ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలు వీడె - అచ్చంగా తెలుగు

ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలు వీడె

Share This

 ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలు వీడె  

(అన్నమయ్య కీర్తనకు వివరణ )

                                                                                                - డా.తాడేపల్లి పతంజలి


అన్నమయ్య కీర్తనలో ఒక విరహపు నాయికగా మారి వేంకటేశుని సంయోగము కోసము తపించాడు.(సంపుటము  06-149)  
పల్లవిఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలువిడెచంద్రుని ఉదయముతో  తూర్పు కొండ తెల్లగా మారింది. ఆకాశములో చంద్రుడు  కొలువు తీరాడు .
అదనెరిగి రాడాయెనమ్మ నా విభుడునా ప్రభువైన వేంకటేశ్వరుడు ఈ అద్భుతమైన సమయము తెలుసుకొని ఇంకా  రాడేమిటమ్మ ! (మేమిద్దరము కలవటానికి ఇది చాలా మంచి సమయము. ఈ విషయము  తెలిసికూడా ఇంకా వేరే నాయిక దగ్గరే ఉన్నాడు... ఇంకా రాడేమని నాయిక బాధ)
1వ చరణంచన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయెనా స్తనములపై ఉన్న ముత్యాల హారాలు చల్లగా అయ్యాయి.
కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడుఓ కోరదగిన ఆడుదానా!(కాంత) ఈసమ యములో నా కన్నులను ఏదో మూసేసినట్లయిందే!
కన్నె కలువల జాతి కనుమోడ్చినది మీదస్వచ్చమైన (=కన్నె) కలువపూల జాతి పారవశ్యంతో ముడుచుకుపోయింది.(చంద్రుడు ఉన్నప్పుడూ కలువలు వికసించాలి. కాని ఆనందంతో ముకుళిస్తున్నాయని కవి చమక్కు, )
వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవెవెన్నెల అనే , వేసవి వలె వెచ్చగా ఉన్న విరియని మొగ్గ ఇప్పుడు వికసించింది.(వెన్నెల చల్లగా ఉండాలి కాని, నాయిక విరహముతో ఉంది కాబట్టి వెన్నెల ఆమెకు వేడిగా మారింది. అందుకే కవి  వేసంగి మొగ్గ అనే పేరు – వెన్నెలకు పెట్టాడు. )
 2వ చరణంపువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెరసెనాకురులంతా పువ్వులతో నిండి యున్నాయి. అందువల్ల పువ్వులలోపల ఉన్న నా తల వెంట్రుకల పరిమళము (=బుగులు కొనగా) ఇంకా బాగా ఎక్కువయింది(= నెరసె).( నా తలవెంట్రుకలు మంచి వాసనతో ఉంటాయి. పువ్వుల వాసన జత కలిసింది. ఇక వాసన పెరగకుండా ఎలా ఉంటుంది?)
దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగనుఈ వాసనలకు ఆకర్షితమై అదుగో – తుమ్మెదలు గుంపులుగా పువ్వుల కురుల మీదికి వచ్చి పడుతున్నాయి. (=తరమి డాయగను)
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదునిందలు చేసే ఆ పావురాల, కోకిలల బాధకి ఓర్వలేకపోతున్నాను. (ఇష్టమైన వాళ్లు మాట్లాడుతుంటే వినాలని కోరిక. చిలుకలు, కోకిలల కూతలు విడి సమయాలలో ఇష్టమే కాని, విరహపు సమయాలలో చాల బాధను కలిగిస్తాయి. అందువల్ల అవి కూస్తుంటే నాయికకి నిందలు చేసినట్లు అనిపిస్తోందని కవి వర్ణన.)
అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడోఅవతల ఏ నాయిక శృంగార చాతుర్యాలకి (=పసలకు)  వేంకటేశ నాయకులవారు సంతో షిస్తున్నారో ! నన్ను మాత్రము ఇలా విరహపు బాధలకు గురి చేస్తున్నారు
3వ చరణంపన్నీట జలకమార్చి పచ్చకప్పురము మెత్తికమ్మనైన , చల్లనైన పన్నీట స్నానము చేయించి, చల్లదనము, మంచి పరిమళము గల కర్పూరము పూసి,
చెన్నుగ గొప్పున విరులు చెలువందురిమిఅందంగా (=చెన్నుగా)కొప్పులో పూలు అందంగా తురిమి,
ఎన్నంగల తిరువేంకటేశు డిదె ననుగూడెస్తుతించుటకు యోగ్యుడైన శ్రీవేంకటేశుడుఇదుగో ! నన్ను కలిసాడే!
కన్నుల మనసునుం దనియం గరుణించె గదవేనా నేత్రాలు, మనస్సు తృప్తి పడేటట్లుగా నన్నుకరుణించాడు గదే!
విశేషాలు కన్నె కలువల జాతి కనుమోడ్చినది మీద సాధారణంగా కవి సమయాల్లో కలువ పూలు చంద్రుని రాకతో వికసిస్తాయని వర్ణిస్తారు. అన్నమయ్య విలక్షణంగా ముడుచుకొంటున్నాయంటున్నాడు. బాగా అనందం కలిగినప్పుడు ఒక్కోసారి ఆ సంఘటననో- వ్యక్తినో తలుచుకొని కళ్లు పారవశ్యంతో మూతపడటం లోకంలో జరుగుతుంటుంది. అన్నమయ్య ఈ పారవశ్యపుఆధిక్యాన్ని వివరించటానికే పారవశ్యపు ముకుళింత ప్రస్తావన తెచ్చాడు.   ఈ పాటలో మొదటి రెండు చరణాల్లోను విరహము , చివరి చరణములో సంయోగము చెప్పబడింది.జీవుడు భగవంతుని కోసము తపించాలి.అప్పుడు తప్పకుండా చివరకు స్వామి దయ ప్రసరిస్తుందనే సందేశము ఈ కీర్తన ఇస్తోంది .శ్రీ గరిమెళ్ల వారు గానము చేసిన ఈ కీర్తన  శ్రవణ సంబంధి (ఆడియో) లంకె ఇది. https://archive.org/details/UdayAdriTelupAye
స్వస్తి. ’
                                                                                    -------    

No comments:

Post a Comment

Pages