తేనెలొలుకు తెలుగు పలుకు

సి.ఉమాదేవి


కథ,కవిత లేదా వ్యాసం ఏదైనా పత్రికలో ప్రచురితమైనపుడు చదువుతారా అని ఈనాటి తరాన్నిఅడిగితే నేనేదో కటికచేదు కషాయాన్ని మింగమన్నట్టు చూసి తెలుగులో రాసారా అని అడుగుతారు.అవునంటే, ఎలా చదవగలం అని తెల్లబోతారు.వారికి ఒకటే ప్రశ్న.ఎందుకు చదవలేరు?చదవడం రాదా లేక మరచిపోయారా, చదివితే అర్థంకాదా?అసలు తెలుగులో అక్షరాలే దిద్దలేదా? నిజానికి నాటి తరం వారే కాస్త పఠనాసక్తి చూపిస్తున్నారు. నేటి తరం తెలుగంటేనే ఉలిక్కిపడుతున్నారు. (దయచేసి తెలుగువారయికూడా తెలుగు చదవలేమనే యువతకు, చిన్నారులకు ఈ వ్యాసం చదివి వినిపించమని మనవి).
తెలుగు బిడ్డడవయ్యు తెలుగురాదంచును
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా?
దేశభాషలందు తెలుగు లెస్సయటంచు
తెలుగుబిడ్ఢా!యెపుడు తెలుసుకుందువురా?
అని పలికిన ప్రజాకవి కాళోజిగారి మాటలు చురుక్కుమనిపించవచ్చునేమో కాని తెలుగుభాషపై మమకారం తరిగిపోతున్నందుకు ఆవేదన పెల్లుబుకుతుంది.
తెలుగంటే కేవలం అచ్చులు,హల్లులు కాదు.తెలుగంటే అమ్మభాష.తెలుగంటే మన మాటను బంగరు పలుకుగా మార్చే పరుసవేది.మన అమ్మను ప్రేమించినంతగా మన మాతృభాష తెలుగును ప్రేమించగలగాలి.తెలుగునాట పుట్టిన,ఏ బిడ్డకయినా కనీసకర్తవ్యమిది. భోగరాజు పట్టాభిరామయ్యగారు తెలుగులో సంతకం పెట్టినందుకు తన చెక్కును  అంగీకరించలేదన్న నేపథ్యమే ఆంధ్రాబ్యాంకు ఆవిర్భావానికి మూలమైంది.మాతృభాషపై ఆనాటి స్ఫూర్తిదాయక ప్రేమకు మనసు పులకరిస్తుంది.
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పొగడ్తల పొగడమాలలేసుకోవడంలో ముందుంటాం.మాట్లాడాలంటే మాత్రం పరభాషకై ప్రాకులాడుతాం.తెలుగు నేర్చుకుని,మాట్లాడితే ఏవైనా ఉద్యోగాలొస్తాయా?ఉపాధి దొరుకుతుందా అని నిస్పృహకు  లోనవుతారు.మాతృభాషలో నిష్ణాతులైనవారు పరభాషలను అవలీలగా నేర్చుకోగలరు.బ్రతుకు భాష ఆంగ్లమే కావచ్చుకాని మనసుభాషను మరవడం భావప్రకటనకు వెన్నుపోటే!మనలోని భావాలను యథాతథంగా పలకగలగాలంటే కావలసినది తీయనైన తెలుగు భాషేకదా! ఒకనాడున్న భాషలెన్నో ఈనాడు లేవు. అలాగే తెలుగునుకూడా తృణీకరిస్తూపోతే అరణ్యాలలో కనుమరుగైన డైనాసరస్ లా తెలుగుభాష కూడా ఏదో ఒకనాడు అంతర్థానమైపోతుంది.భాషాభివృద్ధి జరగటానికి బదులు భాష అంతరించడంలో మనిషే ముఖ్య పాత్రధారి.నానాటికి తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది.భాష అంతరించడమంటే పచ్చని పైరుకు పోషణలేక  మాడిపోవడం వంటిదే. కవిత్రయంగా పిలువబడే నన్నయ్య ,ఎఱ్ఱాప్రెగడ,తిక్కన వ్యాసమహర్షి సంస్కృతమున రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించి తెలుగుభాషకు సొబగులు అలదినారు.వారి రచనలు నేటికీ పాఠ్యాంశాలై సాహితీ సంస్కృతిని  చాటుతున్నాయి. మీ రచనాసక్తికి దోహదపరచిన అంశాలేవి అని అడిగితే చందమామ, బాలమిత్రవంటి బాలసాహిత్యాన్ని  బాల్యంలో చదవగలగడమే అనే వారెందరో ఉన్నారు.ప్రాచీనసాహిత్యాన్ని సులభశైలిలో చిన్నారులకు పరిచయంచేసిన ఘనత బాలలకై వెలువడిన పత్రికలదే.ఒకప్పటి వెన్నెలకుప్పలు, గుజ్జనగూళ్లు వంటి ఆటలెలాను లేవు తెలుగుభాషపై మమతను పెంచకపోతే ఎలా?ఇది ఏ ఒక్కరిపైనో నెపం వేసి చేతులు ముడుచుకుంటే చాలదు. ప్రభుత్వాలు తెలుగు భాషాభివృద్ధికి కంకణబద్ధులై ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పరచాలి.ప్రాచీనభాష హోదా ను  కంటితుడుపుగా భావిస్తే చాలదు,తెలుగులో సాధించవలసిన  కనీసమార్కులు ఉద్యోగార్హతలో ఒక కొలమానం కావాలి.
తెలుగు భాష ఈనాటిది కాదు.హాలుడు రచించిన గాథాశప్తశతి నాటికే తెలుగు పదాలు ఆవిర్భవించినట్లు చరిత్ర చెప్తోంది.భౌగోళిక,చారిత్రక నేపథ్యాలు వేరుకావచ్చు,కాబట్టి తెలుగు పలుకుబడి వేరువేరు కావచ్చు.కాని వివిధ మాండలికాలలోని సొబగు వేటికదే అందమైన పదాలను వినిపిస్తాయి. భాషామాధుర్యాన్ని మన ముందు తరానికి దూరంచేయకండి.తెలుగు భాష,సంస్కృతి విదేశాలలో సైతం గుర్తింపు పొందుతున్నాయి.మన పండుగల నేపథ్యాన్ని తెలుపుతూ అమెరికాలో వినాయకచవితి, బతుకమ్మ పండుగ,దసరా,దీపావళి జరుపుకుంటారు.బొమ్మలకొలువులు, సత్యనారాయణవ్రతం,దీపావళి వేడుకలు చూసినపుడు మన సంస్కృతీ సంప్రదాయాల అభివృద్ధికి మరింత సమయాన్ని మనమెందుకు కేటాయించలేకపోతున్నామని పునరాలోచించాలి. అక్కడ కూడా తెలుగుపాటకు స్వరగళార్చన, శాస్త్రీయమైన పదనర్తన మన కళలకు హారతి పట్తున్నాయి.అమెరికాలో పుట్టిన తెలుగు బిడ్డలకు మాతృభాష నేర్పే బడులు పెరుగుతుంటే మనం తెలుగు బడులకు తెరదించుతున్నాం. జాగ్రత్త! తెలుగు భాష ప్రమాదంలో పడుతోంది.మనమేం చేయాలో ఆలోచిద్దాం.
పిల్లలతో తెలుగులో కూడా మాట్లాడండి.వారిచేత మమ్మీ,డాడీ అనికాక అమ్మ,నాన్న అని పిలిపించుకుని ఆ పిలుపులోని మాధుర్యాన్ని ఆస్వాదించగలగాలి.అందరిని ఆంటీ,అంకుల్ అనే సంభోదిస్తారు.అయితే పెద్దమ్మకు, పిన్నమ్మకు తేడా వివరించండి. పెద్దనాన్నఅంటే తండ్రికి అన్న అని,చిన్నాన్న,నాన్నకు తమ్ముడనే బాంధవ్యాన్ని తెలియచేయాలి.  సామెతలు వాటి పుట్టుక వెనుక కథలు తెలియచేయాలి.పొడుపు కథల విడుపు వారికి ఒత్తిడి చదువుల నడుమ ఆటవిడుపే.అది వారి ఊహాశక్తిని కూడా  పెంచుతుంది.జాతీయాలను భాషలో వినియోగించడమెలాగో నేర్పండి.శతకపద్యాలు వల్లెవేయిస్తే నీతిశాస్త్రం ఔపోసన పట్టినట్లే!బాలసాహిత్యానికి పెద్దపీట వేయనంతవరకు బాలలకు భాషా ప్రాముఖ్యతపై అవగాహన పెరగదు.కనీసం రోజు విడిచి రోజైనా ఒక తెలుగు కథ చదివి వినిపిస్తే, వారిలో తెలుగు నేర్చుకుంటే అవన్నీచదవగలమన్న కోరికకు బీజం పడుతుంది.మనసుపెట్టి ఆలోచిస్తే మార్గం సుగమమే.నేర్చిన చదువు సంపదను పెంచవచ్చు కాని నేర్చిన తెలుగు పలుకులు భాషను అభివృద్ధిపథంలో నడిపిస్తాయి.అంతర్జాలంలో తెలుగు పత్రికలు సాహితీసేవ ద్వారా భాషకు సముచిత స్థానమిచ్చి పాఠకులను పెంచడమేకాక సాహితీ సృజనకారులకు వేదికగా నిలుస్తున్నాయి. ఐప్యాడ్ లో కూడా తెలుగు రాయడానికి తెలుగు ఎడిటర్ ఉపయోగించుకునే వీలుంది. మొబైల్ ఫోన్లు సైతం తెలుగును చదవగలిగేలా రూపొందుతున్నాయి. అవకాశాలున్నా అందుకునే ఆసక్తి కొరవడి మనభాషను మనమే చిన్నబుచ్చుకుంటే మనవేలితో మనకన్నే పొడుచుకున్నట్లు కాదా! మన భాషను, సంస్కృతిని మరచిపోవడమంటే తల్లిని మరచినట్లే. అమ్మభాషకు శిరసానమామి!

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top