అయ్యయ్యో బ్రహ్మయ్యా - అచ్చంగా తెలుగు

అయ్యయ్యో బ్రహ్మయ్యా

Share This
అయ్యయ్యో బ్రహ్మయ్యా
 - ప్రతాప వెంకట సుబ్బారాయుడు 

 బ్రహ్మ దేవుడు నాలుగు తలకాయల నుదుర్లూ గోక్కున్నాడు. ఇంత క్రితం ఒకబొమ్మని చేతిలోకి తీసుకుని నుదుటి మీద రాత రాద్దామనుకునేసరికి సరస్వతి వచ్చి"ఏమండీ! పార్వతీదేవి వ్రతం చేసుకుంటోందట పిలిచింది. నేను వెళ్ళిరానా?"అంది. "అలాగే..వెళ్ళు! అన్నట్టు శివుడ్నీ, పిల్లల్ని అడిగానని చెప్పు"అన్నాడు. ఆ తర్వాత ఆలోచనలో పడ్డాడు. అదేమిటంటే ‘ఇందాక తన చేతుల్లోని మట్టిబొమ్మ నుదుటన రాత రాశాడా? లేక మాటల్లోపడి రాయకుండానే ప్రాణంపోసి ఏ మాతృగర్భంలోకన్నా జారవిడిచాడా?’ అని. ఈ మధ్య తనకి మతిమరపు సంభవిస్తున్నట్టు అనుమానంగా వుంది. ఇలా జరగడం మొదటిసారి కాదు..ఇప్పటికి రెండు మూడు సార్లు జరిగింది. కారణం అంతుబట్టడం లేదు. ఈ విషయం ఇంకెవరికన్నా తెలిస్తే ఇంకేమన్నా వుందా? జీవులు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి రాత రాసే తను, ఈ మధ్య ఒక పాపికి అష్ట ఐశ్వర్యాలతో కూడిన రాజభోగ జీవితం అనుగ్రహించాడు. ఒక పుణ్యాత్ముడికి హైద్రాబాదు ట్రాఫిక్‍లో క్షణం క్షణం నరకాన్ని అనుభవించే దిక్కుమాలిన జీవితాన్ని నుదుటి గీతల్లో పొందుపరిచాడు. ఏవిటీ విపరీతం? తనకేం జరుగుతోందసలు?’ ‘నారాయణ..నారాయణ..’ "అమ్మో నారదుడు వచ్చేస్తున్నాడు. నారదుడికి తన గురించి తెలిస్తే ఇంకేమన్నా వుందా? లోకాలన్నింటిలో టాం టాం చేసేయ్యడూ.." "నారాయణ..నారాయణ..అన్నట్టు సరస్వతీ మాత కనిపించడంలేదు..ఎక్కడికెళ్ళింది?" "ఆఁ..అది..అది..ఎవరింట్లోనో ఏదో పనుందట ఇప్పుడే వస్తానని వెళ్ళింది" "ఎవరింట్లో..ఏం పని?..నేను అందరిళ్ళూ చూసే వస్తున్నానే.. ఎక్కడా తల్లి జాడ కానరాలేదు. ఒకప్పుడు శివుడు..విష్ణువు తగవులతో తమ అర్ధాంగులనుండి దూరమయి తర్వాత బాధతో పశ్చాత్తాపంతో వాళ్ళని వెదకుతూ వెళ్ళి, బ్రతిమాలి బామాలి తెచ్చుకున్నట్టుగా మీ మధ్యా అలాంటి గొడవేమన్నా జరిగిందా?" అడిగాడు నర్మగర్భంగా. "అబ్బా..అదేం లేదయ్యా..నాకు చాలా పనుంది.. చేసుకోనీ సూర్యాస్తమయంలోగా ఇంకా కొన్ని బొమ్మలకి రాత రాయాలి"విసుగ్గా అన్నాడు. "అమ్మతో నాకు పనిబడింది. ఆ తల్లి ఎక్కడికెళ్ళిందో చెప్పాలి..మీకు తెలుసుకదా మన పనుల విషయంలో జాగు జరగకూడదు. సృష్టి కార్యాలకి విఘాతం కలుగుతుంది. నేను తక్షణమే అమ్మని చూడాలి..మాట్లాడాలి"అన్నాడు మంకుపట్టు పట్టి. "అబ్బబ్బ తెగ విసిగిస్తున్నావయ్యా. సరస్వతి ఒక ముఖ్యమైన పనిమీద వెళ్ళింది. అది ఎవరికీ చెప్పకూడదు. బహురహస్యం!"తప్పించుకునే ప్రయత్నం చేశాడు. "నేను తెలుసుకోకూడని రహస్యమా? మానవుల్లాగా రహస్యమంతనాలు మీరూ మొదలెట్టారా? మన దగ్గర కార్యకలాపాలన్నీ దృగ్గోచరంగా (ట్రాన్స్ పరెంట్) వుంటాయి కదా! నేనిప్పుడే నారాయణుడితో విషయం చెబుతాను"అని లేవబోయాడు. "ఉండవయ్యా ఉండు. చెబుతాను."అని నారదుడి చెయ్యి పట్టుకుని ఆపి, సరస్వతి ఎక్కడికెళ్ళిందో ఆలోచించాడు. ఎంత ఆలోచించినా తట్టలేదు. తను ఎక్కడికో వెళతానని చెప్పడం వరకు జ్ఞాపకం వుంది. కాని ‘ఎక్కడికెళతానని’ చెప్పిందో మాత్రం నాలుగు బుర్రల్నీ ఎంతగా గోక్కున్నా గుర్తుకు రావడం లేదు. "నేను వెళ్ళాల్సిన ప్రదేశాలు, చెయ్యవలసిన పనులూ ఎన్నో వున్నాయి. అమ్మ ఎక్కడకెళ్ళిందో త్వరగా చెప్పాలి"అన్నాడు నారదుడు ఆసనం నుండి మళ్లీ లేస్తూ. "అబ్బా! నీతో చచ్చిపోతున్నానయ్యా, నారదా"అని నారదుడికి అసలు విషయం చెప్పకపోతే ఇంకా గొడవవుతుందని, నారదా! నీకో విషయం చెబుతాను. కానీ నువ్వు ఎవరికీ చెప్పకూడదు"అన్నాడు. "నేను ఇదివరకటి తంపులమారి నారదుణ్ణి కాను..నన్ను నమ్మి..విషయం చెప్పవయ్యా బ్రహ్మయ్యా" "మరి.. మరి.. నాకీమధ్య మతిమరపు ఎక్కువయిందయ్యా, కారణం ఏమిటో తెలియడం లేదు."అసలు విషయం చెప్పేశాడు. "ఓహ్! అదా సంగతి, అర్ధమైంది. దానికి అంతగా మదనపడడం దేనికి? మన దేవ వైద్యుడు ధన్వంతరి వున్నాడుగా, పిలిస్తే సరి"అన్నాడు. "వైద్యుడు ఇంటికి వస్తే విషయం అందరికీ తెలిసిపోదూ"కాస్త సిగ్గుపడుతూ అన్నాడు. "వ్యాధి ముదరకముందే వైద్యం అందాలి..లేకపోతే అసలుకే ఎసరొస్తుంది..నువ్వు తెమ్మంటే మూడో కంటి వాడికి, ఒళ్ళంతా కళ్ళున్న వాడికీ తెలియకుండా, తెల్లవారు ఝామున ఆయన్ని తీసుకువస్తాను" "అందరూ నిన్ను తిట్టుకుంటారు కాని..నువ్వెంత మంచివాడివయ్యా..నారదా"అన్నాడు మెచ్చికోలుగా. ’అబ్బా సంబడం, అసలు ఆ వ్యాధేమిటో తెలిస్తే అందరికీ చెప్పొచ్చు’ నారదుడు మనసులో అనుకుని "దాందేముంది? నేను రేపుతెల్లవారుఝామున ధన్వంతరిని తీసుకు వస్తాను"అని ‘నారాయణ.. నారాయణ’ అన్న ఈల పాటతో హుషారుగా వెళ్ళిపోయాడు. *** చెప్పినట్టుగానే ధన్వంతరిని తెల్లవారుఝామున తీసుకువచ్చాడు నారదుడు. బ్రహ్మదేవుడికి అన్ని పరీక్షలూ చేసి..రకరకాల ప్రశ్నలు వేసి ఆలోచనలో పడిపోయాడు ధన్వంతరి. ఆ మౌనం బ్రహ్మదేవుడికి భయం కల్పించింది. నారదుడిలో ఉత్సుకతని రేకెత్తించింది. "వ్యాధి ఏమిటో చెప్పవయ్యా ధన్వంతరీ..ఇక్కడ ఉత్కంఠతో నరాలు తెగిపోతున్నాయి.."అన్నాడు నారదుడు. "బ్రహ్మకి..మానవులకి వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు వచ్చింది". "అంటే?"బ్రహ్మ భయంగానూ..నారదుడు ఆశ్చర్యంగాను అడిగారు. "మతిమరపులో ముందు చిన్న చిన్న విషయాలు ఎంత ఆలోచించినా గుర్తుకు రావు. తర్వాత్తార్వాత పూర్తిగా మతిమరపు గుప్పిట్లోకి వెళ్ళిపోతారు" దీర్ఘంగా నిశ్వసించి చెప్పాడు ధన్వంతరి. "అయ్యో, అలాగయితే బ్రహ్మయ్యకి ప్రమాదమే! అసలు అతని పనే పూర్తి మతితో చెయ్యవలసింది." "నారదా ఈ విషయం దయచేసి స్వర్గమంతా టముకెయ్యకు.."నారదుడి వంక చూస్తూ అని"ఇది నాకెలా వచ్చింది?"అడిగాడు బ్రహ్మ ధన్వంతరిని. "సాధారణంగా మనుషులకి వృద్ధాప్యంలో వస్తుంది. మన లోకంలో మీరు కురువృద్ధులు కాబట్టి ప్రప్రధమంగా మీకే వచ్చింది. . అయినా సృష్టి కర్త అయిన మీకు రావడం ఆశ్చర్యమే! " అన్నాడు. ‘అంతా నా తలరాత’ అనుకుని మరి దీనికి వైద్యం..ఔషధం?"ఆందోళనగా అడిగాడు. "నాకు తెలియదు..కాని మానవులు ప్రయాసపడి ఏదో కనుక్కున్నారని..విన్నాను." "ఔరా! మానవ వైద్యులు, వైద్యంలో ఈ ధన్వంతరిని మించిపోయారా? మరి నేనిప్పుడేంచేయాలి?" "వెంటనే భూలోకానికి వెళ్ళాలి..ఆలస్యం చేస్తే మతిమరపు ముదురుతుంది"అన్నాడు నారదుడు. *** మూడు తలకాయల్ని ఇంట్లో అటకమీదపెట్టి, సరస్వతికి తన గోడు చెప్పుకుని, ఎవరికీ విషయం చెప్పొద్దని మరి మరీ చెప్పి, మారువేషంలో నారదుడిని తోడు తీసుకుని భూలోకానికి వచ్చాడు బ్రహ్మ (అసలు విషయం ఏమిటంటే, తన గైర్హాజరులో నారదుడు తన గురించి స్వర్గంలో అందరికీ చాటింపేస్తాడని భయం). ఇక్కడి కార్పోరేట్ హాస్పిటల్లో జాయినై, మందులు వేసుకుంటూ, మెమొరీ క్లాసెస్ కి వెళుతూ, యోగా, ధ్యానం చేసుకుంటూ తన మతిమరపుని అతి తక్కువ కాలంలోనే తగ్గించేసుకున్నాడు. స్వర్గలోకానికి వచ్చిన బ్రహ్మని పరీక్షించిన ధన్వంతరి "ఇక్కడ నీకు ఎప్పుడూ పని పని, వృద్ధాప్యంలో అంత పని ఒత్తిడి కూడదు. శివుడు సదా ధ్యానంలో వుంటూ, విష్ణువు చక్కగా లక్ష్మీ దేవితో పాదా లొత్తించుకుంటూ ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా జీవిస్తున్నారు. కాని ఎన్నో యుగాలనుండి అవిశ్రాంతంగా సమస్త జీవకోటికీ అదేపనిగా గుమాస్తాలా నుదుట గీతలు రాస్తూ పోతే వింత వింత వ్యాధులు రాక ఏమవుతుంది? ఇహ ఇప్పటినుండన్నా విశ్రాంతి తీసుకోవడం మొదలెట్టు. భూలోకంలో పని భారం లేదు కాబట్టి, మానసికంగా సాంత్వన పొంది త్వరగా కోలుకున్నావు."అన్నాడు. "నారదా! పాపం నువ్వుకూడా నాతో భూలోకానికి వచ్చి తోడుండి నాకు చాలా ఉపకారంచేశావు. ధన్యవాదాలు."అని నారదుడిని పంపించేలోగా బ్రహ్మ తన గృహానికి వచ్చాడని తెలుసుకుని దేవతలందరు సకుటుంబసపరివారంగా పరామర్శించడానికి వచ్చారు. "ఈ విషయం మీదాకా ఎలా వచ్చింది?" ఆశ్చర్యంగా అడిగాడు బ్రహ్మ. అందరూ నారదుడి వైపు చూశారు. "నువ్వా నారదా..ఎలా? నాతోనే వున్నావుగా!"ఆశ్చర్యపోయాడు బ్రహ్మ. "అదీ..నువ్వు మెమొరీ క్లాసెస్ కి వెళ్ళినప్పుడు, ధ్యానంలో వున్నప్పుడూ"నసిగాడు. "వార్ని, బుద్ధిపోనిచ్చుకున్నావు కాదు." కోపంతో కసిరాడు. "పోన్లే బ్రహ్మా! కథ సుఖాంతమైంది. నిజంగానే మనకి పని ఒత్తిడి అధికమైంది. ఇహనుండి మన దేవుళ్ళం కూడా మానవుల్లా సుఖసంతోషాల కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. అందరూ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే సృష్టి కార్యాలకి విఘాతం కలుగుతుంది. సర్వే దేవతా సుఖినో భవంతు"అని విష్ణువు వెళ్ళిపోయాడు. సర్వే జనా సుఖినో భవంతు! *** ( గమనిక :ఈ కథ కేవలం సరదా కోసం రాసినది. మన పురాణాలనీ, పాత్రలనీ కించపరిచే ఉద్దేశం లేదు.)

No comments:

Post a Comment

Pages