వచన రచనకి మేస్త్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి - అచ్చంగా తెలుగు

వచన రచనకి మేస్త్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి

Share This
వచన రచనకి మేస్త్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి 
 - మల్లాది వేంకట గోపాలకృష్ణ 

 తెల్లటి ముతక పంచె, లాల్చీ. చేతిలో సంచీ. పెదాలపై చెరగని చిరునవ్వు. నిండైన విగ్రహం. ఆయన తెలుగు భాషకి పట్టం కట్టిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ అంటే చూసినవారికెవరికీ నమ్మకంకూడా కలగదు. తెలుగు సినిమా పాటకి కావ్యగౌరవాన్ని కల్పించిన మహనీయుడు ఆయనే అంటే నోరు విప్పి నాలుగు ముక్కలు మాట్లాడేదాకా ఆయన్ని చూసిన వాళ్లకి నిజంగా నమ్మకం కుదరదు. బాహ్య స్వరూపానికి కాక అంతర్గతమైన సరస్వతికి ప్రాధాన్యం ఇచ్చిన మహామనిషి రామకృష్ణశాస్త్రి. సకల శాస్త్రాలనూ అపోసన పట్టిన ఆ మహర్షి, ఎన్నో కళల్ని అలవోకగా వంటపట్టించుకుని తనలో జీర్ణం చేసుకున్న అపర శంకరుడైనా అంత సాదాసీదాగా ఉండేవారు. ఆయనకసలు ప్రచారమంటే గిట్టదు. తానెప్పుడూ పేరుప్రఖ్యాతులకోసం పాకులాడలేదు. అచ్చతెలుగు నుడికారాన్ని స్వచ్ఛంగా ప్రేమించారు. జాను తెలుగు పదాలను జన్మంతా ఆరాధించారు. అక్షరం ముక్కమీద ఆపేక్షతోనే కథలు, కవిత్వం, పాటలు రాశారు తప్ప మరేమీ ఆశించికాదు. అందుకే ఆయనకి అంతటి సరస్వతీ కటాక్షం కలిగింది. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు శ్రీ యడవల్లి సుబ్బావధాన్లుగారి దగ్గర వేదవిద్యని నేర్చుకున్నారు. శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి దగ్గర మహాభాష్యం చెప్పుకున్నారు. శ్రీ శిష్ట్లా నరసింహశాస్త్రిగారి ద్వారా బ్రహ్మసూత్రాలను ఒంటబట్టించుకున్నారు. వ్యాకరణ, తర్క, అలంకార శాస్త్రాల్ని ఆసాంతం అపోసన పట్టారు. ఖగోళ, జ్యోతిష శాస్త్రాలు శాస్త్రిగారికి కరతలామలకం. నాట్యంలో, చిత్రలేఖనంలో, సంగీతవిద్యలో విశేషమైన ప్రావీణ్యాన్ని సంపాదించారు. దాదాపు యాభైకి పైగా భాషలమీద పట్టు సంపాదించారు. ఇది లోకానికి తెలిసిన లెక్క. ఇంకా వారికి తెలిసినవని మనకు తెలియని భాషలు ఎన్నున్నాయో లెక్కేలేదు. ఓసారి మల్లాదివారు ఆయన పెద్ద కొడుకు నరసింహశాస్త్రిగారు రోడ్డుమీద అలా నడిచివెళ్తున్నారు. ఎవరో ఓ కొత్తవ్యక్తి ఎదురై శాస్త్రిగారిని గుర్తుపట్టీ పట్టనట్టుగా అంతలోనే మళ్లీ గుర్తుపట్టినట్టుగా పొగడడం మొదలుపెట్టాడు. అయ్యా మీ అంతటివారి దర్శనభాగ్యం నాకు కలగడం ఈ పూట నిజంగా నేను చేసుకున్న పుణ్యమే అంటూ తనకు తోచిన ఉపమానాలను వల్లెవేయడం మొదులుపెట్టాడు. ఎవరో తెలియని వ్యక్తి, అందునా పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. పైగా సమయం, సందర్భంకూడా కాదు. అవతల త్వరగా వెళ్లిపోవాలి. వెంటనే రామకృష్ణ శాస్త్రిగారావ్యక్తితో “అయ్యా మీరు పొరపాటు పడ్డారు. మీరు అనుకునే మహనీయులు ఇంకెవరో అయి ఉంటారు. నా పేరు గుంటూరు శాస్తుర్లు అంటారు. నేను రచయితనుకాను. ” అని చెప్పి చటుక్కున ముందుకు వెళ్లిపోయారు. నరసింహశాస్త్రిగారికి నోట మాట రాలేదు. అలా చూస్తూ ఉండిపోయారు. ఆయన భావాన్ని గ్రహించిన రామకృష్ణ శాస్త్రిగారు “ నాన్నా పొగడ్త చాలా ప్రమాదకరమైనది. అందునా ఇలా ఇప్పుడు రోడ్డుమీద మరీ అసందర్భమైన సమయమూ సందర్భమూ కాబట్టి అలా చమత్కారంగా దాటుకొచ్చేశాను” అని చెప్పారు. రామకృష్ణ శాస్త్రిగారు ప్రచారాన్నీ, పటాటోపాన్నీ ఇష్టపడని మహనీయులు అని చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఓసారి కవిగారిని పిలుచుకురమ్మని స్టూండియోనుంచి పిలుపొచ్చింది. రోడ్డుకి ఆవలివైపున స్టూడియో. ఈవలి వైపున మల్లాది రామకృష్ణశాస్త్రిగారిల్లు. ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి విషయం చెప్పాడు. శాస్త్రిగారు కారులేందే కాలు బైటపెట్టేదిలేదని చెప్పారు. మేనేజర్ తెల్లమొహం వేశాడు. ఎదురింటినుంచి ఆయన్ని కారులో ఎలా స్టూడియోకి తీసుకెళ్లాలో అర్ధంకాలేదు. ఆ సమస్యకి పరిష్కారాన్నికూడా శాస్త్రిగారే చెప్పారు. కారుని తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పెట్టమని చెప్పారు. ఇటువైపునుంచి డోరు తీసుకుని కారెక్కి, అటువైపునుంచి డోరు తీసుకుని కిందికి దిగి ఎంచక్కా నడుచుకుంటూ అలాగే స్టూడియోలోకి వెళ్లిపోయారు. ఇదేమి చమత్కారం శాస్త్రిగారూ అంటే. “మరి మీరు కారు పంపకపోతే, నేను నడిచి వచ్చేస్తే, డిమాండ్ తగ్గిపోదూ. ఫలానా స్టూడియోవాళ్లు శాస్త్రిగారికి కారు పంపలేదటకదా..! అంటూ ఎవరైనా ఆడిపోసుకుంటేనో.. ఎందుకొచ్చిన గొడవ. అందుకనే కారులోనే వచ్చాను” అని సమాధానం చెప్పారు. రామకృష్ణశాస్త్రిగారి చమత్కారానికి అక్కడున్నవాళ్లంతా ఆ రోజున పొట్టచెక్కలయ్యేలా తనవితీరా నవ్వుకున్నారు. నవ్వుతూ, నవ్విస్తూ, వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ కలుపుకుపోతూ, అందరినీ తనవారిగానే భావించి ఆదరించిన సుహృన్మణి మల్లాది. ఓ రోజున మిట్టమధ్యాహ్నంవేళ మల్లాది రామకృష్ణశాస్త్రిగారు భోజనం చేసి గడపమీద తలవాల్చి అలా నేలమీద పడుకుని సేదతీరుతున్నారు. ఆయన్ని ఎంతగానో అభిమానించే ఆచార్య ఆరుద్ర వచ్చారు. శాస్త్రిగారంటే ఆయనకి అంతులేని ఆరాధన. వీలైనప్పుడల్లా వచ్చి ఎన్నో విలువైన విషయాలను అడిగితెలుసుకుని శిష్యరికం చేసేవారు ఆరుద్ర. ఆ రోజున మాటల్లో మాటగా మీకు ఎన్ని భాషలు తెలుసో చెబుతారా అని ఆయన శాస్త్రిగారిని అడిగారు. శాస్త్రిగారి చేతిలో తాటాకుల విసనకర్ర ఉంది. దాని రెక్కలమీద ఎన్ని భాషలు తెలుసో అన్ని భాషల్లోనూ ఒక్కో రెక్కమీద ఒక్కో భాష చొప్పున సంతకం చేసివ్వమని అడిగారు. ఆయన మాటని మన్నించిన శాస్త్రిగారు తనకు తెలిసిన భాషలన్నింటిలోనూ ఒక్కో రెక్కమీద ఒక్కో భాష చొప్పున విసనకర్రకి రెండు వైపులా సంతాకాలు పెట్టారు. విసనకర్ర నిండిపోయింది. ఇంకా చాలలేదు. శాస్త్రిగారు మాత్రం ఇంక చాల్లే అని అప్పటికి సరిపెట్టారట. దాదాపు యాభైకి పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగినంతటి పాండిత్యం వారికి ఉండేదని అందరూ చెప్పుకునేవారు. కానీ ఆ మహనీయుడికి పట్టున్న భాషలు అంతకు రెండింతలుంటాయన్న విషయం ఆరుద్రతోపాటుగా ప్రపంచానికికూడా ఆరోజే తెలిసింది. శ్రీ లలితా శివజ్యోతీ సర్వకామదా శ్రీ గిరినిలయా నిరామయా సర్వమంగళా అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతీ అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతీ అంటూ తెలుగునాట ఈనాటికీ ముత్తయిదువులు పేరంటాల్లో హారతి పాటని పాడుకుంటుంటారు. కానీ ఈ పాటని రాసిన మహనీయులు మల్లాది రామకృష్ణశాస్త్రి అన్న విషయం చాలామందికి తెలియనే తెలియదు. కొందరు అభిమానులు తెలిసో తెలియకో రామకృష్ణశాస్త్రిగారికి కేవలం తెలుగునేలమీద పుట్టడంవల్ల రావాల్సినంత పేరు రాలేదు, దక్కాల్సింనంత గౌరవం దక్కలేదు అని బాధపడుతూ ఉంటారు. నిజానికి అలాంటి భావనలు నిజం కాదన్న విషయాన్ని ఘంటాపథంగా చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదూ. రామకృష్ణశాస్త్రిగారు కోరుకున్నదీ అదే. నిజమైన కవి తనకి బాగా పేరు ప్రఖ్యాతులు రావాలని ఎన్నడూ కోరుకోడు. తాను రాసిన కవిత్వం జనబాహుళ్యంలోకి చొచ్చుకు పోవాలని, ప్రజల నాలుకలమీద పదికాలాలపాటు నిలబడాలని మాత్రమే కోరుకుంటాడు. భాగవతాన్ని తెలుగువారికి వరప్రసాదంగా అందించిన పోతన్నని ఎవరు ప్రత్యేకించి గౌరవించాలి. ఎవరు ఆయనకు ప్రచారం కల్పించాలి. సామాన్యుడికి తత్వాన్ని అలతి పదాలతో అతి తేలికగా అర్ధమయ్యే రీతిలో చెప్పిన వేమనకి ఎవరు ప్రచారం కల్పించాలి. జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోవడం ఎలా, బుద్ధి కలిగి చాకచక్యంగా జీవిచడం ఎలా, ధర్మమార్గంలో నడుచుకోవడం ఎలా, ఏది ఉచితం, ఏది అనుచితం అని చక్కటి పద్యాలతో పామరులకుకూడా అర్ధమయ్యే రీతిలో చెప్పిన సుమతీ శతకకారుడికి ఏమని ప్రచారం కల్పించాలి, ఎవరు కల్పించాలి. “మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కవిత్వం చాలామందికి అర్ధం కాదు. ఆయన కవిత్వాన్నీ రచనల్నీ చదివి అర్ధం చేసుకోవాలంటే జాను తెనుగు నేర్చి తీరాలి” అని చాలమంది చెబుతూ ఉండడంకూడా నా చెవిన పడింది. నేను సుతారమూ దీనికి ఏమాత్రం అంగీకరించనుగాక అంగీకరించను. అలా చెప్పినవారు గొప్పవారైనా సరే, వారు బాధిపడినా సరే నేను ఈ విషయాన్ని నిక్కచ్చిగా చెప్పదలచుకున్నాను. మల్లాదివారి సాహిత్యం అలతిపదాలతో అనంతమైన అర్దాన్ని స్ఫురించేదిగా ఉంటుంది. జాను తెనుగు పద బంధాలను ప్రయోగించడంలో ఆయనకు ఆయనే సాటి. కృష్ణాతీరం నవల చదివినవారికి ఈ విషయం సుస్పష్టంగా అర్ధమవుతుంది. మల్లాదివారి పద ప్రయోగం, వాక్యనిర్మాణరీతి అచ్చంగా ప్రపచంలో వ్యవహారంలో ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది. “ వయస్సంటే వంటిమీదకు వచ్చిందికాని మనస్సింకా మనుగుడుపుల్లోనే ఉందన్నాట్ట వెనకటికి నా వంటి వాడెవడో!”, “తిండీ తిప్పలూమాని, కంపనుబడ్డ కాకల్లే తిరిగి ఎండగట్టుకుంటే ఏమవుతుంది? ఏనుగు చిక్కింది ఎలకపిల్లయ్యింది............ పాలల్లో పడ్డ బల్లి అయితేగాని, అయ్యకి ఒళ్లు తెలియలా!”, “అరుడు మెచ్చితే నరుడూ మెచ్చాడని”, “ మూడు నిద్దర్లకే ముగ్గురు పిల్లలన్నట్టు, ఆకుదూసిన మల్లెపందిరికిమల్లే మొగ్గమీద మొగ్గతొడుగుతూంది!”, “మనిషి నీళ్లోసుకున్నట్టుంది ; పూవుల పొట్లాం లాగుంది!”. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు అంతే ఉండదు. మాటికి మాట జోడించి వాటికి చిత్రమైన అందాన్ని తెప్పించడంకూడా మల్లాదిరామకృష్ణశాస్త్రిగారికే చెల్లింది. దీనికో చిన్న ఉదారహణను చూద్దాం.. “ “ఇంటి దగ్గరినుంచేనా?” “ కాక?” “కాకో ­­­─ నిక్కాకో ! నీకు తెలియాలి” “ఒకరు చెప్పాలా? పాలెం పాలెం కోడైకూస్తుంటే...” ఇట్లాంటి చిత్రవిచిత్రాలు మల్లాదివారి రచనల్లో కోకొల్లలు. ఒకనాడు కంపు అన్న పదానికి సువాసన అని అర్ధం. కాలక్రమంలో దానికి ఇప్పుడు దురర్ధాన్ని లోకం ఆపాదించింది. ఇప్పుడు కంపు అంటే దుర్వాసన అనే అర్ధం లోకంలో ప్రచారంలో ఉంది. తప్పెవరిది. ముందుతరాలకు మన అచ్చతెలుగుని పరిచయం చెయ్యలేకపోయినవాళ్లదే. అందుకే మనం మన ముందు తరాలకు చక్కటి తెలుగును నేర్పడాన్ని మన బాధ్యతగా భావించాలి. లోపాన్ని మన దగ్గర పెట్టుకుని అలతి పదాల్లో అనంతమైన అర్ధాన్ని స్ఫురింపజేసేలా రచనలు చేసిన మహనీయులకు మన వ్యక్తిగతమైన అభిప్రాయాలను అపాదిస్తే ఎలాగన్నది నేను ఏకరువు పెట్టదలచుకున్న పిండితార్ధం. ఎవరినైనా నొప్పించడానికి మాత్రం నేనీ మాటలు చెప్పడం లేదు. ముందుతరాలకు చక్కటి తెలుగు భాషని అందిచడానికి జరగాల్సిన కృషి జరగడం లేదు అన్న బాధతో చెబుతున్నాను. అందుకోసం మనం ప్రత్యేకించి లోకాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మనింట్లో మనం చక్కటి తెలుగులో మాట్లాడితే చాలు. జాను తెనుగు పదాలను పిల్లలు వినేట్టుగా చేయగలిగితే చాలు. ఇంట్లోనైనా రోజూ వినే తెలుగు మాటలు వాళ్ల చెవులకెక్కుతాయి. మనకి ప్రత్యేకించి పని గట్టుకుని ఎవరూ ఇవన్నీ నేర్పలేదుకదా. మన తల్లిదండ్రులు, పెద్దవాళ్లు, కుటుంబసభ్యులు మాట్లాడుకుంటుండగా విన్నందువల్లే మనకీ భాష పట్టుబడింది తప్ప ప్రత్యేకించి పుస్తకాలు కొని తెచ్చుకుని పాఠాలు నేర్చుకుంటే కాదు. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు మన రక్తంలోనే ఉంది. కానీ మనం చేయాల్సిందల్లా దానికి దాని ధర్మాన్ని గుర్తు చేయడం మాత్రమే. సినిమాల్లో మాటలు పాటలు రాయడానికి ముందు మల్లాది రామకృష్ణశాస్త్రి చాలా పత్రికల్లో వ్యాసాలు, కథలు, నవలలు, నాటకాలు రాశారు. దేశాభిమాని అనే పత్రికలో ఉప సంపాదకుడిగా కొంతకాలంపాటు పనిచేశారు. తర్వాత కృష్ణా పత్రికలో చేరారు. నా కవిమిత్రులు, చలవమిరియాలు లాంటి చక్కటి శీర్షికలతో రచనలు చేసి పాఠకుల్ని ఆకట్టుకున్నారు. భారతి పత్రికలో మల్లాది రాసిన తొలి కథ ప్రచురితమైనప్పుడు ఆయన వయసు పదిహేనేళ్లు మాత్రమే. ఆనాటి ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం 1945లో “పల్నాటి యుద్ధం” సినిమాకి సలహాలు సంప్రదింపులకోసం మల్లాదివారికి మద్రాసుకి పిలిపించారు. 1952లో రామకృష్ణ శాస్త్రిగారు చిన్నకోడలు చిత్రానికి మొట్టమొదటి గీతాన్ని రాశారు. ఆయన పాటలు రాసిన చిట్టచివరి చిత్రం 1968లో వచ్చిన వీరాంజనేయ. ఇదే సంవత్సరం ఆయన కథల్లోంచి ఓ పాటని ఎంచుకుని అత్తగారు కొత్త కోడలు సినిమాలో వాడుకున్నారు. మల్లాదివారు దాదాపు నలభై సినిమాల్లో రెండు వందల పాటల్ని రాశారు. దేవదాసు సినిమాకి ఆయన రాసిన “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్” పాటలో అనంతమైన వేదాంతం దాగిఉంది. తెలుగు భాషలో కుడి అంటే దేహం అన్న అర్ధం కూడా ఉంది. ఎడం కావడమంటే దూరంకావడం. తన ప్రాణానికి ప్రాణమైన పార్వతి తనని విడిచివెళ్లిపోయిన తర్వాత ప్రాణమైతే మిగిలిందిగానీ దేహం మాత్రం విడిచివెళ్లిపోయింది అన్న భావన స్పురించే రీతిలో దేవదాసు పాడిన పాటలో వేదాంతం గోచరిస్తుంది. ఇలా అలతి పదాల్లో అనంతమైన వేదాంతాన్ని నిబిడీకృతం చేసిన మాటల మాంత్రికులైన మల్లాది మాత్రం అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగే ఉంటుందన్న నిజాన్ని రుజువుచేశారు. ఎవరో ఓ సందర్భంలో “దానికి అర్ధం ఏంటి శాస్త్రిగారూ..” అని అడిగితే.. “ఆ అది ఓ తాగుబోతు పాడిన పాట. తాగుబోతు మాటలకు అర్ధం ఏముంటుంది చెప్పండి?” అంటూ సున్నితంగా స్పందించిన సమున్నతమైన వ్యక్తిత్వం శాస్త్రిగారిది. తెలుగు సినిమా పాటకి కావ్య గౌరవాన్ని కల్పించిన మహాకవి మల్లాది రామకృష్ణశాస్త్రి. ఆయన రాసిన ఎన్నో, ఎన్నెన్నో పాటలు జనసామాన్యంలోకి చొచ్చుకుపోయాయి. చిటారుకొమ్మన మిఠాయి పొట్లం చేతికందెను నరుడా, ఏరు నవ్విందోయ్ ఊరు నవ్విందోయ్, అల్లవాడే.. రేపల్లెవాడే.., ఎందాక ఎందాక ఎందాక.. ఓ..ఓ..ఓ.. అందాకా అందాకా అందాకా, తెల్లవారవచ్చె తెలియక నా స్వామి మళ్లీ పరుండేవు లేరా మళ్లీ పరుండేవు లేరా, కనుపాప కరవైన కనులెందుకో తనవారె పరులైన బ్రతుకెందుకో, అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం లాంటి గీతాలు తెలుగు ప్రజల నాలుకలమీద ఈనాటికీ నాట్యమాడుతూనే ఉంటాయి. సీనియర్ సముద్రాలతో ఆయనకి చక్కటి అనుబంధం ఉండేది. చాలా సందర్భాల్లో మల్లాదివారు రాసిన చాలా సినిమా పాటలకు సీనియర్ సముద్రాల పేరు తెరమీద కనిపించేదికూడా.. మల్లాది రామకృష్ణ శాస్త్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో 1905లో జన్మించారు. తల్లిదండ్రులు కనకవల్లి, నరసింహశాస్త్రి. రామకృష్ణశాస్త్రిగారికి నలుగురు తోబుట్టువులుకూడా ఉన్నారు. రామకృష్ణశాస్త్రిగారికి 1920లో వెంకటరమణమ్మతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నరసింహశాస్త్రి, రాజ్యలక్ష్మి, సర్వలక్ష్మి, సూరిశాస్త్రి. ఆనాడు గొప్ప పండితులు శ్రీ పురాణం సూరిశాస్త్రిగారు మల్లాది రామకృష్ణశాస్త్రిగారి పాండిత్యాన్ని, మేధస్సునీ గుర్తించి గౌరవించి ఆయనకు తన కూతురు వెంకట రమణమ్మతో వివాహం జరిపించారు. పురాణం సూరిశాస్త్రిగారు ఏ పుస్తకం కొన్నా రెండు కాపీలు తెప్పించేవారు. ఒకటి తనకీ, మరొకటి తన అల్లుడికి. మల్లాది రామకృష్ణ శాస్త్రి తన తండ్రి పేరుని పెద్ద కుమారుడికీ, మామగారి పేరుని చిన్న కుమారుడికీ పెట్టుకున్నారు. మద్రాసు మహానగరంలో రామకృష్ణశాస్త్రిగారి కేరాఫ్ అడ్రస్ పానగల్లు పార్క్. ఎక్కడికి వెళ్లినా తిరిగి తిరిగీ సాయంత్రానికి కచ్చితంగా ఆయన పానగల్లు పార్కుకి చేరుకునేవారు. పానగల్లు పార్క్ బెంజీమీద కూర్చుని శాస్త్రిగారు అనర్గళంగా అనేక రకాలైన విషయాలగురించి ప్రసంగిస్తూంటే ఎందరో భాషావేత్తలు, ప్రముఖులు అలా సర్వాన్నీ మర్చిపోయి వింటూ జ్ఞానాన్ని సముపార్జించుకునేవారు. పానగల్లు పార్కు అనేక రకాలైన సాహితీ చర్చలకూ వేదికయ్యింది. ఎంత పుణ్యం చేసుకుంటే ఆ నేలకి అంతటి భాగ్యం దక్కిందో. ఆచార్య ఆరుద్ర, వి.ఎ.కె రంగారావు లాంటి వారు క్రమం తప్పకుండా శాస్త్రిగారు చెప్పే విషయాలను వినడానికి పానగల్లు పార్కుకి వచ్చేవాళ్లు. ఓసారి రామకృష్ణ శాస్త్రిగారి పెద్ద కుమారుడైన నరసింహశాస్త్రిగారు మద్రాసు వెళ్లినప్పుడు ఆయన ఇంట్లో లేరు. ఏ స్టూడియోలో ఉన్నారో తెలుసుకోవడం కష్టమయ్యింది. ఎవరో చెప్పగా ఆయన పానగల్లు పార్కుదగ్గర తండ్రిగారికోసం నిరీక్షించి, ఆయన్ని అక్కడే కలుసుకుని తిరిగి రైలువేళకి అందుకుని తిరుగుప్రయాణమయ్యారు. మరో మహాకవి శ్రీశ్రీ రాసిన పాటల గురించి కవిత్వం గురింతీ మల్లాదివారు ఏనాడూ వ్యాఖ్యానించలేదు. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి పాటల గురించి, కవిత్వం గురించి, కథల గురించి శ్రీశ్రీ కూడా ఏనాడూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అలా వ్యాఖ్యలు చేయడమంటే ఒకరిగురించి మరొకరు తక్కువగా అనుకోవడమే అన్న అభిప్రాయం ఇద్దరిలోనూ ఉండేది. ఏమీ మాట్లాడకుండా ఉండండంలోనే ఎంతగానో ప్రశంసించడం ఉందని ఓ సందర్భంలో శ్రీశ్రీ స్వయంగా చెప్పారు. రామకృష్ణశాస్త్రి రాసిన ప్రతి అక్షరం, ప్రతి మాటా, ప్రతి పాటా తెలుగుజాతికి, తెలుగు సినీ జగత్తుకీ వరమే. కథ, కవిత, పాట, పద్యం, వచనం.. ఇలా ప్రక్రియ ఏదైనా కావొచ్చు కానీ వాటన్నింటిమీదా రామకృష్ణశాస్త్రి చెరగని ముద్రని వేశారు. వచన రచనకు మేస్త్రీ అన్న బిరుదుని సార్ధకం చేసుకుని తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలబడిపోయారు. ఆయన వ్యక్తిత్వం సమున్నతమైనది. వసుధైక కుటుంబం అన్న మాటకి అసలు సిసలైన నిర్వచనంగా బతికిన విశ్వమానవుడు మల్లాది రామకృష్ణశాస్త్రి. ప్రతి మనిషిలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి భాషలోనూ ఆయన దైవాన్ని చూసేవారు. అందరినీ, అన్నింటినీ తనవారిగా, తనవిగా భావించి ప్రేమగా చూసుకునేవారు. మనస్ఫూర్తిగా ఆయన్ని తలచుకుంటే ఇప్పటికీ అనంతమైన ఆయన ప్రేమని మనం పరిపూర్ణంగా అనుభవించగలుగుతామనడంలో అణుమాత్రమైనా అతిశయోక్తి లేనేలేదు. నిజం.. నిజం.. నిజం.. ఇది ముమ్మాటికీ నిజం..

No comments:

Post a Comment

Pages