ఝాన్సీ, జూనియర్ లెక్చరర్ - అచ్చంగా తెలుగు
        ఝాన్సీ, జూనియర్ లెక్చరర్
-      దోమల శోభారాణి
      
కళాధర్ దగ్గరి నుండి ఇ-మేల్ వచ్చింది నాన్నా.. ” అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది ఝాన్సీ. ఆలోచనల పరంపరలలో సతమతమౌతున్న తన తల్లిదండ్రులను గమనించించింది. కన్నీటి పర్యంతమైన ఆమె తల్లి ముఖాన్ని చూడగానే  అప్రయత్నం గా తన కళ్లళ్లోనూ కన్నీళ్ళు నిండుకున్నాయి. చటుక్కున తల తిప్పుకొని చున్నీతో కళ్ళు ఒత్తుకుంది. గొంతు జీరబోయి ఏమీ మాట్లాడలేక పోయింది. ఝాన్సీ తండ్రి మనసు కలవరపడసాగింది. ‘సంఘంలో పరువేం కావాలి ?.. తమ ఒక్కగానొక్క గారాల పట్టి నిశ్చితార్థం కన్నుల పండువగా జరిగింది. ఈ కాలంలో అదొక రకంగా గాంధర్వ వివాహమే. తాంబూలాలు మార్చుకోవడం.. దండలు మార్చుకోవడం.. ఉంగరాలు మార్చుకోవడం... ఫోటోలు, వీడియోలు, వగైరా, వగైరా... అన్నీ జరిగాక పెళ్ళి పనులు వాయిదా!.. అంటున్నాడు కళాధర్. ఎందుకు?.. ఏమిటా కారణం?. వాయిదా నెపంతో మరో సంబంధమేమైనా చూసుకుంటున్నాడా..?’ పలు ప్రశ్నలు దయానందం బుర్రను తొలిచేస్తున్నాయి. అదే విషయాన్ని తన సతీమణి వసంతతో చర్చిస్తుంటే తన కూతురు ఝాన్సీ రావడం.. నోట మాట రాక తలెత్తి, కూతురి ముఖం వంక చూడలేకా మూగ పోయారు ఆదంపతులు. గొంతు సవరించుకుంది ఝాన్సీ. “అదేంటమ్మా అలా అయిపోయావు?.. నాన్నా..! ఇప్పుడేమైందని? పెళ్ళి ఆగిపోలేదు కదా..! వాయిదా వేయుమన్నాడు. అంత దానికే కుదేలైపోతే ఎలా! అదీ ఒకందుకు మన మంచికేనేమో!..” మనసులో బాధనంతా ఒడిసి పట్టుకొని తల్లి దండ్రులు అధైర్య పడగూడదని గంభీర వచనాలు పలుక సాగింది. “కళాధర్ నాకూ మేల్ పెట్టాడమ్మా.. అతని పేరెంట్స్ కు గూడా మేల్ పెట్టాడట. నేనింకా కళాధర్ తండ్రి గారితో మాట్లాడలేదు. పెళ్ళి ముహూర్తాలు పెట్టుకున్నాం.. పెళ్ళి వాయిదా అంటే ఎలారా..? కారణమేంటో రాయలేదు. ఇలా పొడి, పొడి మేల్స్ పెట్టి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాడు కళాధర్. అసలు విషయమేంటో కనుక్కుంటాను... ” అంటున్న దయానందం గొంతులో కాస్త కాఠిన్యత కనబడే సరికి ఝాన్సీ కంగారు పడింది. “మీరేం కనుక్కోవద్దు నాన్నా.. నేనే మళ్ళీ కళాధర్‍కు మేల్ పెడ్తాను. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వస్తోంది. మీరేం దిగులు పడకండి నాన్నా.. ఇప్పుడే ఈ విషయం ఎవరితో మాట్లాడకండి. నేను కళాధర్‍తో మాట్లాడి నిర్ణయ తీసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. నువు దిగాలు పడకమ్మా.. ” అంటూ ధైర్యం చెప్పింది. కళాధర్ డిగ్రీ కాలేజీ లెక్చరర్‍. నిశ్చితార్థం జరిగిన మరునాడే బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్ర మారు మూల ప్రాంతం లోని  జిల్లాలో మహిళా డిగ్రీ కళాశాలకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ చేరిన కొద్ది రోజులకే తాను హాస్టల్ వార్డెన్ ఇంచార్జి తీసుకున్నానని ఎంతో సంతోషంగా ఫోన్ చేసాడు. “ఝాన్సీ నా అదృష్ట దేవత.. ” అన్న కళాధర్ ఫోన్ లోని మాటల పులకరింతలు తనని యింకా పలుకరిస్తుండగానే.. పెళ్ళి వాయిదా అంటూ మేల్ పెట్టాడు. ‘తమది అణా, కాణీ సంబంధమేమీ కాదు.. తాను అనాకారీ కాదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్. కట్నం కూడా తులాభారమేనాయె!.. నాన్న  రిటైర్డ్ ప్రిన్సిపాల్. అమ్మ రిటైర్డ్ టీచర్. తాను ఏకైక సంతానం..’ ఆమె ఆలోచనలనకు అడ్డుపడుతూ తన సెల్ ఫోన్ మోగింది.. ఫోన్ ఎత్తి మాట్లాడుతున్న ఝాన్సీ దృష్టిలో ‘ఫ్లాష్.. ఫ్లాష్..’ అంటూ టీవీలో వస్తున్న వార్తలు  ఫోన్ లోని మాటలకు అద్దం పడ్తున్నాయి. ఝాన్సీ కొయ్యబారిపోయింది..
***
            కళాధర్ కాలేజీలో చేరగానే ఆ కాలేజీకి అనుబంధమైన అమ్మాయిల వసతి గృహానికి వార్డెన్‍గా అదనపు బాధ్యతలు అప్పగించాడు ప్రిన్సిపాల్. కళాధర్  హాస్టల్ పగ్గాలు చేబట్టగానే రంగుల పల్లకీలో ప్రయాణిస్తున్నట్లు అనుభూతికి లోనయ్యాడు. అంత చిన్న వయసులో హాస్టల్ బరువు బాధ్యతలు సీనియర్లను కాదని ప్రిన్సిపాల్ తనకు అప్పగించడం దశ, దిశల నుండి వచ్చే ప్రశంసల జల్లులతో ఉక్కిరి బిక్కిరయ్యాడు కళాధర్. కాని తనకన్నా సీనియర్ లెక్చరర్లు తమ స్వీయ అనుభవాల దొంతరలలో తిరస్కరిస్తే ప్రిన్సిపాల్ తనకు అంటగట్టిన విషయం పసి గట్టలేకపోయాడు. సాధారణంగా ప్రిన్సిపాల్ కళాశాల ఆరంభంలో స్టాఫ్ మీటింగ్ పెట్టి కళాశాలకు సంబంధించిన హోం పరీక్షలు, పబ్లిక్ పరీక్షలు, స్కాలర్షిప్, హాస్టల్, ఫర్నీచర్ మొదలగు విభాగాలకు ఒక్కొక్క లెక్చరర్‍ను ఆ అకడెమిక్ సంవత్సరానికి గాను ఇంచార్జీలగా నియమిస్తాడు. అయితే ఏ ఇంచార్జీ తీసుకోకుండా ‘తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ’ అనేరీతిలో తప్పించుకోవాలని ప్రయత్నించే లెక్చరర్ల సంఖ్యే అధికం. అందులో హాస్టల్ అంటే మరీ తలనొప్పి.. ఎవరూ ముందుకురారు. కొత్తగా కాలేజీలో జాయిన్ అయిన వారికి అంటగట్టాలనే ప్రిన్సిపాల్ పాచిక పారింది. కళాధర్ హాస్టల్ వార్డెన్ అనగానే ఎగిరి గంతేసి ‘సై’ అన్నాడు. హాస్టల్‍కు వచ్చే నిధుల కైపుతో అతనిలో అహం ఆవహించింది. వార్డెన్..! అదీ అందమైన అమ్మాయిల రాణుల నిలయానికి తనొక మహారాజు... రాజంటే రాజభోగాలు అనుభవించాల్సిందే.. లేదంటే రాజుకూ, పేదకూ తేడా ఏముంటుంది?.. పైగా ఏ వయసులో అనుభవించాల్సిన స్వర్గ సుఖాలు ఆ వయసులోనే అనుభవించి తీరాల్సిందే.. మళ్ళిన వయసుకు వెళ్లిన వైభవం వస్తుందా!.. ఈ రాచరికమూ శాశ్వతం కాదు. రాచరికం అంతరించాక రాజభోగాలుంటాయా!.. ఆలసించిన ఆశాభంగం.. మంచి తరుణం మించిన దొరకదు. అనే బీజం కళాధర్ మదిలో నాటుకొని అంకురించింది. దినదినాభివృద్ధి చెంది మ్రానై నిలిచింది. మ్రాను కాస్తా బీడు పడి మోడు కానివ్వ రాదని పరి, పరి విధాల పథకాలు వేయసాగాడు కళాధర్ . కళాధర్ లోని ఆ అదనపు పార్శ్వపు ఆలోచనా సరళి హొయలలో అమ్మాయిల వసతి గృహానికే ఎక్కువ సమయాన్ని కెటాయించే వాడు. అవసరమున్నా లేకున్నా.. తనిఖీలు, కౌన్సిలింగ్ నెపంతో.
***
            అవాళ కళాధర్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ. అంతా హడావుడీ. కళాశాల సూపరింటెండు సహాయకారిగా వచ్చాడు. సూపరింటెండెంట్ ఓ ప్రక్క వసతి గృహం తాలూకు రిజిస్టర్స్ వెరిఫికేషన్ చేస్తూ వంట వాళ్ళతో వివరాలు సేకరిస్తుంటే ఓ మూల కళాధర్  స్వయంగా విద్యార్థినిలతో ముచ్చట్ల లోకంలో విహరించ సాగాడు. కళాధర్ ప్రసన్న వదనంతో పలుకరిస్తుంటే తాము ఒక అధికారి ముందు గాక ఒక ఆత్మీయుని ముందున్నట్లు... తమ కష్ట సుఖాలలో పాలు పంచు కునే అపద్భాంధవుడన్నట్లు.. అమ్మాయిలలో కల్గుతున్న అనుభూతులతో వాతావరణమంతా ఆహ్లాదకరంగా మారింది. అందులోని ఒక అమ్మాయి ఆకర్షణలో కళాధర్‍కు కావాల్సిన జవాబు కనబడింది. అలాంటి అమ్మాయికోసమే ఇంత కాలం తాను తహ, తహ లాడేది. ‘పల్లె అందాలన్నీ ఇంతి ఒడలు ఒంపు సొంపుల్లో ఒలుకబోయాలి. మాయామర్మ మెరుగని మోములో సడిలిన శృంగారపు మలినం కాసింతైనా కానరావద్దు. స్వచ్చమైన మేలిమి బంగారపు మేను ఛాయలో వడలిన తగరపు అద్దకం ఉండొద్దు’ అనే అభిరుచుల కనువైన ఆమె సొగసును కాసేపు కనులార్పక జూసి కను సైగలతో పిలిచాడు కళాధర్. “పేరు?” “భారతి సార్” కళాధర్ కళ్ళళ్ళో కనబడీ కనబడని కవ్వించే చిలిపితనం తొణికిసలాడింది. అతనికి వినిపించి.. మురిపించింది భారతి లోని ‘రతి’ అనే పదం. “ఏం చదువుతున్నావ్” “బి.ఏ. ఫైనలియర్ సార్” “ఓ.కే. నేను చిన్న పని అప్పగిస్తాను. డూ యూ ఫీల్ ఎనీ థింగ్... ?” “నో సార్. విత్ ప్లెజర్.. చెప్పండి. ” అంది భారతి. “గుడ్.. గార్ల్. ఏంలేదు... మీ హాస్టల్‍కు సబంధించినదే. హాస్టల్లో మీ సమస్యలు.. కావాల్సిన సదుపాయాల గూర్చి అందరి అభిప్రాయాలు సేకరణతో ఒక నివేదిక రాసి నాకు అందజేయాలి. ఇది చాలా కాన్ఫిడెన్షియల్. నీది తెలుగు లిటరేచర్ కదా. అందుకే నీకీ పని అప్పగిస్తున్నాను. ఈ ఆదివారమే సబ్మిట్‍చేయాలి. దానిని పై అధికారులకు పంపించి మనకు వచ్చే నిధులను పెంచుమని అడుగుతాను. మీరు మరిన్ని సౌకర్యాలు పొందవచ్చు” అంటూ తన పర్సనల్ సెల్ నంబరిచ్చాడు. “అలాగే సార్” కళాధర్ వెళ్ళిపోగానే హాస్టల్లో భారతిని అంతా చుట్టుముట్టారు. ఆమె అదృష్టాన్ని తెగపొగిడారు. కొందరు ఈర్ష్య పడ్డారు. ‘అభినందనలకు పొంగిపోరాదని’ ఆమె ఆరాధించే విద్యలో మొదటి సూత్రం.. ఏమాత్రమూ గర్వపడలేదు.
***
            ఆవాళ ఆదివారం.. స్వదస్తూరితో తమ వసతి గృహంపై నివేదికను తయారు చేసింది భారతి. ఒకటికి పదిసార్లు చదువుకొని తృప్తి పడింది. సమయం ఉదయం పది కావస్తోంది. కళాధర్ తనకిచ్చిన సెల్ నంబర్‍కు ఫోన్‍జేసింది. “సార్.. నేను భారతిని. వసతి గృహంపై నివేదిక ఇమ్మన్నారుకదా.. తయారు చేశాను. తీసుకు రమ్మంటారా.. ” “నో.. నో.. ఇప్పుడే వద్దు. నేను అర్జంటుగా ఒక టెలీ కాన్ఫరెన్స్ కోసం కలెక్టర్ ఆఫీసుకు వెళ్తున్నాను” “సరే సార్.. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు?” “ఎప్పుడో ఎందుకు..  సాయంత్రానికల్లా తిర్గి వచ్చేస్తాను. ఈవినింగ్ సెవనో క్లాక్ మా ఇంటికి వచ్చేసేయ్. ఓ.కే..” “ఓ.కే. సార్..”
***
            వసతి గృహానికి అతి దగ్గరలోనే కళాధర్ నివాసం. భారతి సరిగ్గా సాయంత్రం ఏడు గంటలకల్లా ‘పి.ఆర్. కళాధర్’ అన్న బోర్డు చదువుతూ కాలింగ్ బెల్ నొక్కింది ‘పి.ఆర్.’ అంటే పులిరాజు కాబోలు అని మనసులో నవ్వుకుంటూ.. భారతిని కూర్చోమని చెప్పి  పని మనిషి వెళ్ళిపోయింది. అది విశాలమైన హాలు. అత్యంత ఆధునికంగా సోఫా, ఫర్నీచర్, టీ పాయ్ నీట్‍గా అమర్చబడి వున్నాయి. కంప్యూటర్ టేబుల్.. పైన ల్యాప్‌టాప్ పక్కనే రెండు స్పీకర్లు. సీ.డి. స్టాండ్.. వైఫై.. సరే సరి. గోడకు చక్కటి ల్యాండ్ స్కేప్ చిత్రాలు. హాల్లో నుండి కాస్తా తొంగి చూస్తే తలుపు తెరచి వున్న బెడ్ రూం లోని రెండు దిగంబర ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూడగానే ఒక్క సారిగా ఉలిక్కి పడింది భారతి. ఐదు నిముషాలైంది... గుండె వేగంగా కొట్టుకో సాగింది... ఏ.సీ. శబ్దమైనా భయంకరంగా వినిపిస్తోంది... కళాధర్  ఫ్రెషపై నైట్ డ్రెస్సులో అటాచ్డ్ బాత్‍రూంలో నుండి హాల్లోకి అడుగు పెట్టాడు. “నమస్కారం సార్” అంటూ సవినయంగా లేచి నిలబడింది భారతి. “గుడీవినింగ్ ” తల ఓరగా కదిలిస్తూ కనుసైగలతోనే ప్రతి అభివాదం చేశాడు కళాధర్ . “సార్.. నివేదిక ” “గుడ్... ” అనే పదాన్ని సాగదీసి పలుకుతూ సోఫాలో కూర్చున్నాడు. భారతిని గూడా కూర్చో మంటూ తన ఎడం చేత్తో సంజ్ఞ చేస్తూ “ఇచ్చిన సమయంలోనే పూర్తి చేశావు. అయాం వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ... ” అన్నాడు కుడిచేతిలోఉన్న టవల్‍తో తల తుడ్చుకుంటూ.. భారతి కూర్చుందామని అనుకున్నదల్లా నివేదిక ఇచ్చి కూర్చుందామని అడుగు ముందుకేసింది. “చూడు భారతీ..! ఇక్కడి విషయాలన్నీ చాలా కాన్ఫిడెన్షియల్.. అని నీకు ముందే చెప్పాను. సహకరించాలి..” చివరి పదాన్ని శృంగారలోకంలో విహరిద్దాం!.. అనే రీతిలో పలుకుతూ టవల్‍ను కుర్చీపై ఆరవేసి నివేదికను అందుకొన్నాడు. తన మాటల ధోరణి అర్థమయ్యేలా భారతి చేతి వేళ్ళను సుతారముగా నిమిరుతూ.. ఆ అభినయాన్ని అర్థం చేసుకోలేని వయసుకాదామెది. కాని ఒక బాధ్యతాయుత హోదాలో అలాంటి అభినయం అభినందనీయం కానిది..  ఊహించనిది.. రాజు పాత్ర వేషధారణలో భిక్షువులా అభినయం చేసినట్లు. అంతేలే..! కామానికున్న మహత్తే అంత. కళాధర్ తహ, తహ చూస్తుంటే తన కాళ్ళు పట్టుకుని బతిమాలే ధోరణిలో కనిపించాడు భారతికి. భారతి బిడియ పడుతూ కుడి కాలి బొటన వేలుతో కార్పెట్‍పై అడ్డంగా గీతలు పెడుతోంది. కొద్దిగా తల ఎత్తి ఓరకంటగా నిల్చున్న తీరు ఆమె శీల రక్షణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనుభూతికి లోనయ్యాడు కళాధర్. అతడి మనోకాంక్షను అర్థం చేసుకున్న పడక గది.. ఆహ్వానం పలుకుతోంది. ప్రతిమలు రా!.. రమ్మంటూ! నృత్య భంగిమలో సైగలు చేస్తున్నాయి. కళాధర్ హడావుడి జూసి తల అడ్డంగా ఊపింది భారతి తన వాలు గన్నుల సోయగాలతో... “నేనసలే కొత్త... కంగారెక్కువ. పైగా ప్రభుత్వ వసతి గృహ వార్డెన్ హోదాలో ఉన్నాననే భయం. నా గౌరవ మర్యాదలన్నీ నీచేతుల్లో పెడ్తున్నాను భారతీ..! నీటముంచినా పాలముంచినా నీదే భారం... ” అంటూ రెండు చేతులూ జోడించాడు కళాధర్. “నాపెళ్ళి నిశ్చయమైంది. నిశ్చితార్థం నుండి నాలో అలజడి మొదలైంది. థియరీతో విజ్ఞానం పెరిగినా ప్రాక్టికల్ అనుభవం అవసరం కదా.. దాంతో కామశాస్త్ర శాస్త్రీయతను నాకు కాబోయే అర్థాంగికి చవిచూపాలని ఉంది. ప్రాక్టికల్‍గా మొదటి రాత్రిలోనే నా ప్రావీణ్యతను ప్రదర్శించి గొప్ప మగాడి ననిపించు కోవాలి. నాకు అమాయకంగా కనబడే అమ్మాయిలంటే మహా క్రేజీ. వారి అమాయకత్వం నన్నెంతగానో అబ్బుర పరుస్తూంది. పల్లెవాసులు మేలిమి బంగారపు భరిణలు. ఉదాహరణకు నిన్నే తీసుకోరాదూ...! నీ అంత అందకత్తెను నేను ఏనాడూ చూసి ఎరగను. నీతో నా ప్రథమ అనుభవం  నాజీవితంలో మరుపురాని మైలు రాయి గావాలి. నీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను.. నీకూ ఎలాంటి ప్రమాద జరుగ కూడదు అందుకే ఈ ప్రిపరేషన్.. ” అంటూ ఒక చిన్న పాకెట్ తీసి చూపించాడు. దాని మీది గుర్తు చూసి అది ఏమిటో భారతికి అర్థమైంది. గుండె ఝల్లుమంది. ఈ అపాయం నుండి తప్పించుకోవాలన్నే ఉపాయంలో పెదవి దాటని నవ్వును తన పెదవులపై పులుముకుంది భారతి. కళాధర్  ఉప్పొంగి పోయాడు. ఇంత తేలికగా కార్యసాధన అవుతుందని అనుకోలేదు. తనంత అదృష్టవంతుడు మరొకడుండనుకొన్నాడు మదిలో... భారతి దగ్గరికి రాబోతుంటే.. “సార్.. మీరు పొరబడుతున్నారు. నేను అలాంటి దానిని కాను. మీరు గురువులు.. నాకు తండ్రి లాంటి వారు” అంటూ దూరం జరిగింది.  భయం భయంగా.. “భారతీ.. భయ పడుతున్నావా?.. ఇక్కడ నువ్వూ నేను తప్ప మరెవ్వరున్నారు చెప్పు. భయమెందుకు..?. ” అంటూ కన్ను గీటాడు. గుమ్మానికి అడ్డుగా నిలబడ్డాదు. భారతి ముఖం కోపంతో ఎరుపెక్కింది. “మీ ప్రాక్టికల్ పరీక్షలు నా దగ్గర కాదు సార్.. ఏ వేశ్యావాటికకో వెళ్లి పరీక్షించుకొండి. కాని నాలాంటి కన్నె పిల్లల జీవితాలతో ఆటలాడుకోవద్దు ప్లీజ్..” దీనంగా ప్రాధేయ పడింది. ఏ భార్య  అయినా తన భర్తను ప్రాణపదంగా చూసుకోవాలంటే కామప్రదర్శన ప్రథానం కాదు. అదొక భాగం మాత్రమే. భర్త భోగలాలసత్వాన్ని అసహ్యించు కుంటుందే తప్ప గొప్ప మగాడని అభిలషించదు. భార్య తన భర్త నుండి కోరుకునేది తన వ్యక్తిత్వం గుర్తించడం.. గౌరవం కాపాడటం. ఇది అతడికి తెలియంది కాదు.. “దయచేసి నన్ను విడిచి పెట్టండి.. ” అంటూ అసహాయరాలిగా బతిమాల సాగింది. భారతి బతిమాలిన కొద్దీ రెచ్చి పోయాడు కళాధర్. ఇంతటి చక్కని అవకాశాన్ని చేజేతులా వదులుకోవద్దని మనసు ఉసిగొలుపుతోంది. ‘మగవాని కండ బలం ముందు మగువ తెగువ పనికి రాకపోయినా.. బుద్ధిబలంలో  ఏమాత్రమూ తక్కువ కాదు. కామాంధులను ఎదురించి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం కంటే సమయస్ఫూర్తితో మురిపించి గట్టెక్కడం మేలు. అలనాటి ప్రముఖ జానపద కథ ‘బాలనాగమ్మ’లో బాలనాగమ్మ మైమరపించి మాయలఫకీరు ప్రాణ రహస్యం తెలుసుకొని వాణ్ణి అంతమొందించింది. మన పవిత్ర మహాభారత పురాణంలో సైరంద్రి ( ద్రౌపతి) తన హొయలొలికించి కీచకుణ్ణి తుద ముట్టించింది. స్త్రీమూర్తికి మహత్తరమైన శక్తి ఉంది. మహిషాసురుడు, నరకాసురుడు సంహరించబడింది స్త్రీ చేతిలోనే కదా..’ అనే అలోచనా సరళిని తానకు జూనియర్ కాలేజీలోనే అవగతమయింది. భారతి ప్రిపేరయ్యి వచ్చిన విషయం కళాధర్ పసిగట్టే స్థితిలో లేడు. ఎంత వారైనా కాంత దాసులే!.. ‘ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు?’ పిచ్చెక్కిపోయాడు కళాధర్. ‘అతడొక మేక వన్నె పులి. ఇలాగే ప్రథమ అనుభవమంటూ చిలుక పలుకులు పలుకుతూ తన ప్రాణ స్నేహితురాలైన జీవిత జీవితానితో ఆటలాడుకుందామని  ప్రయత్నించిన నయవంచకుడు. తెలివిగా జీవిత తప్పించుకుంది’ అని భారతికి తెలుసు. పాపం ఆమె తనతో చెప్పుకొన్నప్పుడు ఎంతగా విల విల లాడిందో..! ‘కామ తృష్ణలో కొట్టుకుపోయే కళాధర్ కనుల పొరలు తొలగి పోవాలి.. తగిన శాస్తి చేయాలి. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం  కళాధర్‍ను ఒక పక్క రెచ్చ గొడ్తూ మరో పక్క దీనంగా వేడుకుంటునట్లు నటించ సాగింది భారతి. తెలివిగా కళాధర్ బాహు బంధాల నుండి తప్పించుకొని మేన్ డోర్ తెరిచింది. నిశ్శబ్దంగా ఈ సమయం కోసమే ఎదురి చూస్తున్న హాస్టల్ విద్యార్థినిలంతా బిల బిల మంటూ హాల్లోకి ప్రవేశించారు. కళాధర్‍ను చుట్టుముట్టారు. ఈ హఠాత్పరిణామానికి మ్రాన్పడి పోయాడు కళాధర్. ‘వార్డెన్ డౌన్..! డౌన్..!!” అంటూ కోరస్ గీతాలతో కళాధర్‍ను చుట్టూ మూగారు. భారతి తృప్తిగా తన సహజమైన చిరునవ్వు నవ్వ సాగింది. ఆ క్షణం నుండే కళాధర్‍ను శిక్షించాలాలనే కార్యాచరణ ఆరంభమయింది. జిల్లా సమస్తం అట్టుడికి పోయింది. ఆ మరునాడు ప్రైమరీ తరగతుల నుండి డిగ్రీ కళాశాల వరకు విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. బహిరంగ ప్రదర్శన.. స్లొగన్స్ తో వీధులన్నీ మారుమ్రోగి పోయాయి. విద్యార్థులంతా కలెక్టర్‍కు కళాధర్ వార్డెన్ లైంగిక వేదింపులను సమగ్రంగా వివరించారు. భారతి పథకం ప్రకారం నిరూపణకు కావలసిన దృశ్యాలను రికార్డు చేసిన అధునాతన ‘పెన్-కెమెరా’ అందజేసింది.
            ***
            ఆ ఫ్లాష్ న్యూస్ టీ.వి. ఠీవీగా కోడై కూస్తోంది. ఝాన్సీ తల్లిదండ్రులు నెవ్వెర పోయారు.. ఝాన్సీ ఊహించినట్లుగానే కళాధర్ నుండి ఫోన్ వచ్చింది. ఝాన్సీ ఫోనెత్తి ముందుగా తానే మాట్లాడసాగింది.. ఏమీ ఎరగనట్టు. “హల్లో!..కళాధర్.. ఫోన్ ఎత్తడం లేదేంటి..? అంత బ్యుజీనా..? మన పెళ్ళి ఎందుకు వాయిదా వేస్తున్నావ్.. అమెరికాయాన మేమైనా ఆఫరొచ్చిందా..” అంటూ ఝాన్సీ వ్యంగ్యంగా అడుగ సాగింది. ఝాన్సీ వెటకారపు మాటలతో విషయం తెలిసిందన్నట్లు కళాధర్‍కు అర్థమైపోయింది . “చూడు ఝాన్సీ.. టీ.వి.లో వచ్చే వార్తలు నిరాధారం. హాస్టల్ నిధులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం మళ్ళించడం లేదనే కక్షతో కొందరు రాజకీయ నాయకులు  ఆడిస్తున్న నాటకం ఇది.. వాస్తవం కాదు. నిరూపించుకోవటానికి నాకు కాస్తా సమయం కావాలి . అందుకే పెళ్లి వాయిదా అంటున్నాను..”  మధ్యలోనే రేవతి ఉచ్చస్వరంతో అడ్డుకుంది. “చూడు మిస్టర్ కళాధర్.. కాకమ్మ కథలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూడకు. నిశ్చితార్థం రోజే నీ అనుచిత ప్రవర్తన నాకు అనుమానం కలిగించింది. నీ నిజ స్వరూపం ఏమిటో తెలిసుకుందామనుకున్నాను. పెళ్ళికి ముందు అమ్మాయిల క్యారెక్టర్ మీరు ఎలా ఎంక్వైరీ చేస్తారో.. అమ్మాయిలం మాకూ అబ్బాయిల క్యారక్టర్ తెలుసుకోవాలని ఉండదా?.. శీలవతి కావాలని మీకూ ఉన్నట్లే.. శీలవంతుడు కావాలని మాకూ ఉంటుంది. నువ్వు జీవితపై అత్యాచార యత్నం చేయబోతుంటే ఎలా తప్పించుకుందో నీకు తెలుసు కదా..! నువ్వు ఎవరితోనూ చెప్పుకోలేకుండా చేసింది. ఆ విషయాన్ని వివరిస్తూ నాకు జీవిత ఫోన్ చేస్తే అభినందించాను. తరువాత నువ్వు బుద్ధి మార్చుకునేది పోయి మళ్ళీ భారతిపై కన్నేసావు. అయితే తొందర పడవద్దని సాక్ష్యాలతో సహా నిన్ను పట్టించాలని నేనే భారతికి ‘పెన్-కెమెరా’ పంపించాను.. ప్రాణాళిక రూపు దిద్దాను. భారతి, జీవిత వారంతా ఎవరనుకున్నావ్..!.  ఇంటర్మీడియట్‍లో నా స్టూడెంట్స్. నేనిదివరకు అక్కడి అమ్మాయిల జూనియర్ కాలేజీలో పని చేసినప్పుడు  పాఠాలతో బాటుగా పిల్లలందరికీ సంఘంలో స్త్రీ సాహసోపేతంగా ఎలా మనుగడ సాగించాలో చెప్పేదాణ్ణి.  ఒంటరిగా ఉన్న అమ్మాయిలపై నీ లాంటి గోముఖ వ్యాఘ్రాలు అత్యాచారానికి ఒడిగడ్తే ఎలా తెలివిగా తప్పించుకోవాలో వివిధ రకాల మెళకువలు వివరించే దాణ్ణి. వీటికై ప్రత్యేకంకంగా అదనపు  క్లాసులు కూడా తీసుకునే దాణ్ణి. నా స్వంత ఖర్చులతో వాళ్ళకి కరాటే కూడా నేర్పించాను. హాస్టల్ పిల్లలంతా నాకు బాగా తెలుసు. టీ.వి వార్తల కంటే ముందుగానే భారతి నాకు ఫోన్ చేసి వివరంగా అన్ని విషయాలూ చెప్పింది. నీ లాంటి ఊసరవెల్లి నాకు అఖ్ఖరలేదు. పెళ్ళి వాయిదా కాదు.. కేన్సిల్.. ” అంటూ ఠక్కున ఫోన్ కట్ చేసింది ఝాన్సీ.
   

No comments:

Post a Comment

Pages