మేలుకో శృంగార రాయ
  -డా.తాడేపల్లి పతంజలి
 (అన్నమయ్య కుమారులు తాళ్లపాక పెద తిరుమలాచార్యులవారు        మదనగోపాల స్వామికి మేలుకొలుపులు పాడిన కీర్తన ఇది.)                                                 సంపుటము 15-215  PT38 కీర్తనపల్లవి
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
నా పాల మించిన నిధానమా

మదింపచేసే వాడిని మదనుడు అంటారు. అటువంటి గొప్పవాడైన మదనుని వంటి రూపముగలిగిన గోపాలుడా! ఓ విలాస పురుషులలో శ్రేష్ఠుడా ! మేలుకో! భక్తుడనైన నా వైపు (=పాల)ఉన్న గొప్పదైన నిధివంటి వాడా! (ఒక అవసరము కొరకు ప్రత్యేకముగా నిలువచేసిన ధనాన్ని నిధి అంటారు. ఏ అవసరముకోసం నిధి వాడతారో ఆపేరు దానికి పెడతారు. ఇక్కడ మదనగోపాలుడు భక్తనిధి.).

చరణం 1:
సందడించే గోపికల జవ్వనవనములోన
కందువదిరిగే మదగజమవు.
యిందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గందము మరిగినట్టి గండు తుమ్మిదా..2

గుంపులుగా సందడి చేసే గోపికల యౌవనము అనే అడవిలో నేర్పుతో తిరిగే మదమెక్కిన ఏనుగువు నువ్వు. చంద్రునివంటి మోము కలిగిన సత్య భామ హృదయమనే పద్మములో ఉన్న వాసనని మరగిన పెద్దదయిన, కొవ్వెక్కిన తుమ్మెద వంటి వాడా!ఓ మదన గోపాలా!మేలుకో!

చరణం 2:
గతిగూడి రుకిమిణి కౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా.
సతుల పదారువేల జంట కన్ను గలువల
కితమై పొడమిన నా యిందు బింబమా..

రుక్మిణీదేవితో ఉపాయముతో కలిసి(=గతిగూడి= గతిన్+కూడి) ఆమె కౌగిలి అనే పంజరములో సంభోగపు ముద్దులను కురిపించే ఓ రామ చిలుకా! మేలుకో! పదహారు వేలమంది గోపికల కన్నులనే కలువలజంటయందు ముందుగా (= కితము) పుట్టిన నా చంద్రబింబమా ! ఓ మదన గోపాలా!మేలుకో!

చరణం 3:
వరుసంగొలనిలోని వారి చన్నుగొండలపై
నిరతివాలిన నా నీలమేఘమా
సిరినురమున మోచి శ్రీవేంకటాద్రి మీద
గరిమ వరములిచ్చే కల్పతరువా
వరుసగా సరస్సులో ఉన్న గోపికల స్తనములనే కొండలపై మిక్కిలి ఆసక్తితో వాలిన నా నల్లని మేఘమువంటి వాడా ! లక్ష్మీదేవిని రొమ్ము మీద మోస్తూ, శ్రీ వేంకట పర్వతము మీద గొప్పగా(=గరిమ) వరములు అనుగ్రహించే కల్పవృక్షమువంటివాడా ! ఓ మదన గోపాలా! మేలుకో!

విశేషాలు
1.మదనగోపాల స్వామి మీద అన్నమయ్య వ్రాసినట్లుగా ఈ జోల  పాట ప్రసిద్ధము.
జో అచ్యుతానంద జోజో ముకుంద
లాలి పరమానంద లాలి గోవింద

అంగజుని గన్న మాయన్న యిటు రారా
బంగారు గిన్నెలో బాలు పోసేరా
దొంగ నీవన సతులు పొంగుచున్నారా
ముంగిట నాడరా మోహనా కారా || జో ||

గోవర్థనంబెల్ల గొడుగుగా బట్టి
కావరమ్ముననున్న కంసు బడగొట్టి
నీవు మధురా పురము నేల జేపట్టి
ఠీవితో నేలిన దేవకి పట్టి || జో ||

అంగుగా దాళ్ళ పాకన్నయ్య చాల
శృంగార రచనగా జెప్పె నీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదన గోపాల || జో ||
ఈ జోల పాట చివరలో తిరుపట్ల మదన గోపాల దేవుని ముద్ర ఉంది. కనుక అన్నమయ్య రచించినది కాదని ప్రభాకర శాస్త్రి గారిలాంటి పెద్దల అభిప్రాయము.తండ్రి వ్రాసాడో లేదో తెలియదు కాని -ఆ మదనగోపాలునికి మేలుకొలుపులు మాత్రం కుమారుడు భేషుగ్గ  వ్రాసాడు.


మేలుకో
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం తొమ్మిదవ అధ్యాయం లో స్వామి నిద్ర పోతున్నాడనే వర్ణనలోని అంతరార్థాన్ని తెలిపే శ్లోకం  ఒకటి ఉంది.
యోవిద్యయానుపహతోపి దశార్ధవృత్త్యా
నిద్రామువాహ జఠరీకృతలోకయాత్రః
అన్తర్జలేహికశిపుస్పర్శానుకూలాం
భీమోర్మిమాలిని జనస్య సుఖం వివృణ్వన్
చుట్టూ నీరు, మధ్యలో పాము, పాము మీద స్వామి.ఇదీ వర్ణన.
ఇందులోని అంతరార్థం ఇది.
ఆ వర్ణనంతా  మన జీవితంలో పరమాత్మను ఎలా ఆరాధించాలో చెబుతుంది.
విషయములు అంటే లోతెంతో ఉందో తెలియని  జలము
విషయములలో ఉండే విషముతో కూడినది పాము.
అలాంటి విషపూరితమైన ఇంద్రియస్వభావాలతో తిరిగే ఈ  ప్రపంచంలో   మనలిని రక్షించటానికి  దేవుడు మనలోనే  ఉన్నాడు అనే భావన మనలో  కలగటానికే మేలుకొలుపులు. స్వామీ ! నేనేమన్నా తప్పులు  చేస్తానేమో ! నన్ను చైతన్యం వైపు మేల్కొలుపు అని చేసే  ప్రార్థనే శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం.  ఈ పెద తిరుమలయ్య మేల్కొలుపు.   
      మనందరికీ ఉండే  అవిద్య అయిదురకాలు. 1.తామిస్రము (=చీకటి) 2.అంధ తామిస్రము3. మోహము 4. మహా మోహమూ 5. తమస్సు .చీకటి నాలుగు రకాలు 1. వెలుతురు  లేకపోవటం  2. వెలుతురు ఉన్నా మనం చూడకపోవటం  3. వెలుతురు ఉన్నా  మనము చూడాలనుకొనే  వస్తువు లేకపోవటం  4. పైన చెప్పిన ఈ మూడూ ఉన్నప్పటికీ  చూడాలన్న సంకల్పం లేకపోవటం. ఇటువంటి అవిద్యాత్మకమైన  చీకటి (= అజ్ఞానము)  నుంచి మమ్మలిని మేల్కొలుపుమని స్వామికి ప్రతీకాత్మకంగా చేసే ప్రార్థనే మేల్కొలుపు.
శృంగార రాయ
      రాయ అంటే  a title assumed by rulers of the Kannada country. అని శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953  వివరిస్తోంది. అన్నమయ్య వాజ్ఞ్మయంపై  కన్నడ ప్రభావాన్ని ఈ రాయ శబ్దం నిరూపిస్తోంది.
మదగజమవు.
      అసలు గజమంటేనే మదము ఎక్కినది అని అర్థము. .దానికి ముందు మళ్లీ  మద విశేషణము. మదమెక్కించే  మన్మథుని  పేరును తన పేరు ముందు పెట్టుకొన్న  గోపాలుడు మద గజము వంటి వాడని పైకి అర్థము.
      అవిద్యలో మూడవది మోహము. మోహమంటే ఉన్న దానిని ఇంకోదానిగా చూచే స్వభావం.కృష్ణుని పై  మనకున్న దృష్టి ఇటువంటిదే.ఈ దృష్టిని దాటి, పరమాత్మ భావాన్ని ఆయనలో నిలుపుకోవాలి.ఈ చరణములోని అంతరార్థము ఇది.

వరుసంగొలనిలోని వారి చన్నుగొండలపై/నిరతివాలిన నా నీలమేఘమా
      కృష్ణుని ఇలా గోపికల చన్ను కొండలపై వాలిన మేఘముగా వర్ణించారు. దేవునికి ఈ శృంగారము ఎందు కబ్బా ! అని మనకు అనిపిస్తుంది. దీనికి  భాగవతములో జవాబు వెతుకుదాం.
గోపికలకు , కృష్ణునికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియచేసే రెండు  గొప్ప పద్యాలు పోతనగారు  పక్క పక్కనే వ్రాసారు.
విషజలంబువలన విషధరదానవు
వలన ఱాలవానవలన వహ్ని
నున్నవానివలన నొగి మమ్ము రక్షించి
కుసుమశరుని బారిఁ గూల్పఁ దగునె? (10.1-1040)
విషపూరితమగు  నీటి నుండి సర్ప రూప  రాక్షసుని నుండి రాళ్ళ వాన నుండి  కార్చిచ్చునుండి  తక్కిన ఆపదల నుండి  మమ్ములను కాపాడావు. మన్మథుని బాధలకుదొరకునట్లు  తోయుట  యుక్తమేనా! కాదు.

నీవు యశోదబిడ్డడవె? నీరజనేత్ర! సమస్తజంతు చే
తోవిదితాత్మ; వీశుఁడవు; తొల్లి విరించి దలంచి లోకర
క్షావిధ మాచరింపు మని సన్నుతి చేయఁగ సత్కులంబునన్
భూవలయంబుఁ గావ నిటు పుట్టితి గాదె మనోహరాకృతిన్. (10.1-1041)
పద్మాక్షుడా, కృష్ణుడా!  నీవు యశోదాదేవి యొక్క కొడుకువా ! కాదు.   సమస్తమైన జీవుల యొక్క చిత్తములందు తెలియబడెడి పరబ్రహ్మవు; సర్వనియామకుడవు.  బ్రహ్మదేవుడు ధ్యానించి జగత్తును కాపాడునట్టి మార్గమును చేయుము అని స్తోత్రము చేయగా  భూమండలమును కాపాడుటకు  అందమైన  రూపముతో ఈ విధముగ అవతరించితివికదా!

      పై రెండు పద్యాలు ఇంచుమించుగా విరుద్ధాలు. మొదటి దానిలో అన్నిటిలోనుంచి కాపాడావు. మన్మథుని బాధలనుంచి కాపాడవయ్యా!అంటున్నారు. సరిగ్గా దానికింద పద్యములో ఆయనను పరబ్రహ్మగా ఆరాధిస్తున్నారు.
     
      మొదటి మెట్టులో ఉన్న కృష్ణ శృంగారాన్ని  అర్థము చేసుకోలేక అక్కడే ఆగిపోతే , పరబ్రహ్మగా ఆరాధించే  రెండవమెట్టుకు చేరలేము.
అవిద్యలో  మహా మోహమును కూడా అంటే వస్తువును వాస్తవముగా గుర్తించలేకపోవటం చెప్పారు.  మొదటి పద్యము మహా మోహానికి సంబంధించింది. రెండవ పద్యము వాస్తవాన్ని గుర్తింపచేసేది.  

       అన్నమయ్య వంశీకుల  శృంగార కీర్తనలలో  కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. కీర్తనలలో పైకి కనిపించే శృంగారపు మొదటి మెట్టు దాటిపోవాలి. గొప్పగా వరములు అనుగ్రహించే కృష్ణ కల్పవృక్షమును ధ్యానించాలి. అవిద్యకు సంబంధించిన 1.తామిస్రము (=చీకటి) 2.అంధ తామిస్రము3. మోహము 4. మహా మోహము 5. తమస్సు . దశలు దాటి పోవాలి.శృంగార భావాలు మనలోని అవిద్యను అద్దంలోలా మనకు చూపించి , మన దృష్టి కోణాన్ని మార్చుకొని పరబ్రహ్మగా ఆరాధించే గమ్య స్థానానికి చేరమని చెబుతుంటాయి. అన్నమయ్యగాని, పెదతిరుమలాచార్యులు కాని – ఇచ్చే సందేశమిదే. స్వస్తి.
 ***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top