కంచే చేను మేస్తే - అచ్చంగా తెలుగు

కంచే చేను మేస్తే

Share This

 కంచే చేను మేస్తే...

 -  కోసూరి ఉమాభారతి


‘టెక్సాస్ చైల్డ్-వెల్ఫేర్’వారి  సెమినార్డల్లాస్ లో జరగనుంది. రేపటి నుండి నాలుగు రోజుల పాటు జరిగే ఇవెంట్ కి, నా క్లాస్మేట్  ‘సరిత జాన్సన్’నా కూడా వస్తుంది.  సరదాగా మాట్లాడే సరిత నాకు మంచి కంపెనీ.హ్యూస్టన్ నుండి డల్లాస్ కి మా డ్రైవ్-టైం ఐదు గంటలు.
ఈస్టర్ హాలిడేస్ కూడా అవడంతో, ఆరేళ్ళ మా బాబు ‘ఆకాష్’  బాధ్యత పూర్తిగా తనదేనంటూ మమ్మల్ని సాగనంపారు నవీన్.  స్టేట్ యూనివర్సిటీలో  ‘చైల్డ్ సైకాలజీ, చైల్డ్ వెల్ఫేర్’ కోర్సులో  నన్ను ఎన్రోల్చేసిందే నా భర్త నవీన్.  మరో ఏడాదికి చదువు కంప్లీట్ అయి, డిగ్రీ చేతికొస్తుంది.
*****
ట్రాఫిక్ పల్చగా ఉండడంతో డ్రైవ్ ప్రశాంతంగా ఉంది. సెమినార్ పేపర్స్ తీసి చదవడం మొదలెట్టింది సరిత.  “చైల్డ్ అబ్యూజ్  కేసులు నిజంగానే ప్రపంచమంతటా ఎక్కువయ్యాయి, చంద్రా.   చైల్డ్ లేబర్ నుండి, సెక్సువల్ అబ్యూజ్  వరకు  ప్రతిరోజూ ప్రతిపూట ఎదో ఒక సంచలనం.  వింటుంటే చాలా బాధగా ఉంటది. తల్లీ – తండ్రీ, స్కూల్ టీచర్లు కూడా పిల్లల్ని బాధించడం,  మితిమీరి శిక్షించడం లాంటివి ఎలా ఆపగలం?  ఇంగ్లాండ్ లో కూడా ఇటువంటివి విన్నాను, చూసాను,” అంది బాధగా సరిత.
నాకన్నా వయసులో చిన్నది సరిత. తెలుగమ్మాయే.  గుంటూర్ నుండి వెళ్లి, ఇంగ్లాండ్ లో చదువుకొనేప్పుడు  తన క్లాస్మేట్  జాన్సన్ ని ప్రేమించి పెళ్ళిచేసుకొంది. జాన్సన్ బ్రిటిషర్.  ఐదేళ్ళ క్రితం యు.ఎస్ కి వచ్చి, హ్యూస్టన్ లో సెటిల్ అయ్యారు.  తన ఇంట్రెస్ట్ ని బట్టి,  చైల్డ్ - సైకాలజీ  కోర్సుల్లో చేరింది. ‘చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్’అవ్వాలని ఆమె ధ్యేయం.
“ఇండియా ఐనా ఇంగ్లెండ్ ఐనా, అట్లాంటా ఐనా, అనకాపల్లైనా.... ప్రపంచ వ్యాప్తంగా ‘శిశు సంక్షేమం’ సంక్షోభంలో ఉంది సరిత.  నా సొంత ఎక్స్పీరియన్స్ లో నీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెబుతాను విను,”  అన్నాను నింపాదిగా డ్రైవ్ చేస్తూ.
“మనకి ఐదు గంటల డ్రైవ్ టైం.  ఎన్ని విషయాలన్నా వింటాను, చెప్పు చంద్రా,” అంది నవ్వుతూ......
***
“అమెరికాలో అయితే,  స్కూళ్ళల్లో,  డే-కేర్ లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారని అనుకుంటాము. అభిప్రాయపడతాము కదా!... కాదని  స్వానుభవంతో తెలుసుకున్నాను. ఆకాష్ చిన్నతనంలో, జరిగిన సంఘటన వింటే నువ్వు అసలు నమ్మవు.  అమెరికాలో కూడా పిల్లల పట్ల ఎంతటి అలసత్వమో తెలుస్తుంది..” అన్నాను గుర్తు చేసుకుంటూ.
సీట్ వెనక్కి జరుపుకొని కంఫర్టబుల్గా వెనక్కి వాలి, ‘చెప్పు, ఐ యాం రెడీ టు లిజన్,” నా వంక చూస్తూ సరిత.
“నాలుగేళ్ళ  ఆకాష్ ని  పేరున్న ఓ ప్రైవేట్  ప్రి-స్కూల్ కి పంపాము... యేడాది పొడుగునా హాయిగా గడిచింది.  కిండర్గార్టెన్ కి ప్రొమోట్ అయ్యాడు.  కాస్త దూరంలో ఒక పేరున్న మరో స్కూల్లో, పిల్లలకి  మంచి సమ్మర్  ప్రోగ్రాం ఉందని స్కూల్ వాళ్ళే రికమెండ్ చేయడంతో, ఫీజు కట్టి, మా వాడ్ని అందులో ఎన్రోల్చేసాము.
సమ్మర్ స్కూల్ కంటూ వాడికి కొత్త షూజ్, బట్టలు తీసుకున్నాము.  నాకూ ఉత్సాహంగానే ఉంది.  మొదటి మూడు రోజులు  హాయిగా గడిచింది.  నాలుగో రోజు – గురువారం –ఫీల్డ్-ట్రిప్.  స్కూల్ పిల్లలంతా అక్కడికి దగ్గరలో ఉన్న స్కేటింగ్-రింక్ కి వెళ్ళి వచ్చేప్పటికి,ఎండ్ ఆఫ్ స్కూల్ డే అవుతుందని నోట్ పంపారు..
అదే రోజు మా వాడి పుట్టినరోజు కూడా.  స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు, వాళ్ళ టీచర్ కి ఆకాష్ బర్త్-డే అని ఇన్ఫార్మ్ చేసాను.  క్లాస్ అయ్యే టైంకి కేక్ తీసుకు వస్తానని, చిన్న పిల్లలకి పార్టీ ఫేవర్స్ కూడా తెస్తానని చెప్పాను...
ఫీల్డ్-ట్రిప్ నుండి తిరిగి వచ్చాక ఓ అరగంట సమయం ఉంటుంది కాబట్టి, చక్కగా సెలెబ్రేట్ చేద్దామని చెబుతూ, హెడ్-కౌంట్ ఇచ్చింది ఆ టీచర్.... వెళ్ళే ముందు ప్రిన్సిపాల్ వద్ద కూడా పర్మిషన్ తీసుకోమంది.  ఆవిడ చెప్పినట్టే  చేసాను,” అని చెబుతూ క్షణమాగి, కుతూహలంగా వింటున్న సరిత  వైపు చూసాను..
“ఊ, తరువాత సంగతి చెప్పు,” అంది సరిత.
ట్రాఫిక్ ఇంకా కూడా లైట్ గానే ఉంది.
ఆ ‘నైట్-మేర్’  సంఘటన తలుచుకొంటూ, చెప్పడం కంటిన్యూ చేసాను...
*****
“అనుకున్న టైం కన్నా కాస్త ఎర్లీగానే,  స్పెషల్ ఆర్డర్ కేక్, పేపర్ గూడ్స్, పార్టీ బాగ్స్ అన్నీ తీసుకొని స్కూల్ కి వెళ్లాను.  పిల్లలంతా ఎవరి క్లాసుల్లో వాళ్ళున్నట్టున్నారు.  మెల్లగా కారునుండి సామాను మా వాడి క్లాస్ రూమ్ బయటికి చేర్చాను.   టీచర్  చెప్పిన ‘లాస్ట్ హాఫ్-అవర్’  క్కూడా ఇంకా టైం ఉండడంతో, ‘నేను వచ్చానని, కేక్ అవీ అక్కడే డోర్ బయట ఉంచానని, డోర్ వద్ద నుండి ఆవిడకి ‘సైగ’ చేసాను.
మరో రెండు నిముషాలకి - నేను ఒక్కోటి అందిస్తుంటే ఆవిడే సామాను, కేక్ అన్నింటినీ క్లాస్ రూమ్ లోని టేబిల్ మీద సర్దింది.
నన్ను లోనికి రమ్మంది.... అనౌన్స్ చేయడానికి, మా వాడి పేరేమిటని అడిగింది... చెప్పాను.  పదిహేను మంది చిన్నపిల్లలున్న ఆ క్లాస్ లో,  నా కళ్ళు మా వాడి కోసం అప్పటికే రెండుసార్లు వెతికాయి...
“ఆకాష్  ఇక్కడ లేడే?” అడిగాను.. కొత్త టీచర్ కనుక వాడి పేరు తెలియదు సరే, కనీసం వీడొక్కడే ఇండియన్ పిల్లవాడు కదా! అది కూడా గుర్తు లేదా? అనుకున్నాను.  పిల్లలని కౌంట్ అన్నా చేసుకోరా? అనుకున్నాను.  నాకు చాలా ఆదుర్దాగా ఉంది...
“అయితే, వేరే క్లాసుల్లోకి ఏమన్నా వెళ్ళాడేమో,” అంది...ఏ క్లాస్ అని వెదకాలి.  ఆమె కొన్ని క్లాస్ రూములు, నేను కొన్నిట్లోకి  వెళ్ళి అడిగాము...చూసాము.  ఎక్కడా వాడి జాడ లేదు... నా కళ్ళల్లో నీరు తిరగడం చూసి నక్కుతూ నసుగుతూ ఉంది ఆ టీచరమ్మ.  అలా ఓ ఇరవై నిముషాలు గడిచింది.   తరిచి తరిచి అడిగితే, స్కేటింగ్-రింక్ నుండి అందరూ స్కూల్ బస్సుల్లో తిరిగొచ్చి కూడా చాలా సేపయిందన్నారు కొందరు.
అలా వాళ్ళ  దగ్గర నిలబడి పంచాయితీ పెట్టే సమయం కాదని... వాళ్ళ నిర్లక్ష్యం  పట్ల నా అసంతృప్తి  వెళ్లగక్కుతూ  నాలుగు మాటలు అనేసి... స్కేటింగ్-రింక్ అడ్రస్ తీసుకొని నా కార్లో స్పీడుగా బయలుదేరాను... వాడ్ని చూస్తానో చూడనో ఏమీ తెలియని పరిస్థితి.   పెద్దగా ఏడుస్తున్నాను.  కళ్ళ వెంట నీరు కట్టలు తెంచుకుంది... కడుపు రగిలిపోయింది...
ఆ చుట్టుపట్ల  ట్రాఫిక్ పోలిస్ ఉండుంటే నా డ్రైవింగ్ చూసి నన్నో అరగంట ఆపేసి టికెట్ ఇచ్చేవాడే.
ఎలాగో స్కేటింగ్-రింక్ చేరాను.  పార్కింగ్-ఏరియా బిల్డింగ్ వెనకాల ఉంది. పార్కింగ్ లో ఒక్క కారు కూడా లేదు.  అంటే  ఆ రోజుకి మూసేసి లాక్ చేసేసారా?  గబగబా డోర్ వద్దకు వెళ్ళి చూస్తే, వెనకాలి  ఎంట్రెన్స్ డోర్ లాక్ చేసే ఉంది... ‘ఎంప్లాయీస్ వోన్లీ’ అని సైన్ పెట్టున్న పక్క డోర్ వద్దకు వెళ్లాను.  దాని మీద గట్టిగా బాదాను....జవాబు లేదు.
దుఃఖం, కోపం, నిస్సత్తువ నన్ను ఆవరించాయి.  అప్పటికి, నాకు అమెరికాలో అన్ని విషయాలు పెద్దగా తెలియవు కూడా.  మా వాడి స్కూల్ కోసమే, కొత్తగా డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను.  మా వారికి ఫోన్ చేసినా, పేజ్ చేసినా జవాబు లేదు.  ముచ్చెమటలు పోశాయి.  సమయం గడుస్తుంటే - చిన్నవాడు ఏమయ్యాడో, ఎవరన్నా  ఎత్తుకెళ్ళారో,  ఎటన్నా వెళ్ళిపోయుంటే ఏమవుతాడో అని బుర్ర వేడెక్కి పోయింది.   అడుగు ముందుకి వేయలేకపోయాను.
మా వారికి ఫోన్ ట్రై చేస్తూనే పెద్దగా ఏడ్చేయడం మొదలెట్టాను.. ఆయన  హాస్పిటల్లో బిజీగా  ఉన్నప్పుడు మాత్రమే ఇలా జవాబుండదు.  వాళ్ళ ఆపరేటర్ క్కూడా కాల్ చేసి, పేజ్ ఆన్సర్ చేయకపోతే, మెసేజ్ పెట్టాను..
అలాగే కాళ్ళీడుస్తూ వ్యర్ధ ప్రయత్నంగా – చుట్టూ తిరిగి ముందు ఎంట్రెన్స్ వైపు  నడిచాను.  ఎండవేడి దంచేస్తుంది.  కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. గొంతు తడారిపోయి ఏడవడానికి కూడా శక్తి లేకుండా పోయింది..
నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో,  ఆలోచనే లేకుండా మెదడు కూడా మొద్దుబారిపోయింది.  యధాలాపంగా గ్లాస్ డోర్స్ హాన్డిల్స్మీద చేతులు వేసి నెట్టాను..  తలుపులు తెరుచుకున్నాయి.  లోపల మరో ఎంట్రెన్స్ డోర్  ఉంది.  అన్నీ డార్క్ బ్లాక్ డోర్స్.   బయటికి ఏమీ కనబడడంలేదు.
ఆ రెండో గ్లాస్ డోర్స్ ని  కూడా గట్టిగా తోసాను.  తెరుచుకున్నాయి.
ఎంట్రీ వే లో ఓ పక్కకి గోడనానుకుని, నా ఆకాష్ నిలబడి ఉన్నాడు.  ఒక్కసారిగా నా ఊపిరి ఆగినట్టయింది.  ఏ దేవుడు కరుణించాడో.  ఒక్కసారిగా వాడ్ని ఎత్తుకున్నాను.  వాడి ముఖాన భయం లేదు.  ఆకలిగా ఉందేమో అనుకున్నాను.   ‘భయం వేయలేదా కన్నా’ అని అడిగితే, లేదన్నాడు.  తనకోసం మమ్మీ  వస్తదని తెలుసన్నాడు.  వాడిని చూసి, వాడి మాట విన్న ఆనందంతో నా మనసు గంతులు వేసింది....ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. అంతలో మావారి నుండి ఫోన్ కాల్ వచ్చింది ...జరిగింది చెప్పాను.
******
 అర్ధమయిందేమంటే,  మూడు గంటలకి ఆ ఫెసిలిటీ క్లోజ్ అయిపోయింది.  మళ్ళీ సాయంత్రం సెవెన్ కి ఓపెన్ అవుతుంది.  మెయిన్ డోర్ లాక్ చేసేసి స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు.ఎంట్రీ వే లో మరో పక్క చిన్న డెస్క్ మీద ఫెసిలిటీ సమాచారం, విజిటర్స్ సైన్ చేసే బుక్ పెట్టున్నాయి.  మెయిన్ డోర్స్ కి,ఆ ఎంట్రీ డోర్స్ కి మధ్యనున్న స్థలంలోనే  ఆకాష్ నాకోసం వెయిట్ చేస్తున్నాడన్నమాట,” నా చేదు అనుభవాన్ని ఏకరువు పెట్టడం ఆపి, ఒక్క క్షణం ఊపిరి తీసుకున్నాను.
అది గమనించి సరిత తన సీట్ స్ట్రైట్చేసి లేచి కూర్చుంది...”నమ్మలేని సంగతి చంద్రా....మరి అలా ఆ స్కూల్ వాళ్ళని వదిలేసేవా? పూర్ ఆకాష్ బేబీ... ఎంత భయపడ్డాడో? పాపం,నీది కూడా  ఊహించలేని పరిస్థితి...  మై గాడ్,” అంది సరిత నాభుజం పై చేయి వేసి...
“లేదు.నిజానికి వదలలేదు. వారి అజాగ్రత్త, అలసత్వం వల్ల మా అబ్బాయిని కోల్పోయే స్థితి తెప్పించారని, స్కూల్ యాజమాన్యంని  కోర్టుకి ఈడుస్తానని హెచ్చరిస్తూ, నేను వెంటనే స్కూల్ డిస్ట్రిక్ట్ కమిటీకి లెటర్ రాసాను.
మాకు తెలిసిన లాయర్ ని సంప్రదించాను కూడా.  అయన జరిగిందంతా రాసి ఇవ్వమన్నాడు.  స్కూల్ బోర్డ్ తో ఇటువంటి కేసులు అవీ చాలా కాలం మాత్రం పడుతుందన్నారు.  పిల్లవాడు  క్షేమంగా దొరికాడు కాబట్టి  తీవ్రమైన నేరంగా అది పరిగణింపబడక  పోవచ్చునన్నారు.  విని డిజపాయింట్అయ్యాను. రాత్రింబగళ్ళు సమయమంతా ఆకాష్ ని కూడా పట్టించుకోకుండా కంప్లైంట్, కేస్ తయారుజేయడంలో  గడిచిపోతుందనిపించి.... మరి కొన్నాళ్ళకి వదిలేశాను,” కాస్త నసుగుతూ సరిత వంక చూసాను.
“నమ్మలేని సంగతే ఇది.  అందుకేనన్నమాట ఆకాష్ ని డే-కేర్ లో ఉంచనంటావు. నీ ఈ అనుభవంవింటేనే తల బరువెక్కిపోయింది.  నాకు హాట్ కాఫీ కావాల్సిందే... నెక్స్ట్ రెస్ట్ ఏరియాలో ఆగుదాము,” అంది సరిత.
*****
కాఫీలు, స్నాక్ అయ్యాక తిరిగి బయలుదేరాము.  హిందీ సాంగ్స్ సి.డి ఆన్ చేయబోయాను.
“వద్దు... ప్లీజ్.  నో మూడ్.... నా ఆలోచన ఇంకా నీవు చెప్పిన సంఘటన మీదే ఉంది. స్కూల్లో దిగవిడచిన పిల్లవాడు మాయమవడంలో,  స్కూల్ వాళ్ళ బాధ్యతారాహిత్యం నమ్మలేకుండా ఉన్నాను.  ఫీల్డ్ ట్రిప్ నుండి పిల్లలని క్షేమంగా తిరిగి స్కూల్ కి తీసుకువచ్చి తల్లికి అప్పజెప్పలేని  స్కూల్ వ్యవస్థ గురించి నాఆలోచన.  ఆకాష్ ఆ రోజు నీకు కనబడకుండా పోయుంటే..? అని నా ఆలోచన,” అంది సరిత...
“నీకు ఓపికుంటే,చైల్డ్ వెల్ఫేర్విషయంగా నా మనసులో నిలిచిపోయిన మరో సంఘటన చెపుతాను..” అన్నాను సరితతో......
“అలా అంటావే?  నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్అదే కదా.. కాక మనం చదివే చదువు కూడా అదేనయ్యే. చెప్పు, వింటాను,”  అంది సరిత....
***
“...టీచర్ ట్రైనింగ్ తీసుకొని, టీచింగ్ జాబ్ చేద్దామన్న ప్రయత్నంలో భాగంగా,సబ్స్టిస్ట్యూట్  టీచర్గా చేరాను.  వారం రోజుల పాటు కంటిన్యూయస్ గా ఒకే హైస్కూల్లో అసైన్మెంట్తీసుకున్నాను.   స్టేట్ అంతటా 9 th-12 thగ్రేడ్ స్టూడెంట్స్ కి ‘టాక్స్’(TAKS-Texas assessment of knowledge and skills) ఎగ్జామ్స్ కూడా అదే వారంలో నిర్వహించబడుతున్నాయి.
నైన్త్ గ్రేడ్ ఎగ్జాం హాల్లో,  క్లాస్ టీచర్తో పాటు నేను కూడా ఉన్నాను.  ‘నేతన్’ అనే ఓ పదహారేళ్ళ అమెరికన్ కుర్రాడు,పరీక్ష కాగితాలని తీసుకున్న పది నిముషాల్లోనే తిరిగి మాకందించి తన సీటులోకి వెళ్లి కూర్చున్నాడు.  ఆ అబ్బాయిని పరిశీలించాను.  చాలీచాలని షర్ట్  వేసుకున్నాడు.  జీన్స్ పాంట్స్ కూడా మడిమల పైకి ఉన్నాయి... టీనేజర్స్ శ్రద్దగా, ట్రెండీగా డ్రెస్ చేసుకొంటారు కదా! నేతన్ ఏమిటిలా! అని కాస్త ఆశ్చర్య పోయాను.  స్వతహాగా చాలా అందమైన వాడు నేతన్. పొడగరి.  నైన్త్ గ్రేడ్ కి కాస్త పెద్దవాడుగా కనిపించాడు.
*****
మరి కాసేపటికి, ఆ అబ్బాయితన డెస్క్ ని, టీచర్ టేబిల్ కి దగ్గరగా జరుపుకొని అక్కడ కూర్చున్నాడు.  టీచర్ అందించిన వేరే టెస్ట్ పేపర్స్ లోని క్వస్చన్స్కి ఆన్సర్స్ రాయడం మొదలెట్టాడు. అదంతా చూస్తున్న నాకేమీ బోధపడలేదు.
******
మరో రెండు రోజులకి ఆ టీచర్ తో సాన్నిహిత్యం ఏర్పడి, నేతన్ గురించి అడిగాను.  ఆ అబ్బాయి నిజానికి చాలా తెలివైన వాడట.  కాని  స్టేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహించే స్టాండర్డ్ పరీక్షలలో పాస్ అవ్వకూడదనే–ఉద్దేశపూర్వకంగా, గత రెండేళ్ళగా అలా సగం రాసిన కాగితాలు సబ్మిట్ చేసాడట.  నాకేమీ అర్ధం కాలేదు.
నేతన్ చరిత్ర తెలుసుకోవలసిన అవసరం ఉందనిపించింది...ఆమెనే అడిగాను.
నేతన్, అతని తల్లి కూడా చాలా కాలంగా స్టేట్- వెల్ఫేర్ -డిపెండెంట్స్ అట.  నూటికి నూరుపాళ్ళు స్టేట్ నుండి వచ్చే చెక్స్ పైన, ఫుడ్ స్టాంప్స్ పైన, వసతి పైన ఆధారపడి జీవిస్తున్నారట.  ఆ తల్లికి పదహారేళ్ళప్పుడు పుట్టిన బిడ్డ అట - నేతన్.
అయితే, అసలు సమస్య ఒకటుందట.  ఆమెకి కుదురు లేకపోవడమే కాక వ్యసనపరురాలట.  స్టేట్- వెల్ఫేర్విధానాల్లోని లొసుగులను,తమకనుగుణంగా మలుచుకుని  బతకడంలో  ఆమె ఆరితేరిందట.  అందులో భాగంగానే, వెల్ఫేర్ వారి ఆదరణ తగ్గకూడదని,నేతన్ కూడా టైంకి తన హైస్కూల్ చదువు పూర్తి కానివ్వకుండా, వెనకబడుతూ వస్తున్నాడట.
మూడోసారి కూడా నైన్త్ గ్రేడ్ ఫెయిల్ అయి, అతను ‘స్పెషల్ నీడ్స్’కేటగిరీ  లోకి మారాలని ఆశిస్తున్నారట ఆ తల్లీకొడుకులు..
నేతన్ కి అంతా తెలిసే తల్లికి అండగా ఉండడం కోసం తన భవిష్యత్తుని ఫణంగా పెట్టాడుట.  అలా తెలివిలేనట్టుగా మసులుకోడం, కనబడడం కూడా, ‘స్పెషల్ నీడ్స్’ మైనర్ చైల్డ్గా నిర్దారించబడి, వెల్ఫేర్ నుండి, నేతన్ ఇరవైయొకటవ  బర్త్-డే  వరకు రెట్టింపు ఆర్ధిక-సాంఘిక సహకారాలని  అందుకోడానికట ....,”  క్షణమాగి సీరియస్గా వింటున్న సరిత వైపు చూసాను.
నేతన్ విషయం చెబుతుంటే, మనసులో మళ్ళీ అంతే బాధగా అనిపించింది నాకు.
“అయితే,తామంతా ఆ అబ్బాయికి చేతనయిన సాయం చేస్తూనే ఉంటామని, నేతన్ పై అందరికీ జాలేనని చెప్పింది ఆ టీచర్.అతనికి వేరేగా పరీక్షలు పెట్టి,  ఆ గ్రేడ్స్ ని బట్టే, స్కూల్లో ఇంటర్నల్గా లెవెంత్ గ్రేడ్ మెరిట్ స్టూడెంట్ గా పరిగణించారట. దాంతో, టీచర్స్ కి అసిస్టెంట్ గా పనిచేసే అర్హతని,ట్యూషన్స్ చెప్పే అర్హతని పొంది, అలా కూడా కొంత డబ్బు సంపాదిస్తాడట... అదీ సంగతి...,”అని నేతన్ సంగతి చెప్పడం ముగించాను.
*****
“అమ్మతనాన్నే హేళన చేసే విధంగా ప్రవర్తిస్తారు కొందరు తల్లులు.  నా జ్ఞాపకాల్లో నిలిచిపోయిన సంఘటన ఇది,” బాధనిపించి నిట్టూర్చాను.
“ఎంతన్యాయం.. కొడుకు జీవితాన్ని అధోగతి చేసిన సొంత తల్లి.  ఏ ఊరైనా మరే దేశమైనా ఇటువంటి సంఘటనలు విన్నప్పుడు కలవరంగా అనిపిస్తుంది,”  అంటూ వాపోయింది సరిత..
******
‘చైల్డ్ వెల్ఫేర్’సెమినార్ లో భాగంగా ‘హానిమార్గంలో పసివారు’ అన్న శీర్షికన మూడు రోజులు జరిగిన మీటింగ్స్ లో వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు ప్రసంగించారు...’ప్రపంచంలో ఏ మూలనైనా - పిల్లలపట్ల అలసత్వం, అలక్ష్యం  భవిష్యత్తుకి  క్షేమం కాదని,  బాధితులైన పసివాళ్ళ జీవితాలని అంధకారంలోకి నెట్టేస్తుందని, భావిపౌరుల దుస్థితికి కారణమౌతుందని చెబుతూ ఆ విషయంగా నమోదయిన సమాచారాన్ని, గణాంకాలని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తిగా  పసివారి  పట్ల జరుగుతున్న అఘాయిత్యాలని  ఆపవలసిన బాధ్యత తల్లితండ్రులు, పెద్దలు, పిల్లల బద్రతా సంస్థలదేనని సూచించారు..  హెచ్చరించారు.
నాలుగో రోజున విద్యాసంస్థల నుండి వచ్చిన మా బోటి ప్రతినిధులకి  ప్రత్యేక క్లాస్ ఏర్పాటు చేసి, సమగ్రమైన సమాచారాన్ని,  ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలని,  చైల్డ్ వెల్ఫేర్ నిమిత్తంగా స్థాపించబడ్డ కొత్త సంస్థల గురించిన వివరాలని అందించారు..
సెమినార్ నుండి ఎన్నో విషయాలు తెలుసుకో గలిగాము,  మాకు ఎంతో లభించిందన్న తృప్తితో తరుగు ప్రయాణయ్యాము...
“ఏమైనా పసివారి ఆలనా పాలనా ప్రప్రధమంగా తల్లి తండ్రులు, ఆ తరువాత గురువుల చేతుల్లో మొదలవుతుంది కనుక, వారు బాధ్యతగా పిల్లల ఎదుగదలకి సహకరించాలి... అలా కాక
“కంచే చేను మేస్తే” విధంగా, వారే తమ పసివారిని హాని మార్గంలో నిలబెట్టడం సరి కాదు,” అన్న నా మాటలకి, “అంతేగా మరి, పూర్తిగా ఏకీభవిస్తాను,” అంటూ సీట్లో వెనక్కి  వాలింది సరిత.
***************

No comments:

Post a Comment

Pages