భైరవ కోన -11 (జానపద నవల ) - అచ్చంగా తెలుగు

భైరవ కోన -11 (జానపద నవల )

Share This
భైరవ కోన -11 (జానపద నవల ) 
 -భావరాజు పద్మిని 


(జరిగిన కధ : సదానందమహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటాడు భైరవపురం రాకుమారుడు విజయుడు. గురువు ఆదేశానుసారం భైరవారాధన చేసి, ఒక దివ్య ఖడ్గాన్ని, వశీకరణ శక్తిని, అష్ట సిద్ధులను, పొంది తిరిగి వెళ్ళే దారిలో కుంతల దేశపు రాకుమారి ప్రియంవదను కలిసి, ఆమెతో ప్రేమలో పడతాడు. వంశపారంపర్యంగా విజయుడికి సంక్రమించిన చంద్రకాంత మణిని స్వాధీనం చేసుకుని, 6 శుభలక్షణాలు కల స్వాతి నక్షత్ర సంజాత అయిన రాకుమారిని బలిచ్చి, విశ్వవిజేత కావాలని ప్రయత్నిస్తుంటాడు కరాళ మాంత్రికుడు. విజయుడి చెల్లెలైన చిత్రలేఖ వివాహం, అతని మిత్రుడు, మంత్రి కుమారుడైన చంద్రసేనుడితో నిశ్చయం అవుతుంది. చిత్రలేఖ తాను వెదుకుతున్న స్వాతీ నక్షత్ర సంజాత అని తెలుసుకున్న కరాళుడు రాజగురువు రూపంలో వచ్చి, ఆమెను అపహరించుకు పోతాడు. జరిగిన మోసం తెలుసుకుని, చిత్రలేఖను రక్షించేందుకు వెళ్తూ, ఒక మునికి శాపవిమోచనం కలిగించి, దుర్గ అనుగ్రహంతో దివ్యదృష్టిని, ఖడ్గాన్ని పొందుతాడు చంద్రుడు. గండ భేరుండ పక్షులపై పయనమై, 3 సముద్రాలకు ఆవల ఉన్న కరాళుడి స్థావరం చేరుకున్న మిత్రులను భక్షించేందుకు వస్తుంటుంది ఒక జడల భూతం...) తల నుంచి పాదాల దాకా వేళ్ళాడుతున్న జడలతో, వికృతంగా నాలుక చాస్తూ, ‘నరవాసన...’ అంటూ, విజయుడిని, చంద్రుడిని మింగేందుకు రాసాగింది జడల భూతం. దాని జడలు నేలకు రాసుకున్న చోటల్లా, నిప్పులు పుడుతున్నాయి. తాత్సారం చెయ్యకుండా తమ ఖడ్గాలతో, చెరోవైపు నుండి, దాని జడలు ఖండించారు మిత్రులు. వెంటనే, ఆర్తనాదం చేస్తూ, నేలకొరిగింది భూతం. దాన్ని దాటుకుని, పది అడుగులు ముందుకు వేసారో లేదో, ఉన్నట్టుండి, మిత్రులు ఇరువురూ, పెద్ద అగాధంలోకి జారిపోసాగారు. అదేదో, లోతైన గుహలా ఉంది. గుహ మార్గం అంతా కటిక చీకటి, బురద... అలా జారుకుని, జారుకుని, ఒక ఊబిలో పడ్డారు మిత్రులు. నెమ్మదిగా, పాదాల నుంచి, ఊబిలో కూరుకుపోసాగారు. వెంటనే, భైరవుడు తనకు ప్రసాదించిన అష్టసిద్దులలోని ప్రాకామ్య సిద్ధిని చంద్రుడికి బోధించి, అతడితోసహా, ఆకాశామార్గంలోకి మాయమయ్యాడు విజయుడు. ‘చంద్రా ! గండ భేరుండ పక్షులు చెప్పినట్లు, ఇక్కడ శక్తి కాదు, యుక్తి ముఖ్యం. నీవు మునుపు చెప్పినట్లుగా రాక్షస బల్లులు, విష సర్పాలు, బ్రహ్మరాక్షసుడు , ఎన్నో దుష్టగ్రహాలు కరాళుడి గుహకు కాపలా ఉన్నాయి. ప్రతి దుష్టశక్తితో పోరాడే సమయం మనకిక లేదు. త్వరగా నీవు దివ్యదృష్టితో మార్గం చూసి చెప్తే, మనం ‘అణిమా సిద్ధి’ తో సూక్ష్మ రూపం ధరించి కరాళుడి గుహలోకి ప్రవేశిద్దాం...’ అన్నాడు విజయుడు. వెంటనే చంద్రుడు దివ్యదృష్టి తో మార్గం తెలిపాడు. మిత్రులు సూక్ష్మ రూపంతో గుహలోకి వెళ్లి, జరిగేది చూడసాగారు. “మరో గంటలో అమావాస్య ఘడియలు రానున్నాయి, లే రాకుమారీ, నీకు కుడివైపున ఉన్న త్రోవలో పయనించి, అక్కడి వాగులో స్నానం చేసి, ఈ నలుపు బట్టల్ని ధరించి, పూర్ణ మనసుతో బలికి సిద్ధమై రా !” ఆజ్ఞాపించాడు కరాళుడు. రాతిపలక పైనుంచి, మంత్రముగ్ధలా లేచి, అక్కడున్న వస్త్రాల్ని తీసుకుని, నడవసాగింది చిత్రలేఖ. ఆమె అలా వెళ్తుండగా, సూక్ష్మ రూపంలో ఉన్న విజయుడు, ఆమె ఎదుటకు చేరి, తన వశీకరణ శక్తిని ఆమెపై ప్రయోగించాడు. అరవద్దు, అలాగే నడవమంటూ సైగ చేసి, ఆమె చెవిలో ఒక ఉపాయం చెప్పి, మాయమయ్యాడు. నల్లటి చీరతో సిద్ధమై, అక్కడి భేతాళుడి విగ్రహం ముందుకు వచ్చింది, చిత్రలేఖ ! విగ్రహం ముందు హోమగుండం మండుతోంది. క్షుద్ర పూజలకు వాడే అనేక వస్తువులు అక్కడ పేర్చబడి ఉన్నాయి. విగ్రహం పాదాల వద్ద ఉన్న దంతపు పెట్టెలో మెరుస్తోంది, చంద్రకాంతమణి. ‘రాకుమారీ ! నీవిక ఆ మణిని చేతిలోకి తీసుకుని, ఆ విగ్రహం ముందు మనస్పూర్తిగా మోకరిల్లు. సాష్టాంగనమస్కారం చెయ్యి!’ , ఆజ్ఞాపించాడు కరాళుడు. ‘కరాళా ! నేను రాకుమారిని. నాకు వంగి దణ్ణం పెట్టే వాళ్ళే కాని, నేను వంగి నమస్కరించింది లేదు. అది ఎలాగో చూపితే, నీవు కోరిన విధంగానే చేస్తాను, ‘ అంది చిత్రలేఖ. ‘ఇదిగో ఇలా చెయ్యాలి, ‘ అంటూ కరాళుడు సాష్టాంగనమస్కారం చెయ్యగానే, స్వస్వరూపాన్ని పొంది, భైరవుడు ఇచ్చిన దివ్యఖడ్గంతో, కరాళుడి తల ఖండించాడు విజయుడు. అది నేరుగా వెళ్లి, హోమగుండంలో పడింది. కరాళుడి మరణంతో అతనికి వశమై ఉన్న దుష్టశక్తులు అన్నీ బిగ్గరగా అరవసాగాయి. విజయుడు, చంద్రుడి మీదకు దాడికి రాబోయాయి. ఇంతలో గుహ భయంకరంగా కంపించసాగింది. భేతాళుడి విగ్రహం విరిగి ముక్కలై పడసాగింది. అడ్డొచ్చిన దుష్ట జీవాల్ని తమ ఖడ్గంతో ఖండిస్తూ, దివ్య మణిని, చిత్రలేఖను చేతబట్టి, శరవేగంతో గుహ వెలుపలికి పరుగులు తీసారు మిత్రులు. ఒక గుట్టపైకి చేరి, తిరిగి గండ భేరుండ పక్షుల్ని ధ్యానించారు. అవి రాగానే, వాటి వీపుపై ఎక్కి కూర్చున్నారు. అవి గగన మార్గానికి ఎగురుతుండగానే, జరిగిందొక విచిత్రం ! కరాళుడి గుహ ఉన్న ప్రాంతమంతా భూకంపం కలిగి, చూస్తుండగానే ఆ దీవి మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఆశ్చర్యంతో చూస్తూ, తమను సమయానికి కాపాడిన భైరవుడికి మనసులోనే వందనాలు సమర్పించారు అంతా. తమ అశ్వాల వద్దకు చేరుకొని, వాటిపై పయనించి, అక్కడి నుంచి, క్షేమంగా భైరవపురం చేరుకున్నారు. కార్తీక పున్నమి. జలపాతపు సోయగాలు పున్నమి వెలుగులో స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. వెన్నెల చలువ, పవిత్రమైన వాతావరణం, మనసుల్ని ఆహ్లాదపరుస్తూ, సేద తీరుస్తోంది. యధాలాపంగా పున్నమినాడు దుర్గా పూజకు, తన పరివారంతో వచ్చింది కుంతల రాకుమారి ప్రియంవద. అక్కడికి భైరవపురం ఆనవాయితీ ప్రకారం చంద్రకాంత మణితో సహా చేరుకున్నారు విజయుడు, రాజు మాణిక్య వర్మ, మహారాణి దేవ సేన, రాజగురువు ప్రజ్ఞాశర్మ, సదానందమహర్షి, చిత్రలేఖ, చంద్రుడు మిగతా కుటుంబ సభ్యులు. చిరునవ్వుతో ఆలింగనం చేసుకున్నారు ఇద్దరు రాజులు, రాణులు. తన వదిన వద్దకు వెళ్లి, ఆప్యాయంగా హత్తుకుంది చిత్రలేఖ ! వారి వివాహాలకి శుభ ముహూర్తం నిర్ణయించారు సదానందమహర్షి. ఇంతలో పున్నమి ఘడియలు సమీపించాయి. చల్లని వెన్నెల కిరణాలు దుర్గ అమ్మవారి ఎదుట ఉన్న కొలనులో పడి, అమ్మ నుదుటి కుంకుమ పైకి పరావర్తనం చెందాయి. అవి అమ్మవారి ఎదుట ఉన్న చంద్రకాంత మణి పై ప్రతిబింబించి, దివ్యమైన వెలుగు ఆ పరిసరాల్లో వ్యాపించింది. ఇంతలో అమ్మవారి విగ్రహం వద్దనుంచి, ఒక దివ్యవాణి వినిపించింది... ‘ నాయనా విజయా ! మీ పూర్వీకుల లాగానే స్వార్ధం వీడి, లోకకల్యాణం కోసం దీక్షబూని, రాజధర్మం నెరవేర్చావు. నీకు , మీ వంశానికి, ఇక్కడున్న అందరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఆచంద్రతారార్కం రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించి అంత్య కాలంలో నన్ను చేరతావు ! విజయోస్తు !’ అమ్మ దీవెనలకు మురిసిపోతూ, అమ్మ ఎదుట ప్రతిష్ట చెయ్యబడ్డ భైరవుడిని భక్తితో ఆరాధించి, పెళ్లి ఏర్పాట్లకు తమ తమ రాజ్యాలకు పయనమయ్యారు అంతా. విజయుడు – ప్రియంవద, చిత్రలేఖ – చంద్రసేనుల వివాహాలు వైభవంగా జరిగాయి. భైరవపురం ప్రజలు , భైరవకోన లోని అమ్మవారి ఆరాధన చేస్తూ, ఆ చల్లనితల్లి దీవెనలతో, ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడే విజయుడి పాలనలో , కలకాలం సుఖంగా జీవించారు. - సమాప్తం -

No comments:

Post a Comment

Pages