తెలివి ఒక్కరి సొమ్మంటే...!

 (హాస్య కథానిక)

 - సుదర్శన్ చెన్నూరి

            
అతడు ఆరడుగుల ఆజానుబాహుడా.. ! కాడు. బుర్రమీసాల కొసలు మెలి తిర్గిన భీకరాకారుడా.. !! కాడు.. కాడు. కండలు వడి తిర్గిన యోధాన యోధుడా.. !!! కాడు.. కాడు.. కానే కాడు. ఆ.. ! మరెవ్వరయ్యా.. !! అంటే కుశాగ్ర బుద్ధి బలశాలి, మూడడుగుల అపర వామనాతారుడు పేరు సదానందం. సార్థకనామధేయుడు గూడా.. చిరునవ్వే అతని చిరునామా. సమస్యలు ఆయనకు ఆమడదూరం. ఒకవేళ అవి దుస్సాహసం చేసి అతనిపై దాడి జరిపినా చిటికెలో పరిష్కరించుకొనే సమయస్ఫూర్తి సంపన్నుడు. ఒక సినీ కవి రాసిన గేయం ‘తెలివి ఒక్కడి సొమ్మంటే.. తెలివి తక్కువ దద్దమ్మ.. ’ అతని నిత్యపారాయణం.
అవాళ సదానందం ‘ఫుష్‍ఫుల్’ ట్రైన్‍కు వరంగల్ నుండి హైద్రాబాదుకు ప్రయాణం పెట్టుకున్నాడు..
కూకట్‍పల్లిలో ఉండే తన బావమర్ధి బాలరాజు “ఉల్లిగడ్డలు దొరకడం గగనమైంది బావా.. ! ఒకవేళ దొరికినా అవి కొనే పరిస్థితిలో లేను. మీరు పెరట్లో ఉల్లిగడ్డలు పండిస్తున్నారట కదా.. అక్క చెప్పింది. దయచేసి మీరు ఒక చేసంచి నిండా ఉల్లిగడ్డలు తెచ్చారంటే ఒకటో, అరో నేను వాడుకున్నా మిగిలినవి బజార్లో నా బండి మీద అమ్మేద్దాం. మీరు నాల్గు చేసంచులనిండా వంద నోట్లు కుక్కుకొని వెళ్ళుదురు గాని.. ” అంటూ ఫోన్ రావడమే ఆలస్యం.. కలర్‍ఫుల్ కలలు కంటూ ఒక పెద్ద చేసంచి నిండా ఉల్లిగడ్డలు కూరుకొని అవి పైకి ఏమాత్రమూ కనబడకుండా పైన ఒక జత బట్టలూ, లుంగీ, తువ్వాలు సర్ది మూతి కట్టేసి వరంగల్ స్టేషన్‍కు బయలు దేరాడు.
సదానందంకు దూరాలోచన ఎక్కువ. మున్ముందు ఉల్లి గడ్డలకు దేశంలో కరువు కాటకం దాపురించి వాటికి మంచి గిరాకీ ఉంటుందని.. ఉండే ఇల్లు కిరాయిదైనా పరాయిదని అనుకోకుండా పగలు రేయి కష్ట పడి ఉన్న కాసింత పెరట్లో ఉల్లి నాటాడు. పురుగు పుట్రా ఆశించకుండా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న తన చిన్ననాటి స్నేహితుని ద్వారా ఉల్లి సాగు మెలకువలు ఉచితంగా తెలుసుకొన్నాడు. మనిషి ఆకారంలో గడ్డి బొమ్మకు తన పాత దుస్తులు అలంకరించాడు. ఒక చేతిలో చెప్పు, మరో చేతిలో ఒక కర్ర అమర్చి పెరడు మధ్యలో నిలబెట్టాడు. ఏమరుపాటులో చూస్తే నిజమైన మనిషే అని భ్రమ పడక తప్పదు. చేదబావిలో నుండి నీళ్ళు చేది పోశాడు. బంగారం గని కన్నా మిన్నగా కాపలా కాశాడు. ఈరోజుల్లో బస్తా ఉల్లి గడ్డలంటే మాటలా.. ! ఒక బంగళా కట్టుకోవచ్చు. అని కలలుకంటున్న దశలో తన కలలను సాకారం చేస్తూ బావమర్ధి బాలరాజు నుండి వచ్చిన ఫోన్ నేపథ్యమే ఈప్రయాణం..
వరంగల్ స్టేషన్‍లో ఇరవై ఐదు రూపాయలు పెట్టి టిక్కట్టు కొని మూడో ఫ్లాట్ ఫాం చేరుకున్నాడు. పుష్‍పుల్ వరంగల్ నుండి ఉదయం ఐదు గంటల పదిహేను నిముషాలకు బయలు దేరింది. తాను నాలలుగు గంటలకే వచ్చాడు. విండో సింగిల్ సీటు సులభంగానే దొరికింది సదానందానికి. ఉల్లిగడ్డల చేసంచి జనం దృష్టిలో పడకుండా సీటు కింద జాగ్రత్త పర్చాడు. తన స్పర్శజ్ఞాన శక్తినంతా ఎడమకాలి మడమకప్పగించి చేసంచిని తేప తేపకు వీణలా మీటసాగాడు.
రైలు కదిలే సమయానికి జనం నిలబడే పరిస్థితి గమనించి, టిక్కట్టు కొన్నప్పటి నుండీ చీకేసిన తాటి పండులా మారిన సదానందం మనసుకు బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. తన టిక్కట్టు ధర తిర్గి రాబట్టుకోడానికి ఇదే మంచి తరుణం.. మదిలో ప్రణాళికలకు జీవం పోయ సాగాడు.
ఇంతలో కాజీపేట వచ్చింది. ఇసుక పోస్తే రాలనంత జనం.. భోగీలో కాలు పెట్ట సందు లేదు. ఇటు కిటికీలో నుండి దూరిన గాలికి అటు కిటికీ గుండా వెళ్ళిపోవడానికి తటపటాయిస్తోంది.
బండి కదిలింది.. సదానందం బుర్రలో తాను జీవం పోసిన ప్రణాళికలు లేచి నృత్యం చేయ సాగాయి..
“మిత్రులారా..! నాప్రియమైన సోదరీ మణులారా!!.., మేరే ప్రియతమ్ భాయీ, బహెనో!..., మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్!!...” అంటూ గొంతు సవరించుకుంటుంటే భోగీలోని జనం కీచైన్లూ, మనీ పర్సులు అమ్ముకొనే వాడేమోలే.. అన్నట్టు మొహం పెట్టారు. వాళ్ళ ముఖకవళికలు గమనించిన సదానందం
“డియర్ ఫ్రెండ్స్... నేను మీరనుకుంటున్నట్లు కీచైన్లు మనీ పర్సులు అమ్ముకొనే వాణ్ణి కాను. ప్రస్తుతం ఈ సీటుకు ఓనర్ని” అంటూ అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు.
“మీరు సీట్లకై పడుతున్న ఇబ్బందులు గమనించి మీకు సహాయం చేద్దామనే ఉద్ధేశ్యంతో నాసీటును వేలానికి పెడ్తున్నాను” అనే సరికి సీట్ల కోసం కస్సు, బుస్సులాడుకునే వారంతా గాలి తీసిన బెలూన్లై సదానందం వైపు దృష్టి సారించారు.
“ఇక్కడి నుండి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగాం రావడానికి దాదాపు గంట సమయం పడ్తుంది. జనగాం వచ్చే వరకు కూర్చుందా మనుకొనే వారెవరైనా నాసీటును వేలంలో కొనుక్కోవచ్చు. జనగాం రాగానే సీటు ఖాళీ చేసి నాసీటు నాకు అప్పగించాల్సి వుంటుంది. వేలంపాటలో కనీసం ఒక రూపాయి చొప్పున పెంచుతూ పోవాలి. ఇవీ నా నియమాలు...
ముందుగా సర్కార్ సవాల్ రెండు రూపాయలు.. ” అంటూ సదానందం వేలం పాట ప్రారంభించాడు.
‘మూడు రూపాయలు.. ’
‘నాల్గు రూపాయలు.. ’
‘ఐదు రూపాయలు.. ’
అంటూ పాట పుంజుకొని పది రూపాయల వద్ద ఊగిసలాడ్తోంది. ఇంకా అత్యాశకు పోవద్దని ‘చచ్చిన వాని పెళ్ళికి వచ్చిందే కట్న’ మన్నట్లు
“తమరి పేరేంటి సార్?.. ” అంటూ సదానందం చిరునవ్వులు చిందిస్తూ సదరు పదిరూపాయలని పాడిన ఆసామిని అడిగాడు.
“ఆయాసంరావు.. ” అనాడు ఎంతో ఆయాస పడుతూ..
“ఓ.. కే.. ఆయాసంరావుగారూ... ఎంతో అదృష్టవంతుడివి నాయనా.. పొద్దున్నే ఏనక్కతోకనో తొక్కొచ్చి ఉంటావ్.. సీటు నీపరం కాబోతుంది.. ” అంటూ ఆయాసం రావును అభినందిస్తూ.. “ఆయాసం రావు గారి పాట పదిరూపాయలు.. ఒకటోసారి.. రెండో సారి.. మూడోస్సారి.. ” అంటూ వేలం పాట ముగించాడు. ఆయాసంరావు ఇచ్చిన పదిరూపాయల నోటు తన జేబులో కుక్కుకుంటూ..
“నియమాలు జ్ఞాపకమున్నాయా ఆయాసం గారూ.. జనగాం రాగానే నాసీటు నాకివ్వాలి” అంటూ వేలం పాట నియమాలను మళ్ళీ గుర్తు చేశాడు సదానందం.
“నాది జనగామే.. అక్కడే దిగిపోతా...”
‘అయితే ఇక ఏపేచీ లేనట్లే.. ’ అనిమనసులో సంబరపడుతూ లేచి నిలబడి ఆయాసం రావుకు సీటు ఆఫర్ చేశాడు. సదానందం సీటుపై ఆయాస పడ్తూ ఆసీనుడయ్యాడు ఆయాసం రావు.
ఈతతంగమంతా పూర్తయ్యే సరికి దాదాపు పెండ్యాల స్టేషన్‍కు చేరువయింది పుష్‍ఫుల్.
పుష్‍ఫుల్ వేగం పుంజుకుంది. అది హొయలొలికించే శబ్దానికి అనుకూలంగా తన మదిలోని పాట.. ‘తెలివి ఒక్కడి సొమ్మంటే.. తెలివి తక్కువ దద్దమ్మ.. ’ పాట రాగాన్ని హమ్ చేయ సాగాడు సదానందం.
జనగాం స్టేషన్ వచ్చీరావడంతోనే తిర్గి తన సీటు స్వాధీన పర్చుకొన్నాడు సదానందం. ఇద్దరు దిగితే నల్గురెక్కుతున్న జన్నాన్ని చూస్తూ పొంగిపోసా గాడు.
రైలు కదిలింది.. వేగం పుంజుకుంటోంది... వేలం మొదలైంది. కొత్తగా కొంతమంది జనం ఎక్కారు.. మళ్ళీ వేలంపాట నియమాలు వల్లె వేసి ఈసారి ‘భువనగిరి’ వరకు అంటూ వేలం పాట ప్రాంభించాడు సదానందం.
జనగాం నుండి భువనగిరి దాదాపు నలభై కిలోమీటర్లు. ఎంత వీలైతే అంత పిండుకోవాలనుకున్నాడు. కాని దూరానికి అనుగుణంగా ఎనిమిది రుపాయలు దక్కింది.
ఈ రోజు తన తెలివి తేటలను తనే నమ్మలేకపోతున్నాడు. ఇలా తన తెలివి తేటలు దినదినాభివృద్ధి చెందుతూ దేద్దీప్యమానంగా వెలిగిపోతుండడం... సదానందంకు నమ్మశక్యంగా లేదు. అందుకే ఆపాటంటే అతడికి ప్రాణం.. బాత్‍రూమ్‍లో మొదలయ్యే ‘తెలివి ఒక్కడి సొమ్మంటే.. ’ పాట బెడ్ ఎక్కినా ఆగదు. నిద్ర పోతూ పెట్టే గురకలో కూడా ఈ రాగమే ప్రతిధ్వనిస్తూంది...
భువనగిరి వచ్చింది... రైల్లో దిగే జనం.. రెట్టింపు ఎక్కే జనం... సదానందం మొహంలో పరమానందం...
సికింద్రాబాదువరకు తన సీటు వేలానికి పెడ్తున్నట్లు తిరిగి నియమ నిబంధనలు వల్లె వేసి వేలం పాట ప్రారంభించాడు సదానందం.
భువనగిరి నుండి దాదాపు గంట ప్రాయణానికి తోడుగా ఔటర్ వద్ద మరో అరగంట ప్రతీ రైలు ఆగడం ఆనవాయితీ కదా. అలా జనం బేరీజు వేసుకోవడం ఈసారి పదిహేను రూపాయలు పలికింది..
భువనగిరి నుండి పుష్ ఫుల్ కదిలింది..
సదానందం తృప్తిగా ఊపిరి పీల్చుకొన్నాడు. తన టిక్కట్టు ధర పోను ఎనిమిది రూపాయలు అదనం.. ఆవల తన బామ్మర్ది ఇంటికి బస్సు కిరాయ.. అని మనసులో అనుకుంటూ మళ్ళీ పాట.. ‘తెలివి ఒక్కరి సొమ్మంటే.. తెలివి తక్కువ దద్దమ్మ.. ’
ఇంతలో బిర, బిరమంటూ “సూడు పిన్నమ్మో!.. పాడు పిల్లోడు.. పైన, పైన పడుతు ఉన్నాడు.. ” అని పాడుకుంటూ ఆనాటి సినీ నటుడు మాడ అనుచరులు భోగీలో దూరడం సదానందం ఆనందానికి  తాత్కాలికంగా తెర పడింది.. ‘ఈరైల్వే పోలీసులు ఏంచేస్తున్నట్టు?.. ’ అని మనసులో విసుక్కుంటూ కిటికీ గుండా బయటికి తొంగి చూసే నటనలో మునిగి పోయాడు.
చేతులతో చెక్క భజన చేస్తూ వాళ్ళు యువకుల జేబుల్లో చేతులు దూర్చి మరీ డబ్బులు లాక్కుంటున్నారు. కనీసం పది రూపాయలు దక్కందే ఎవరినీ వదలడం లేదు.
సదానందానికి భయమేసింది. గబ, గబా కక్కసులో దూరాడు. తన వద్ద ఉన్న డబ్బులన్నీ కట్‍డ్రాయరు పాకెట్లో సర్దుకొన్నాడు. మూడు రూపాయల చిల్లర మాత్రం  తన షర్టు మీది పాకెట్లో పెట్టుకొని పది నిముషాల పాటు దుర్ఘంధం భరించి బయటికి వచ్చాడు.
వాళ్ళంతా వెళ్ళి పోయి ఉంటారనుకున్న సదానందానికి నిరాశే ఎదురైంది.
సదానందం మస్తిష్కంలో ఒక మెరుపు మెరిసింది. ఆభోగీలో ప్రయాణించే ప్రయాణీకుల్లో తనే అత్యంత తెలివి మంతుడు కనుక వాళ్ళకు జ్ఞానోదయ మయ్యేలా ఒక క్లాసు పీకాలనుకున్నాడు..
“ఏమయ్యా... మిమ్మల్నే.. ఇలా ప్రయాణీకులను పీడించి డబ్బు లాక్కోవడం ఏమైనా బాగుందా?.. మీకేమైందని!.. నిక్షేపంలా ఉన్నారు. దేవుడిచ్చిన కాళ్ళూ, చేతులూ.. బంగారంలా ఉన్నాయి.. ఏదో ఒక లోపం ఉన్నదని ఇలా అడుక్కునే బదులు ఏదైనా కాయ కష్టం చేసి బతుకొచ్చు కదా.. అయినా ప్రయాణీకులు దయ తలచి ఇస్తే తీసుకోవాలే గానీ ఇలా పైన పడి లాక్కోవడం సిగ్గుగా లేదూ.. ” అంటూ తనకు తాను మెచ్చుకో సాగాడు. భోగీలో అంత మంది ముందు తనొక సంఘ సంస్కర్తలా మాట్లాడినందుకు.
“ఏమయ్యా.. గీమయ్యా అంటావేంది బావయ్యా.. నాపేరు లచ్చుంబాయి.. ” అంటూ కళ్ళెగరేసుకుంటూ పైట సర్దుకుంది.
“పూర్ బావయ్య.. బావయ్య దగ్గర ఉన్న మూడు రూపాయల మూట  తగిలిందే రాంబాయి.. ’ అంది తన సహచరణితో. డబ్బులను ముద్దు పెట్టుకొని జాకెట్లో దూర్చుకుంది.
“అయినా డబ్బు సంపాదించుకోడానికి సిగ్గెందుకు బావయ్యా.. సవాలచ్చ పద్ధతులున్నై.. రాజకీయ నాయకులు సీట్లు అమ్ముకోడానికి సిగ్గు పడ్తాండ్లా?..  సర్కారు నౌకరోల్లు బల్ల కింద చేతులు పెట్టడానికి సిగ్గు పడ్తాండ్లా.. నువ్వు సీటు వేలం వేసి అమ్ముకొని నిల్సున్నౌ.. సిగ్గు పడ్తానవా?.. మీకందరికీ లేని సిగ్గు మాకెందుకు?..
మాకు ఊకనే ఇత్తాండ్లా్ ఏంది!... మేము ఎన్ని ఇక్మతులు సూయించాలె.. అగ్గొ అటు సూడు.. దర్వాజ దగ్గర సివిల్ డ్రెస్సుల దర్జాగా నిలనడ్డడే రైల్వే పోలీసు బావయ్య.. ఆయనకు సుత సిగ్గు లేదు. మేము అడుక్కున్న దాంట్లకెల్లి సగమియ్యాలె.. మేము ఎక్కడ దాసుకున్నా చెయిపెట్టి కెలికి మరీ తీసుకుంటడు.. వాని తలపండు పగుల.. ” అంటూ శాపనార్థాలు పెట్టింది. రెండు అర చేతులను అదో రకంగా  ఆడిస్తూ.. తమ బృందంతో కలిసి వెళ్ళి పోయింది లచ్చుంబాయి. ‘అనవసరంగా తలదూర్చి మాట పడ్డానని’ సదానందం ఏమాత్రమూ ఫీల్ కాలేదు. పైగా సదానందం బుర్రలో మళ్ళీ పాట ‘తెలివి ఒక్కడి సొమ్మంటే... ’ కేవలం మూడు రూపాయలతో ప్రమాదం నుండి గట్టెక్కినందుకు.. తన చేసంచి స్థాన భ్రంశం కానందుకు.
ఔటర్ సిగ్నల్ వద్ద అరగంట ఆగి తిర్గి వేగమందుకొంది పుష్‍ఫుల్.
సదానందం ‘ఎప్పుడు బామ్మర్ది ఇంటికి చేరుకొంటానా.. తన ప్రయాణంలో ప్రదర్శించిన తెలివినంతా ఎప్పుడు ఏకరువు పెడతానా’ అని మనసులో ఉవ్విళ్ళూర సాగాడు.
సికింద్రాబాదు చేరుకొనే సరికి దాదాపు తొమ్మిదిన్నర అయింది.
తన చేసంచిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పట్నం చేరడం సదానందానికి మహదానందంగా ఉంది.
హుషారుగా చేసంచి తీసుకొని అదే పాట మనసులో మననం చేసుకుంటూ పటాన్‍చెరు బస్సు ఎక్కాడు.
“బావా!.. ఎప్పుడు వచ్చితివి.. ” అంటూ ‘పాండవోద్యోగం’ నాటకం లోని పద్యాన్ని అందుకున్నాడు అతని బావమర్ధి బాలరాజు. తన బావ సదానందాన్ని కౌగిలించుకుంటూ లక్షలనోట్లు కూరిన మూటను అమురుకుంటున్నట్లుగా అనుభూతికి లోనయ్యా్డు. సదానందం చేతిలోని చేసంచిని తీసుకొని కుబేర స్థానంలోని బీరువాలో భద్రపరుస్తూ “వీటి ధర పడిపోకముందే వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకోవాలి బావా..
ఉల్లిగడ్డలా!..  ఇవి కావు నవరతనాల నాణాలు!!.. ”. ‘నవ్వులా అవికావు నవ పారిజాతాలు’ అనే సినీ గీతం లెవల్లో.. పొగుడుతుంటే సదానందం ఉప్పొంగి పోయాడు. ఇద్దరికీ సినిమా పాటలంటే మహా పిచ్చి.
త్వరగా ప్రెషపై తన ప్రయాణ పదనిసలు రాగ యుక్తంగా ఆలపించాలని గబ, గబా బాత్‍రూంలో దూరాడు సదానందం.
ఇంతలో బాలరాజు భార్య బాలామణి వంటింట్లో నుండి పరుగులు తీస్తూ వస్తూ
“సదానందం అన్నయ్య వచ్చాడా.. ఏం తెచ్చాడు ఏంటి?.. ఏదో ఉల్లిగడ్డలు అనే మాట వినవచ్చింది. నాచెవులు పావనమయ్యాయి. ఎన్నాళ్ళకీ ఇంట ఉల్లిగడ్డలు అనే పదం విన్నాను” అంది.
ఉల్లిగడ్డలు సదానందం తెస్తున్నాడని తన బాలామణికి చెప్పలేదు బాలరాజు. ఆడవారి నోట మాట దాగదని.. వాడలో తెలిస్తే ప్రమాదమని అతడి జాగ్రత్త అతడిది.
“ఉష్.. గట్టిగా మాట్లాడకు.. గోడకు చెవులుంటాయి. ఒక పేద్ద చేసంచి నిండా ఉల్లి పాయలే బాలా.. బీరువాలో దాచాను” అంటూ కళ్ళెగరేశాడు బాలరాజు.
“ముందు దేవుడి పటం ముందు రెండు ఉల్లిగడ్డలు పెట్టి మొక్కుదామండీ. తర్వాత అవి ఓనెలరోజులవరకూ వాడుకోవచ్చు. నన్నొకసారి చూడనివ్వండి. నాజన్మ ధన్యమవుతుంది” అంటూ బీరువా తాళం చెవులగుత్తి లాక్కోబోయింది బాలామణి.
“నీకు అన్నింటికీ తొందరే.. ఇలా ప్రాణాలు తోడేస్తావనే నేను నీకు ముందుగా చెప్పలేదు. సరే, సరే.. పద  చూపిస్తాను” అంటూ బీరువా తెరచాడు. చేసంచి మూతి తెరిచి ముందుగా బావ గారి తువ్వాల, లుంగీ, ఒక జత బట్టలు తీసి
“కెవ్...వ్...వ్వు.. ”న కేక వేశాడు బాలరాజు. బాలామణి భయంతో వణికి పోయింది. ఏపురుగో పుట్రో సంచిలో దూరి ఉందేమోనని అనుమానించింది. తీరా చూసి కళ్ళు తేలేసింది.
“ఏం బామ్మర్ధీ.. బాత్‍రూంలో దూరిన వాన్ని జారి పడితే నేను కెవ్వుమనాలి గాని నీ కెవ్వు ఏంటి.. ?” అంటూ ఎకెసెక్కంగా మాటలు విసుర సాగాడు సదానందం. ‘బహుశః అన్ని ఉల్లిగడ్డలు చూసి బామ్మర్థి ఆనందం పట్ట లేక పోయాడేమో!..’ నని అనుకోసాగాడు.
“బావా.. ఉల్లిగడ్డలు అని ఆలుగడ్డలు తెచ్చావేంటి?..  అన్నీ పుచ్చులే.. ఒక్కొక్క ఆలుగడ్డకు అరవై రంధ్రాలున్నాయి.. ” అంటూ బావురుమన్నాడు బాలరాజు.
“బావా నామీద ప్రాక్టికల్ జోక్స్ మాని అసలైన ఉల్లిగడ్డలు ఎక్కడ దాచావో చెప్పు.. వస్తూ, వస్తూ బ్యాంకు లాకర్లో గాని భద్రపర్చి వచ్చావా.. ఏంటి!..  బాల ఉండబట్టలేక పోతోంది”
ఉన్న ఫళంగా టవల్ చాటు తోనే  బాత్‍రూంలో నుండి లాంగ్ జంప్ చేశాడు సదానందం. ఆలుగడ్డలు చూసి ఆవిరై పోయాడు. ‘ఎలా జరింది ఈఘోరం..? తాను ట్రైన్‍లో బాత్‍రూంలో దూరి బయటికి వచ్చాక గూడా సంచిని కనిపెట్టే ఉన్నానే.. ’ అని వాపోసాగాడు.
సదానందం జావ కారిపోయినట్లు సోఫాలో వాలి పోవడం చూస్తూ బాలరాజు “గ్లాసు నీళ్ళు.. ” అంటూ బాలామణిని వంటింట్లోకి తరిమాడు.
టీ.వీ. లో ‘పల్లెటూరి బావ’ సినిమానుండి జయదేవ్, శరావతి పాడిన పాట... ప్రకటనల అనంతరం వింటారని ఆంకర్ ప్రకటించింది..
తన బావకు ఈపాట అంటే చాలా ఇష్టమని వాల్యూం మరీ పెంచాడు బాలరాజు..
సదానందానికి లీలగా గుర్తుకు రాసాగింది. తన భోగీలో నుండి ఒక గల్ల షర్టు బుర్రమీసాలవాడు తన చేసంచి లాంటి సంచి పట్టుకుని తనముందు నుండే వెళ్ళడం గమనించాడు కాని మనిషిని పోలిన మనుషులే ఉండగా ఈచేసంచిలో లెక్కనా అని తేలికగా కొట్టి పారేసుకున్నాడు.
“వా.. !” అంటూ జుట్టు పీక్కోసాగాడు సదానందం.
అతిరహస్యంగా ఆ గల్ల షర్టు బుర్రమీసాల వాడితో పదివేల రూపాయలకు ఒప్పందం కుదర్చుకుని ఉల్లిగడ్డల చేసంచిని తస్కరింప చేసిన వైనం తన బావ పసిగట్టక పోవడం బాలరాజు లోపల ఆనందం కట్టలు తెగిన ఏటి ప్రవాహాలై ఎగిసి పడ్తోంది..
ప్రకటనల అనంతరం టీ.వీ. లో పాట ప్రారంభమైంది... ‘తెలివి ఒక్కడి సొమ్మంటే... తెలివి తక్కువ దద్దమ్మ.. సొమ్ము మనది.. సోకు మనది... తెలుసుకోవే ముద్దుల గుమ్మా!...’
***
>

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top