నారాయణ పెళ్లి – న భూతో న భవిష్యతి - అచ్చంగా తెలుగు

నారాయణ పెళ్లి – న భూతో న భవిష్యతి

Share This

నారాయణ పెళ్లి  – న భూతో న భవిష్యతి

- జి. లీలాసౌజన్య 


నారాయణ మా ఆఫీస్ లో పెళ్ళికాని బ్రహ్మచారి. ఎప్పుడూ టైం కి రావడం, టైం కి వెళ్ళడం అన్నీ పధ్ధతి ప్రకారం జరగాలంటాడు. మనిషికి అతి శుబ్రం. మన చేతిలోంచి పెన్ ఇచ్చినా, తన రుమాలుతో తుడుచుకుని కాని, ముట్టుకోడు. శుభ్రత- పరిశుభ్రత  గురించి తెగ క్లాస్సులు పీకుతూ ఉంటాడు. వయసు ముప్పై దాటబోతున్నా పెళ్లి కాలేదని తెగ బెంగ పడిపోతూ ఉంటాడు.
ఎవరైనా ‘నీకేంటి నారాయణా ! మంచి పిల్ల దొరుకుతుంది, ‘ అంటే, ‘ఊరుకో తమ్ముడూ, పెళ్ళైన వాడివి, ఎన్నైనా చెప్తావ్,’ అనేవాడు. మేమంతా చెన్నై కాంక్రీట్ జంగల్ లో కుస్తీలు పడుతూ ఉంటే, సెలవలకు వాళ్ళ ఊరు వెళ్ళొచ్చి, పల్లెటూరంటే మా ఊరే ! పచ్చని పొలాలు, తోటలు... హబ్బ ! ఊరు వెళ్తే బలం రెట్టింపు అవుతుంది అనేవాడు. అన్నట్టు చెప్పడం మరిచానండోయ్... మన నారాయణ ఊరిపేరు... కొత్తపెంట !( న్యూ షిట్ అని... అరవ వాళ్లకి అర్ధమయ్యేలా చెప్పేవాళ్ళం.)
విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర అదొక కుగ్రామం. అలాంటి నారాయణ కు మరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పెళ్లి కుదిరింది. ఇంక మనోడిని పట్టగలమా... సిగ్గులు, నవ్వులు, ఫోన్లు... టాక్ ఆఫ్ ది ఆఫీస్ – నారాయణ అయిపోయాడు.
మొత్తం ఒక 8 మంది చెన్నై నుంచి, నారాయణ పెళ్ళికి బయలుదేరాం. పల్లెటూరు, పొలాలు, చిక్కటి గేదె పాలు, చల్లగాలి అని – ఇలా రకరకాల ఊహలతో... ఇద్దరు అమ్మాయిలు కూడా పల్లెటూరు చూడాలని, ఆనందంగా మాతో వచ్చారు.
వైజాగ్ లో దిగ్గానే, మాకోసం క్వాలిస్ పంపాడు. హోటల్ గదులు, వైజాగ్ లో సైట్ సీఇంగ్, ‘అబ్బో, నారాయణ నారాయణ కాదు, మర్యాద రామన్న !’ అనుకున్నాం. ఎన్నెన్నో ఊహలతో మేమంతా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. కొత్తపెంటకు బయలుదేరాము. క్వాలిస్ లో డ్రైవర్ తమ్ముడు అన్నీ ప్రేమగీతాలే పెట్టాడు. మాలో ఒకడు, ‘అబ్బబ్బ, ఏ ఊరు తమ్ముడూ, భలే పాటలేట్టావ్ , మనసు ఎటో వెళ్ళిపోయింది, ‘అన్నాడు. “ మాది ‘పెంట’ అన్నా...” అనగానే, ‘ఏది మన నారాయాణ పెంటేనా , అని అడగబోయి, ‘ఓ షిట్, మా నారాయణ ఊరేనా ?’ అని అడిగాడు మా ఫ్రెండ్.
‘లేదన్నా ! అది కొత్త పెంట, మాది ఉత్త పెంటే ! ముందు మా పెంటే పుట్టింది. తర్వాత కొందరు కలిసి, ఆ పెంట ఏర్పరచి, దానికి కొత్త పెంట అని పేరు పెట్టారు. అసలు మా పెంట గురించి చెప్పాలంటే...’ అని మొదలుపెట్టాడు.
అందరం ‘తమ్ముడూ ! ఆపు నీ పెంట పురాణం అని బ్రతిమాలితే, కాసేపాగి, మీకు బోర్ కొట్టినప్పుడు చెప్తాలే !’ అని వదిలేసాడు.
వైజాగ్ నుంచి బొబ్బిలి దాకా అలా సరదాగా కబుర్లు, జోకులతో సమయం ఎలా గడిచిందో తెలీలేదు. మధ్యలో పచ్చని చేలు, పొలాలు చూసి, ‘ఆహా ! దగ్గరికి వచ్చేస్తున్నాం ! వెళ్ళగానే నారాయణ ను గాల్లోకి ఎత్తేసి, గోలగోల చెయ్యాలి,’ అని పధకం వేసుకున్నాం.
బొబ్బిలి రాగానే ఒక ప్రక్కకు తిప్పాడు డ్రైవర్ తమ్ముడు. అక్కడి నుంచి ఒక్క చెట్టు కనిపిస్తే ఒట్టు ! గతుకుల రోడ్డు, 4 కిలోమీటర్లు 40 నిముషాలు పట్టింది. అసలు కధ ఇక్కడే మొదలవుతోంది...
ఊళ్లోకి వెళ్తుంటే ఒక పెద్ద మురుక్కాలవ. పల్లెటూరు అన్నాకా పిల్లకాలువ, మురుక్కాలువ మామూలే, అనుకుంటూ, 4 కిలోమీటర్ల ప్రయాణంలో పట్టేసిన నడుముల్ని సవరించుకుంటూ బండి దిగాము. ఇంటి ముందు శామ్యానా వేసి ఉంది. (తాటాకు పందిరి అనుకున్నందువల్ల  కొంచెం నిరాశ పడ్డాం ). నారాయణ లుంగీ ఎగ్గట్టి, అలసటగా ఉన్న మొహంతో ఎదురొచ్చాడు. ‘ రండిరా ! ఆకలేస్తోందేమో, ముందు భోజనాలు చేద్దురు, ‘ అన్నాడు ఇంట్లో అందరి పరిచయాలు అయ్యాకా !
ఉన్నట్టుండి ఇంటిపైన గోల. పైనజనాలు దేని కోసమో కొట్టుకుంటున్నట్టు ఉంది. మేడపైన భోజనాలట ! అప్పటికే కలిపిన రస్నా కోసం జనాల హడావిడి అది. రస్నా డ్రం లో అప్పటికే నలురైదుగురు పిల్లలు నడుం దాకా మునిగి ఉన్నారు. అది చూసి, ‘రస్నా వద్దు బాబోయ్ ‘ అని డిసైడ్ అయ్యాము.
బాగా దాహంగా ఉందంటే, ఇంకో 2, 3 డ్రమ్ములు చూపాడు. మంచినీళ్ళు కేవలం సాయంత్రమే వస్తాయి. అందుకే నిన్ననే పట్టి పెట్టాము, అన్నాడు. వాటి నిండా ఈగలు, దోమలు ఈత కొడుతున్నాయి. ‘నీళ్ళు వద్దు బాబోయ్... సాయంత్రం నేరుగా పంపు నుంచే తాగాలని’ డిసైడ్ అయ్యాము.
బాగా ఆకలేస్తోంది. భోజనం చేద్దామని వెళ్ళాము. అక్కడ కూడా చిన్న తోపులాట ! చేత్తోనే కూరలు అవీ వడ్డిస్తున్నారు. అన్నంలో చెయ్యి ముంచి వడ్డిస్తున్నారు. మాతో వచ్చిన నిఖిల్ గాడు, నేను అన్నం తిన్ను, నీళ్ళు త్రాగను, అని దీక్ష మొదలెట్టాడు.
‘నారాయణ పెళ్ళికి నిఖిల్ నిరాహార దీక్ష !’ అని పేరు పెట్టి ఏడిపించాము. మేము ఆకలితో చచ్చిపోతామేమో అని భయపడి, కాస్త బిర్యాని పెట్టించుకుతిని, ఈగలు ఏరుకున్న నీళ్ళు కొంచెం త్రాగేసి, కిందకి వచ్చాం. నా కడుపులో కొంచెం తేడాగా ఉండి, నారాయణ దగ్గరికి వెళ్లి, ‘ప్రకృతి పిలుస్తోంది,’ అన్నాను.
‘సారీ రా, మా ఇంట్లో ఇప్పుడే బాత్రూం కట్టిస్తున్నాం, మా బావ ఇల్లు పక్క వీధే ! అక్కడికి వెళ్ళండి, ‘ అన్నాడు.  అక్కడ బాత్రూమ్స్ లేవు అనేసరికి, మొత్తం మందంతా ‘బావ ఇంటికీ జై’ అని బయల్దేరాము.
ఇప్పటికీ నాకర్ధం కాలేదు. ఒక బాత్రూం లో రెండు ఇండియన్ కమోడులు ఎందుకు ఉంటాయో ! హమ్మయ్య, అనుకుని, ఆరుబయట మంచాలుంటే అడ్డం పడిపోయాం. నిఖిల్ గాడు ఊరంతా తిరిగొచ్చి,(ఊరంటే రెండు వీధులు మాత్రమే...) దాహంగా ఉంది, ధంసప్ తాగుదాం అంటే, ఉన్న ఒక్క కొట్టు మూసేశారు. దాహం అని గోల ! ఆ నీళ్ళు త్రాగామంటే, ‘నో, నేను బైటికేల్తే మినరల్ వాటర్ తప్ప త్రాగను,’ అని మొరాయించాడు.
‘నారాయణ గాడు ఇక్కడికి రానీ, చచ్చాడే ! వాడి పెళ్ళికొస్తే. నా చేత ఉపవాసం చేయిస్తాడా ?’ అని ఏడుపు మొదలెట్టాడు.
సాయంత్రం అయ్యింది, స్నానాలు చేద్దామని, ‘బాత్రూం ఎక్కడండి ?’ అని నారాయణ అక్కని అడిగారు అమ్మాయిలు. ‘మొగాళ్ళంతా బైటేగా తానాలు. ఆడంగులు ఇంట్లో మధ్యలో అటూఇటూ తలుపులేసుకుని, పోస్కోండమ్మా,’ అని చెప్పింది. అప్పుడు చూసాం అక్క ఇల్లు పూర్తిగా ! మండువాలోగిలి ఇల్లు లాగా, డాబా ఇల్లు మధ్యలో ఖాళీ ! అటూఇటూ రెండేసి గదులు. మధ్యలో ఉన్న స్థలంలోనే అంట్లు తోమడం, ఆడాళ్ళ స్నానాలుట ! అమ్మాయిలు ‘ఎవరైనా డాబా ఎక్కితే ఎలా?’ అంటే...
‘ ఎవ్వరెక్కుతారు ? ఎక్కినా రేయ్... పొండ్రా తానాలాడుతున్నాం, అంటే, రయ్యి మని పారిపోరూ !’ అంది అక్క.
మెట్ల మీద నేను, రాము గాడు జేమ్స్ బాండ్ లాగా కాపలా ఉంటే, అమ్మాయిలు బిక్కుబిక్కుమంటూ స్నానాలు చేసొచ్చారు. మేమైతే బహిరంగ  స్నానాలు చెయ్యలేక మొహాలు కడుక్కుని, బాగా పౌడర్ కొట్టేసుకున్నాం. ఇక పెళ్లింటికీ వెళ్తే, రోడ్డుమీదే మండపం కట్టి, కుర్చీలు వేసేసారు. చీకటి పడుతుంటే ఊరంతా లైట్లు వేసారు, ఉన్నది రెండు వీదులే కదా ! నారాయణ ఆనందంలో తేలిపోతున్నాడు. సరిగ్గా తిండి లేక, స్నానాలు లేక, నీరసించిన మొహాలతో మేమలా కూర్చున్నాం. ఉన్నట్టుండి పెద్ద శబ్దం వినబడింది!
మంది అంతా భయపడి, ఏంటా అని అటు చూస్తే, ‘ఆర్కెస్ట్రా ‘ ట. వాడే పాడతాడట, ఊరంతా వినాలట ! నిఖిల్ గాడు పెళ్ళయ్యాకా, పదింటికి వెళ్లి, ‘ఒరేయ్ క్వాలిస్ అడగరా, లేట్ అయిపొయింది,’ అంటే... నారాయణ సిగ్గుపడుతూ, ‘పెళ్ళయ్యాకా, ఊర్లో ఒక్కొక్కళ్ళ ఇంటికి క్వాలిస్ లో వెళ్లి ఆశీర్వాదం తీస్కోవాలి రా ! అదయ్యాకే మీరు వెళ్ళేది,’ అన్నాడు.
ఆర్కెస్ట్రా  వాడు సాయంత్రం 7 కి మొదలెట్టి, పెద్ద సౌండ్ తో, రాత్రి ఒంటిగంట వరకు, బూతు పాటలు, వేదాంతం, శృంగారం, పెళ్లి, విషాదం, అన్నీ కలిపి కొట్టేసాడు. మాకు సర్వాంగాలు పని చెయ్యడం మానేసాయి. ఎవరం డిన్నర్ చేసే సాహసం చెయ్యలేదు. ఆ ఊరేగింపు అయ్యేదాకా, వాడు పాటలతో చంపేస్తూనే ఉన్నాడు. నారాయణ మాత్రం కొత్త పెళ్లి కూతుర్ని చూస్కుంటూ, సిగ్గు పడుతూ, మురిసిపోతూ, ఆనందంలో తేలిపోతున్నాడు. మాకు మైండ్ బ్లాక్ అయ్యి, నీరసంతో బాడీ లో పార్ట్లు పనిచెయ్యడం మానేసి, దాదాపు ఆ పెళ్ళికి బలిచ్చే గొర్రెల్లా అయిపోయాం ! అమ్మాయిల పరిస్థితి అయితే, వర్ణనాతీతం ! నిఖిల్ గాడు అయితే , పెళ్లికొడుకని వదిలేసాడు కాని, లేకపోతే నారాయణ గాడిని ఎప్పుడో చంపేసేవాడు !
ఇంతకీ పచ్చని పొలాలు, తోటలు ఏమున్నాయో కూడా మేము అడగాలా, చూడాలా  ! ఊరుమొత్తానికి ఒకే ఒక చెట్టు కనబడింది ! అర్ధరాత్రి ఒంటిగంట కి ఊరేగింపు పూర్తి చేస్కుని, నారాయణ కార్ దిగుతుంటే, దాదాపు వాడిని కార్లోంచి బైటికి లాగేసి, మేమంతా ఎక్కేసి ‘ తమ్ముడూ !పద నాన్నా !’ అని డ్రైవర్ ని బ్రతిమాలి, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాం. బొబ్బిలి ముందు నిఖిల్ గాడు బండాపి, ఎత్తిన బాటిల్ దింపకుండా నీళ్ళు త్రాగేసాడు.
పెంట లోంచి బయట పడ్డాకా, అందరం ‘బ్రతుకుజీవుడా !’ మొదటిసారి హాయిగా నవ్వుకున్నాం ! ‘పేరు గొప్ప, ఊరు దిబ్బ’ అన్న చందాన నారాయణ ప్రదర్శించిన పటాటోపాలు, చెప్పిన కబుర్లు ఇప్పటికీ తల్చుకుని, తల్చుకుని నవ్వుకుంటాము !

No comments:

Post a Comment

Pages