రైలు ప్రయాణము -జీవన యానము - అచ్చంగా తెలుగు

రైలు ప్రయాణము -జీవన యానము

Share This
రైలు ప్రయాణము -జీవన యానము
 - చెరుకు రామమోహనరావు 

వచ్చునెప్పుడని యన్నది తెలుసు 
పోవు నెప్పుడని యన్నది తెలుసు 
వచ్చి పోవు ఆ బండి కొరకు నీ 
తపన దెందుకో ఎవరికి తెలుసు 

రాకపోకలకు నడుమన మనము 

రాద్ధాంతములను చేయుచుందుము
జీవితమే ఒక రైలు ప్రయాణము 
మేటి విల్తుడది వదలిన బాణము

రెండిటి నడుమన యున్నభేదము 

ఏమిటన్నయది ఇపుడే చూతము 
రైలుయానమున గాంచెదమంతము 
జీవయానమది చూడుమనంతము 

ఖర్చులు మనవి  కష్టము మనది 

సంపాదించే సౌఖ్యము మనది
పంచిన ధనము,పెంచును ఘనము
రైలు యాత్రలో ధన మింధనము

ప్రయాణ వేదిక ప్రవేశ మందిన        (ప్రయాణ వేదిక = railway platform)

మరునిముసమ్మే మొదలుబలాటము
ఎప్పుడు వచ్చును ఎక్కడికొచ్చును
అన్నది పెంచును మన  ఆరాటము

గమనాగమనపు సూచికలున్నా

సేద తీర్చుటకు వీచికలున్నా
సహన మన్నదే కనబడదన్నా
ఎండమావి యది ఎటుల గాంచినా

వచ్చునంతలో తిండి తినెదము

అంతలోపలే నిదురపోయెదము
పిల్లల పాపల నరచికరిచెదము
మనుషులన్నదే మరచిపోయేదము

జీవ యానమున డబ్బు చెల్లదు

మిత్ర బాంధవుల తోడు నొల్లదు
త్రికరణ శుద్ధిని బుద్ధిగ పెంచిన
చిత్తము ఈశుని వీడి వెళ్ళదు

పునరపి జననం పునరపి మరణం

చావు పుట్టుకలు వలయ తోరణం
మన  చేతలు మన  జన్మ కారణం 
నీతి మాలితే బ్రతుకు దారుణం 

అనుబంధాలు ఆత్మీయతలు

అన్నవేవి మనమొచ్చేటప్పుడు
మనవనుకొన్నవి మనతోనున్నవి
మనతోడేవీ పోయేటప్పుడు

 పోవురైలు మన  కమితోల్లాసము

తిరుగు యానమున ఉదాసీనము
జీవికి ఏడుపు, వచ్చునప్పుడు
ఏడిపించు తా పోవునప్పుడు

వచ్చుటకేడ్చిన జీవి తాను మరి

మోహము కోపము లోభము వంచన
ఐశ్వర్యమ్మును అక్కున చేర్చును
అహంకారమును ఔదల దాల్చును

పోవునప్పుడో పూచికపుల్లయు

కోరుకున్ననూ కొనిపోలేమను
నిజమును మరచి నీల్గుచుందుము
బట్ట లేకయే వచ్చిపోయదము 

తృటిలో మనసులు కలుపుకొందుము 

తృటిలో మమతలు పెంచుకొందుము
ఎవరిది వారిదె గమనము గమ్యము
అంతలోపలే ఈ అనుబంధము

అంతము లేనిది అంతు తెలియనిది

ఆలోచింపగ ఆత్మ ప్రయాణము
అవసరాలకు ఆనందాలకు
ఆలవాలమది రైలు ప్రయాణము 

ఒక్కసారి యోచించ దలచితే 

ఒక్క మాటలో చెప్పదలచితే
పోయి వచ్చుటే రైలు ప్రయాణము
వచ్చిపోవుటే జీవన యానము

తత్సత్

No comments:

Post a Comment

Pages