మాతృభాషకు వందనం
 -పోడూరి శ్రీనివాసరావు 
 9849422239 


అమ్మ అనేమాట అమృతతుల్యం 
 యెంత చక్కని భాష – మధురాతిమధురం !! 

 ఆంధ్రభోజునే అలరించినదీ భాష 
 పాశ్చాత్య వ్యామోహంతో తన ఉనికినే 
కోల్పోయిన భాష మన భాష – మన తెలుగు భాష !! 

 మాతృభూమి అంత గొప్పదైన 
 తల్లిభాషపై మనకీ చిన్న చూపేల ? 
 మమ్మీడాడీ సంస్కృతికి తిలోదకాలిచ్చి 
 అమ్మానాన్నల సంస్కృతిని స్వాగాతిద్దాం !! 

 మన భాషా, మన సంస్కృతుల 
 అభ్యుదయానికై పాటుపడదాం ! 
 వెనకాడవద్దు – ప్రాణత్యాగానికైనా 
 తెలుగుభాష ఘన చరితను స్మరించుకుందాం !! 

 మన భాషాప్రాభవాన్ని ముక్తకంఠంతో
 ఎలుగెత్తి జగతికంతా చాటుదాం 
 దిక్కులు పిక్కటిల్లేలా నినదిద్దాం 
 తెలుగుభాష గొప్పతనాన్ని !!!

 అన్యభాషీయుల భాషాభిమానానికి 
 తలవంచుకుని సిగ్గిల్లుదాం ! 
 మనలో ఆ ఐక్యత, భాషాభిమానం 
 ఎప్పుడా అని ఎదురు చూద్దాం !! 

 ప్రాజ్ఞులు చేసే కదనంలో చేయికలుపుదాం – 
ఉడతాభక్తిగా మన మాతృభాషపై 
తెలుగు వెలుగులు వెలయిద్దాం !! 

 తెలుగు భాష సముద్ధరణకు 
 నడుం బిగించి నిలబడదాం 
 మనభాష బావుటా శిఖరాగ్రం పైన 
రెపరేపలాడేలా చేద్దాం !! 
 ఇదే మన తెలుగుభాషకు మనం 
 సమర్పించే మాతృభాషాభివందనం !!
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top