’పసి’ హృదయం

- పూర్ణిమ సుధ 


ఎనిమిదో క్లాసు చదివే స్నిగ్ధ, రెండు రోజులుగా బడికెళ్ళనని ఒకటే మొరాయిస్తోంది. ఈ స్కూల్ కి కొత్తే అయినా, చక్కగా చదివే పిల్ల, టీచర్లందరికీ ఇష్టమైన విద్యార్థి, ఎందుకు వెళ్ళనంటోందో అర్థం కావట్లేదు. మా ఆయనేమో, దీనికిదే మాయరోగం, రెండురోజులెళ్ళకపోతే, ఇహ స్కూల్ మూడ్ పోతుంది. చదువుకోకపోతే అడుక్కుతినాలి... అంటూ రొటీన్ తిట్ల దండకం మొదలెట్టారు. ఎంత ఆలోచించినా అస్సలు అర్థం కాలేదు. సరే, ఒక్కసారి వాళ్ళ క్లాస్ టీచర్ తో మాట్లాడ్దాములే అనుకుంటూ, బలవంతాన స్కూల్ కి పంపేసి, నేనూ ఆఫీస్ కి బయలుదేరాను.
వెళ్ళానన్నమాటేకానీ అస్సలు మనసు మనసులో లేదు. స్నిగ్గీ మీదే మనసంతా... ఆ రోజు సాయంత్రం కూడా చాలా ముభావంగా ఉంది. అయిదింటికి రాగానే ల్యాండ్ లైన్ నుండి ఫోన్ చేసి చెప్తుంది, ఇంటికొచ్చాను అని. నేనడిగే మొదటి ప్రశ్న... బాక్స్ తిన్నావా ? అని. అంటే టైం సరిపోలేదమ్మా, కొంచెం వదిలేసాను అంటుంది. అరే, ఎదిగే పిల్ల తినలేదనే ఆదుర్దాలో కేకలేసి, ఇప్పుడు తిను అంటాను... పాడయిందని చెత్తడబ్బాలో వేస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ క్లాస్... ఆ వెంటనే పళ్ళో, కుకీసో తింటుంది... రోజూ ఇదే రొటీన్. ఇవాళ అయిదింటికి ఫోన్ చెయ్యలేదు. నేనే చేసాను. వచ్చాక ఫోన్ చెయ్యలేదేం ? అన్నాను. మాట్లాడలేదు. సరేలే - బాక్స్ తిన్నావా ? అన్నాను. లేదమ్మా అంది. నేనేం మాట్లాడలేదు. సరే నాకు మీటింగ్ ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తా అని కట్ చేసి, నేరుగా ఇంటికెళ్ళా... స్తబ్దుగా పడుకున్న స్నిగ్గీ ని చూసి, ఒక్కసారి గుండె జారిపోయింది. ఏమైందని ఎంత అడిగినా ఏం చెప్పలేదు... సరే, తమ్ముడు ఏడి అనడిగితే డాబా మీద క్రికెట్ ఆడుకుంటున్నాడంది. మరి నువ్వెళ్ళలేదే ? అంటే మాట్లాడదు. ఇలా కాదని, ఒక పది నిమిషాలు దాన్ని ఫ్రెష్ అవమని వదిలేసి, పిల్లలిద్దరినీ తీసుకుని పార్క్ కి వెళ్దామని నిర్ణయించుకున్నదే తడవుగా వెంటనే తయారయ్యే డ్రై ఫ్రూట్ ఉండలు చేసి, అరటిపండు మిల్క్ షేక్ చేసి, ఇద్దరికీ ఇచ్చి, నేనూ రెడీ అయ్యాను. పెద్దరికంగా, ఏయ్, అలా పరిగెత్తకు, ఇటు వైపుకి నడు... అంటూ తమ్ముణ్ణి గైడ్ చేస్తుంటే, ముచ్చటేసింది. సరే, పార్క్ లో వాడు తెచ్చుకున్న బాల్ తో ఆడుకుంటున్నాడు... మెల్లిగా, మా స్కూల్ రోజుల విషయాలు చెప్తూ, దాన్ని కదిలించడం మొదలుపెట్టాను. టీచర్లందరికీ నువ్వెంటే ఎంత ఇష్టమో కదా ? అని మాటలో మాటగా అంటుంటే, దాని ఆవేశం కట్టలు తెంచుకుని ఏడవడం మెదలుపెట్టింది. ఏమైందమ్మా ? అని అడిగాను... చెప్పుకొచ్చింది.
తన క్లాస్ లో తను, చిన్మయి - ఇద్దరూ ఇంచుమించు ఒకే మాదిరిగా చదువుతారు. పోటాపోటీగా - వీళ్ళిద్దరికీ ఎన్ని మార్కులొచ్చాయని క్లాస్ పిల్లల్నుండి, ప్రిన్సిపాల్ దాకా ఆరా తీస్తారు. ఈ మధ్య, క్లాస్ గ్రూపులుగా విడిపోయి, ఇద్దరిలో విషం చిమ్మడం మొదలుపెట్టారు. దానితో, ఆ పోటీని తట్టుకోలేక, స్నిగ్గీ బ్రేక్ టైం లో బయటికి వెళ్ళొచ్చేసరికి, చిన్మయి, తన బార్బీ బొమ్మ కీచైన్ పోయిందని, కొత్తగా కొన్న పెన్సిల్ పౌచ్ పోయిందని, ఎవరి మీదైనా అనుమానమా ? అంటే, స్నిగ్గీ అని చెప్పి, తన బ్యాగ్ లో ముందుగానే పడేసి ఉండడంవల్ల తను దొరికిపోయి, ఎలా వచ్చిందో అర్థంకాక తెల్లమొహం వేసేలోపు, తన గ్రూప్ వారంతా అవునని సమర్థించి... ఇలా రెణ్ణెల్లలో, ఇప్పటికి మూడో సారిట. ఇంట్లో చెప్దామంటే, మొన్నీమధ్యే నాన్నని ఆ బార్బీ కీచైన్ అడిగినప్పుడు, సరిగ్గా చదువు ముందు... సైకిల్ లేనిదే కీచైన్ ఎందుకు అన్నారు కాబట్టి, ఇప్పుడు, నిజంగా, నేనే తీసాననుకుంటారేమో అని భయపడి చెప్పలేదుట. అంతే కాదు, ప్రతీ దానికీ గ్రూపిజం, వెలేయడం, ఇలా వత్తిడి తెస్తే సరిగ్గా మార్కులు తెచ్చుకోదు, అప్పుడు తనే ఫస్ట్ రావచ్చు... అన్న ఆలోచన వచ్చిందంటే, పిల్లల్లో ఎంత హింసాత్మక ప్రవృత్తి పెరుగుతోందా ? అని భయమేసింది. అసలు స్నిగ్గీకున్న స్థైర్యం, పరిపక్వత నాకు కూడా లేదేమో అనిపించింది. ఆ చిన్ని మనసులో ఇంత తుఫానున్నా, అదేనాడూ బయటపడలేదు. ఇంకా చెప్పుకుపోతోంది... మీరంతా అంటారమ్మా, బాల్యం అత్యంత మధురం అని, కానీ నాకస్సలు అనిపించట్లేదు. ఎందుకో తెలుసా ? పొద్దున లేస్తూనే, మాథ్స్ ట్యూషన్, ఆ వెంటనే రెడీ అవడం, ఐదు నిమిషాల్లో టిఫిన్ కుక్కుకుని, స్కూల్ బస్ ఎక్కెయ్యడం, అక్కడ, సీనియర్లు, మమ్మల్ని లేపి కూర్చుంటారు. దాదాపు, ఇరవై కేజీల బ్యాగ్ మోసుకుని, స్కూల్ కి వెళ్తే, హోంవర్క్ చేస్తే, సరిగా చెయ్యలేదని, చెయ్యకపోతే ఎందుకు చెయ్యలేదని, వాళ్ళు ఒక్కసారి డిక్టేట్ చేసింది ఠక్కుమని గ్రాస్ప్ చేసి రాసెయ్యాలి, లేకపోతే, గోడకుర్చీలు, నీల్ డౌన్ లు, క్లాస్ మేట్స్ ఎప్పుడు మాట్లాడ్తారో, ఎప్పుడు రాజకీయాలు చేస్తారో తెలీదు, మగపిల్లలతో మాట్లాడితే - అదో తంటా.
బోర్డ్ మీద రాసింది ఫాస్ట్ అంటూ టీచర్ చెరిపేస్తారు, మళ్ళీ ఇన్ కంప్లీట్ అని అదో పనిష్మెంట్. ప్రాజెక్ట్స్ ఇస్తారు, సొంతగా చేస్తే గుర్తింపుండదు, గూగుల్ లో సెర్చ్ చేస్తే అంతా ఒకేలా రాసారంటారు. టీచర్లకి కూడా ఎప్పుడు నచ్చుతామో ఎప్పుడు నచ్చమో తెలీదమ్మా... ఎవరో ఏదో చెప్పినా వినేసి, నువ్వు కూడా ఇలాంటిదానివనుకోలేదంటారు. అర్థంకాకపోతే స్టాఫ్ రూం కి వచ్చి అయినా సందేహం తీర్చుకోమంటారు. వెళ్తే, ఇది కూడా రాదండీ, మరి ఇంట్లో పేరెంట్స్ ఏం చెప్తున్నారో అంటారు... పోర్షన్ అయిపోవాలన్న తొందరే కానీ, అర్థమయిందా ? లేదా అని పట్టించుకోరు. బంద్ లు, వాళ్ళు పెట్టే సెలవులు గుర్తురావు, సండేలు, పండగలు కూడా స్పెషల్ క్లాసులు... ఒక టీచర్ కి ఇంకో టీచర్ కి పడకపోయినా మేమే బలవ్వాలి. పరీక్షల్లో కాపీ కొట్టేవాళ్ళని ఏం అనరు, చెప్పినందుకు మాత్రం, నీకెందుకు ? నువ్వు రాయి... అంటారు, అదే డౌట్ అని లేచినా, నీకు ప్రతీదీ డౌటే అని దెప్పిపొడుస్తారు. లంచ్ కలిసి తింటుంటే, ఇష్టమైన కూర అయితే, అంతా పంచేసుకుంటారు, నాకస్సలు ఉంచకుండా. వాళ్ళ కాకరకాయో, ఇంకోంటో ఇస్తారు. నేనది తినలేక, బాక్స్ రిటర్న్ తెస్తే, నువ్వు తిడ్తావు. ఇంటికొచ్చాక, హోంవర్క్, నువ్వొచ్చేసరికి ఏడవుతుంది. నీతో మాట్లాడ్దామంటే, నువ్వు రేపటి కూరలు తరుక్కుంటూ, నాన్న బిజినెస్, మీ ఆఫీస్ సంగతులు, మిగతా విషయాల్తో బిజీగా ఉంటావు. స్నాక్స్ తిని స్టడీ అవర్ కి వెళ్తే, రాగానే అన్నం తినబుద్ధి కాదు, కానీ త్వరగా పడుకోవాలని, పెట్టేస్తావు... మాకు తినే మూడ్ ఉందో లేదో అక్కర్లేదు. పడుకునే ముందు ఒక్కసారి, నీతో మాట్లాడాలనుంటుంది. కానీ నువ్వు సీరియల్ చూస్తుంటావు... ఇవి కాక, ఖర్మ కాలి, పక్కింటి పిల్లలో వెనకింటి పిల్లలో ఏదైనా సాధిస్తే, మీరు మమ్మల్ని సాధిస్తారు.
ఇన్ఫాక్చ్యువేషన్ లు కూడా ఏడో క్లాస్ నుండే మొదలు... అవింకా నీదాకా తేలేదు. నేను ఎదుర్కోగలను. కానీ మన భాస్కర్ మామయ్య ఇంటికొస్తేనే, చాలా చిరాగ్గా ఉంటుంది. నువ్వు నాకు, తమ్ముడికి చైల్డ్ అబ్యూజ్ గురించి చెప్పావ్ కాబట్టి, మా జాగ్రత్తలో మేమున్నాం కానీ, నాన్నే, వెళ్ళు - పిలుస్తున్నాడుగా అని బలవంతం చేస్తారు. బట్టల గూడు బాలేదు, స్టడీ రూమ్ నీట్ గా లేదు, నా చిన్నప్పుడు ఇలా లేము... అంటూ రోజూ ఏదో ఒక క్రమశిక్షణా రాహిత్యం మీద తిట్లు తినీతినీ మెదడు మొద్దుబారిందమ్మా... క్రమశిక్షణలో పెట్టండి మంచిదే... కానీ ఆ స్ట్రెస్ కి ఏది మాట్లాడాలన్నా, ఏ పని చెయ్యాలన్నా, భయంభయంగా ఉంటోందమ్మా... దానివల్ల, అటు స్కూల్ లో స్ట్రెస్, ఇటు ఇంట్లో స్ట్రెస్... ఒక్కోసారనిపిస్తుంది, మీతో సమానంగా, మేమూ శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నామమ్మా... నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ, మీరు చెడు పేరెంట్స్ కాదు, జస్ట్ ఓవర్ కాషియస్... అంతే. వారానికోసారి మాట్లాడి, నెలకో సినిమాకి తీసుకెళ్ళి, ఏడదికో హాలిడే - ఇవి లేకపోయినా పర్లేదమ్మా... ప్లీజ్, నాకు తమ్ముడికి ఒక రిలీఫ్ గా ఉండమ్మా - చాలు. అసలు, మాతో ఫ్రెండ్లీగా ఉంటావ్ కాబట్టే, నీతో ఈ పాటి మాట్లాడగలిగాను, అదే నాన్నయితే చెప్పగలిగేదాన్ని కాదు.... అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది.
నేను చటుక్కున దాన్ని అక్కున జేర్చుకుని,  ఓదార్చాను. పిల్లలకి కూడా ఇన్ని సమస్యలుంటాయా ? అని మౌనంగా రోదించాను. దానికి ధైర్యం చెప్పాను. మర్నాడు ప్రిన్సిపల్ తో మాట్లాడి, ’మీకు మీరే పోటీ, పక్కనవారు కాదు’ - నిన్నటి మీ కంటే, నేటి మీరు మెరుగ్గా ఉండాలి’ అనే కాన్సెప్ట్ ని చెప్పమని అభ్యర్థించాను. ఇంట్లో కూడా మిలిటరీ డిసిప్లీన్ కాక, కాస్త చనువుగా మెలగమని మా ఆయనకి చెప్పాను. ఇప్పుడు ఇద్దరి ముఖాలు కాస్త వికసించాయి. మళ్ళీ నా కుటుంబంలో సంతోషం లాగా... ఉందో లేదో స్వర్గం - ..... నా సర్వస్వం నీకిస్తా... నా బాల్యం నాకిచ్చెయ్యి... అని గజల్ శ్రీనివాస్ పాటని ఇప్పుడు స్నిగ్గీ, బాబీ ఇద్దరూ ఆస్వాదిస్తున్నారు.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top