రామ నామ వరాననే...

- పిన్నలి గోపీనాథ్ 


రామాయణం రకరకాలుగా ప్రసిద్ధి పొందిందంటే తప్పులేదేమో.. అసలు రామ శబ్దమే ఎంతో విశేషమైనది కదా.. సేకరించిన సమాచారం ప్రకారం...
'రా' యనగా యందులో 'ర' కారమూ, 'అ' కారమూ కదా ఉన్నవి. వాటిలో 'ర' అనేది అగ్ని బీజాక్షరం గానూ, 'అ' కారము సూర్య బీజాక్షరంగానూ, 'మ' యనునది చంద్ర బీజాక్షరంగానూ చెప్తారు. రాముడు సూర్య వంశ రాజు అనేది కూడా ఇక్కడ గమనార్హం.. కదా..!
మరో వివరణ ప్రకారం..'.రా' అనగానే పాపా(త్మకమైన ఆలోచన)లు నోటి ద్వారా బయటకు వస్తాయి. తిరిగి అవి లోనికి వెళ్ళే లోపునే 'మ' యనునది ఉచ్చరిస్తాము గనుక ఇక నవి లోనికి పోయే మార్గం లేక బయటనే దగ్ధమైపోతాయి.
ఇంకో కీలకమైన వివరణ... అష్టాక్షరీలోని 'రా' ను తొలగిస్తే అది 'నా యణాయ' గా మారి నిరర్థకమవుతుంది. అది అర్థ రహితం. ఇక 'మ' యనునది శివ పంచాక్షరీ లోనిది. తొలగిస్తే 'న శ్శివాయ' అయి అశుభ కరమవుతుంది. కదా ...!!
..... ఇంతకూ
 ఆ.వె. మరల రామ కథయె మనన మేల యనుచు
విస్తు బోవ నేల ? విబుధ జనులు
చదువ చదువ నదియె  జక్క సేయు మదిని
గాదె యవని ఇతర కథలకన్న?!
ఆ.వె. అయిన వారి మనువు ఆనవాలే లేని
సాగ దామని యది సాజ మోయి!
వారి వేడ్క తోనె వత్సరాన యెపుడు
సందడిగను మొదలు సంబరాలు
కదా ... కావుననే ఇంకొక పర్యాయము రామ కథను సంక్షిప్తంగానే అదీ ఒకే పద్య రూపంలో స్మరించెదము గాక...

ఏక పద్య రామాయణం..

సీ: పుత్రకామేష్టితో పుడమి చేరెను హరి ... ద్వార పాలకులకు దారి చూప
పింతల్లి కోర్కెయే పిత్రాజ్ఞ పాలనై ... అడవి దారి వెడలె ఆలి తోడ
మాయ లేడిని జంప మాయమయ్యె సతియు ... వాలి వధతొ వాయు తనయు దోస్తి
లంక జేర్చపనులు పూర్తి జేసెనుగాగ ... పురికి అరిగి పట్టమందుకొనియె!!
ఆ.వె.: అకట తానె తిరిగి సీతను అడవికి
పంపె, కాని పిదప జంట సుతుల
యదను చేర్చి రాజ్యలక్ష్ములనే ఇచ్చి
సరయు జేరి యముని కోర్కె దీర్చె !!
ఇక్కడే మరో విషయం. యెప్పుడు యెక్కడ చదివానో గుర్తు లేదు. కానీ, వో పద్యం నా మనసున నాటుకు పోయింది. యముడు రాముని కోరిన తీరును తెలిపే పద్యం...
" వినుము రామ పరమ బురుష వేద వేద్య ధారుణీ
జనుల బోవ దనుజ కులము సంహరింప బూని యీ
మనుజ కులము నందు బుట్టి దశసహస్ర యుగము పా
లనము జేసి తింక గాలమయ్యె లేచి రావయా ! "
 అదీ విషయం. అందరినీ బాధిస్తాడనుకునే యమడు సైతం రాముని కడ నిలచి వినయముగా నడగవలసి వచ్చింది. శుభమ్...
 శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే...

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top