేశం మేప్ చేయించి ... కింద సింహళం కూడా వుంటుందండోయ్ ...

ఏ ప్రాంతంలో ఆ దేవి ఉందో అక్కడ లైట్లు వెలిగే ఏర్పాటుతో మంచి కోరియోగ్రఫీతో బోల్డుమంది ఆర్టిస్టులతో ...(30 మంది) ఆడియన్స్ ని పులకాంకిత ముగ్దుల్ని చేసింది. ఈవిడ రవీంద్రభారతి ప్రదర్శనలో పొందిన సభా అభినందనకి సాక్షాత్తు అర్హురాలని ప్రతీ ప్రేక్షకుడూ భావించాడు – తక్కువదా మరి ఈ అమ్మాయి .. ఆమె ప్రొఫైల్ చూస్తే అదీ అనుభవం
అనిపించింది – బ్రీఫ్ గా చెప్పేముందు ఆ కార్యక్రమం అనేకాదు – ఆమె ఏ కార్యక్రమం తలపెట్టినా ఈ రాధకి వెనుకనుండి నడిపిస్తున్న పతిదేవుడు (రాధా)మోహనుడు – ఈ విషయం మాత్రం స్ట్రాంగ్ గా చెప్పాలని వుంది— 14 వ ఏటనుండి శ్రీమతి సుధారాణిగారి వద్ద గుంటూర్లో భరతనాట్య విద్యార్థిగా గజ్జెకట్టిన రాధ – మోహన బంధం పడిన తదుపరి.. శ్రీమతి జ్యోతిగారి వద్ద కూచిపూడి అభ్యసించింది! అప్పుడే.. ఆమె కళాజీవితానికి మెరుగులు పెట్టిన .. నేటికీ మెరుపులూ, మెలుకువలూ అందిస్తున్న శ్రీమతి మంజులాశ్రీనివాస్ గారి పరిచయభాగ్యం ఏర్పడింది – జంటనగరాల్లో అన్ని కళావేదికల్లో ఈ నాట్య విజ్ఞురాలు ఎన్నెన్నో ప్రదర్శనలనందిస్తూ – ఎందఱో ఉద్దండ కళాకారుల తెలుగు యూనివర్సిటీలో భరతనాట్యంలో డిప్లొమా కోర్సు చేసింది. రవీంద్రభారతి, సుందర కళా నిలయం, శిల్పారామం వంటి విశిష్టమైన వేదికలపై ఎన్నో ప్రదర్శనలు
ఇచ్చింది. 16 వ ఏట గుంటూరు రోటరీ క్లబ్ వారు నిర్వహించిన భరతనాట్య పోటీల్లో ప్రధమ స్థానంలో నిలిచింది. 2012 లో ఆమె తన శిష్యులతో కలిసి నర్తించిన 'భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య శైలిలో దాస వాగ్గేయకార కృతులు అన్న 100 నిముషాల నృత్య ప్రదర్శనకు గానూ, ఆమెకు ' ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం లభించింది. 17 సంవత్సరాల చిరు ప్రాయంలోనే , ఆమె కోరియోగ్రఫీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు శిష్యుల శిక్షణ మొదలుపెట్టింది. 2012 లో 'రాధా నృత్య నిలయం' స్థాపించి అనేకమందికి కూచిపూడి మరియు భరతనాట్యం లో శిక్షణ ఇవ్వసాగింది. ఆమె శిష్యులు అనేక పోటీల్లో పాల్గొని, ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. రవీంద్రభారతి లో ఆమె ప్రదర్శించిన 'శక్తి పీఠ ప్రదక్షిణం'
 
అనే బాలే అనేకమందిని విశేషంగా ఆకట్టుకుని, ప్రశంసలు పొందింది.
మొదట కొన్ని స్కూల్ లలో నృత్య అధ్యాపికగా పనిచేసిన రాధ, ప్రస్తుతం కొంపల్లి లోని, DRS ఇంటర్నేషనల్ స్కూల్ లో నాట్యం బోధిస్తున్నారు. కళను వైవిధ్యంతో మేళవిస్తూ, కొత్తకొత్త నృత్య రూపకాలతో, నిరంతర కృషితో విజయ శిఖరాలు అధిరోహిస్తున్న రాధామోహన్ 'శింజారవం' దిగంతాలకు వ్యాపించి, ఎందరికో స్పూర్తిగా నిలవాలని ఆశిస్తున్నాను.

***


No comments:

Post a Comment

Pages