సుస్వరాల దక్షిణామూర్తి
 - ఆచార్య చాణక్య 

 సంప్రదాయ సంగీతమే ప్రాతిపదికగా... తెలుగు పాటల పూదోటకు స్వరపరిమళాలు అద్దిన సలలిత రాగసుధారస మూర్తి... సుసుర్ల దక్షిణామూర్తి. సాక్షాత్తు త్యాగరాజస్వామి శిష్యపరంపరకు చెందిన సీనియర్ సుసర్ల దక్షిణామూర్తి మనవడిగా... అడుగడుగునా ఎనలేని గౌరవం లభించింది. తాత పేరు నిలబెడుతూ.. ఆయనకు తగ్గ మనవడిగా... సినీ సంగీత కళానిధిగా ఎదిగారు. తెలుగు వారంతా సుస్వరాల దక్షిణామూర్తి అని పిలుచుకునే సుసర్ల వారి వర్థంతి ఫిబ్రవరి 9న. తెలుగు పాటకు స్వరాల మల్లెలు అలంకరించిన సుసర్లవారు... 1921 నవంబర్ 11న కృష్ణాజిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించారు. స్వతహాగా సంగీత కుటుంబానికి చెందినవారు కావడం... సుసర్ల వారు... చిన్నవయసులోనే కర్ణాటక సంగీతంలో ప్రావిణ్యం సంపాదించారు. పదహారో ఏట నుంచే వయొలిన్ కచ్చేరి యిచ్చేవారు. ఎందరో మహామహుల దగ్గర సహాయకుడిగా పనిచేసి... సినీసంగీతదర్శకుడిగా మారారు. సంగీత దర్శకుడిగా తెలుగు వారి మనసుల్లో స్థానం సంపాదించుకున్న దక్షిణామూర్తి సినీ జీవితం... సహాయకుడిగా, గాయకుడిగా ప్రారంభమైంది. స్త్రీ సాహసం, పరమానందయ్య శిష్యుల కథ, శ్రీలక్ష్మమ్మ కథ, సంసారం లాంటి చిత్రాల్లో పాటలు పాడారు1946లో నారద-నారదితో తెరంగేట్రం చేసిన సుసర్ల దక్షిణామూర్తి... సంతానం, హరిశ్చంద్ర లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. సుసర్ల వారు... కొంతకాలం HMV సంస్థలో హార్మోనిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ద్వారా మధుర స్వరాలను శ్రోతలకు అందించారు. రాశికంటే వాసికే ప్రాధాన్యత ఇచ్చే దక్షిణామూర్తి... ఆయా సందర్భాలను బట్టి రాగరచన చేయడంలో దిట్ట. వీరకంకణంలోని కట్టండి వీరకంకణం అనే దేశభక్తి గీతం విన్న ఎవరైనా రోమాంఛితం అవుతారు. ఇదే సినిమాలో ప్రేమ లేని ప్రేమ పాటకు ఆయన కట్టిన బాణీని చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ సినిమాలోని అన్ని పాటలు సుసర్ల వారి ప్రతిభకు దర్పణాలు. కెరీర్ ప్రారంభంలో అత్యధిక ప్రయోగాలు చేసిన ఘనత సుసర్ల వారికే దక్కుతుంది. కుంటుంబ కథలు, పౌరాణికం, సాంఘికం ఇలా సినిమా ఏదైనా... దానికి తగ్గ బాణీలు ఆయన మంత్రదండంలో సిద్ధంగా ఉండేవి. సంతానం చిత్రంతో గాయని లతామంగేష్కర్ గొంతును తెలుగు వారికి పరిచయం చేశారాయన. నిదురపోరా తమ్ముడా అంటూ... ఎన్నో హృదయాల్ని తడిచేసిన ఈ గీతం... ఇప్పటికీ ప్రేక్షకుల్ని మనసుల్ని తడుముతూనే ఉంది. సుసర్ల దక్షిణామూర్తి 34 ఏళ్ల సినీ ప్రయాణంలో 135 చిత్రాలకు స్వరాలందించారు. రాశి తక్కువైనా వాసి బాగుండాలనే మనసత్వం ఆయనది. ఎస్.పి. కోదండపాణి, ఏఏ రాజ్, శ్యామ్ లాంటి సంగీత దర్శకులు సుసర్ల శిష్యలు కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ స్వామినాథన్ సైతం ఆయన వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. లతా మంగేష్కర్తో పాటు... జమునారాణి, పి.లీల, బెంగళూరు లత గాత్రాన్ని... సుసర్లవారు తెలుగు శ్రోతలకు పరిచయం చేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి సంగీత స్రష్టను తన సంగీతంతో ఆకట్టుకుని... పాటలు పాడించేంత విద్వత్తు సుసర్ల వారికి మాత్రమే సొంతమంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. తొలిసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ కుదిరిన నర్తనశాల... తెలుగు సినీప్రపంచంలో ఓ ఆణిముత్యంగా నిలిచింది. పాటలో పదాలకే కాదు.... సందర్భానికీ... బాణీలు కట్టే ప్రత్యేకమైన సంగీత దర్శకుడు సుస్వరాల దక్షిణామూర్తి. ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రార్థనాగీతం పాడి నెహ్రూ చేతులమీదుగా సుసర్లవారు సన్మానం అందుకున్నారు. శ్రీలంక జాతీయ గీతాన్ని స్వరపరిచి... తెలుగు గాయని కె.రాణితో పాడించారాయన. హాలీవుడ్ చిత్రం జంగిల్ కూ పనిచేశారు. అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడించిన సుసర్లకు ప్రభుత్వం నుంచి పురస్కారాలు దక్కకపోయినా... అభిమానులు ఎన్నో బిరుదులు ఇచ్చి గౌరవించారు. ఎన్టీఆర్ సుసర్లను " స్వర సుధానిధి" అని పిలిచేవారు. తన స్వరాలతో తెలుగు వారిని ఊయలలూగించిన స్వర సవ్యసాచి సుసర్ల దక్షిణామూర్తి. 1984లో " శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర" చిత్రానికి చివరిసారిగా సంగీతం అందించారు. ఆయన జీవితం చివరిరోజుల్ని చైన్నైలోని కుమార్తె ఇంట్లో గడిపారు. ఆ స్వరబ్రహ్మ 90ఏళ్ల వయస్సులో 2012 ఫిబ్రవరి 9న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. భౌతికంగా ఆయన లేకపోయినా... సుసర్ల వారి సుస్వరాలు తెలుగు లోగిళ్ళలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి... పరవశింప జేస్తూనే ఉంటాయి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top