శివం – 11 - అచ్చంగా తెలుగు

శివం – 11

Share This

శివం – 11

రాజ కార్తీక్

9290523901

(నంది కధను చెబుతూ ఉంటాడు శివుడు )

స్పృహలేని నందిని నేను ఎత్తుకొని మోసుకుంటూపోతున్నా. ఆ దృశ్యం గాంచిన విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు నా ముందు ప్రత్యక్షమయ్యి “మహాదేవా, భక్తులకు మీరు అంటే ఎంత ఇష్టమో, మీకు అంతకన్నా ఇష్టము వారంటే ! ఈ సంఘటన చూసి మేమెంతో పులకించిపోయాము. భవిష్యత్తులో నంది మీ వాహనం, మీ భక్తుడు అవ్వబోతున్నాడు. అలాంటి మీ వాహనాన్ని మీరే మోయటం ఏంతో కనులపండుగగా ఉంది. మేము కూడా మీ భక్తులమే” అని అన్నారు.
నేను “శ్రీహరీ, బ్రహ్మదేవా, నంది యొక్క భక్తి అజరామరమైనది. ఆ భక్తికి ఏ భగవంతుడు అయినా దాసుడు అవ్వవలసిందే! చాలా మంది భక్తులు ‘శివుని వరం పొందాలి’ అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే శివుడిని  పొందాలి అనుకుంటారు. అటువంటి వారిలో నంది అగ్రగణ్యుడు. అందరూ అనుకున్న విధంగా అతడు ఒక బలమైన కోరిక కోరుకుంటాడు. అది తప్పకుండా నెరవేరుస్తాను. ఇక మిగిలింది నందిని పూర్తిగా పరిశుద్దుడిని చేసే తపస్సు మాత్రమే”, అన్నాను.
బ్రహ్మ,విష్ణువులు నమస్కరించి వెళ్ళిపోయారు. నా భుజాల మీద ఉన్న నంది కొంచం స్పృహ లోకి వచ్చి కలవరిస్తున్నాడు. అతని కల నాకు తెలుసు, ఆ కల “నేను ఒక స్మశానంలో కూర్చొని ఉన్నా, నాముందు ఉన్న నంది నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యంలో “స్మశానంలో ఒక్కడివే ఎలా ఉంటావయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను. నా తోడు నీకు అవసరం లేకపోయినా, నీ తోడు నాకు కావాలి” అంటూ పారవశ్యంతో నర్తిస్తున్నాడు. నేను నవ్వుతూ ఉన్నాను. నా దగ్గరికి వచ్చి ఆనందంగా నా మీద నీరు పోసి, నా ఢమరుకం తీసుకొని దాన్ని లయబద్ధంగా వాయిస్తూ, నా ముందు నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యానికి నేను ఎంతో ప్రసన్నత చెందాను. నేను లేచి నిలబడ్డాను. నంది నా వైపు చూస్తున్నాడు. నేను కూడా నా త్రిశూలాన్ని పట్టి నంది ముందు ఆనందతాండవం చేసాను.
నంది మోకాళ్ళ మీద కూర్చొని, నా ఢంకా మ్రోగిస్తున్నాడు. నా నృత్యం చూసిన నంది ఎంతో భావోద్రేకం  చెందాడు. నాట్యం మధ్యలో “నీవు కూడా రా నంది” అని సైగ చేశా, ఆ సైగతో నా దగ్గరికి వచ్చాడు నంది, నాతో పాదాలు కలిపి, నృత్యం చేయసాగాడు. మేమిద్దరం ఎంతో ఆనందంగా నృత్యం చేస్తున్నాము”.
నంది నా భుజం మీద ఊగుతున్నాడు “యోగిదేవా, అనంతదేవ, మహాదేవా” అని కలవరిస్తున్నాడు. అతని మనసు అతని కలలో ఉన్నా, నా చుట్టూ నాట్యం చేస్తుంది. ఆ కలలో “ప్రభూ! ఈ దీన భక్తుడికోసం నీవు చిందులేశావా, నీ సృత్యం నాకు చాలా నచ్చింది స్వామీ, ఇక మీదట ఎవరు ఎక్కడ ఉత్సవం చేసినా, అక్కడ నేను కూడా ఉండి ఆనంద పారవశ్యంతో నృత్యం చేస్తాను తండ్రీ” అంటున్నాడు.
“హరహరశంభో” నృత్యం చేస్తా మహేషా అంటూ నా భుజం మీద ఊగుతున్నాడు. ఇంతలో భువననది వచ్చింది. నన్ను చూసిన ఆ నది నాకు నమస్కరించింది. నేను “భువన, యితడు నంది నాకు ప్రియమైనవాడు, ఇతనికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడు “, అన్నాను.
ఆ  నదీమాతా “అలాగే స్వామీ! తప్పకుండా.” అంది, నేను నందిని క్రిందకు దింపి ఒంటిని స్ప్రుశించాను. నందికి అన్ని చోట్ల నయం అయ్యింది. నంది కళ్ళు తెరిచాడు. “మహాత్మా, తామెవరో మహాదేవుని దూతలాగా ఉన్నారు నన్ను ఎంతో ఓర్చి ఇక్కడికి చేర్చారు. మీ వైద్యంతో నాకు నయం చేశారు. ఇక మీద తపస్సులో లీనం అవుతాను” అని నాకు కృతజ్ఞతలు చెప్పాడు. “మరి నేను వెళ్ళి వస్తా, శివానుగ్రహప్రాప్తిరస్తు” అని ఆశీర్వదించా. దానికి నంది “శివానుగ్రహం ఉంది స్వామి, శివదర్శనప్రాప్తిరస్తు” అని దీవించండి అని అన్నాడు.
దానికి నేను “నందీ, శిలాదపుత్రా ! నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఆ మహాదేవుడు నీకు ఎప్పుడో దర్శనం ఇచ్చి ఉంటాడు, మళ్ళీ తప్పక ఇస్తాడు” అని అన్నాను. నంది వచ్చి నేను చేసిన సేవకు, సహాయానికి నాకు కృతజ్ఞతలు చెప్పి, నా పాదాలను తాకి “స్వామి, ఈ పశువును బరువు అనుకోకుండా మోశావు, మీకు అవసరమైనప్పుడు మిమ్ము నేను కూడా మోస్తా స్వామీ !” అని నాకు అభయం ఇచ్చాడు. నేను మాత్రం చిరునవ్వు నవ్వి, “తప్పకుండా నాయనా, నీవు నాకు ఇచ్చిన ఈ వరాన్ని వాడుకుంటాను అని చెప్పి, “మహాదేవుని దర్శనం పొందాలంటే ఏవిధంగా తపస్సు చేయాలో చెప్పి వెళ్ళిపోయాను బాటసారి లాగా.
          ఇక నంది లక్ష్యం నా దర్శనం, అక్కడ పడి ఉన్న ఒక పాతరాతిలింగాన్ని తీసుకొని శుభ్రం చేసుకొని, నది ఒడ్డున ప్రతిష్టించుకొని, బాటసారిగా నేను చెప్పిన తపస్సు సూత్రాలు అనుసరించి తపస్సు మొదలెట్టాడు. నంది మొహం మీద సూర్యుడు పడుతున్నాడు. దానికి అడ్డంగా అక్కడ ఉన చెట్టు నందికి నీడలాగా అయ్యింది. భువన నదికి ఎక్కడి నుండో పెద్ద వరద వచ్చింది. కానీ, తపస్సులో లీనమయిన నందికి తలంపు లేదు, ఆ వరద నందిని తాకబోయి సమయానికి, భువననది ఆ వరద దారి మళ్ళించి, నందికి ఏమి కాకుండా చేసింది. కానీ, నంది ఘోరతపస్సు చేస్తున్నాడు. నేను అంతా చూస్తూనే ఉన్నాను. నా మనసు కూడా నంది మనస్సు కన్నా ఉవ్విళ్ళు ఊరుతుంది. జోరున వర్షం పడుతుంది, కానీ నందిలో చలనం లేదు. ఉరుములతో, పిడుగులతో వర్షం మరింత పెద్దదయ్యింది. సరిగ్గా నంది మీద పిడుగు పడబోయింది. నేను వెంటనే ఆ పిడుగు నందికి తగలకుండా చేశాను. నంది మాత్రం తపస్సు నా జ్ఞాపకాలతో చేస్తున్నాడు. నేను, నాకు తోడుగా మరొక కైలాసవాసి......
(సశేషం...)

No comments:

Post a Comment

Pages