లౌక్యంతో విజయం - అచ్చంగా తెలుగు
 లౌక్యంతో విజయం
-         బి.వి.సత్యనగేష్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కాం. సీట్ల నంబర్లు కష్టపడి వెతుక్కుని నెమ్మదిగా కూలబడ్డాము. సామాన్లు భద్రంగా సర్దుకున్నాం నేనూ, నా భార్య. మా సీట్లకు ఎదురుగా ఒకాయన అప్పటికి మూడొంతుల సిగరెట్ పూర్తిచేసి బోగీని సిగరెట్ వాసనతో నింపేశాడు. ఆయన 45 సంవత్సరాల వయసున్న, బాగా పల్లెటూరి మనిషిలా వున్నాడు. “మన ఫ్యామిలీయా?” అంటూ నా భార్య వంక చూస్తూ నన్నడిగాడు. మన ప్రాంతమా, మన ఊరా అని అడగటం విన్నాం కాని భార్యను చూపించి ‘మన ఫ్యామిలీయా’ అని అడగటం చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. సరే మాట్లాడటం తెలియని వ్యక్తిలా ఉన్నాడని సరిపెట్టుకున్నాం. నిజమే! కొంత మందికి ఎలా మాట్లాడాలో తెలియకపోవచ్చు. మేమూ ఊరుకున్నాం గాని అతగాడు మాత్రం మాతో సంభాషణ కొనసాగించాడు. మరొక ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించాడు – “మీది ఏ కులం?” (మనది ఏ కులం? అననందుకు సంతోషించాను). ఆ తరువాత పరిచయ కార్యక్రమం మొదలయ్యింది. ఈ కార్యక్రమం అసలు ముందుగా ప్రారంభం కావాలి. కాని సదరు వ్యక్తికి ఏ పధ్ధతి, లౌక్యం లేదు కనుక చాలా సమయం తరువాత తనను తానూ పరిచయం చేసుకున్నాడు. దీనిని inverted funnel type discussion అంటారు. ‘నా పేరు రాజ్య. ల్యాండ్ లార్డ్ ను’ అన్నాడు. “అమ్మాయ్! మంచి నీళ్ళు తెచ్చి ఉంటావు. కొంచెం నాకు కూడా ఇయ్యి” అన్నాడు. ఈ విధంగా అనేక ప్రశ్నలు, సమాధానాలు, వ్యాఖ్యానాలతో సదరు రాజ్య రైల్లో ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించాడు. ఈ విధంగా కొంత మంది లౌక్యం బాగా తెలిసినవారు యెంత జాగ్రత్తగా ఉంటారో ఇప్పుడు చూద్దాం. ఒకసారి హైదరాబాద్ బస్సు స్టేషన్ లో నేను, ఒక పెద్దమనిషి మాట్లాడుకుంటున్నాం. ‘కామారెడ్డి’ అనే ప్రదేశానికి వెళ్ళాలి. నాతొ బాటు వున్నా పెద్దమనిషి ఒక పెద్ద పబ్లిక్ ఫిగర్. అంటే ఆయనను చాలా మంది గుర్తుపడతారు. మేమిద్దరం మాట్లాడుకుంటూ వుండగా, మా పక్కనే వున్నా బస్సు లో నుంచి హడావిడిగా దిగి “నమస్కారం సార్” అంటూ నా పక్కనున్న పెద్దమనిషిని పలకరించాడు. ఆయన తిరిగి “నమస్కారం” అన్నారు. పెద్దమనిషి బస్సు మనిషితో కుశల ప్రశ్నలు వేసి, మన వాళ్ళంతా బాగున్నారా అని అడిగి, అందరినీ అడిగినట్లు చెప్పండి అన్నారు. బస్సు మనిషికి నన్ను పరిచయం చేసారు. బస్సు మనిషి పెద్దమనిషి మీద గౌరవంతో ఏదో సంభాషణ కొనసాగిస్తూనే వున్నాడు. “మీ బస్సు కు సమయం అవుతున్నట్లుంది. పైగా సామాను వదిలి రావటం అంత శ్రేయస్కరం కాదు, ఈ సారి తీరిగ్గా కలుద్దాం. ఇపుడు గుంటూరుకేనా వెళ్ళేది?” అని పెద్దమనిషి సంభాషణను బ్రేక్ చేసి సదరు బస్సు మనిషిని పంపించేసారు. “ఇప్పుడు మనల్ని పలకరించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా?” అని పెద్దమనిషి నన్ను అడిగారు. “మీరు చెప్పలేదు. ఆటను కూడా చెప్పలేదు. అతను మీతో మాట్లాడటంలో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసాడు. ఇంతకీ అతనెవరు?” అని నేనడిగాను. “నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి” అన్నారు పెద్దమనిషి. “బాగా తెలిసున్న వ్యక్తిలా మాట్లాడారు. గుంటూరా? అని అడిగారు, మన వాళ్ళందరినీ అడిగినట్లు చెప్పండి అన్నారు" అని అడిగాను. అపుడు ఆయన ఈ విధంగా చెప్పారు. “అదే లౌక్యం అంటే. అతను బస్లో నుంచి ఎంతో అభిమానంగా వచ్చి నమస్కరించి, బాగున్నారా అని ఆప్యాయంగా పలకరిస్తే మనం కూడా అతన్ని ఆప్యాయంగా పలకరించాలి. నువ్వెవరు? అని అడిగితె నోచ్చుకుంటాడు. మీరు వెళ్ళవలసిన బస్సు ఏది అంటే గుంటూరు వెళ్ళే బస్ చూపించాడు. అందుకే గుంటూరు వెళ్తున్నారా అని అడిగాను. కాకపొతే తెనాలి అంటాడు. ఇక మన వాళ్ళంతా బాగున్నారా అనే ప్రశ్న చాలా సాధారణమైన ప్రశ్న. అప్పటికీ మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు అతని వివరాలేమైనా తెలుస్తాయేమోనని ప్రయత్నించాను. అయినా ఆటను చెప్పలేదు. ఇక సంభాషణలో అతనెవరో నాకు తెలియదు అనే విషయం అతనికి తెలిసిపోతుందేమోనని బస్సు బయలుదేరే సమయం అవుతోందని పంపించేసాను. గుంటూరు ప్రోగ్రాంకు వెళ్ళినప్పుడు ఆటను నాకు చాలా మర్యాదలు చేసి ఉంటాడు. అతని ఇంటికి కూడా తీసుకెళ్ళి ఉంటాడు. వాళ్ళింట్లో భోజనం కూడా పెట్టి ఉంటాడు. కాబట్టి నువ్వెవరు అని నేనడిగితే ఖచ్చితంగా బాధపడతాడు. అని పెద్దమనిషి వివరించారు. ఇలాంటి పరిస్థితులు అప్పుడప్పుడు ఎవరికైనా ఎడురుపడుతూ ఉంటాయి. బస్సు మనిషి తనను తానూ పరిచయం చేసుకుని ఉంటె బాగుండేది. మనం ఎన్టిరామారావును గుర్తుపదతాం. కానీ ఆయన మనల్ని గుర్తుపట్టాడు. అందువల్ల మనల్ని మనం పరిచయం చేసుకోవడం మంచిది. తెలిసి కూడా అలా చెయ్యడానికి వెనుకాడుతున్నామంటే అహంకారంతో ఉన్నామనే చెప్పవచ్చు. అలాగే సలహాలిచ్చేటపుడు కూడా లౌక్యంతో వ్యవహరించాలి. కొంత మందికి సలహాలు తీసుకోవడం ఇష్టం ఉండదు. వీరు సలహాను విమర్శగా తీసుకుంటారు. పొగడ్తలకు పొంగిపోతారు. విమర్శలకు కృంగిపోతారు. వీరితో చాలా లౌక్యంగా వ్యవహరించాలి. లౌక్యం మోతాదు మించినా ప్రమాదమే. నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత ఉండనే ఉంది. కనుక లౌక్యం అనేది మానవ సంబంధాలలో చాలా ముఖ్యమైనది. వ్యాసకర్త: హైదరాబాద్ లోని మైండ్ ఫౌండేషన్ – సెంటర్ ఫర్ పర్సనల్ ఎక్సల్లెన్సు డైరెక్టర్ 

No comments:

Post a Comment

Pages