శ్రీధరమాధురి – 11 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి – 11

Share This

 శ్రీధరమాధురి – 11


సాధారణంగా లోకంలో ఇతరులపట్ల మనం చూపే ప్రేమ అంతా, వారు మంచివారనో, అందంగా ఉన్నారనో, ఆస్తిపరులనో, గుణవంతులు అనో, మేధావులనో, మీకు సహాయం చేసారనో, అభిరుచులు కలిసాయి అనో, ఎన్నో కారణాలతో ముడిపడి ఉంటుంది. కాని, ఇష్టపడేందుకు మనం వెతుక్కున్న అవే కారణాలు, కొన్నాళ్ళకు వారిని మనం ద్వేషించేలా చేస్తాయి. అందుకని, కారాణాలు వెతికే లౌకికమైన ప్రేమ నుంచి, ఏ నిబంధనలు విధించని అలౌకికమైన ప్రేమ దిశగా మనల్ని పరిణితి చెందమంటూ... నిజమైన ప్రేమ గురించి పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురుజి చెబుతున్న అమృత వాక్కులు  చదవండి...

మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి...
భార్యను ప్రేమించండి...
పిల్లల్ని ప్రేమించండి...
మిత్రులను ప్రేమించండి...
ఇరుగుపోరుగువారిని ప్రేమించండి...
మీ పరిసరాలను ప్రేమించండి...
మీరు చేసే పనిని ప్రేమించండి...
మీ ఆరోగ్యాన్ని ప్రేమించండి...
మీ రోగాన్ని ప్రేమించండి...
మీలోని మంచిని ప్రేమించండి...
మీలోని చెడును కూడా ప్రేమించండి...
ప్రకృతిని ప్రేమించండి...
ఇంకా, తప్పకుండా ...
మీ శత్రువులను కూడా ప్రేమించండి...

ఏది చేసినా దైవం పేరుతో చెయ్యండి, అప్పుడు మీరు అన్నింటా, అంతటా దైవాన్ని చూడగలుగుతారు. ఎల్లప్పుడూ పరమానందంలో ఉండగలుగుతారు.

నాలుక చెప్పే కారణాలతో కొన్ని చక్కబడతాయి. కాని, సంజాయిషీలు అడగని ప్రేమ ఉత్తమమైనది.

మీ అడుగులు అన్నింటినీ దైవమే రూపొందించారు. కాబట్టి విజయమైనా - పరాజయమైనా, తప్పైనా – ఒప్పైనా, పూర్నమైనా –అసంపూర్నమైనా, వెలుగైనా – చీకటైనా, బలమైనా –జడత్వమైనా పూర్తిగా ఆయన ఇచ్చ ,దయ, అనుగ్రహమే ! పూర్తిగా ఆయన్ను శరణాగతి వేడి, ఆయన పాలనను అంగీకరిస్తూ, బేషరతైన ప్రేమను, ఎంపిక లేని జీవనాన్ని మూలాధారంగా చేసుకుని జీవిస్తే, మీకు దివ్యమైన శాంతి కలుగుతుంది. దైవాన్ని ప్రార్ధించండి, ఆయనకు పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకోండి.

చాలాసార్లు ప్రేమ నిబంధనలకు లోబడి ఉంటుంది. ఎన్నో షరతులు... బేషరతైనది ఏదీ లేదు. చాలాసార్లు మనం ‘ప్రేమ’ పేరుతో ఆచరణాత్మకంగా చూపేది అంతా కేవలం ‘స్వార్ధం’. ప్రేమలో మనం నిబంధనలు విధించకూడదు. మనం బుద్ధి, ఆకృతి అనే అడ్డంకుల్ని అధిగమించినప్పుడే ఇది సాధ్యం. ఇవి దాటి పరిణితి చెందాకే బేషరతైన ప్రేమ అనేది సాధ్యం అవుతుంది. దీన్ని మేము ‘ఆదిభౌతిక ప్రేమ’ అంటాము. అటువంటి సందర్భాల్లో, అది నిజంగా ‘ఆదిభౌతిక ఉనికి’ ‘ ఆదిభౌతిక జీవనం’ ,అవుతుంది. అందుకే మేము కారణాలు వెతక్కుండా జీవించమంటాము. కారణాలు లేకుండా ప్రేమించామంటాము. తర్కం, కారణాలు వెతకడం అనేవి బుద్ధి మరియు ఆకృతిని తీసుకువస్తాయి. కాబట్టి, దీన్ని అధిగమించి, ఎదగండి.

ఆమె – నేను దైవాన్ని ఎంతగానో ప్రేమిస్తాను. ఆయన నన్ను ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు గురుజి ?
నేను – హ హ హ హ ... దైవంపట్ల నీ ప్రేమ నిబంధనలకు లోబడి ఉందని (సుఖాలనే ఇవ్వాలి అనే) నేను అనుకుంటున్నాను. నీ ఇబ్బందులు తొలగినా, తొలగాకపోయినా ఆయన పట్ల బేషరతైన ప్రేమను కలిగి ఉండు.


మా (ఆత్మజ్ఞానుల ) జీవితం చాలా సులభం...
ఎందుకంటే...
మేము ఏదీ ఎంపిక చేసుకోలేము...
బేషరతైన ప్రేమ కలిగి ఉంటాము ...
లోపాలు ఎంచము ..
మేము చేసేది లేక చెయ్యకూడనిది ఏదీ లేదు...
దేనికీ విచారించాల్సిన పనిలేదు...
ఎవరినీ లెక్కచెయ్యని దృక్పధం ...

తర్కం లేకుండా జీవించండి. కారాణాలు చూడకుండా ప్రేమించండి. కారణాలు అన్వేషించకుండా జీవించడం అనేది మంచి పధ్ధతి. దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు. మీరు కారణాలు అన్వేషిస్తూ ఉంటే, అలా వెతుకుతూనే మిగిలిపోతారు. కాని కారణాలు వెతక్కుండా జీవించాలన్నా, ప్రేమించాలన్నా మీకు చాలా ధైర్యం ఉండాలి. ఇది పిరికివాళ్ళ కోసం కాదు. కేవలం ధైర్యం కలవారికే. మనచుట్టూ ఉన్న సమాజం అజ్ఞానంలో ఉంది. ఇది మిమ్మల్ని తర్కంలో పెడుతుంది. మీరు అప్రమత్తంగా ఉండి, వాటికి బలవ్వకుండా ఉండాలి. అమిత జ్ఞానం కల వ్యక్తి తర్కం లేకుండా జీవిస్తారు. ‘అవ్యక్తమైన’ పరమాత్మపై ఆయన విశ్వాసాన్ని ప్రశ్నించలేము. అంతా దైవానుగ్రహం.

మతం అనేది అధికంగా మనసుకు , నమ్మకానికి సంబంధించినది. దీన్ని ఒక సైంటిస్ట్ లాగా ఒక టెలీస్కోప్ లేక మైక్రోస్కోప్ తీసుకుని పరీక్షించకండి. దీన్ని నిర్దారించలేరు. ఒకవేళ పరీక్షలతో నిరూపించగాలిగితే, అది యెంత తెలివైనదంటే, మీతో ఆటలాడడం మొదలుపెడుతుంది. అది మీకు హానికరమై, చివరకు మీ అహానికి సవాలుగా మారుతుంది. మా వంటివారికి, మీరు దాన్ని అదుపు చేసేందుకు సతమతమవుతుంటే చూడడం వేడుకగా ఉంటుంది. మీ అహం నశించిపోతుంటే చూడడాన్ని మేము ఇష్టపడతాము.

ప్రేమ ఎల్లప్పుడూ పనికివచ్చే దారులు వెతుకుతుంది...

ఉదాసీనత ఎల్లప్పుడూ పనికిమాలిన సాకులు వెతుకుతుంది...

మీరు ప్రేమించేవారిని మర్చిపోయేందుకు ప్రయత్నించడం అనేది మీకు అసలు తెలియనివారిని గుర్తుచేసుకోవడం వంటిది.

బేషరతైన ప్రేమలో , నేను అన్న అహం లేకుండా నన్ను నేను దగ్ధం చేసుకుంటాను. ఈ అగ్ని యెంత మ్రుదువైనదంటే, అన్ని గాయాలను ఇది నయం చేస్తుంది.

ప్రేమలో పడిపోకండి... ఇది విషాదానికి దారి తీస్తుంది...

ప్రేమతో నిలబడండి ... ఇదే దైవత్వం .

బెషరతైన ప్రేమ మనల్ని మౌనంగా ఉండేలా చెయ్యాలి ...

‘ఎవరినైనా వదిలి వెళ్లిపోనివ్వటం ‘ అనేది కూడా ఒకరకమైన బేషరతైన ప్రేమే !

బేషరతైన ప్రేమకు బాహ్యంగా ఒక రూపం లేక ముఖం ఉండవు... ఇది దైవంతో ఆనంద నాట్యం.

బేషరతైన ప్రేమలో మునిగి ఉండాలంటే ఒకరికి ప్రశ్నించనలవి కానంత విశ్వాసం ఉండాలి. ఒకవేళ ప్రేమలో కాని, విశ్వాసంలో కాని ప్రశ్నలు ఉదయిస్తే, అప్పుడు అది ప్రేమా కాదు, విశ్వాసమూ కాదు. కేవలం నటన.

ఒకసారి మీరు మీ అభిప్రాయాల్ని పక్కన పెట్టి, దైవం పట్ల మీ ప్రేమ, విశ్వాసాన్ని ధృడంగా ఉంచితే, వాస్తవికమైన వెలుగు మీపై ప్రసరిస్తుంది.

అతను – నాకు ప్రార్ధించడం ఎలాగో నేర్పండి గురూజి.
నేను – ఇది చాలా బాగుంది, నీకు ప్రేమించడం తెలుసా ?
అతను – తెలుసు గురూజి.
నేను – అయితే నీవు ఇప్పటికే ప్రేమలో ఉన్నావు, ఇక నేర్పాల్సిన పని లేదు.
(దైవంపట్ల మనకుండే హృదయపూర్వకమైన ప్రేమే... ప్రార్ధన అని గురూజి చెబుతున్నారు.)

బేషరతైన ప్రేమ ఒకరిని స్వేచ్చగా వదిలి వెళ్లిపోనివ్వాలి. లేకపోతే ‘షరతులు లేకపోవడం’ అనేది ఉండదు, ప్రేమ కూడా ఉండదు. అది కేవలం స్వార్ధం.

నిజమే, విమర్శకుడు మీ సత్తా పెంచగలడు. కాని దైవం పట్ల మీ ప్రేమలో మీ సమర్ధతను నిరూపించడం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది ?

కంగారుగా పరుగులుతీసేవారు, అసలు ప్రేమనే ఆస్వాదించలేరు.

కారణాలు వెతికి ప్రేమించడం కంటే, అకారణంగా చూపే ప్రేమ కోటి రెట్లు గొప్పది.

కేవలం గొప్ప జ్ఞాని మాత్రమే, బేషరతైన ప్రేమను అందించగల ధైర్యాన్ని కలిగి ఉంటాడు.

తప్పొప్పులు ఎంచే తత్వం ఉన్నవారు మామూలుగా చాలా కర్కశంగా ఉంటారు. అటువంటివారు ప్రేమించలేరు. వాళ్ళు అందరిమీద అజమాయిషీ చేస్తూ ఉండడంతో, అది వాళ్ళ చుట్టూ గోడ కట్టేస్తుంది. అటువంటివారు ఎన్నటికీ బేషరతుగా ప్రేమించలేరు. వాళ్ళ ప్రేమకై మీరు వారి నిబంధనలకు లోబడాలి. వాళ్ళు సరైనవారు అన్న అపోహ వాళ్ళను నిర్దయగా చేస్తుంది. వాళ్ళు వారి అహంపై తేలుతూ ఉంటారు. నాకు వినోదం కలిగించే అటువంటి విదూషకులను చూసి, నేను నవ్వుకుంటాను.

మీరు ఎవరినైనా బేషరతుగా ప్రేమిస్తే, అప్పుడు మీ వ్యవస్థిత బుద్ధి అక్కడ ఉండదు...

మీరు ఈ సమస్త విశ్వాన్ని మనసారా ప్రేమిస్తే, అప్పుడు వ్యవస్థిత బుద్ధి శాశ్వతంగా నశించిపోతుంది.

మీరు ప్రేమించిన వారికి దూరమైనప్పుడు...
మీరు ఏవి పొందారో...
ఏవి కోల్పోయారో...
ఎక్కడ హద్దుమీరి ప్రవర్తించారో .. గుర్తిస్తారు. 

మీరు ప్రేమించేవి మీరు ఏమిటో చెబుతాయి. మీరు ద్వేషించేవి మిమ్మల్ని ఇంకా బాగా నిర్వచిస్తాయి, అది మీకూ తెలుస్తుంది. కొందరు తెలియనట్లుగా నటిస్తారు. నేను వారిని చూసి నవ్వుకుంటాను.

No comments:

Post a Comment

Pages