శ్రీ కృష్ణదేవరాయల కవితావైభవం.
(కవితకు చిత్రం :పొన్నాడ మూర్తి గారు )
- డా:ఉమాదేవి బల్లూరి.

జయహో ఆంధ్రభోజా
జయ జయహో శతకోటి భానుతేజా
సాహితీ సమరాంగణ సార్వభౌమా
యుగాలు మారినా తరగని తెలుగు తేజమా
నరసరాయాత్మజా శ్రీకృష్ణదేవరాయా
అందుకోవయ్య మా నీరాజనం
అందించవయ్య నీ ఆశీర్వచనం
ఎదురుచూస్తోంది ఆంధ్రప్రజానీకం
శ్రీనివాసుని కొలిచి తరియించినావు
పరమతసహనాన్ని పాటించినావు
భువన విజయపు రూప శిల్పివే నీవు
అష్టదిగ్గజ కవుల నాదరించావు
"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
దేశభాషలందు తెలుగు లెస్స"యటంచు
పలికించినావు శ్రీకాకుళాంధ్ర దేవునినోట
తెలుగుభాషలోని తీయందనాన్ని
ఆస్వాదించి నీవు ఆరాధించినావు
అంతటితొ నాగక రాజకవి వైనావు
ఆముక్తమాల్యదనె రచియించినావు
పంచకావ్యములలో నొక్క కావ్యమ్ముగా
వెలయుచున్నది తెలుగుసీమలోన
ముడిచి విడిచిన 'మాలనే'ధరియించిన
శ్రీరంగధాముని పరిణయ గాధనే
సప్తాశ్వాస కావ్యమ్ముగా తీర్చిదిద్దావు
కదనరంగంలోను కవనరంగంలోను
నీకు నీవే సాటి కారెవరు పోటీ
విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుని చేత
"విశిష్టాద్వైతమత "స్థాపన మొనర్చినావు
దేశ వైశాల్యమే అర్థసిద్ధికి మూలమటంచ
ప్రజల సౌభాగ్యమే రాజ్యాభివృద్ధియని
కావ్యాన వివరించి ఆచరణ  చేసి చూపావు
బద్ధవైరము పూని రాజ్య లాభాపేక్షతో
వేరు వడ్డ దాయాదుల యంతరంగములందు
మోక్షాపేక్షయే కాని "పగ"యశాశ్వితమని
ఖాండిక్య కేశిధ్వజుల కథ ద్వార తెలిపావు
మీపెద్దలు కూర్చిన"నిక్షేపమిది"యంచు
రాజ్య వాంఛను బాపి యామునాచార్యునకు
శ్రీరంగనాథునే దర్శింప చేశావు
ముక్తి మార్గపు దారి చూపించి నావు
"సత్యమేవ జయతే"అన్న సూక్తికి ప్రతిగ
మాలదాసరి కథనె కూర్చావు కమ్మగా
ఆ ముక్తమాలను ధరియించిన స్వామికి
మాల నిచ్చిన ముదితనే పతిని చేశావు
ఆచంద్రతారార్క ముండునట్లుగ నీవు
విష్ణు చిత్తీయమ్ము రచియించినావు
ఆకమ్మని కావ్యమే "ఆముక్తమాల్యద"గ
అలరారుచున్నది సాహిత్య సీమలో
అష్టాదశవర్ణనలతో వెలసిన ఈ కావ్యం
అపూర్వం--అమోఘం--అనితరసాధ్యం.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top