రుద్రదండం -11 - అచ్చంగా తెలుగు

రుద్రదండం -11

Share This
రుద్రదండం -11 
 - రాజ కార్తీక్ 9290523901

(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతుండగా ఆమె పరాకును గమనించిన శివుడు, కోపించి, తన చేతిలో ఉన్న రుద్ర దండాన్ని విసిరివేస్తాడు. అది ముక్కలై జంబూద్వీపంలో అనేకచోట్ల పడుతుంది. అవన్నీ దక్కించుకుని, జోడించిన వాడు శివుడే అవుతాడు. రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కపాలుడు. కాశీ నగరంలోని శివాలయంలో రుద్రదండాన్ని సాధించబోయే కారణ జన్ముడు పుడతాడు… ఆ సమయంలో అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు ఒక ఒంటి కన్ను రాక్షసుడు… ఆ రాక్షసుడిని బారి నుంచి రాజకుటుంబాన్ని, ప్రజల్ని రక్షిస్తాడు విష్ణునంది అనే ముని. బాలుడికి రుద్రసేన కార్తికేయుడు అని పేరు పెడతారు. అతడు శివపాద మహర్షి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తూ, పెరిగి పెద్దై, ఒక మదమెక్కిన గుర్రాన్ని నిరోధిస్తూ, ఒక జలపాతం వద్దకు చేరతాడు. ఇక చదవండి...) 
 రుద్రుడికి ఎక్కడినుండో ఒక పారవశ్యం కలుగుతుంది. వంద కోయిలలు ఒకేసారి కూసినట్లు ఉంది. అక్కడ జలపాతం ప్రవహిస్తుంది. ఆ కొండపై ఒడ్డు ఉంది. ఆ ఒడ్డు నుండి క్రిందికి దారి ఉంటుంది. అది ఎంతో మనోహర దృశ్యం – అక్కడ పచ్చికల మధ్యలో ఎవరో ఉన్నట్లు ఉంది. గుర్రం దిగి అటుకేసి చూశాడు రుద్రుడు. వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక యువతి స్పృహతప్పి పడి ఉంది. ఆమె అపసవ్యమైన పరిస్థితిలో ఉంది. అది చూసాడు రుద్రుడు. రుద్రనోటిలో మాటలు లేవు. తానెప్పుడూ, ఇటువంటి అందాన్ని చూడలేదు. ఆమెని చూసి మైమరచిపోయాడు. ఆమె శరీరం మీద పడిన నెమలీకలు, పూలు ఆమెను కప్పుతూ ఉన్నాయి. రుద్రకి మాత్రం మనసులో వెయ్యి జలపాతాల శబ్దం వినబడుతుంది. పౌర్ణమి చంద్రుడి మీద విహారం చేసినట్లు ఉంది. ప్రపంచంలో అన్ని పక్షులు ఒకేసారి చూసినట్లు ఉంది. వెంటనే గుర్రం దిగి దగ్గరికి వెళ్లి జలపాతంలో నీరు తెచ్చి మొహం మీద చిలకరించాడు. కానీ, ఆమె లేవలేదు. రుద్రకి మనసు పనిచేయడం లేదు. “ఎవరీ వనిత, ఏమి ఈ సౌందర్య ఘనత , ఇదేనా సృష్టిలోని కవిత? “ అంటూ ఆశ్చర్యపడుతున్నాడు. “బహశా ఇంద్రుడు తపస్సును భగ్నం చేయటానికి పంపిన అప్సరస? అని అనుకుంటున్నాడు. ఆమె మ్రింగిన నీరును నోటినుండి బయటకు తెప్పించే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత ఒక్కసారిగా ఆమె చెవి దగ్గరికి వెళ్ళి “మొసలి మొసలి అని కేకలు వేశాడు. అంతే ఆమె అలజడితో కనులు తెరిచింది. ఆమె కదలికలతో ఆమెపై ఉన్న నెమలీకలు పూలు క్రిందపడ్డాయి. ఆమె అదురుపాటుతో లేచి తెలియని అతన్ని చూసి పరిగెత్తి పొదల చాటున దాగింది. అపుడు “ ఎవరు నీవు అప్సరసవా, శాపవశాత్తు భూమి మీదకు వచ్చిన దేవతవా?అన్నాడు రుద్రుడు. “ఓ యువతి! భయపడకు, నీవు స్పృహ తప్పి ఉన్నపుడు సాయం చేసిన వాడను నేనే, ఇక్కడికి దగ్గరగా మా గురుకులం ఉంది, శివపాదమహర్షి శిష్యుడను నేను, భయము వలదు”, అన్నాడు. అపుడు ఆ యువతి నేను ఈ జలపాతానికి అవతలి వైపు ఉన్న “పద్మ పట్టణ” రాకుమారిని అన్నది. అంతలోనే ఉన్నట్లుండి ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. “ఓ రాకుమారి నాకు లొంగిపోతావా లేక నిన్ను భక్షించమన్నావా” అన్నాడు. దానితో ఆ యువతి భయపడసాగింది.” ఓ రాక్షస పురుషా? నాకు నీవు అంటే మనసులేదు నిన్ను నేను వివాహ మాడను, దయచేసి నన్ను వదిలిపొమ్ము, నన్ను బాధపెట్టకు” అంది. సుఖపడు అని అంటే బాధ అంటావు, ఈ మానవులకు అసలు బుద్ధి లేదు, అని ఒక్కసారి ఆమె దగ్గరికి వెళ్ళబోయాడు. “నా దగ్గరకు రావొద్దు,” అని భయంతో అరిచే కొలదీ, రాక్షసుడు మరింత వాంఛతో ,తన కోరిక తీర్చుకోవడం కోసం ముందుకు దూకాడు. ఒక్కసారిగా రుద్రుడు “స్త్రీని బలత్కరించడం పురుష లక్షణం కాదు, వలచి రావలసిందే కాని...”, అన్నాడు. ఆ రాక్షసుడు ఎవరివిరా నీవు బాలకా, పొమ్ము నీ తల్లిదండ్రులకు పుత్రశోకం ఇవ్వటం మాకు ఇష్టం లేదు”, వెంటనే రుద్రుడు “అయితే నన్ను గెలిచి, ఆ వనితను తీసుకుపో”,అన్నాడు. రాక్షసుడు “అలానా, రా...మనిషి మాంసం తిని చాలారోజులు అయ్యింది” ,అంటూ రుద్రుని మీదకు దుమికాడు. రుద్రుడు తన శక్తి సామర్ధ్యాలతో నిలువరిస్తున్నాడు. వారి పోరు దూరం నుండి చూసినా, పొదలచాటు ఉన్న రాకుమారి ఆనందంగా ఉంది. పోరులో ఉన్నప్పుడు రాక్షసుడు రుద్రుని విసిరివేశాడు. సరిగ్గా వచ్చి రాకుమారి చెంత పడడంతో రాకుమారి తత్తరపాటుతో ప్రక్కకు తప్పుకుంది. ఆమె బిడియాన్ని, తత్తరపాటుని చూసి పరిహసిస్తున్నాడు. ఇక రుద్రుడు వాయువేగంతో వెళ్ళి తన దగ్గర ఉన్న విష్ణునంది ఇచ్చిన బాకుతో వానిని హతమార్చాడు. ఆ రాకుమారి ఎంతో ఆనందించింది. ఆ రాకుమారి, “వీరుడా, నా సమస్యను అంతం చేశావు, నేను పరిపూర్ణంగా ధరించుటకు మరియొక వస్త్రమును ఇవ్వుమని అడిగింది. రుద్రుడు తను తెచ్చిన వస్త్రమును, తన ముసుగును, తన శరీరంపై ఉన్న వస్త్రమును అటు ఇటుగా ఎన్నో తిప్పి , దాన్ని రాకుమారి ధరించే విధంగా తీర్చిదిద్దాడు. దానికి గట్టిగా మరికొన్ని ముడులు వేసి, దానికి కొన్ని పూలు ఆకులు అందంగా అలంకరించి ఒక నూతన శైలి వస్త్రమును చేసి ఆమెకు అందించాడు. అది ధరించి ఆ రాకుమారి పొదలమాటు నుండి బయటకు వచ్చి, అక్కడ నీటిలో తన బింబాన్ని చూసుకొని మురిసిపోయింది. “వీరుడా, మా రాజ్య చేనేత పట్టుకళాకారులకు కూడా ఇంత గొప్ప శైలిలో వస్త్రములు చేయలేరు. ఇది బహు ముచ్చటగా ఉంది. నా మాన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతలు అంది. “ధన్యవాదములు రాకుమారి, మీ కథ సంక్షిప్తంగా చెప్పండి, అని చమత్కరింపుతో అడిగాడు. ఆ రాకుమారి “పద్మపట్టణ రాకుమారిని నేను, ఆ రాక్షసుడు నాచెంత ప్రత్యక్షమయ్యి మనువాడమని బలవంతపెట్టాడు. వాడ్ని ఎదిరిద్దామనేసరికి మాయమయ్యేవాడు. నాకు స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు, నా ముందు ప్రత్యక్షమయ్యి “ ఇంతకాలం సహనంగా ఉండడమే తప్పు, నిన్ను ఏమి చేయకపోవడమే నా తప్పు, ఇక ఆ తప్పు చేయను అని చెప్పి నన్ను అపహరించి తీసుకుపోతున్నాడు. నేను వాడ్ని మనువాడడం కన్నా చావడం మేలని గాలిలో వెళుతున్న అతని చేతిపట్టు వదిలించుకున్నాను, బహుశా నీటిలో పడేప్పుడు నా వస్త్రములు ఈ చెట్టు చేమలకు తగులుకొని, క్రిందపడే వేగం తగ్గి, కొంచెం గాయాలతో నీళ్ళలో పడి స్పృహ తప్పు తుండడంతో అతి కష్టం మీద ఒడ్డుకు వచ్చాను. ఆ తర్వాత నీకు తెలిసిందే? రుద్రుడు మొత్తం విని “అది సరే నాకొక సందేహం...” అన్నాడు. (సశేషం...)

No comments:

Post a Comment

Pages