Sunday, March 22, 2015

thumbnail

అన్నమయ్య సంకీర్తనా మహతి - శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

అన్నమయ్య సంకీర్తనా మహతి - శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

- మధురిమ

    
పదకవితా పితామహుడు అన్నమాచార్యులవారు సుమారు 36,000 సంకీర్తనలను రచించినారట.అందులో కేవలం 12,000 సంకీర్తనలు మాత్రమే ప్రస్తుతం లభ్యం అవుతున్నాయట. ఏ వ్యక్తి అయినా తన జీవిత కాలంలో ఈ 12,000 సంకీర్తనలు వినగలడా? ఆ 12,000 విష్ణు కధా గానాలు వినే భాగ్యము ఎవరికైనా దక్కుతుందా? ఆయన కారణ జన్ముడైతే వినగలడేమో!
మరి ఒకవ్యక్తి దివ్య శక్తిలా కేవలం 25సంవత్సరాల వ్యవధిలో సుమారు 1000 సంకీర్తనలు స్వరపరిచారంటే ఆయన కారణ జన్ముడు అని అనుటలో అతిసయోక్తి లేదుకదా.
అలాంటి , శ్రీవారి సంకల్పకారణా జన్ములు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.
బాలకృష్ణ ప్రసాద్ గారు నవంబరు 9, 1948వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రీ లో జన్మించారు.వేదంలా ప్రవహించే గోదావరి ఉన్న రాజమహేంద్రిలో పుట్టారు కాబట్టే ఆయన సంకీర్తనా గాన  ప్రవాహం గోదావరి వలే జీవనదిలా నిత్యం పరవళ్ళు తొక్కుతూ నిరంతరం ప్రవహిస్తూ ఉంది.
ఆయన తండ్రి శ్రీ గరిమెళ్ళ నరసింహారావు గారు, గొప్ప గాయకులు, వాగ్గేయకారులూ కూడా."సంగీత స్వర సాహిత్య సంపుటి"అనే గ్రంధ రచయిత కూడా.ఈ గ్రంధం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో 1974లో అచ్చు అయ్యింది కూడా. తల్లి కృష్ణవేణమ్మగారు గాత్రంలో వాయులీనం వాయించడంలో  ప్రవీణురాలు. అటువంటి వారింట ఆ వేంకటేశుడు ఆయనను జన్మింప జేసినందుకు ఆయనకు సంగీతం వెన్నతో పెట్టిన విద్య అయ్యింది మరి.
జననీ జనకులే శృతిలయలు నేర్పిన తొలి గురువులు.
 1978లో కర్ణాటక సంగీతంలో డిప్లమో పూర్తిచేసి తి.తి.దే వారి అన్నమాచార్య ప్రాజెక్టులో గాత్ర కళాకారులుగా చేరినారు.ఇదికూడా స్వామివారి సంకల్పమేమరి. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉదేశ్యం అన్నమయ్య సంకీర్తనా ప్రచారం. 1978 నుంచీ 2006 వరకూ ఈ ప్రాజెక్టులో నిర్విరామంగా పనిచేసి సుమారు 700 అన్నమాచార్యులవారి కీర్తనలను స్వరపరిచి ఇందులోభాగంగా శ్రీ నేదునూరికృష్ణమూర్తి, మంగళంపల్లి బలమురళీకృష్ణ వంటివారి దగ్గర శిష్యునిగా ఎన్నో విషయాలు తెలుసుకుని తానుకూడా గురువుగా శ్రీ జి. మధుసూధనరావు, బి.రఘునాథ్, సరస్వతి ప్రసాద్ వంటి మేటి శిష్యులను కూడా తయారు చేసినారు.
 ఎ.ఐ.ఆర్ లో లలితసంగీతంలో "ఎ" గ్రేడ్ ఆర్టిస్టుగా, శాస్త్రీయ సంగీతంలో "బి హై" గ్రేడ్ ఆర్టిస్టుగా ఇప్పటికీ కొనసాగుతున్న ప్రతిభాశాలి. ఇక వారి సంకీర్తనా గాన  యజ్ఞం అనే విషయానికొస్తే ఇప్పటివరకూ వారు 5000 కచేరీలు చేసారు.
అన్నమయ్య సంకీర్తనా గానంలో ఆయనకే గల కొన్ని ప్రత్యేకతలు :
1.ఇప్పటివరకూ సుమారు 1000 అన్నమయ్య కీర్తనలు పాడిన ఏకైక కళాకారుడు. ఈవిషయం తెలిసాక మనకి ఏమనిపిస్తుందంటే అన్నమయ్య , కీర్తనలు 14వ శతాబ్దం లో రాసాడు.అప్పుడు వాటిని ఆయన ఎలా పాడాడో  మనం ఎవ్వరం వినలేదు మరి. అందుకే మళ్ళీ ఈమహానుభావుని రూపంలో స్వామిసంకల్పం చేత జన్మించి వాటిని స్వరపరుస్తూ మనం పాడుకునేలా చేస్తున్నాడు..కనుక ఈయనను అపర అన్నమయ్య అనుటలో అనుమానం అఖర్లేదు.
2.సుమారు 200ల రాగాలలో లలిత, జానపద శాస్త్రీయ ప్రక్రియలలో కీర్తనలు ఆలపించారు.
3.సుమారు 100 క్యాసెట్లు,సీడీలలో 400ల సంకీర్తనలు ఆయన గళం నుండీ జాలువారాయి.   అందులో కొన్ని బహుళ జనాదరణ పొందినవి  వినరో భాగ్యము విష్ణుకథా, జగడపు చనవుల, వొచ్చెను అలమేలుమంగా, తిరువీధుల మెరసి,  చూడరమ్మ సతులాల,  జయ  లక్ష్మి వర లక్ష్మి, ఆదిమూలమె మాకు అంగరక్ష ,ఆంతయు నీవే, ఏమని పొగడుదుమే, పిడికిట తలంబ్రాల ....
వీరు చేపట్టిన కొన్ని విశేష కార్యక్రమాలు:
అన్నమయ్య సంకీర్తనాలహరి అనే కార్యక్రమం ద్వారా డా.సి.నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానంలో ఎన్నో మంచి భక్తిరస ప్రధానమైన కీర్తనలు ఆలపించారు.ఈ కార్యక్రమం డిడి సప్తగిరిలో 25 భాగాలుగా  ఆరునెలల పాటు ప్రసారం అయ్యింది.
హరి సంకీర్తనం : ఈ కార్యక్రమం భక్తి ఛానెల్లో 2008వ సంవత్సరం నుండీ సుమారు రెండున్నర సంవత్సరాలు ప్రసారం అయ్యింది. ఈ కార్యక్రమంలో వారానికో కీర్తన నేర్పించేవారు.ఈ కార్యక్రమం కూడా ఒక సంచలనమే...
అన్నమయ్య స్వరార్చన: యస్.వి.బి.సి లో 108 భాగాలు ప్రసారం అయ్యిన ఈ కార్యక్రమం చాలా జనాదరణ పొందింది.
లక్షగళార్చన: మే 10,2008 నాడు భారత దేశమంతటా 1,60,000  మంది కళాకారులతో  సిలికాన్ ఆంధ్రా, తి.తి.దే, ఆం.ప్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన   కార్యక్రమంలో అంతమందిచేత ఒకేరోజు  సంకీర్తనార్చనకి సారధ్యం వహించిన ఘనత వీరిదే మరి.
ఇవే కాక నాదోపాసన, నాదయోగి వంటి  కార్యక్రమాలలో ఆయన గురువు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి వద్ద శిష్యులుగా వారి అనుభవాలను పంచుకుంటూ,వారు నేర్పితే నేర్చుకుంటూ,వారివెంట పాడూతూ ఎంత గొప్పవాళ్ళమైనా గురువుముందు ఎంత ఒదిగి ఉండాలో ఆచరించి చూపిన ధన్యజీవి.
బాలకృష్ణ ప్రసాద్ గారి అపూర్వ ప్రచురణలు: ఇప్పటికి ఆయన తి.తి.దే వారి సౌజన్యంతో 8 పుస్తకాలు ప్రచురించారు.ఈ పుస్తకాల్లో  సుమారు 200ల అన్నమయ్య కీర్తనలు స్వర సంహితంగా  లభిస్తున్నాయి. సంగీతాభిమానులు  సంగీత       జ్ఞానము ఎక్కువ  లేకున్ననూ  నేర్చుకునే అంత సరళంగా వీటిని రచించారు.
వాటిలో కొన్ని  అన్నమయ్య సంకీర్తనా స్వరసంపుటి(1993),   అన్నమయ్య నృసింహ సంకీర్తనం(1999) మొదలైనవి ముఖ్యమైనవి.
 ఆయనకు దక్కిన అపూర్వ గౌరవాలు,సన్మానాలు:తి.తి.దే వారిచే ఆస్థాన విద్వాంసునిగా 16నవంబరు,2012 సంవత్సరంలో  నియమించబడి ఆ పదవికే వన్నే తెచ్చిన వారయ్యారు. కంచికామకోటిపీఠం ఆస్థాన విద్వాంసునిగా నియమింపబడిన ఆయన ఆ కామాక్షీ అమ్మవారి పరిపూర్ణానుగ్రహ పాత్రులు. 2007వ సంవత్సరంలో ఆ.ప్ర ప్రభుత్వం నుంచీ ఉగాది పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం  నుంచీ 2009వ సంవత్సరానికి "ఉత్తమ సంగీతజ్ఞ" పురస్కారం పొందారు.
1997లో  శ్రీవేంకటేశ అన్నమయ్య సొసైటీ ఆఫ్ అమెరికా సంస్థచే "అన్నమయ్య నాద జ్యోతి" బిరుదును, అన్నమయ నాద సుధ సమ్రాట్ (2003)అన్న బిరుదును అన్నమయ సంకీర్తన అమృత వర్షిణి సంస్థ నుండి, హరి కీర్తనాచార్య మరియు గానకళ విశారద (2003) యస్.బి.ఐ విజయవాడ నుండి, బాలమురళికృష్ణ ప్రతిభా పురస్కారం(2011) వంటి ఎన్నో బిరుదులు పొందారు. ఇవేకాక కనకాభిషేకం (2003), సువర్ణ గండపెండేరం (2009) విజయనగరం లో కూడ పొందారు.
కర్ణాటక , లలిత సంగీతాలలో అయన చేసిన కృషి: శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు 21 వ శతాబ్దపు వాగ్గేయకారులలో ఒకరు. 300 పైగా కృతులు తెలుగు, సంస్కృతంలో ఇంకా వర్ణాలు, థిల్లనాలు, జావళిలు రచించారు. సుందర రంజని, వాణిప్రియ, సత్యప్రియ, సంజీవి, నాటహిందోళం వంటి రాగాలు సృష్టించి వాటిలో ఎన్నో కీర్తనలు స్వరపరిచారు కూడా. సుందర రంజని రాగం లో వారు రచించి స్వరపరిచిన అంజనేయ కీర్తి మణిమాల ను సంగీత సరస్వతి శ్రీమతి యం.యస్.సుబ్బులక్ష్మి గారు ఆవిష్కరించారు.
లలిత సంగీతానికి ఈయన ఎనలేని సేవ చేసారు. డా.సినారె,సామవేదం షణ్ముఖ శర్మ వంటి వారు రచించిన సుమారు 400 పాటలు సర్వపరిచగా వాటిని ప్రముఖ గాయని గాయకులు అయిన బాలసుబ్రమణ్యం, శైలజ మరియు జానకి వంటి వారు ఆలపించారు. వాటిలో ముఖ్యమయినవి శివపదం, శివామృతం,కృష్ణరవళి, షిరిడి సాయి గీతమాలిక.
త్రేతాయుగ,ద్వాపరియుగాలలో ఋషులు,యజ్ఞ,యాగాదులు చేసేవారని విన్నాం, పురాణగాధలలో చదువుకున్నాం. ఈ కలియుగంలో ఆ శ్రీనివాస ప్రభువు సంకల్పంతో అన్నమయ్య జన్మించాడు  కానీ ఆ పదకవితాపితామహుడి సంకీర్తనలను ఓ సామగాన  యజ్ఞంలా చేస్తున్న ఈ సామవేద ఋత్వికుని ద్వారా విని మనం ధన్యులమవుతున్నాం.
భావితరాలకు ఇంతటి మహాసంపదనిచ్చి ఇంతటి మహద్భాగ్యం కలిగిస్తున్న ఈ మనీషి యొక్క ఈసంకీర్తనా యజ్ఞం నిరంతరం కొనసాగాలనీ అందుకా వేంకాటాచలపతి శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి సంపూర్ణ ఆరోగ్యం తో కూడిన ఆయువును ప్రసాదించాలని ప్రార్ధిద్దాం.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information