నీలి కళ్ళు - అచ్చంగా తెలుగు

నీలి కళ్ళు

Share This

నీలి కళ్ళు

డా. జె.వి.బి.కశ్యప్


తోలుబొమ్మల కాలం కరిగిపోయింది. మనది కాని ఒక ఊహా లోకం, అరచేతి సాక్షిగా బుల్లి బుల్లి పెట్టెల్లో ఇమిడిపోతుంటే, ఆఖరికి కృత్రిమ మట్టి కూడా ఆడుకోడానికి దొరుకుతున్న ఈ కాలంలో, నేనెవరికి గుర్తోస్తాను? కనీసం ఈ చెత్తబుట్టలో నుంచి నన్ను కాల్చడానికి కుడా సమయం లేని సమాజాన్ని గత 10 సం. లు గా వింటున్నాను.
ప్రతి బొమ్మా తయారయినపుడు దానికి తోడుగా ఒక ఆత్మపుడుతుంది. దానంతట అది కదలలేని బొమ్మ కూడా జీవిస్తుంటుంది . దాని ఆకారానికి తగ్గట్టే , ఆ ఆత్మ ప్రవర్తిస్తుంది. ఆడినా, విరిగినా, చినిగినా, పూర్తిగా బూడిదయ్యేంత వరకు అది జీవిస్తుంది, ఆ జీవితాన్ని ప్రేమిస్తుంది .
అక్కడక్కడా మాసిపోయిన నీలం రంగు ఓణి, పొడుగాటి జడ, నుదుట ఎర్రని దోసగింజ బొట్టు, బంగారంలా మెరిసిపోతున్న నకిలీ ఆభరణాలు, హృదయం దగ్గర ఒక అద్భుతమైన పేరుతో నా ఎదురుగా పడిందొక అందమైన తోలుబొమ్మ. 10 సం .ల తర్వాత మరో తోలుబోమ్మని చుసిన ఆనందం నాది. నా మీద పడి నన్ను పూర్తిగా కప్పేస్తున్న ప్లాస్టిక్ ని తప్పుకుంటూ, చీల్చుకుంటూ తన నీలి కళ్ళ తో నన్నే చూస్తున్నది.
ఎర్రని హృదయాకారపు గుడ్డ పై అందంగా కుట్టిన తన పేరు చాలా బాగుంది, ''ధాత్రి''. నాకైతే చాలా నచ్చింది. నాకూ ఒక పేరుంటే ఇంత అందంగా బాగుంటుందనిపించింది. కానీ, తన కళ్ళలో బాధ ఉంది. నా వైపైతే చూస్తుంది కానీ  ఆలోచనలిక్కడ లేనట్టు ఉన్నాయి. మరో కొత్త బొమ్మ అందగానే తనని వీధిలో విసిరేసిన యజమాని గుర్తు వచ్చి ఉంటుందా? ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే, పేరు కుడా ఇచ్చారు కదా! అయినా ఇంత అందమైన బొమ్మని అలా పారేసి ఉంటారా?
'' ఓయ్ ... ఓయ్'' పెద్దగా అరిచాను. కదలిక లేదు. అయినా నా పిచ్చి గాని, పిలవగానే చేయి ఊపి నా దగ్గరికోస్తుందా ఏంటి? తనూ బొమ్మే కదా! ఇన్ని సార్లు పిలచినా పలకదెం? అంత బాధగా తనని చూడలేక పోతున్నా. ఎలాగైనా చిన్న బొమ్మ కదా, ముద్దుగా ఉంది. ఒద్దికగా ఉంది. బహుశా ఏదన్నా బొమ్మల పెళ్ళిలో పెట్టుండవచ్చు. అయినా ఈ కాలంలో ఇంకా అలాంటి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా?
అలా ఆలోచిస్తుంటే, నా పెళ్లి గుర్తొచ్చింది. నన్ను ఆడించే వాడు స్వంతంగా తయారు చేసాడు నన్ను. నాకు కళ్ళలా రంగు రాళ్ళు పెట్టినప్పుడే మొదటి సారి చుసానతనని. అంతకు ముందు బొమ్మలోని పీచు తీసి నాలో కూరుతుంటే వడలిపోయిన పాత బొమ్మని చూసి జాలేసింది. అంత కొత్తగా ఉన్నాను నేను.
నేనంటే వాడికొక గౌరవం ఉండేది. మరి వాడి తిండి నా చలవే కదా? ఆ సంవత్సరం పండక్కి ఆట ఆడించడానికి తయారు చేసాడు నన్ను కొత్తగా. నాతో పాటు మరో బొమ్మను కూడా.. ఒక పెళ్లి కూతురు, మేలి ముసుగు లో. నిజం చెప్పాలంటే ....
ఆ ముఖం చూడాలని ఎంత ఆశ పడ్డానో. మా కధ కుడా ఆ సంవత్సరం నుంచి కొత్తది అట. అప్పటిదాకా విన్న పేదరాసి పెద్దమ్మ కధలు విసుగేత్తిన్చేసరికి, ఒక సరికొత్త సినిమా కధని తయారు చేసాడు, పాత వాసనలతో.
అనగనగా ఒక కోటలో ఉండే రాకుమారి, తనని ఎత్తుకెల్లాలన్న సేనాధిపతి నుంచి తప్పించుకుని ఊర్లోని కిరాయి రౌడీ ఐన నా దగ్గరికి వస్తుంది సహాయం కోసం. నేను ఒప్పుకుంటానుట, తను నాకు దక్కే షరతు మీద. తను సరే అంటుంది, కాని ఎప్పటికి తన ముఖం చూడను అనే మాట మీద. ఆ తర్వాత పెద్ద పెద్ద శబ్దాలతో ప్రతినాయకులని తన్నడం. మా పెళ్లి వైభవంగా జరగడం. ఆ పెళ్లి అవ్వగానే, ఆ రాకుమారి ఆటకొచ్చిన అందరి ముందు ముసుగు తీసి కనిపిస్తుంది నాకు తప్ప. అంతటితో కధ  అయిపోతుంది, ముసుగు పడిపోతుంది.
నాకు తన ముఖం చూడాలనిపించేది. ఆ ముసుగు తీయగానే ఎదురుగా ఉండే పిల్లల కళ్ళలో ఆనందం చూడగానే ఆ కోరిక ఇంకా పెరిగి పోతుంది. కధ అవ్వగానే మమ్మల్నిద్దరిని ఒక పెట్టెలో పడేసేవాడు.
మొదటిసారి పెళ్ళైన తర్వాత అలా పడేసినప్పుడు ఎంత సిగ్గేసిందో. వెయ్యదా మరి? తను ... నా గుండెల మీద ... కదలకుండా ... రాత్రంతా.
అలా ఐదవసారి ... పదవసారి ... పాతికోసారి ... యాభాయ్యోసారి పెళ్ళయ్యాక సిగ్గు పోయింది. ఎందుకంటే, ఇప్పుడు తనలో ప్రతి భాగం నేను తడిమిందే, అంతా నాకు తెల్సిందే. తన ముఖం తప్ప. చెపితే నమ్మరు, ఒక రాత్రంతా ముసుగు పైనుంచి తనని ముద్దు పెడుతూనే ఉండిపోయా.
మేము మాట్లాడుకుంటుంటే రాత్రి సరిపోయేది కాదు. ఎంత అందంగా మాట్లాడుతుందనీ? ప్రతి సారి ముసుగు తీసినప్పుడల్లా నేను కనిపిస్తానేమో అని ఎంతో పరితపించేదిట, నిజమే కదా ... నేను తనని చూడనట్లే, తను నన్ను
చుడలేదిప్పటి దాకా.
నాకన్నా మిగతా ప్రపంచం కనిపిస్తుంటుంది. తనకి అదికూడా లేదు, ఆ ముసుగు లోనుంచి. కాని ఆ తెరిచిన కొంతసేపూ, నా గురించే ఆలోచించేది పాపం. ఆ ముసుగులో నుంచి కూడా స్పష్టంగా కనపడేవి మా కళ్ళే.
తన నీలం రంగు కళ్ళ గురించి నేను చెప్పినప్పుడు ఎంత సిగ్గు పడేదో, నా ఎరుపురంగు కళ్ళ గురించి మాట్లాడేప్పుడు అంత కన్నా ఎక్కువ గర్వ పడేది. మా యజమాని మాకు పెట్టిన పేర్లు నచ్చలేదు మాకు. కధ  కోసం పెట్టిన రాజు, రాణి
అనే పేర్లు అస్సలు నచ్చలేదు. మేమెప్పుడు అలా పిలచుకోలేదు కూడా. ఒకరకంగా ఆ అవసరం రాలేదనే చెప్పాలి. ఎందుకంటే అసలక్కడ మాట్లాదటానికేవరున్నారని మేము తప్ప.
నేను మాత్రం తనకి ఒక పేరు పెట్టాను. ఒకరోజు మా ఆట చూడటానికి వచ్చిన నీలం కళ్ళ పాప పేరు ... మృణాలిని. ఆ పేరు తనకీ నచ్చింది.
అంతా ఎంతో బాగుండేది. ఇలా జరిగిపోతుండగా, మెల్లగా మా బట్టలు చిరుగుళ్ళు పడటం మొదలెట్టాయి. మా ఆట చూడటానికొచ్చే జనం పలచబడిపోయారు. మా యజమాని కొత్త అలవాటేదో చేసుకున్నాడు. వాడి నోటి వాసనకి మృణాలిని కళ్ళు తిరిగేవట.

ఒక రోజైతే ఆటకి ఒక్కళ్ళూ రాలేదు. ఆట మొదలెట్టడానికి నన్ను చేతిలోకి తీస్కుని, అలానే నేలకేసి కొట్టాడు. కాలితో తొక్కాడు. ఈడ్చి ఒక మూలకి పడేసాడు. నా మృణాలినికి ఈ బాధ ఎదురు కానందుకు ఆనందపడ్డా. ఎదురుగా
కనిపిస్తున్న పెట్టె లో తను ఎంత బాధ పడుతుందో. రెప్పపాటులో తన దగ్గరకెళ్ళాలనిపించింది.
ఇంకాసేపటికి చేతిలో ఏదో సీసాతో బైటకు వచ్చాడు మా యజమాని, దానిలో ద్రవం తాగుతూ, తూగుతూ. కాసేపు తన ఆట చూడటానికి రాని జనాన్ని, తన భార్యని వినరాని మాటలన్నీ తిట్టాడు. అలా తిడుతూ తిడుతూ మృణాలిని ఉన్న పెట్టె తగిలి కింద పడ్డాడు. ఆ సీసా ఆ పెట్టెపై పడి భళ్లుమంది. అది చూసి సహించలేక ... లోనికి విసురుగా వెళ్లి అగ్గిపెట్టె తెచ్చి, ఆ పెట్టెకి నిప్పంటించాడు. 'వద్దూ .. వద్దూ' ఏడ్చాను, అరిచాను .. కాని కదలలేక పోయాను. అన్ని వందల సార్లు ఈ చేతులతో కాపాడుకున్న నా మృణాలిని నా కళ్ళెదురుగానే కాలిపోయింది.
నాకు కన్నీళ్లు రావు. దానికేదో గ్రందులుండాలిట కదా.? అంతా ఐపోయింది. ప్రతి రాత్రి నా గుండెపై సేదతీరే అందం కనుమరుగైంది. కరిగిన కాలం తన గురుతులెం మిగలకుండా చెరిపేసింది ... అవును గుర్తు తెచ్చుకోవడానికి కనీసం
తనని నేను చూడలేదు కూడా. నా హృదయం చిరిగిపోయింది.
మరుసటి రోజు మూలనపడున్న నన్ను చేతిలోకి తీస్కున్నాడు. బూడిదైన ఆ పెట్టె దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ బూదిదలోనే నన్ను పెట్టి నా బదులు కుడా ఏడ్చేశాడు. నాకు అదేం తెలియడం లేదు. నన్ను చుట్టిన శూన్యంలో తన ప్రాణం కోసం వెతికాను. తిరిగి నన్ను చేతిలోకి తీస్కుని  బూడిద ఊడిచేప్పుడు కనపడ్డ ఓ నీలికన్ను మాత్రం నా కళ్ళలో మిగిలిపోయింది.
బూడిద అంటిన నేనూ ఆ తర్వాత ఇక్కడికి చేరాను. ఈ ఊరు చివరి చెత్తలో నన్ను పడేసి వెళ్ళిపోయాడు మా యజమాని చివరగా. నా తర్వాత ఎన్నో బొమ్మలు ఇలానే వచ్చాయి, కొన్ని వెళ్ళిపోయాయి. అవన్నీ మాత్రం ప్లాస్టిక్ వే. వాటిని మళ్లీ బొమ్మలుగా చేయ్యోచ్చుట, నాలా కాదు. అందుకే పది సంవత్సరాల క్రితం ఇక్కడికి చేరిన సర్కస్ కోతి 2 నెలల్లోనే వెళ్ళిపోయింది.
అలానే ఎర్ర కుక్క, వెనుక చక్రాలు లేని జీపు, కాళ్ళు చేతులు విరిగిన సైన్యం, నా మీద నా అంత ఎత్తున్న పిల్లి, ఐదు కాళ్ళ సాలీడు, ఒంటికన్ను చేప, రెక్క తెగిన పక్షి, బంగాళదుంప, మరమనిషి ... ఇలా ఎందఱో. కాని నాలాంటి
తోలు బొమ్మ రాలేదు.
నేను చూసిన మొదటి అమ్మాయి బొమ్మ 3 సంవత్సరాల క్రితం వచ్చిన ప్లాస్టిక్ పట్నం అమ్మాయి. పేరు బార్బీ అట. అసలు మన జాతిలానే లేదు. తనెందుకు వచ్చిందో తెలుసుకుని ఆశ్చర్య పోయాను. కుడి కాలి చెప్పు పోయిందని బైట
పారేసారుట. ఎప్పుడు గలగలా నవ్వేది, ఆ నవ్వులో ఎంతో బాధ ఉండేది. తనుండే చోట ఎవ్వరూ తనతో ఆడుకోరుట, గూట్లో అందానికి పెదతారుట, అయినా ఆదుకోకపోతే బొమ్మలు పడే బాధ ఎవరికీ తెల్సు? అందుకే చిన్న చెప్పు పోయినందుకే తనని వదిలేసారు. ఇంత అందమైన పిల్లకి ఎన్ని కష్టాలు?
నా సంగతి గుర్తు వచ్చింది. ఒకసారి నీళ్ళలో తడిస్తే, నా లోపలంతా ఖాళీ చేసి కొత్త పీచు కూరాడు మా యజమాని. మరోసారి కొక్కేనికి తగిలి కాలు చిరిగిపోతే, ఎంత జాగ్రత్తగా కుట్లేసాడనీ ... అస్సలు బైటకు తెలియనట్టు.
ఇంకా ఆ గాయం అలానే ఉంది. ఇక్కడ ఎండకు ఎండి, వానకు తడిసి ఆ కుట్లు ఊడిపోయాయి, అంతా పచ్చిగా దూది వెళ్ళగక్కుకుంటూ. ఈ అమ్మాయికేమో ఇలాంటి దుస్థితి. ఆ తర్వాత తనూ వెళ్ళిపోయింది.
నా ఆలోచనల తెరచించుకుంటూ, ''ఓయ్ .. ఓయ్'' అని వినిపించింది. ఇంకెవరు తనే. ఇప్పుడు తన కళ్ళలో మునుపటి బాధ లేదు. కళ్ళు తెరిపినపడ్డాయి. ఎదురుగానే ఉన్నా చూడని .. నన్ను చుస్తోందిప్పుడు.
''మొన్న నన్ను పిల్చింది మీరేనా?'' కొంచెం మెల్లిగా, ఇంకొంచెం భయంగా అడిగింది. కుదిరితే తల దిన్చుకునేదేమో.
''అవును ... అప్పుడు అంత బాధగా ఉన్నావేం ?'' కారణ ఊహించగలిగీ అడిగాను.
''మా లక్ష్మికి తెలియకుండా ఇక్కడ పడేసారు నన్ను. తను ఎంత ఏడుస్తుంటుందో'' మెల్లిగా బాధ పొరలు తిరిగి కమ్ముకుంటున్నాయి.

''సరేలే ... జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు ధాత్రి ..'' ఊరడించాను.
'' నా పేరు మీకెలా తెల్సు?'' ఆశ్చర్యం. కళ్ళలో వెలుగు, అవును వెలుగు కనిపించింది.
'' నీ గుండెపై కుట్టి ఉంది చూస్కో ..'' అన్నాక గుర్తొచ్చింది, తను తల దించి చూడలేదు కదా అని. ఏమనుకుంటుందో పాపం అని భయపడ్డా.
కానీ '' అవునా .. అయితే అది నా పేరే అన్న మాట. ఆ గుడ్డ కుడుతున్నప్పుడు అనుకున్నాను అదే అయ్యుంటుందని..''అన్నది.  ఇప్పుడింకా ఉత్తేజంగా ఉంది, చిన్న పిల్ల కదా.
''మీ కక్కడ ఇబ్బందిగాలేదా?'' కొంచెం జాలిగా అడిగింది. 'నిజమే నా మీదంతా కొత్త చెత్త పేరుకుపోయి ఉంది. ప్లాస్టిక్ ఏరుకునే వాళ్ళు ఎన్ని సార్లు నన్ను దోర్లగించారో. చివరకిలా కేవలం కళ్ళు మాత్రమే మిగిలి పోయేంత
మునిగిపోయాను.'
'ఈ నీలికళ్ళు నన్నిబ్బంది పెడుతున్నాయి. ఎటు కదలకుండా నన్నే చూస్తూ, జ్ఞాపకాల మొదళ్ళను వెతుకుతూ, ఇంతకు ముందు నీలికళ్ళ తాలుకూ ముఖం తెలియదు నాకు. ఇప్పుడలా కాదు ఈ నీలికళ్ళ గురించి మొత్తం తెలుసు నాకు. అలా మాట్లాడుకుంటుంటే ఎన్ని రోజులు గడిచి పోయాయో. ఒక రోజు అర్దరాత్రి హటాత్తుగా అడిగింది, ''నన్ను పెళ్లి చేసుకుంటారా ..?'' అని.
''నాకు చాలా సార్లు పెళ్లైపోయింది'' నవ్వేసాను నేను. తను ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు తన మాటల్లో బాధ లేదు, నా మీద ప్రేమ తప్ప. ఇంతకుముందు నేను చుసిన ప్రేమకి దీనికి తేడా ఉంది. అది మలయా మారుతంలా
మృదువుగా ఉండేది. ఇది ఒక ఉప్పెన.
తననేప్పుడు తాకలేదు. ఆ అవసరం రాలేదు. కాని అంతా తానే, నాకు తెలియకుండానే పడిపోయానా తోలు హృదయంలోకి.
ప్లాస్టిక్ ఏరే వాళ్ళకోసం ఎదురుచూడటం ఒక పనైపోయింది నాకు. మళ్ళీ నన్ను దొర్లగిస్తే, నన్ను నేను తనకి పూర్తిగా చూపాలని ఉంది. మరి తనకంటే నేను చాలా ఎత్తు కదా! పైగా నాకు మీసం కుడా ఉంది. నా కాలుకున్న గాయం
గుర్తొచ్చినప్పుడల్లా వేనుకాడేవాడిని. కానీ అంతలోనే నవ్వొచ్చింది. అవును ... నేనొక ముసలి తోలుబొమ్మను, కాని నా హృదయం కాదు.
తను చూసిన బొమ్మల గురించి చెప్పేది, నా గురించి క్షుణ్ణంగా అడిగేది. మా ఇద్దరినీ కలిపి ఊహించుకునేది. ఎవరన్న మా ఇద్దర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పెళ్లి చేస్తే అని ఆలోచించేది. మా పెళ్లి గురించి మాట్లాడేది. పెళ్లి కానందుకు బాధ పడేది. 'నా కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో' అని నవ్వేసేది. తన గుండె మీద నా పేరు కుట్టించుకోవాలని ఉన్నదనేది.
'అసలు పెళ్లి అంటే ఎందుకిష్టం  ఇంత?' అని అడిగానోకసారి. 'వచ్చే సంవత్సరం ... తన పెళ్లి చేద్దాం అనేదిట లక్ష్మి. ఇంతలోనే ఇలా అయిందిట. అయినా అలా ఎవర్నోకరిని చేస్కోనందుకు చాలా ఆనందంగా ఉంద'ని కూడా చెప్పింది.
నేను పుట్టిన ఇన్ని సంవత్సరాల తర్వాత నాకో పేరు పెడతానంది, తనకి చాలా ఇష్టమైన పేరుట. అలాగే పెట్టింది. నాకే నవ్వొచ్చే పేరు. 'బావ'. అది పేరుట.
వాళ్ళ లక్ష్మి ఒక అబ్బాయి వెనక ఇలానే పిలుస్తూ తిరుగుతుందిట ఎప్పుడూ. వాడు ఆడుకుంటుంటే వాడి వస్తువులు పట్టుకుంటుందిట. వాడినేమన్న అంటే తను పోట్లాటకెల్తుందిట. వాడు ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకుంటుందిట, ఎక్కడ తింటే అక్కడే తింటుందిట. తనకీ అలానే చెయ్యాలనుందిట.
అప్పటినుంచి నన్ను అలానే పిలిచేది. ఒకసారి మరీనూ .. రాత్రంతా పిలుస్తూనే ఉంది, ఆగమన్నా ఆగకుండా. నాలో ఇదివరకటి నిర్లిప్తత లేదు. నాపై ఉన్న విరిగిపోయిన ఎర్ర కారు బరువనిపించడంలేదు. ఆ చుట్టూ పక్కల విసర్జితాల వాసన చిరాకు తెప్పించడం లేదు. ఇంతకాలం కదలకుండా ఉన్నందుకు విసుగు లేదు. అప్పుడప్పుడు పడే వానకి ఎప్పుడో చెరిగిపోయిన బూడిదలో కరిగిపోయిన మృణాలిని ఇదివరకటిలా గుర్తు రావడం లేదు. నా గాయాలు నన్ను తోడేస్తున్నాయన్న భయం లేదు. అంతా ఆనందమే.
సూర్యుడు చంద్రుడు మాలాగే విరామంలేకుండా తిరుగుతున్నారు. ఆరు నెలలు కదిలాయి. ఒక ఉదయాన్నే పెద్ద కుదుపుతో మా కుండీ పక్కకి ఒరిగింది. ముందు నేను, నాపై తను పడింది. అలా ఇద్దరం బైట పడ్డాం. ఎంత అదృష్టం తను నా మీదే ఉంది. ఇంకా గడ్డలు కట్టని తన దూది మెత్తగా తగిలింది. నా మోకాలు నుంచి, నా గుండెల దాకా ఉంది నా బంగారం.
నిలువెల్లా తనని తగులుతుంటే ... నవ్వొస్తోంది, ఇద్దరికీ. ఆపకుండా నవ్వుతున్నాం.
ఒక్కసారిగా నా నవ్వు ఆగిపోయింది. తను ఆదుర్దా పడింది. 'ఎంట'ని రెట్టించింది. ఏమని చెప్పను ..? 10 సంవత్సరాల క్రితం వచ్చిన అదే మరచిపోలేని వాసన. తనని హత్తుకోవాలనిపించింది. ఎందుకో బాధ లేదు. కొంచెం సేపటికి మేము తడిసాం ఆ ద్రవంలో.
పచ్చని, ఎర్రని జ్వాలలాక్రమించాయి నిమిషాల్లో మా చుట్టూ. దానిని ఆపలేను. కాని ఇది కచ్చితంగా ఇంతకుముందులా కాదు. ఈ నీలి కళ్ళకి చివరిదాకా నేను తోడున్నా. తన కళ్ళలో నన్ను వదిలి వెళ్తున్నా అన్న బాధ.
మెల్లిగా అడిగాను .. ''నన్ను పెళ్లి చేసుకుంటావా యువరాణి'' అని మునుపటి నేనులా. దహిస్తున్న మంటల్ని లెక్క చేయకుండా అందంగా నవ్వింది, నాకు మాత్రమే వినపడేలా.
నా హృదయం తిరిగి అతుక్కున్నట్టు అనిపించింది.

No comments:

Post a Comment

Pages