తెలుగు వెలుగులు పంచే "పాఠశాల"


తెలుగు భాషా పరిరక్షణకు 'నేను సైతం' అంటూ కొత్త జ్యోతిర్మయి గారు మిత్రబృందంతో కలిసి, షార్లెట్ , ఉత్తర కెరొలిన లో మొదలుపెట్టినదే 'పాఠశాల'. కొంతమంది తెలుగు వారు కలిసి, స్వచ్చందంగా చేస్తున్న ఈ సేవ... బహుధా ప్రశంసనీయం. వారు ఎలా మొదలుపెట్టారో, ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో, మీరూ చదివి, తెలుసుకోండి. స్పూర్తిని పొందండి. 
పాఠశాలను ఎప్పుడు ప్రారంభించారు ? మొదట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు ? స్థాపించినప్పుడు మీ మనోభావాలు/లక్ష్యాలు ఏమిటి ? 
భావితరాల వారికి తెలుగు మనభాషలోని కమ్మదనాన్ని పరిచయం చేయడమే మా లక్ష్యం. పైగా విదేశాలకు మనవలు, మనవరాళ్ళతో
గడపడానికి వచ్చే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు భాషాబేధం వలన పిల్లలతో మాట్లాడలేని వారి ఇబ్బందిని గమనించి ఏమైనా చెయ్యాలన్న సంకల్పంతో ఆరేళ్ళ క్రితం ఈ పాఠశాలను మొదలుపెట్టాము. మొదట్లో ఓ పదిమంది పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి వచ్చేవారు. 
మొదట్లో మీకు లభించిన స్పందన ఎలా ఉంది ? ఎంతమంది స్వచ్ఛందంగా మీకు సహాయం అందించేందుకు వచ్చారు ? 
పాఠశాలను మొదలుపెట్టినపుడు ఓ పది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించడానికి ముందుకు వచ్చారు. వారిలో అక్షరాలు మాత్రమే వచ్చినవారు, గుణింతాలు నేర్చుకున్నవారు, అస్సలు అక్షరం పలకని వారు ఇలా వివిధ స్థాయిలలో ఉండేవారు. ఎవరికి తగిన విధంగా వారికి చెప్పవలసి వచ్చేది. ఈ పాఠశాల ద్వారా మీరు మొదట్లో చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి ? విద్యార్ధులకు ఆసక్తి కలిగే విధంగా ఎన్నో పద్యాలు, పాటలు నేర్పించాము. నీతి ప్రధానమైన నాటికలు వేయించాము. పోయినేడాది ఉపాధ్యాయులందరూ కలసి తెలుగు ఎందుకు నేర్చుకోవాలో తెలియజేసే ఒక నాటికను కూడా ప్రదర్శించారు. విదేశాలలో పెరుగుతున్న పిల్లలకు ఇంట్లో అమ్మ, నాన్న తప్ప వేరే బంధువులు ఉండరు. దీనివలన పిల్లలకు ఇతరులను చూసి నేర్చుకునే అవకాశం చాలా తక్కువ. వారు ఎలా నడుచుకోవాలో, మంచి నడవడిక గురించి తెలియజేస్తూ ప్రతి వారం ఒక మంచి విషయం చెప్తాము. ఒకసారి పాఠంలో ఉమ్మడికుంటుంబం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వారికి ఎలా వివరించినా అర్ధం కాలేదు. చెప్పడం కంటే వారికి చూపిస్తే బావుంటుందనే ఉద్దేశ్యంతో ‘ఉగాది వేడుకలు’ అని నాటిక వారితోనే వేయించాము. విద్యార్ధులందరూ కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. విద్యార్ధులతో బొమ్మలు చేయించి వివిధ వేషధారణల గురించి, మన సంస్కృతి గురించి చెప్పడం జరిగింది. మా పాఠ్యాంశాలు పలువురికి ఉపయోగపడాలని ఓ బ్లాగు మొదలు పెట్టాము. మేము విద్యార్ధులతో చేయించిన బొమ్మలు, వేయించిన నాటికలు అన్నీ కూడా ఈ బ్లాగులో చూడొచ్చు.  
దీనికి ప్రవాసీయుల నుంచి, విదేశీయుల నుంచి లభించిన స్పందన ఎలా ఉంది ? 
మా పాఠశాల గురించి ఇప్పటివరకు ఏ పత్రికలో కాని టివిలో కాని ప్రచారము చేయలేదు. ఫేస్ బుక్ లో పోయిన సంవత్సరమే ఓ పేజ్ మొదలు పెట్టాము. https://www.facebook.com/paatasalausa?ref=hl patalog 
నడక నేర్చుకునేటప్పుడు తడబాటులు, తిరిగి పట్టువదలకుండా ప్రయత్నించడాలు, సహజమే కదా ! మరి మీరు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కున్నారు ? 
మీరన్నది నిజమే. మొదట్లో మాకు పుస్తకాలు లేవు. విద్యార్ధులకు ఏ విధంగా నేర్పాలో తెలిసేది కాదు. భారతదేశం నుండి తెచ్చిన తెలుగు పాఠ్య పుస్తకాలు తెలుగు రాయడానికి ఉపయోగ పడేవిగా ఉన్నాయి కాని వారికి మాట్లాడానికి ఉపయోగపడలేదు. దాంతో మేమే మా పాఠ్యాంశాలను తయరుచేసుకున్నాము. పిల్లలకు ఆ ఒక ప్రణాళిక ప్రకారం నేర్పిస్తూ వారి అభివృద్ధి ఎప్పటికప్పుడు చూసుకుంటూ కావలసిన మార్పులు చేసుకుని ప్రస్తుతం నాలుగు తరగతులకు పాఠ్యాంశాలను సిద్దం చేసుకున్నాము. మేము మొదట్లో ఎదుర్కొన్నవి ప్రధానంగా రెండు సమస్యలు. 
ఏడాది మొదట్లో పాతిక మంది విద్యార్ధులు చేరితే చివరకు వచ్చేసరికి పదిమంది ఉండేవారు. దానికోసం సంవత్సరానికి ఒకసారి ప్రతి విద్యార్ధి తల్లిదండ్రులను కలసి వారి పిల్లల తెలుగు నేర్చుకోవడం గురించి తెలుసుకొని వారి సలహా మేరకు మా బోధనా పద్దతిలో మార్పులు చేసుకున్నాము. ఇలాచేయడం వలన పోయిన సంవత్సరం యాభై మంది పిల్లలతో తరగతులు మొదలుపెడితే మధ్యలో చేరినవారితో కలపి యాభై ఆరు మంది పిల్లలతో వార్షికోత్సవం జరుపుకున్నాము. విద్యార్ధులకు అచ్చులు నేర్పించడం పూర్తిచేసి హల్లుల్లోకి వెళ్లేసరికి అచ్చులు మరచిపోయేవారు. వారికి నెలకో పరీక్ష, అర్ధసంవత్సర పరీక్ష, సంవత్సరాంతపు పరీక్ష పెట్టి, మంచి మార్కులు తెచ్చుకున్న ప్రతి విద్యార్ధికి బహుమతులిచ్చి ప్రోత్సహించడంతో ఆ సమస్య తీరిపోయింది. ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలియచేస్తారా... 
ప్రతి ఏడాది తల్లిదండ్రులందరూ కూడా తమ చేతుల మీదుగా ఈ వార్షికోత్సవం జరిపిస్తారు. ఆ సందర్భంగా ఉపాధ్యాయులను సత్కరించడం, విద్యార్ధులకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేయడం జరుగుతుంది. విద్యార్ధులు పాటలు, పద్యాలు పాడతారు. నాటికలు వేస్తారు. మా నాటికలు, వార్షికోత్సవం వీడియోలు ఇక్కడ చూడొచ్చు.  


మీరు చేస్తున్న కృషికి మీరు అందుకున్న ప్రశంసలు/అవార్డులు , లేక మీరు మర్చిపోలేని అనుభూతిని గురించి చెబుతారా ? 
ఈ విద్యార్ధులు భారతదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ బస్సులమీద, షాపుల మీద రాసిన పేర్లు చదవగలుగు తున్నామని, దాంతో వాళ్ళకు తాముకూడా భారతదేశానికి సంబంధించిన వారిమనే అనుభూతి కలుగుతుందని చెప్పినపుడు ఎంతో సంతోషంగా అనిపించింది. అలాగే పెద్దవాళ్ళు ఎప్పుడూ వారితో మాట్లాడని వారి మనమలు, మనుమరాళ్ళు ఇప్పడు ఎంతో చక్కగా తమతో తెలుగులో మాట్లాడగలుగుతున్నారని ఎంతో అభిమానంగా ఫోన్ చేసి చెప్తుంటారు. అదే మాకు అతి పెద్ద ప్రశంస. 
ప్రస్తుతం మీ సంస్థ/సంఘం లో ఎంతమంది సభ్యులు ఉన్నారు ? 
పాఠశాలలోని నాలుగు తరగతులలో మొత్తం పదకొండు విభాగాలున్నాయి. అందులో వున్న నూటపదిమంది విద్యార్ధులకు ఇరవై మంది ఉపాధ్యాయులు స్వచ్ఛ౦దంగా బోధిస్తున్నారు. అంటే ప్రతి సుమారుగా ఐదుగురు విద్యార్దులకు ఒక ఉపాధ్యాయని/ఉపాధ్యాయుడు అన్నమాట. వీరు కాక తల్లిదండ్రులందరూ కూడా తరగతిలో ఏ సహాయం చెయ్యడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మేమంతా సమిష్టిగా చేస్తున్న కృషే మా ఈ పాఠశాల. 
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ? 
ప్రణాలికలంటూ ఏమీ లేవండి. ఆసక్తిగా ముందుకు వచ్చిన పిల్లలకు తెలుగు నేర్పించడం. అలా అని ఎవ్వరినీ తెలుగు నేర్చుకోమని బలవంతం చెయ్యము. మాతృభాష ఎందుకు నేర్చుకోవాలో మాత్రం ప్రతి ఏడాది తరగతులు మొదలు పెట్టేటప్పుడు సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తాము. సంఖ్య పెంచుకుని ప్రపంచానికి చాటుకోవాలన్న ఆసక్తి మాకు లేదు. ఎంత మంది పాఠశాలలో చేరారన్నది ముఖ్యం కాదు, వారు ఎంత ఆసక్తిగా నేర్చుకుంటున్నారన్నదే మాకు ముఖ్యం. 
ప్రస్తుతం మీరు ఏ ఏ దేశాల్లో మీ సేవలను అందిస్తున్నారు ? ఏ విధంగా సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నారు ? 
మేము ఈ పాఠశాలను షార్లెట్ లో మొదలు పెట్టాము. ఈ ఏడాది కొలంబియా తెలుగు అసోసియేషన్ వారు మా పాఠ్యాంశాలు ఆధారంగా తెలుగు నేర్పిస్తున్నారు. అలాగే ఆసక్తి ఉన్నవారు మా దగ్గర పాఠ్యాంశాలు తీసుకుని వారి పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు. ఎవరైనా తెలుగు నేర్పించాలనుకునే వారికి మా పాఠ్యాంశాలను, పాఠ్య ప్రణాళికను సంతోషంగా అందజేస్తాము. 
మీరు ప్రచురించిన పుస్తకాల వివరాలు , అవి కొనుగోలుకు ఎక్కడ అందుబాటులో ఉంటాయో చెబుతారా ? 
పాఠాలన్నీ పిడిఫ్ రూపంలో వున్నాయి. అన్నీ పూర్తిగా ఉచితం. 
తెలుగు భాషాభివృద్ధికి మనం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ? భాష పట్ల మక్కువ ఉన్నవారికి మీరిచ్చే సందేశం...
ఏ కార్యక్రమాలు చేపట్టనవసరం లేదండి. ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడాలి, తెలుగులోనే మాట్లాడాలి. మన భాషలోని మాధుర్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోగలిగి అవి పిల్లలతో పంచుకోగలిగితే చాలు. మాటల్లోనే వారికి జాతీయాలు, సామెతలు, పొడుపుకథలు అన్నీ వాళ్ళకు అర్ధం అయ్యేలా చెప్పగలిగితే ఇలాంటి పాఠశాలల అవసరమే ఉండబోదని మా నమ్మకం. 
మీరు ఇంకేమైనా చెప్పదలచుకుంటే ఇక్కడ వివరించండి... 
తెలుగును పరిరక్షించాలన్న తపనతో మీరు చేస్తున్న కృషి అభినందనీయము. ఎక్కడో సుదూరంగా నిర్వహిస్తున్న మా పాఠశాల గురించి తెలుసుకుని మీ పత్రికలో ప్రచురించాలనుకోవడం మీ భాషాభివృద్దిని చాటిచెబుతోంది. మా పాఠశాల తరపున మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. 
ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా ? వివరాలు తెలుపగలరు ?(మీ సంస్థకు సంబంధించిన వెబ్ సైటు వివరాలు, యు ట్యూబ్ లింక్ లు ,చిరునామా, ఈమెయిలు, వంటి వివరాలు అందించగలరు) paatasalausa@gmail.com

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top