బుడ్డా వెంగళ రెడ్డి - అచ్చంగా తెలుగు

బుడ్డా వెంగళ రెడ్డి

Share This
బుడ్డా వెంగళ రెడ్డి
 - చెరుకు రామమోహనరావు 

రెండవ భాగము బుడ్డా వెంగళ రెడ్డి గారి ఔదార్యము దానపరత్వము వారిని గూర్చి వ్రాసిన గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రిగారినిగూర్చిన పరిచయము తో కాస్త నిదానముగా తెరపైకి వస్తాను. అపర శిబి చక్రవర్తిగా అభినవ రాధేయునిగా గణుతికెక్కిన బుడ్డా వెంగల రెడ్డి గారిని గూర్చి తెలుసుకొనుటకు మునుపు వారిని గురించి అజరామరమైన పద్యకావ్యము వ్రాసిన, పేరుకు ప్రాకులాడని మహా కవిని, ఒక మహోన్నత వ్యక్తిని గూర్చి తెలుసుకొందాము. ఆ మహనీయుని పేరు గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. వీరు విశ్రాంత ఉన్నత ఆంధ్ర పండితులుగా కర్నూలు జిల్లా నంద్యాలలో నివసించుచున్నారు. వారు ఆంధ్రమున ఉప పండితునిగా తమ ఉద్యోగ జీవితము మొదలుపెట్టి ఉన్నత పండితునిగా ఉన్నతి సాధించినారు.వీరి చదువు,ఉద్యోగమూ అదే పాఠశాలలోనే. ఇది వీరి అరుదైన ఘనత. వీరు సంస్కృతఆంద్ర,కన్నడ,ఆంగ్ల భాషల్లో అసమాన పండితులు. వారియొక్క పాత విద్యార్థులు అందరుకలిసి ,వారు వారించినా వినకుండా మహాగురు సన్మానమును నిర్వహించినారు.ఎంత కాలము క్రిందటి విద్యార్థులనైనా ఇట్లే గుర్తించ గల్గుట వారి శిష్య వాత్సల్యతకు తార్కాణము.కుతుమ్బపరముగా కూడా ఎన్నో కష్టాలను సహించి సంసారమును సమర్తవంతముగా నడిపిన ధీశాలి.100 పుస్తకముల రచయిత. వీరు కవానములో చేత బట్టని సాంప్రదాయమే లేదు. అమూల్యమైన పుస్తకములు వ్రాసియు , వాటిపై మూల్యము ప్రకటించక ఉచితముగా పంపిణి చేసిన జ్ఞాన దాత. ఏరోజూ ఎవరినీ ఆశ్రయించక తన పుస్తకములు తానే ముద్రించుకొన్న అపర పోతన్న.కృతి భర్త, ఈ మహనీయులైన 'సూర్యచంద్రులను' ఆంధ్రమన్న నభోమండలముపై ప్రతిష్టించిన అపర భగీరథుడు అయిన శ్రీయుతులు తంగిరాల వెంకట సుబ్బారావు గారి మాటలలో 'శాస్త్రి' గారిని గూర్చి చెప్పాలంటే 'కృతి స్వీకర్తకు కొన్ని బాధ్యతలుంటాయి.వాటిలో కావ్య ప్రకాశానం(ముద్రణం) లో కవికి చేయూత నివ్వడము.కానీ తమ్ముడు శాస్త్రిగారు కవిసమ్రాట్ విశ్వనాథ వారి వలె 'మనస్సన్యాసి'. నా నుండి ఏమీ ఆశించలేదు.ఇది వారి సచ్చీలత్వానికి వ్యక్తిత్వ మహోన్నత్వానికి ఋషి వంటి నిరీహకు, స్వచ్చదర్పణ సదృశమైన సౌమనసానికి తార్కాణమే అయినా, నాకు మాత్రం మిక్కిలి అసంతృప్తిగానూ, వెలితిగానూ,వ్రీడ గానూ వుంది. ఏమి చెయ్యను? ఇది శాస్త్రిగారి మహోన్నత గుణ నగమునకు దర్పణము.ఇక ఆయన కవితా రీతిని గూర్చి శ్రీయుతులు బేతవోలు రామబ్రహ్మము గారు ఏమన్నారో చూదము.'పాత్రలు తెరిచి , ధాన్యపు బస్తాలనోకచోతనే పేర్చి ,వండి వడ్డింపజేసి, క్షామ పీడితుల్ని ఆదుకొన్న మహానుభావుడు కదా వెంగళరెడ్డి గారు.అదే పద్ధతిలో శాస్త్రిగారు కూడా నాయకుడి గునదాన్య రాశిని పద్యాల బస్తాలో నింపి ఉత్తర భాగాన పేర్చి రుచ్యంగా విందు భోజనంగా వండి వడ్డించి మన ఆకలి తీర్చారు.పద్య కవితా ప్రియులు ఒక రకంగా ఇప్పటి కాలాన క్షమా పీడితులే. శాస్త్రిగారు కడుపు నిపారు.నాలాగే గర్రున త్రేన్చబోతున్న పాఠకులందరి పక్షాన అంటున్నాను-అన్నదాతస్సుఖీభవ.' సాహితీ వాచస్పతి మొవ్వ వృషాద్రిపతి గారి మాటలలో 'ప్రస్తుత మీ కావ్య నిర్మాత గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి మహోదయులు కవివతంసులు,విపశ్చిదగ్రణులనడములోఅతిశయోక్తి లేదు..వీరిప్పటికే ఆంద్ర ప్రదేశములో లబ్ధప్రతిష్ఠులు.ఎన్నో గద్య పద్య గ్రంథాలతో తెలుగువాఙ్మయ సరస్వతిని సర్వాలంకార భూషిత గావించినవారు.ఈ విధంగా వ్రాసుకొంటూ పోతే ఎన్ని పుటలైనా వ్రాయ గలిగేటంత గొప్పదనము కలిగినవారు శుబ్రహ్మణ్య శాస్త్రివారు.'కవి దోర్దందుడయిన శాస్త్రి గారి పాండిత్యము ముందుమోడు బారిన మావి తరువైనా మోసులెత్తక మానదు.' అని అన్నారు జోశ్యం విద్యాసాగర్ గారు. ఇక కథా నాయకుడి విషయానికి వస్తాము. ఆంద్ర ప్రదేశము లో దాన కర్ణులుగా ప్రఖ్యాతి గాంచినవారిలో రాయలసీమలోని బుడ్డా వెంగళరెడ్డి , యాదాళ్ళ నాగమ్మ, నెల్లూరు మండలములో కోడూరి బాలకోటారెడ్డి,గుంటూరు మండలములో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు,గోదావరి మండలములో డొక్కా సీతమ్మ సుప్రసిద్ధులు. నేటి కడప కర్నూలు జిల్లాల్లో కుందు నదీ పరీవాహక ప్రాంతాన్ని 'రేనాడు' అంటారు.ఇప్పటి కర్నూలు జిల్లా కోవెల కుంట్ల తాలూకాకు చెందిన ఉయ్యాలవాడ గొప్పదనాన్ని గూర్చి ముందే చెప్పుకొన్నాము. ఆ గ్రామ వర్ణన మరొక్కసారి శాస్త్రి గారి మాటలలో చదవండి : తుంగోత్తుంగ తరంగ చాలనములన్ తోడైన హంద్రీ సరి ద్భంగావృత్తమహీతలమ్మినుమడింపన్ జుట్టునేర్లెన్నొ పా రంగా పుష్కల సస్య వృద్ధికినపారప్రఖ్య నార్జించి పే రంగాంచన్ విలసిల్లు తీరమిది నోరూరించు మాధుర్యముల్ ఇక అక్కడి పాడిపంట పౌరుల గూర్చి చదవండి. నాయకుని గుణశీలము కూడా ఇక్కడే మచ్చుకు చూపించి కథకు నాంది పలికినారు. పచ్చని పంటచేలు చేలువంబున డంబు వహించు తోటలున్ ముచ్చతగోల్పు మేడలు నమోఘ వినిర్మిత వృత్త కుడ్యముల్ మెచ్చెడి పాడి, పాడి తమ మేని నరంముల నింపు పౌరులున్ వచ్చెడి బాటసారుల కపార కృపాసాహితాదరమ్ములున్ ఆ గ్రామమందలి సుసంపన్నమైన కుటుంబీకులు నల్లపరెడ్డి అక్కమ్మ గార్ల ప్రథమ పుత్రుడు మన నాయకుడు.జననం సా.శ.1822 . సాధారణ ఎత్తు.గుండ్రని ముఖము గౌరవర్ణము.ముఖములో స్పోటకపు మచ్చలున్నా ఆకర్షణీయమైన విగ్రహము. సాముగరిడీ చేసి ధృఢమైన శరీరమును గలిగిన వాడు.ప్రథమ సంతానమగు ఆయనకు ఈశ్వరరెడ్డి తమ్ముడు, తిమ్మమ్మ, సుబ్బమ్మ చెల్లెళ్ళు. వెంగళరెడ్డి గారి మొదటి భార్య నాగమ్మ నిస్సంతుగా గతించింది.తిరిగి పెళ్ళియాడినా పిల్లల లేమిచే తమ్ముడు ఈశ్వరరెడ్డి కుమారుని దత్తత తీసుకొన్నాడు.బంగారమునకు తావియబ్బినట్లు పుట్టుకతోనే దానగుణము అబ్బినది ఆ మహనీయునికి.బాల్యము లోనే తానూ కొన్న తినుబండారములు సాటి పిల్లలకు పంచేవాడు.ఆయన దాతృత్వమును గాంచి ప్రజలు బడా వెంగళ రెడ్డి అని అనేవాళ్టట. అది రాను రాను రాను బుడ్డా వెంగళ రెడ్డి అయినదని అంటారు. అసలుగా వారి ఇంటిపేరు 'మద్దెల'. 'మజ్జరి' అనుట కూడా కద్దు.ఆయన దానగుణాలను గూర్చి తెలుసుకొంటూ పోతే మనము ఆశ్చర్యపోక తప్పదు.ఆయన సచ్చీలతకు దానగుణానికి ఈ పద్యము కొలబద్ద బుడ్డా వెంగళరెడ్డి రాజలధనమ్మున్ దాన సచ్ఛీలమం దడ్డంబెమియులేక చేగోనిన ధన్యాత్ముండు బుణ్యాత్ముడై వద్దిన్చేన్ తనకున్నయంత వరకున్ వాత్సల్యమేపారగా 'రెడ్డీ' నీవే దధీచి వా శిబివనన్ 'రేనాట కీర్తించగన్' ఆయనకు పండితపోషణ బహు ప్రీతి. సంస్కృత పాఠశాల ఆ కాలములోనే నెలకొలిపి విద్యాదానము చేసిన మహనీయుడు.తన ఇంటి పనివాళ్ళందరికి భోజన వసతులు ఉచితముగా ఏర్పరచేవాడు.ప్రతి ఏటి ఉగాదికి ఆయన చేసే అన్నదానానికి చుట్టుప్రక్కల గ్రామాలన్నే తరలి వచ్చేవి. తనకు వద్దిచిన ప్రతి వస్తువూ పంక్తిలో ప్రతియోక్కరికీ వద్దిన్చావలసిందే. వారి ఈ మాట శిలాశాసన తుల్యము.పోటీ పడి నెయ్యి త్రాగేవారికి త్రావినంత నెయ్యి గిన్నెతో వంచి పోయించే వారు.ఆయన వంశీయులు నేటికినీ ఈ సదాచారాన్ని కొనసాగిస్తున్నారు.ఆయన ఒకరోజు రాత్రి ప్రయాణము తన గుర్రముపై చేస్తూవుండగా దారిలో దొంగలు అడ్డగించినారు.వారిని లాలించి బుజ్జగించి ఇంటికి పిలుచుకుపోయి భోజనము పెట్టించి వారి నాలుగు మూటల బియ్యము అంటే 500 K.G లు ఇచ్చి పంపిన దాత. వారి వద్ద ఒక అపురూపమైన జాతి గుఱ్ఱము వుండేది. ఆయన ప్రయాణాలన్నీ దాని పైనే. ఊరిలోని ఒక వణిజుడు ఆ గుర్రమునకు వలయు ముంతెడు ఉలవలు రెడ్డిగారి దివాణమునకు పంపి లెక్క వ్రాసుకోనేవాడు.సంవత్సరం చివర అతని బాకీ తీర్చుట నాటి గొప్ప ఇంటివారి ఆనవాయితీ. కొన్నాళ్ళకు ఆ గుఱ్ఱాన్ని తన గురువుగారైన ధరణి సీతారామయ్య గారికి దానము చేసినారు. కానీ గుఱ్ఱానికి దాణా యదా తతంగానే పోయేది. సంవత్సరము చివర ఆ వర్తకుడు డబ్బుకు వస్తే గుఱ్ఱము తన గురువుకు దానము ఇచ్చినట్లు చెప్పి ఆ గుఱ్ఱము బ్రతికినంత కాలము దాణా ఖర్చు తన వద్ద నండినే తీసుకోమ్మన్న ఉదారుడు.శివరాత్రికి 20 రోజుల ముందు నుండి తమ ఊరిలోని అగస్తీశ్వరాలయములో సంతర్పణలను నిరాఘాటముగా 25 సంవత్సరములు జరిపిన మహనీయుడు. ఒకసారి ఒక బిచ్చగత్తె రెడ్డిగారి ముంగిట నిలిచి ఒక పాత కోక ఇమ్మని అడిగింది. ఆ మాట విన్న రెడ్డి గారి ఒక భార్య పాతదేందుకు నీకోసం క్రోత్తదే నేయింఛి ఇస్తాములే అన్నదట. ఆ మాట విన్న రెడ్డి చిలుకకోయ్యకు తగిలించి ఉన్న కొత్త చీర తెచ్చి ఆ బిచ్చగత్తెకు ఇచ్చినాడట. ఆయన భార్య లబోదిబోమంటూ అది నా పుట్టినింటివారు పెట్టిన కొత్త కోక అన్నదట.రెడ్డిగారు కూడా 'అందుకే నీ మాట నిజము చేయుటకు అది ఆ బిచ్చగత్తెకు ఇచ్చినా'నన్నాడట. ఎంతటి ఔదార్యమో! ఇంటిలో గంగాలముల నిండా మజ్జిగ వుంది కూడా లేదని ఒక బ్రాహ్మణ స్త్రీని తన భార్య చెన్నమ్మ వెనక్కు పంపుతూవుంటే గమనించిన రెడ్డి మళ్ళీ తానూ మాజ్జిగ పోస్తే బాగుండదని ఆవు పడ్డానే దానము చేసిన దానవీరుడాయన. ఉయ్యాలవాడ సమీపములో 'పాంపల్లె' అన్న వూరిలో ఇద్దరు బ్రాహ్మణ సహోదరులుండేవారు .వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒక వడ్యాణము కావలసి వచ్చి రెడ్డి గారిని అరువు ఇమ్మన్నారు. దాని బరువు ఒక శేరు (అంటే 250 గ్రాములు ఇంచుమించు). రెడ్డిగారు అది ఇవ్వడమే కాకుండా , వారు తిరిగి తెచ్చి ఇస్తే ఆడపిల్లకు పెట్టినది మళ్ళీ వెనక్కు తీసుకోనన్న వదాన్యుడు ఆయన.యువ గణము ఆరోగ్యమునకై వ్యాయామశాల ఏర్పాటుచేసి అందు చిన్న కమ్ము, పెద్ద కమ్ము అన్న వస్తాదులను పోషించుతూ, వారితో, ఉచితముగా యువకులకు శిక్షణ ఇప్పించేవాడు.తానూ వారితో అప్పుడప్పుడు మల్ల యుద్ధము చేసే వాడు. చెన్నంపల్లె గ్రామం లో వెంగళరెడ్డి గారిని చంప టానికి మాటువేసిన విషయము చెప్పిన ఒక మాలకు , ఆతని జీవితమంతా ఆశ్రయమిచ్చి తనవద్దనే ఉంచుకొని పెళ్లి పేరంటము చేసి ఆ దంపతులను తన వద్దనే ఉంచుకొన్న మానవతావాది ఆయన. . ఒకసారి జొన్నల మూటలు (బస్తాలు) ఎద్దుల బండికి ఎత్తుకొని కొందరు ఉయ్యాలవాడ పోతూ వుండినారు. మూటలకు రంధ్రములు ఉండుట వల్ల జొన్నలు భూమి మీద రాలుతూ వుంటే రెడ్డి గుఱ్ఱము దిగి అవి ఎరుకొంటూ ఉయ్యాలవాడ చేరినాడు. వారి బండి కూడా వారి ఇంటి ముగితే నిలిచి వుంది. రెడ్డి గారు వారిని జూచి ఎవరు కావలెనంటే వారు 'వెంగళ రెడ్డి గారు' అన్నారట. అందులకాయన 'సరే సరే ముందు భోజనము చేయండి' అని వారికి విస్తరాకులలో రూపాయలు వడ్డింప జేసినారట. వారు బిక్క మొగము వేసుకొని చూస్తే ఆయన' మరి గింజాలు ఎరుతూవుంటే ఎగతాళి చేసినారే మరి ఇపుడు రూపాయలు తినండి' అన్నాడట. ఆయనే వెంగళరెడ్డి అన్న విషయము వారికర్థ పోయింది. సిగ్గు తో తల వంచుకొన్నారు. రెడ్డిగారు రూపాతలు తీయించి వారికి మృష్టాన్నము పెట్టించి దాన్యమునకు తగు మూల్యము చెల్లించి పంపించినాడు.హాస్య స్ఫోరకమైన ఈ యదార్థ సంఘటన గమనించండి.రెడ్డి గారి తల్లి అక్కమ్మ వితరణ శీలి కానీ అమ్మయకురాలు. ఆ వూరిలో వుండే పాణ్యం సంజీవభోట్లు అన్న బ్రాహ్మనికి ప్రతిరోజూ దిన భత్యం ఇచ్చేవాళ్ళు.ఒకసారి తన ఇంట్లో ఏర్పడిన సమస్యల వల్ల ఆయన బహుశ పోరుగూర్లకు పోయినాడో ఏమో ఒక నెలరోజులు రెడ్డిగారి ఇంటివైపు రాలేదు.సమస్యలతో సతమతమౌతున్న ఆయన రెడ్డిగారి ఇంటికి పోగానే 'సామీ ఎక్కడికి పోయివుండినా'రని అడిగింది. ఆయన విసుగుతో 'స్వర్గానికి పోయి వస్తున్నా'నని అన్నాడు. ఆ అమాయకురాలు 'మా ఆయన కనపడినాడా ,ఆయన బాగుండాడా సామీ' అన్నది. ఆ బ్రాహ్మడు ' కనబడినాడమ్మా' అన్నాడు. 'ఏమన్నాడు సామీ' అన్నది.అందుల కాయన చలి ఎక్కువగా వుంది దుప్పటి కావాలన్నాడు' అని ఆమెతో అన్నాడు . ఆమె ఇంట్లోవున్న కొత్త దుప్పటి తెచ్చియిచ్చింది. చాటుగా వెంగళరెడ్డి గారు విన్నారని ఆ బాపనికి తెలియదు. నాల్గు రోజుల పిమ్మట రెడ్డి యాతని బిలచి 'స్వామీ దుప్పటి మా నాయనకు ఇచ్చినావా' అన్నాడు . సంజీవ భొట్లు గారికి నోరు పెగల లేదు కానీ కాస్త తమాయించుకొని 'రెడ్డీ మేము కప్పుకొంటే మీ తండ్రి కప్పుకొన్నట్లు కాదా' అన్నాడు. రెడ్డి ఆయన సమయస్పూర్తి కి నవ్వుకొని ఇంకా 6 క్రొత్త దుప్పట్లు ఆయనకు ఇచ్చి పంపించినాడు. సా.శ.1826 క్షయ నామ సంవత్సరములో నాటి కదప్ కర్నూలు అనంతపురము బళ్ళారి జిల్లాలలో ఇంత వరకు రాణి కరువువచ్చింది. దీనిని 'డొక్కల కరువు' అని కూడా అన్నారు.ఆ కరువుకు కడుపులు మాడి వేలమంది మరణించినారు. కడుపు నిండా తిన్నవారేవరైనా కనిపించితే , రోజులకొద్దీ కడుపులు మాడ్చుకొనే ప్రజలు, వారి డొక్క చించి అందులోని అన్నము తినేవారని అంటారు. అందు కే ఆ కరువుకు ఆపేరు వచ్చింది. ఆగల రాజ్యాదికారులు నెలకొల్పిన గంజికేంద్రాలు వెలవెలబారినాయి.అవి ఏ విధంగానూ ప్రజల ప్రాణాలు కాపాడలేక పోయినాయి. అట్టి స్థితిలో ప్రజలను ఒక్క దయనీయుడగు మహనీయుడు వెంగళరెడ్డి మాత్రమే తన ఆస్తి మొత్తము వెచ్చించి కాపాడగలిగినాడు. పూటకు 8,000 మంది కి తక్కువ లేకుండా 3 నెలలు ఆదుకొన్న ఘనకీర్తియాతనిది.ఎంతటి దయాగుణ సంపన్నులో ఎంతటి దానపరులో! అసలు ఈ కరువుకు బలికాబోతున్న అంగ్లేయునికి ప్రాణము పోసిన ఘనత రెడ్డిగారిది. ఆయన తమ్ముడు ఈశ్వరరెడ్డి కూడా అన్నకు బాసటగా నిలిచి తన ఆస్తీని కూడా అన్నకే ఇచ్చి పేదల నాదుకోమ్మన్నాడు. ఆస్తి అంతా హారతి కర్పూరము చేసి ఆకలిగొన్న వారిని ఆదుకొన్న మహనీయులు. భయంకరమైన ఈ కరువును శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మాటలలో చదవండి. ఎండి బీటలు బారి గుండెలవియజేయు పొలముల గని రైతు బోరుమనియే మేతకి కదిలిన మేలి పసులమంద లెండు డొక్కల చ్చచ్చుచుండె నచటె పాలీని గేదెల పరువెత్త జేసిరి ఆలమందల తోడ నడవులకును కడుపు నిండని తల్లి కడుపు పంట నిసుంగు చనుబాలు దొరకక చనెను దివము ఎవరుజేసిన పాపమో ఎరుగరాదు ప్రకృతి కోపించి ప్రళయ సంపాతమనగ తీవ్రమౌ క్షామ దావాగ్ని దివియజేసే అదియ రాయల సీమ లో నగ్గి రేపే కరువు మొత్తము ఈ పద్యములో కళ్ళకు కనబడుతుంది. ఈ సమాచారము భారత దేశములోని తమ ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా తెలుసుకొన్న బ్రిటీషు మహారాణియగు విక్టోరియా మహారాణి ఆ కలియుగ పరోపకార ధౌరేయుడగు దాన రాధేయునికి 20 తులాల పతకము బహుమతిగా ప్రకటించి ఇప్పించి సన్మానించింది. రెడ్డిగారు . అధిపోగోట్టుకొంటే మళ్ళీ 10 తులాల పతకమును ఆ పరాంతపు కలెక్టరు ద్వారా అందజేసే ఏర్పాటు చేయించింది. శత్రువుల చేత కూడా కీర్తింపబడిన ఆయన దాన పరత్వమును ఎంత కొనియాడినా తక్కువే. అది స.శ. 1900 డిసెంబరు 31వ తేదీ.వెంగళరెడ్డి ఆనాడు పిల్లలకు మశూచి టీకాలు వేయించే పనిమీద ఊరిలోకి వెళ్ళి,ఇంటికి వచ్చి భోజనము చేసి మధ్యాహ్నము 12 గం. అనాయాస మరణము పొందినాడు. ఎంతటి పుణ్యమూర్తియో కదా!ఆ నాడు బాలునిగా వున్నబ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహం గారు వెంగళరెడ్డి గారి మరణాన్ని గూర్చి చెప్పినది వారి మాటలలోనే " టీకాలు వేయించటానికి వెంగళ రెడ్డి మాయింటికి రాగానే నేను భయపడి పారిపోతూవుంటే బలవంతముగా పట్టి తెప్పించి , మిఠాయి తినిపించి , తన జేబులో నున్న ఒక రూపాయి నాలుగు అణాలు నాకిచ్చి, టీకాలు వేయించి, ఇంటికి వెళ్లి మధ్యాహ్నము 12 గం. లకు అకస్మాత్తుగా మరణించినారు.రెడ్డిగారితో కడపటి దానము గ్రహించినవాడను నేనే !" రెడ్డిగారిని వారియింటి వామి దొడ్డిలోనే సమాధి చేసి ఇప్పటికీ ప్రతి సంవత్సరము నిరంతరాయంగా సమారాధన చేస్తూనేవున్నారు. ఇవంతా ఆయన బ్రతికిన కాలములో జరిగిన విషయాలు. ఇపుడు ఆయన పరమపదించిన పిదప జరిగిన ఈ సంఘటన చదవండి. రెడ్డిగారు మరణించుటకు కొన్ని రోజుల ముందు తన కుమారుని ఉపనయనము కోసము ఒక పేద బ్రాహ్మణుడు రెడ్డి గారిని కొంత ధనము యాచించినాడు. రెడ్డిగా సరేయని ఆధానము ఇవ్వగా ఆ బాపడు "అయ్యా ఈ డబ్బు ప్రస్తుతానికి మీ వద్దనే ఉంచండి నేను ముహూర్తమునకు రెండు రోజుల ముందు వచ్చి తీసుకొంటాను" అన్నాడు. రెడ్డిగారు అందుకు 'సరే' అన్నారు. ఒకరోజు ఆ బ్రాహ్మడు ఉయ్యాలవాడకు పడిగెపాడు అన్న ఊరి దారిగుండా వస్తూవుంటే రెడ్డిగారు గుర్రముపై ఎదురు వస్తూ ఆతనికి కనిపించినారు. రెడ్డి గారు ఆయనకు నమస్కరించి " స్వామీ ! మీ ధనము పసుపు గుడ్డలో చుట్టి వెదురు కొమ్ములో ఉంచి గాటి పట్టున ధన్తులో పెట్టినాను మావాళ్ళనడిగి తీసుకోండి" అన్నాడు. ఆయన అల్లాగేనని వెళ్లి జరిగినదంతా ఇంటివారితో చెబితే ముక్కుపై వ్రేలు వేసుకొనుట వారి వంతయింది.వారు ఆయనతో " ఆయన గతించి పది దినములైనది.మీకు కనిపించి చెప్పినాడంటే మాకు మిక్కిలి ఆశ్చర్యముగావుంది " అంటూ ఆ తావులో చూస్తే డబ్బు చెప్పింది చెప్పినట్లుగా అక్కడే వుండినది. ఆ డబ్బు తీసుకొని ఆయన సంతోషముగా వెళ్ళిపొయినాడు.ఇటువంటి దానశీలిని నేను ఈ విధంగా తలచుకోగలుగుట నా అదృష్టమని తలన్చుచుచూ పద్య కావ్యముగా వ్రాసిన శ్రీ గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి నమస్కరిస్తూ ఈ క్రింది పాట తో స్వస్తి పలుకుతాను. మా బాల్యములో ప్రతి బిచ్చగాని నోటిలోనూ ఈ పాట వినేవాళ్ళం... ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నదీ ధర్మం సూడరయా నేటికి బుడ్డా ఎంగాలరెడ్డిని దానా పెబువని తలవరయా పచ్చి కరువులో పానము బోసేను బెమ్మ దేవుడే ఆయనయా ఆకలి కడుపుకు అన్నము పెట్టె ధర్మ దాత యని తెలియరయా ఈ విధంగా ఆ పాట సాగుతుంది. పూర్తి పాఠము నాకు జ్ఞాపకము లేదు. తత్సత్

No comments:

Post a Comment

Pages