ఊపిరి - అచ్చంగా తెలుగు

ఊపిరి

Share This

ఊపిరి

 - చెన్నూరి సుదర్శన్


ఆవాళ ఐతారం (ఆదివారం)..
నేలమాళిగలో (సెల్లార్లో) ఉదయం పది గంటలకు పది మంది పిల్లలకు లెక్కల ట్యూషన్‍లో మునిగి పోయి ఉన్నాడు బుచ్చిమల్లు. అతడికి వారాలతో గాని సెలవు దినాలతో గాని పని లేదు. అలా ట్యూషన్ చెప్తుంటేనే.. అతడి బతుకు బండి సాగేది.
“తాతా!” అంటూ జింక పిల్లలా పరుగెత్తుకుంటూ వచ్చింది బుచ్చిమల్లు మనుమరాలు సుమేధ.. ముద్దుగా ఇంట్లో అందరూ పిల్చుకునే సుమీ..
  బుచ్చిమల్లు గుండె గుభేలుమంది. గభాల్న వీధి గుమ్మం మూసేద్దామంటే  సుమీ రెండు కాళ్ళనూ చుట్టేసుకుని వుంది. అతడి ఒంట్లో వణుకు పుట్టింది. వెనకాల అతడి కొడుకు గాని కోడలు గాని వస్తున్నారేమోనని కలవరడ్డాడు కళ్ళజోడు సదురుకుంటూ.. ఎవరూ రావడం లేదని నిర్థారణ కాగానే  అమాంతం సుమేధను హృదయానికి హత్తుకున్నాడు. పోయే ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది..
‘ఎన్నాళ్ళయింది..?. ఈ స్పర్శకు నోచుకోక యిలాగే ఊపిరి ఆగి పోతుందనుకున్నాను..’ అని బుచ్చిమల్లు మనసు తల్లడిల్ల సాగింది. దుఃఖం పెల్లుబికింది. ఘొల్లుమన్నాడు.. సుమేధ కూడా బిగ్గరగా ఏడ్చేసింది.
ట్యూషన్‍కు వచ్చిన  పిల్లలంతా బిక్కు బిక్కుమంటు వారి వంక చూడసాగారు. బుచ్చిమల్లు తల ‘ఈ పూటకిక సెలవు..’ అన్నట్లుగా స్పందించడం  గమనించి ఒకరి తరువాత పుస్తకాలు సర్దుకొని వెళ్ళి పోయారు.
కాసేపటికి తమాయించుకున్నాడు బుచ్చిమల్లు. సుమేధ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు. ఉప్పదనమైన అతడి పెదవులను తడుముకుంట తన్మయత్వం చెందసాగాడు.
బుచ్చిమల్లు  ఆనంద భాష్పాలను సుమేధ తన చిట్టి చేతులతో తుడువ సాగింది..
కన్నీరు తెరలు తెరలుగా ఉప్పొంగ సాగాయి.. గుండె దిటవు చేసుకున్నాడు.
ఆవాళ్టి సంగతి జ్ఞప్తికి రాగానే అతడి చేతులు అప్రయత్నంగా సుమేధను దూరంగా తోసేసాయి.
“నేనంటే ఇట్టం లేదన్నవ్.. మల్ల ఎందుకచ్చినవ్?.. మీ అవ్వ, నాయన దగ్గరికే పో..” అంటూ చిరు కోపం ప్రదర్శించాడు బుచ్చిమల్లు. భుజంమ్మీది కండువాతో కళ్ళు తుడ్చుకుంటూ.. అలాగే వాలు కుర్చీలో వాలి పోయాడు.
సుమేధ దూకుడుగా  అడుగు ముందుకు  వేసి వచ్చి కుర్చీ ఎక్కి బుచ్చిమల్లు  తొడల మీద కూర్చుండి పోయింది. తన తాత కడుపును గట్టిగ పట్టుకొని ఎదపై తల ఆన్చింది. సుమేధ వీపు మీద తన రెండు చేతులతో నిముర సాగాడు బుచ్చిమల్లు.. తెంచుకుంటే తెగి పోయే బంధం కాదది..
 బుచ్చిమల్లుకు ఆనాటి దృశ్యం కళ్ళకు కట్టినట్టు సాదృశ్యంగా కనబడుతోంది.. మనసును దహించి వేస్తోంది..
***
“నాయనా.. వెచ్చే నెల ఆరో తారీఖున మంచి మూర్తం వుందట.. కొత్త ఫ్లాట్లకు మారుతున్నాం” పెద్దర్వాజల అడుగు పెట్టుకుంటూ అన్నాడు బుచ్చిమల్లు  ఏకైకసంతానం సదానందం.
  బుచ్చిమల్లు  హృదయం పులకించి పోయింది.. సొంత గూటిలో పొదిగిన విహంగమయ్యాడు.
‘ఎంత కాలానికి నా కోరిక తీరబోతోంది..! ’ అని పొంగిపోయాడు. కళ్ళు మూసుకొని ఆ పరమాత్మనికి నమస్కారాలు సమర్పించుకోసాగాడు.
ఇంతలో వంటింట్లో నుండి సదానంద భార్య కళావతి సంకేతాలు అందినట్లున్నాయి.. వ్యక్త పరుస్తున్న తండ్రి సంతోషాన్ని తోసిరాజని సదానందం అంతర్థానమయ్యాడు. అయినా ఈ కాలపు పిల్లలు అంతేలే.. అని  మనసు నెమ్మదించుకున్నాడు బుచ్చిమల్లు.
“తాతా.. అన్న కొడ్తాండు..” అంటూ సుమేధ పరుగెత్తుకుంటూ వచ్చి బుంగమూతి పెట్టింది.
“తాతా అన్ని అబద్ధాలు చెప్తాంది.. సుమే నన్ను కొట్టి ఉర్కత్తాంది..” అంటూ కింది పెదవి పంటి కింద బిగబట్టి.. కుడిచేతి పిడికిలి బిగించి వెనకాలే పరుగెత్తుకుంటూ వచ్చాడు బుచ్చిమల్లు మనమడు వంశీకృష్ణ.
పిల్లలకు ఎప్పుడు ఎప్పుడు చెబుదామా అని ఉవ్విళ్ళూరుతున్న బుచ్చిమల్లుకు అనుకోకుండా మనుమడు మనుమరాలు రావడం పెదాలు విచ్చుకున్నాయి..
“సుమీ.!. వంశీ..! కొంచెం దగ్గరికి రాండ్లి.. మీకో మంచి ముచ్చట చెప్తా..” అంటూ లాలనగా పిలిచాడు.
ఒకరి నొకరి వెక్కిరింతలు చందమామలోని మచ్చల్లా వారి ముఖాల్లో తళుక్కుమంటున్నాయి. వారి ముసి ముసి నవ్వులు బుచ్చిమల్లు ముఖం ముడుతల్లో ముకుళం అయ్యాయి.
 తమ తాతయ్య వంక చూస్తూ ఏమీ ఎరగనట్టే..
“ఏంది తాతా..” అన్నారు పిల్లలిద్దరు యుగళగీతంలా..
“మనం కొత్త ఇంట్లోకి పోతున్నాం.. ” కళ్ళళ్ళో అతడి ఆనందాన్నంతా కుమ్మరిస్తూ అన్నాడు బుచ్చిమల్లు.
“ఈ ఇల్లు బాగలేదా.. ”  అడిగాడు వంశీ..
“ఇది మనది కాదు కదరా.. ”  గొప్ప ఆరిందలా అన్నది సుమేధ.
దాని ముద్దు ముఖం చూడగానే చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు బుచ్చిమల్లు. ఉచ్ఛిష్టమైన తన చెక్కిళ్ళను తుడ్చుకుంటూ “ఎప్పుడు మనం కొత్త ఇంట్లకు పోతున్నం..!” అంటూ గోముగా అడిగింది.
“వచ్చే నెల.. మీ నాయన ఇప్పుడే చెప్పిండు.. మనం వచ్చే ఉగాది పండుగ కొత్త ఇంట్లోనే జరుపుకుటం..” అంటుంటే అతడి మాటలు ఇంకా పూర్తి కాకుండానే “ఉగాది పండుగా..! ఆ రోజు రంగులు సల్లు కుంటరా?..” అటూ అడిగింది సుమేధ తన చిన్ని చేతులను వయ్యారంగా తిప్పుకుంటూ.. తనకు రంగులు చల్లుకునే హోళీ పండుగ అంటే ఎంతో ఇష్టం. బుచ్చిమల్లు సమాధానం చెప్పేంతలోనే..
“పిచ్చి మొహమా..! అది హోళీ పండుగే..! ” అన్నాడు వంశీ ఠక్కున.
వాడి తెలివి తేటలు బుచ్చిమల్లుకు ముద్దు తెప్పించాయి. మనుమని బుగ్గపై  ఓ మారు ముద్దు పెట్టి ఉగాది పండుగ గూర్చి చెప్ప సాగాడు.
“ఉగాది పండుగ అంటే బచ్చాల పండుగ..”
“బచ్చాలంటే.. ” బుచ్చిమల్లు మాటలకు అడ్డు తగిలింది సుమేధ.
“గట్ల పిచ్చి పిచ్చి కొశ్చన్లేయకు.. బచ్చాలంటే తెల్వదా..! తినేటియ్.. తాతను పురంగ చెప్పనియ్యి..” అంటూ వంశీ సుమేధ బుగ్గపై తన చిటికెన వేలుతో సుతారముగా పొడిచాడు.
“చూడు తాతా..!” అంటూ వంశీని ఉరిమి చూసింది.. నాలుకను తన దొండపండులాంటి పెదవులతో అదిమిపట్టి..
బుచ్చిమల్లు మరోమారు ఇద్దరినీ శాంత పరిచి చెప్పసాగాడు.
“బచ్చాలు అంటే శనగపప్పు ఉడుకబెట్టి బెల్లమేసి రుబ్బుతరు. దాన్ని పూర్ణం అంటరు. ఆ తర్వాత గోధుమ పిండిని పూరీల లెక్క సేసుకుంట అందుల చిన్న పూర్ణం ముద్ద పెట్టి మెల్లంగ మెల్లంగ ఒత్తి పెనం మీద నెయ్యేసుకుంట కాలుత్తరు.
ఉగాది పండుగ మన హైందవులకు కొత్త సాలు అన్నమాట”
“కొత్త సాలు అంటే..”  సుమేధ కళ్ళు బండి చక్రాల్లా గుండ్రంగా తిప్పుతూ అడిగింది.
  “కొత్త సాలు అంటే కొత్త ఏడాది.. ఇంగిలీసోల్లకు కొత్త ఏడాది జనవరి ఒకటి ఎట్లనో.. మనకు ఉగాది అట్ల.  అదంతా తరువాత చెప్తా కాని.. ముందుగా పండుగ గురించి వినండి.. ఆరోజు బచ్చాలే గాకుండా పచ్చడి సుత చేత్తరు..” అంటుంటే గొంతు పొర మారింది. సుమేధ తన చిన్ని చేతులతో వాటర్ బాటిల్ అందించింది. గొంతు తడుపుకున్నాడు బుచ్చిమల్లు.
“ఉగాది రోజు ఇంట్లో వాళ్ళంత తెల్లారగట్లనే లేచి తలంటి తానం చేత్తరు. కొత్త బట్టలు కట్టుకుంటరు. మామిడాకులు, యాప పువ్వు తెంపుకత్తరు. మామిడాకు దర్వాజలకు తోరణాలు పెడ్తరు. అటూ యిటూ యాప కొమ్మలు చెక్కుతరు. కుమ్మరోల్ల ఇంటికాడ్నుండి కొత్త పటువ(చిన్న కుండ) కొనుక్కత్తరు. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడ్తరు. అందుల నిండు బిందెలకెల్లి తీసిన  నీల్లు పోత్తరు. ఆ నీల్లల్ల బెల్లం, కొబ్బరి ముక్కలు, అరడి పండు ముక్కలు, మామిడి కాయ ముక్కలు యింకా యాప పువ్వు కలుపుతరు”
“ఎందుకు తాతయ్యా..” అడిగాడు వంశీ.
“నువెందుకు మాటల సందుల బుడ్డరఖాన్ లెక్క దూర్తానవ్?..” అంటూ రెట్టించింది సుమేధ. నువ్వే బుడ్డర్ ఖాన్.. నువ్వే.. నువ్వే.. అన్నట్లు సైగలు చేసుకుంటుంటే బుచ్చిమల్లుకు నవ్వాగింది కాదు.  చిరునవ్వు నవ్వుకుంటూ సముదాయిస్తూ..  చెప్పటంకొనసాగించాడు.
“గట్ల కలిపిన దాన్నే పచ్చడి అంటరు” అంటూ గొంతు సవరించుకున్నడు బుచ్చిమల్లు. “ దేవుని పటం ముందర ఇత్తారాకేసి అందుల కొత్త బియ్యం చిన్న కుప్ప లెక్క పోత్తరు. ఆ బియ్యం కుప్పమీద చిన్న గుంట చేసి అందుల పచ్చడి పటువ పట్టి మూతను బోర్లేత్తరు. పటువ మెడకు యాపాకు కొమ్మలు తోర్నం లెక్క కడ్తరు. దాని ముందర దీపాలు పెట్టి ఊదుబత్తీలు ముట్టిత్తరు. కొబ్బరి కాయ కొట్టి తీర్థం తీసుకుంటరు. ఆ రోజు అందరు ఇత్తార్లల్లనే బోంచేత్తరు.. నీసు అసలే ముట్టరు..”
అలా చెబ్తూ వుండగా “సుమీ..! వంశీ..!!” అంటూ బుచ్చిమల్లు కోడలు హుకుం లాంటి పిలుపు విన వచ్చింది.. పిల్లలిద్దరూ మూతులు మూడు వంకర్లు తిప్పుకున్నారు. ‘మళ్ళీ ఇప్పుడే వస్తాం’ అన్న రీతిలో వెనక్కి చూసుకుంటూ వెళ్ళి పోయారు.
పిల్లలతో బాటు కొడుకూ కోడలు హాల్లో సమావేశమైనట్లు పసిగట్టాడు బుచ్చిమల్లు. బుచ్చిమల్లు కోడలు వచ్చి హాలు తలుపులు మూసి బేడం పెట్టింది. బుచ్చిమల్లు  మొగసాల(డ్రాయింగ్‍రూం) లో  అలాగే కుర్చీలో కూర్చుండి పోయాడు. అది అతడికి మామూలే..
అతడిలో కొత్త ఫ్లాట్ తాలూకు ఆలోచనలు కదలాడసాగాయి..
బుచ్చిమల్లు బట్టల షాపులో గుమస్తా.. వర్తక వ్యవహారాల లెక్కా డొక్కా చూసేవాడు. లెక్కల్లో ఒక్క తప్పూ దొర్లేది కాదు. షావుకార్లు అతన్ని ‘లెక్కల సార్‍విగా..పిల్లలు బాగు పడ్తరు’ అని ప్రశంసించే వారు. పాత మొండి బకాయిలు వసూలు చేయడానికై అప్పుడప్పుడు ఊర్లూ తిరిగే వాడు.
బుచ్చిమల్లు భార్య సావిత్రమ్మ ఆరోగ్యం సరిగ్గా ఉండక పోవడం.. సంతానం ఆలస్యమైంది. ఒక్క కొడుకు సదానందం పుట్టగానే చాలనుకున్నారు. తమ మాదిరిగా కొడుకు కష్టాలపాలు కాగూడదని పైచదువులు చదివించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది..
సదానందం ప్రేమించిన అమ్మాయి వాళ్ళ కులం కాకపోయినా ముందుపడి పెళ్ళి చేసారు.
నేటి లోకం రివాజులా సదానందం సహజమైన కోరిక బుచ్చిమల్లు  ముందుంచాడు.. ‘వేరే కాపురం..’.
కాదనలేక పోయారు బుచ్చిమల్లు, సావిత్రమ్మ దంపతులు. ‘వాడు సుఖంగా కాపురం చేయడమే మాకు కావాల్సింద’ని సరి పెట్టుకున్నారు. కొడుకును కన్నుల చలువగా చూసుకునే భాగ్యం కోల్పోవద్దని పక్క వీధిలోనే మరో ఇల్లు వారికి అద్దెకు ఇప్పించారు. అద్దె కూడా వాళ్ళ మెడకే పడ్డా సర్దుకు పోయారు.‘కొడుకు మమ్మల్ని కాదనుకున్నా.. వాని బాగోగులు చూసుకునే బాధ్యత ఇంకా మాపై వుంది..’ అనుకునేవారు.
ముందుగా వంశీకృష్ణ బుచ్చిమల్లును తాతయ్యగా పదోన్నతి కలిగించాడు. ఇప్పుడు వాడికి అయిదేండ్లు. ఆ తరువాత మరో ఏడాదికే సుమేధ.. పిల్లలు మమతానురాగాలతో పెనవేసుకు పోయారు. వారిరువురే వాళ్ళ ఊపిరి.
పరుగెత్తి పాలు తాగాలనే కాంక్షతో ఉద్యోగ బాధ్యతలు వదిలి నేల విడ్చి సాము చేసాడు సదానందం. సైడు వ్యాపారాలతో సయ్యాటలాడిండు. అనుభవ లేమితో అప్పులపాలయ్యాడు..
 అటు ఉద్యోగంలో సస్పెండయ్యాడు..
 ‘అత్తా.. మామా.. మీరే ఆదుకోవాలి.. ’ అని వారి కోడలు అడుగక ముందే బుచ్చిమల్లు తన  షావుకారు దగ్గర అప్పుజేసి కొడుకు అప్పులన్నీ తీర్చాడు.
కిరాయి కొంపలతో విసిగి పోతున్నాడు కొడుకు.. మనం కొన్న స్థలంలో వాడు తనకు నచ్చిన రీతిలో ఇల్లు తరువాత కట్టుకుంటాడు కాని ముందు ఒక ఫ్లాట్ కొనిద్దామని సావిత్రమ్మ, బుచ్చిమల్లు చెవిలో జోరీగై దూరింది. తన ఒంటి మీది నగలన్నీ ఒలిచి యిచ్చింది.
ఇద్దరు కలిసి ఫ్లాట్‍కు అడ్వాన్స్ అనకుండా ఏకమొత్తంగ కట్టారు.
 కొడుకు కోడలును ఫ్లాట్ విషయం చెప్పి ఆశ్చర్యచకితుల్ని చేయాలని తిర్గి వస్తుండగా విధి వక్రించింది. వారు ప్రయాణిస్తున్న ఆటో నిల్చి వున్న వాటర్ ట్యాంకర్‍ను గుద్దుకున్నది. సావిత్రమ్మ హఠాత్తుగా బుచ్చిమల్లును ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయింది..
సావిత్రమ్మ చచ్చిపోయిన ఘడియ మంచిది కాదని శవాన్ని వాకిలి కూడా తొక్కనివ్వ లేదు ఇంటి ఓనరు. బజారులో చిత్తు కాగితంలా కొట్టుకు పోయింది సావిత్రమ్మ..
సంవత్సరీకం పోయిన నెలల జరిగింది. వారి ఇంటికి ఏడాది సూతకం వెళ్ళి మంచి రోజులు మొదలయ్యాయి..
‘నా సావిత్రమ్మ కోరికలు మోసుకొని కొత్త ఫ్లాట్ లోకి వెళ్తున్నాం.. ’ అని బుచ్చిమల్లు మనసు చిన్న పిల్లవాడిలా ఉరకలు వేయసాగింది..
ఇంతలో హాలు గుమ్మం తలుపులు తెరుచుకున్నాయి. అతడి ఆలోచనలు ఆగిపోయాయి.. ‘దీపం ఉండగానే ఇల్లు సదురుకోవాలె..’ అనే కళావతి మాటలు వంటింట్లో నుండి  విన వస్తున్నాయి.
సదానందం వచ్చి  బుచ్చిమల్లుకెదురుగా కూర్చున్నాడు ..
ఏదో చెప్పాలని తటపటాయిస్తున్నట్లు గమనించి బుచ్చిమల్లే కదిలించాడు.. సదానందం తడబడుకుంట గొంతు పెకిలించుకున్నాడు...
“నాయనా!.. కొత్త ఫ్లాట్ లోకి మారుతున్నం అన్నకదా.. కాని నువు మాత్రం మాతో రావద్దు” నేల చూపులు చూసుకుంటూ అన్నాడు.
బుచ్చిమల్లు గుండెలో రాయి పడింది. గొంతులో నుండి మాట రావటం లేదు..
“ఒక్కగానొక్క కొడుకుని. నిన్ను సాదడం నాకు తప్పుతదా.. అసలే లోకులు పలు గాకులు..ఏమనుకుంటరు?.. నా మీద దుమ్మెత్తి పోత్తరు..! నీకు నాల్గు తొవ్వలు సూపిద్దామనుకుంటాన.. అందుల నీకు నచ్చిన తొవ్వల నువ్వు సూసుకో..” అంటూ మరో మారు తల దించుకున్నాడు. బుచ్చిమల్లు  పానమంత అగులు బుగులు కాబట్టింది. ఊపిరి ఆగిపోతుందా అన్నట్లు చల్ల చెమటలు పెట్టసాగాయి.
“మొదటి తొవ్వ.. మీ అన్న ‘బతుకైనా చావైనా నా ఇంట్లనే..’ అనుకుంట తన కొడుకు వెంబడి కొత్త ఇంట్లోకి పోకుంట ఒంటరిగా ఉంటాండు గంత పెద్దింట్ల. నీకు తెల్వంది కాదు.. నువు వెళ్ళి నీ అన్నతో వుండిపో..
రెండో తొవ్వ.. ముండబోసిన నీ చెల్లెలు అంటే నీకు పానం కదా..! ఆమె పిల్లలంతా అమెరికా వెళ్లిపోతే ఒంటరిగా బతుకుతాంది. చెల్లెలికి చేదోడు వాదోడుగా వుంటది. ఆడికన్నపో..
మూడో తొవ్వ.. ఎవ్వలనూ కట్ట పెట్టద్దు అనుకుంటే.. పెద్ద మనసుతోటి ఏదైనా అనాధ ఆశ్రమంలో చేరిపో..
ఇంగ చిట్ట చివరగా నాలుగో తొవ్వ. కాదూ..! కూడదూ..!! మాతోనే వుంటాను అని అనుకుంటే.. నేను మా ఫ్లాట్ల సెల్లార్ల వుండే వాచ్‍మన్‍ను బతిలాడి ఒప్పిచ్చిన. నిన్ను ఒక  అర్రల(గదిల) ఉండనిత్తనన్నాడు. అతడితో షేర్ చేసుకో.. ఉదయం రాత్రి హోటల్ నుండి టిఫిన్లు తెప్పించుకో.. పగటీలి ఒక పూట భోజనం టిఫిన్ బాక్స్ ఇచ్చి నేను బడికి పోత. మా ఫ్లాట్లనే కాబట్టి నాకేం కట్టం కాదు.. గామాత్రం చెయ్యలేనా..”
బుచ్చిమల్లుకు ఇదంతా కలా..? నిజమా..? అనిపించ సాగింది.. మెదడు మొద్దుబారిపోతాంది..
“నువ్వు మాతో కలిసి వుండటం  నీ కోడలుకు గానీ.. నాకు గానీ.. నా పిల్లలకు గానీ ఎవరికీ ఇట్టం లేదు. కావాలంటే సుమీని.. వంశీని నువ్వే అడుగు.. ఫ్లాట్‍కు డబ్బు కట్టి అవ్వను బొందబెట్టుకున్నవ్.. ఇక నువ్వు మా ఫ్లాట్‍కు వత్తే ఇంకా ఏమైతదో.. మాబాగు కోరే వాడివే అయితే బాగా ఆలోచించుకో.. నేను చెప్పేదేదో శాన క్లియర్‍కట్‍గా చెప్పిన. ఏదైనా ఒక తొవ్వ(ఆప్షన్) సూసుకో.. నీ ఇట్టం. ఇంకా శాన టైమున్నది.. వచ్చే నెల కదా..! మీకోడలు శాన మంచిది కాబట్టి కొంచెం ముందుగాల్నే  చెప్ప మన్నది..” అంటూ తండ్రి వంకైనా చూడకుండా బిర బిరా వెళ్ళిపోయాడు సదానందం.
బుచ్చిమల్లు నిశ్చేష్టుడయ్యాడు.. కళ్ళు బైర్లు కమ్మి అలాగే కుర్చీల ఒరిగి పోయాడు.. ఆఖరికి ఆ గోదాట్ల పడే తొవ్వ సుత  చెప్పకపాయె నా కొడుకు అని   అతడి మనసు మదనపడ సాగింది.. ‘అత్తలేని కోడలు ఉత్తమరాలు’ అనే  వ్యంగాస్త్రం అతడి నోటిగుండా అప్రయత్నంగా మొదటిసారిగా వచ్చింది.
రోజులు గడుస్తున్నాయి.. నిద్రాహారాలు మాని ఆలోచించ సాగాడు..
‘పిల్లలు బుచ్చిమల్లు దరికి రావడం లేదు. కాని వారు దూరంగా కనిపించినా అతడిలో అనిర్వచనీయమైన తృప్తి కలుగుతోంది. వారు ఒక సెకను కనపడ్డా ఒక రోజంతా బతికే శక్తి అతడిలో పునరావేశం (రీచార్జ్) అవుతోంది. అలాంటప్పుడు అతడు వారిని విడిచి ఎలా వెళ్లగలడు..
బుచ్చిమల్లు ‘చెల్లెలు, అన్నయ్య వాళ్ళ బతుకేదో వాళ్లు ఈడ్చుకుంటున్నారు. తాను వెళ్ళి వారికి అపప్రథ మూట కట్టడం ఇష్టం లేదు. ‘తాటి చెట్టు కింద పాలు తాగినట్లు’ వుంటుంది. వారి సొమ్మంతా తనే తింటున్నానని  వారి పిల్లలు అపోహపడక మానరు’ అని మనసులో ఆవేదన చెంద సాగాడు.
‘యిక నేను అనాధాశ్రమంలో వుంటే సుమీ.. వంశీలు నన్ను చూడ్డానికి వస్తారన్న నమ్మకమూ లేదు. వారిని చూడకుండా నేను ఎలా బ్రతగ్గలను?.. రోజుకొక్కసారైనా వారిని చూడాలి.. లేకుంటే ఆగిపోతుంది నాఊపిరి.. నేను ఫ్లాట్లోనే వాచ్‍మన్ గదిలో వుంటాను..’ అని స్థిరంగా బుచ్చిమల్లు నిర్ణయించుకున్నాడు.
‘నారెక్కలు ఆడినంత కాలం నలుగురు పిల్లలకు లెక్కలు చెప్తాను.. పని మనిషిని పెట్టుకొని ఆ ఒక్క పూట కూడా వంట చేయించుకుంటే ఆ శ్రమ కూడా తప్పుతుంది నా కొడుక్కు. కొన్నాళ్ళు చూద్దాం.. ’ అని దృఢనిర్ణయానికి వచ్చాడు.
 ‘నాకొడుకు కోడలుకు తృప్తి పడ్డారో లేదో..! ఎండిన ఎంగిలాకులా ఎగిరిపోతాడనుకుంటే ఎటొచ్చి మళ్ళీ మా మెడకే చుట్టుకుంటున్నాడని  అనుకున్నా ఫరవాలేదు..  ప్రేమపాశం తెంచుకుంటే తెగిపోయేది కాదు.. నామనుమడు మనుమరాలును చూసుకునే భాగ్యం కల్గించుకుంటాను.. నాఊపిరి మరి కొన్నాళ్ళు నిలుపుకుంటాను..’ అనే సంతృప్తి అతడిలో బలపడింది.
            ***
బుచ్చిమల్లు ఆలోచనలకు తెరపడింది..
అతడి మనుమడు వంశీ అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలా రాసాగాడు.
బుచ్చిమల్లు చూసీ చూడనట్లే చూసి దృష్టి మరల్చు కున్నాడు.
సుమీ ఏడుస్తూ అలాగే అతడి ఎదపైన నిద్రపోయింది.
“తాతా నాతో మాట్లాడవా?.. ” అన్నాడు వంశీ. అంతదాకా ఏడ్చినట్లున్నాడు.. వెక్కిళ్ళు వస్తున్నాయి. కన్నీటి చారలు కనబడ్తున్నాయి. జుట్టు చెదిరిపోయి వుంది.
ఇంతలో వంట మనిషి నర్సమ్మ  వచ్చి అతడి ఒళ్ళోని సుమీని ఎత్తుకుంటూ “మీ కొడుకూ కోడలు కార్ల  బయటకు పోయిండ్లు సారూ..” అంది.
అందుకే పిల్లలు వచ్చారు అనుకున్నాడు మనసులో బుచ్చిమల్లు.
“నేనంటే మీకిట్టం లేదు కదా.. నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టిండ్లు కదా..” అన్నాడు బుచ్చిమల్లు.. మునివేళ్ళతో నొసలు కొట్టుకుంటూ..
వంశీ ఒక్క పెట్టున ఏడ్పు అందుకున్నాడు.
బుచ్చిమల్లుకు జాలి వేసింది..
“తాతా నేను జల్దిన పెద్దగ ఎట్లైతనో చెప్పవా?.. నేను పెద్దగైతే నిన్ను నాదగ్గరే ఉండనిత్త” అంటున్న వంశీని అమాంతం తన హృదయాన్కి హత్తుకున్నడు బుచ్చిమల్లు. కళ్ళు నీటి కడవలయ్యాయి.
“తాతా విషం ఎక్కడ దొరుకుతది?.. ఇదైనా చెప్పు” అన్నడు వంశీ.
బుచ్చిమల్లు గుండె ఝల్లుమన్నది. తత్తర పడ్తూ..
“నీకెందుకు బాబూ..” అన్నాడు.
“మా నాయనను సంపేత్త..” అన్నాడు ఆవేశంగా.. పై పళ్ళతో కింది పెదవి కరుచుకుంటూ..
“తప్పు బాబూ.. పెద్దోల్లను అలా అనద్దు..” అంటూ వంశీ గదుమ పట్టుకున్నడు బుచ్చిమల్లు.
“మరి నువ్వు పెద్దోడివి కావా.. నిన్ను గట్లనే అంటడా తాతా..!..
మా నాయన వాళ్ళు ఏమి ఇచ్చినా  తినొద్దు.. వాల్లు ఇసప్పురుగులు” అన్నడు.. కళ్ళు పెద్దవి వేసి అరచేయి అడ్డంగా ఊపుతూ..
‘నేను వింటున్నది నిజమేనా..!’  అన్నట్లుగా ఆశ్చర్యంగా చూడసాగాడు బుచ్చిమల్లు..
“ఆరోజు సుమీని నన్ను.. బెదిరిచ్చిండ్లు. తాత దగ్గరికి వెళ్ళద్దు..  తాత అడిగితే ఇట్టం లేదని చెప్పండి. లేదంటే అన్నంలో విషం కలిపి తాతను సంపేత్తం.. అన్నరు”  వంశీ చెబ్తుంటే.. మంగమ్మ, బుచ్చిమల్లు కొయ్యబారిపోయారు.*

No comments:

Post a Comment

Pages