భైరవ కోన -10(జానపద నవల )

- భావరాజు పద్మిని 


(జరిగిన కధ : సదానందమహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటాడు భైరవపురం రాకుమారుడు విజయుడు. గురువు ఆదేశానుసారం భైరవారాధన చేసి, ఒక దివ్య ఖడ్గాన్ని, వశీకరణ శక్తిని,  పొంది తిరిగి వెళ్ళే దారిలో కుంతల దేశపు రాకుమారి ప్రియంవదను కలిసి, ఆమెతో ప్రేమలో పడతాడు. వంశపారంపర్యంగా విజయుడికి సంక్రమించిన చంద్రకాంత మణిని స్వాధీనం చేసుకుని, 6 శుభలక్షణాలు కల స్వాతి నక్షత్ర సంజాత అయిన రాకుమారిని బలిచ్చి, విశ్వవిజేత కావాలని ప్రయత్నిస్తుంటాడు కరాళ మాంత్రికుడు. విజయుడి చెల్లెలైన చిత్రలేఖ వివాహం, అతని మిత్రుడు, మంత్రి కుమారుడైన చంద్రసేనుడితో నిశ్చయం అవుతుంది. చిత్రలేఖ తాను వెదుకుతున్న స్వాతీ నక్షత్ర సంజాత అని తెలుసుకున్న కరాళుడు రాజగురువు రూపంలో వచ్చి, ఆమెను అపహరించుకు పోతాడు. జరిగిన మోసం తెలుసుకుని, చిత్రలేఖను రక్షించేందుకు వెళ్తూ, ఒక మునికి శాపవిమోచనం కలిగించి, దుర్గ అనుగ్రహంతో దివ్యదృష్టిని, ఖడ్గాన్ని పొందుతాడు చంద్రుడు. ఇద్దరూ ముని చెప్పిన దిశగా పయనమవుతారు...) శ్వేతాశ్వంపై వేగంగా పయనిస్తున్న విజయుడు, పంచకళ్యాణి పై స్వారీ చేస్తున్న చంద్రుడు తమ గుర్రాలకు విశ్రాంతిని ఇచ్చేందుకై చెట్టు క్రింద ఆగారు. కాసిన్ని ఫలాలు తిని, సేద తీరాకా చంద్రుడిని ఇలా అడిగాడు విజయుడు... “ మిత్రమా ! అమ్మవారి దయతో నీకు దివ్యదృష్టి అనుగ్రహించబడింది కదా ! ఆ మాంత్రికుడి చెరలో చిత్ర ఎలా ఉందో ఏమో, ఒకసారి చూసి చెప్పు...” “అవశ్యం మిత్రమా !” అంటూ కన్నులు మూసుకుని దేవిని ధ్యానించాడు చంద్రుడు. అతని మనోనేత్రం ముందు కరాళుడి స్థావరం లీలగా కదిలింది ... “ హ హ హ హ ... సాధించాను, కింకరా ! ఇదిగో చంద్రకాంత మణి ! “ అంటూ తన సేవకుడైన కింకరుడి చేతిలో మణిని ఉంచాడు కరాళుడు. “ భళా దేవరా ! అది సరేగాని, దుర్భేద్యమైన ఆ కోట లోకి మీరు ఎలా ప్రవేశించారు ? పూజామందిరంలోని ఆ మణిని ఎలా కైవసం చేసుకున్నారు ?” సందేహంగా అడిగాడు కింకరుడు. “ ఏమున్నదిరా ! ఈ మనుషులు అనుబంధాల కోసం ప్రాణాలైనా ఇస్తారు కదా ! నిద్రిస్తున్న రాజును కాలసర్పమై చుట్టాను. మణిని ఇవ్వకపోతే, రాజును చంపుతానని బెదిరించాను... వెంటనే రాణి మణిని చేతికి ఇవ్వగానే , మాయమయ్యాను...” అన్నాడు వికటాట్టహాసం చేస్తూ. “ అయితే మనకు అమావాస్య బలికి చిత్రలేఖ, మణి, సిద్ధమయ్యాయి. ఇక అమావాస్యకి రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇక మీరు విశ్వవిజేత కావడం తధ్యం ! అటుపై ఇన్నాళ్ళూ మిమ్మల్ని నమ్మి కొలిచిన ఈ కింకరుడిని కూడా గుర్తు పెట్టుకుంటారుగా దొరా ! “ నక్కవినయం అడిగాడు కింకరుడు. “ ఆహా !కరాళుడు చక్రవర్తి అయితే... కరాళ కింకరుడు సామ్రాట్టు కాడూ ! ఈ దివ్య మణిని అంతవరకూ, భేతాలుడి ముందు భద్రంగా ఉంచు. చిత్రలేఖ ఎక్కడా ?” అడిగాడు కరాళుడు. “ అదిగో దొరా ! మీ మాయతో ఇంకా నిశ్చలంగా ఆ రాతి దిమ్మెపై పరుండి ఉంది. కాపలాగా రెండు భూతాలు ఉన్నాయి...” అంటూ గుహ మూలకు చూపాడు కింకరుడు. అక్కడ భీభత్సమైన పుర్రెల మధ్య, స్పృహ లేకుండా ఉన్న చిత్రలేఖను చూసి, కలవరంగా కళ్ళు తెరిచాడు చంద్రుడు. “ఏమైంది మిత్రమా ! ఎందుకా కలవరం ?” అని అడుగుతున్న విజయుడికి, తాను చూసింది అంతా చెప్పాడు చంద్రుడు. “ అంతేకాదు మిత్రమా ! గుహ బయట రాక్షస బల్లుల్ని, విష సర్పాలని, గుహ ద్వారం వద్ద ఒక బ్రహ్మ రాక్షసుడిని కాపలా ఉంచాడు కరాళుడు. మనకు ఆట్టే సమయం లేదు, సత్వరమే పయనం కావాలి...” అన్నాడు. తమ శాస్త్రాస్త్రాలను సర్దుకుని బయలుదేరబోతున్న మిత్రులకు ఎదురు వచ్చాడు ఒక  జటాధారి. ఒళ్ళంతా విభూతి అలముకుని, కేవలం కౌపీనం మాత్రమే ధరించిన ఆయన మొహంలో  అంతులేని దివ్య తేజస్సు. అలా సమ్మోహితులై చూస్తున్న మిత్రులతో ఆయన, “ నాయనలారా ! బడలిక వల్ల డస్సి ఉన్నాను, మీ వద్ద ఆహారం ఏదైనా ఉంటే ఇచ్చి పుణ్యం కట్టుకోండి...” అన్నారు. వెంటనే తన మొలకు ఉన్న మూటలోని మధుర ఫలాలను అందించాడు విజయుడు. తన వద్ద ఉన్న చిన్ని సీసా లోని తేనె ను దొన్నెలో ఒంపి ఇచ్చాడు చంద్రుడు. అవన్నీ తిన్న ఆయన, “ విజయోస్తు నాయనలారా !  భైరవపురం పరువుప్రతిష్టలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. మీకు నా అండ ఎప్పుడూ ఉంటుంది...” అని దీవించారు. “స్వామీ ! ఇంతకూ మీరు...” అని వారు అడుగుతుండగానే, అక్కడ ఆయన రూపం అదృశ్యమై భైరవుడు ప్రత్యక్షం అయ్యాడు. వెంటనే వారు స్వామి పాదాలకు నమస్కరించి,  లేచేలోపే, ఆయన అంతర్ధానమయ్యారు. రెట్టించిన ఉత్సాహంతో బయలుదేరిన మిత్రులు ఇద్దరూ, భాగమతి తీరానికి చేరి, తమ అశ్వాలను ఒక చెట్టుకు కట్టివేసి, అరణ్యంలోని మునిని స్మరించారు. మెరుపు వేగంతో విశాలమైన రెక్కలు అల్లారుస్తూ, శ్వేత వర్ణంలో ఆకాశంలో విరిసిన వేయి రేకుల తామరలను మరిపిస్తూ ప్రత్యక్షం అయ్యాయి రెండు గండ భేరుండ పక్షులు. వాటికి వినమ్రంగా నమస్కరించి, వాటి వీపుపై కూర్చుని, పయనమయ్యారు ఇద్దరు మిత్రులూ ... కొండలూ, గుట్టలు, సముద్రాలు దాటుతూ సాగుతోంది వారి పయనం. పక్షులు ఎగిరే వేగానికి పడిపోకుండా, వాటి వీపుకు గట్టిగా కరుచుకుని, మబ్బుల ఆకాశంపై నుంచి, చీమల బారుల్లా కనిపిస్తున్న చేట్టుచేమల్ని, జీవరాశుల్ని ఆశ్చర్యంగా చూడసాగారు వారు. రెండు జాములు గడిచాకా, రెండు సముద్రాల నడుమ ఉన్న ద్వీపానికి చేరుకున్నారు. అక్కడి పెద్ద కొండపై దిగిన గండ భేరుండ పక్షులలో ఒకటి ఇలా మాట్లాడసాగింది... “ఇక్కడి నుంచి మీకు అడుగడుగునా గండాలే !  ఆ కనిపించే కొండ దిగువనే ఉంది కరాళుడి మాయా స్థావరం. ఈ లోయలో ఎవరు అడుగు పెట్టినా, ప్రాణాలతో తిరిగి వెళ్ళకుండా కట్టుదిట్టమైన కాపలా పెట్టాడు కరాళుడు.  తొందరపడి దూసుకు పోకుండా ఆలోచించి అడుగు వెయ్యండి. ఇక్కడ శక్తి కాదు, యుక్తి ముఖ్యం . మరి మాకు సెలవిప్పిస్తే, మేము బయలుదేరతాం...” అంది. గగన మార్గాన దూసుకుపోతున్న తమ నేస్తాలకు చెయ్యి ఊపుతూ వీడ్కోలు పలికి, కత్తులు దూసి బయలుదేరారు ఇద్దరూ... “వాసన... నరవాసన...” అంటూ వారి ముందుకు వచ్చింది ఒక జడల భూతం ... దాని నాలుక చాచి, వీరి వైపు ఆశగా చూస్తూ రాసాగింది. (చివరి భాగం వచ్చే సంచికలో...)  

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top