దూరపుకొ౦డలు - అచ్చంగా తెలుగు
దూరపుకొ౦డలు
-కొల్లూరు విజయా శర్మ
  
 హైదరాబాద్  అంతర్జాతీయ విమానాశ్రయం . సమయం తెల్లవారి మూడున్నర అవుతోంది . చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసుకుని ప్రయాణీకుల లాంజ్ లో కూర్చుని ఉన్నారు శ్రీకర్ కుటుంబం . పిల్లలు యామిని ,ఆకాశ్ లు నిద్రలేక వాడిన ముఖాలతో స్తబ్దంగా ఉన్నారు . శ్రీకర్ కళ్ళు భార్య రవళినే గమనిస్తున్నాయి . ఆమె సీటుకి వెనక్కి చేరబడి కళ్ళు మూసుకుని ఉంది . కళ్ళు అవిశ్రాంతంగా వర్షిస్తూనే ఉన్నాయి . రుమాలుతో ఎంత తుడుచుకుంటున్నా గుండెలో వేదన కన్నీళ్ళ రూపంలో ప్రవహిస్తూనే ఉంది . ఆమె మానసిక స్టితిని అర్ధం చేసుకున్న శ్రీకర్ నిట్టూర్చాడు . ఒక్క ఏడాదిలో ఎంత తేడా ... ఎన్ని కలలతో ఎంత  ప్రేమాభిమానాలతో వచ్చారో యేడాది క్రితం మాతృభూమికి . చక్కని ఉద్యోగం ,స్వంత ఇల్లూ అన్నీ వదులుకుని తన వాళ్ళు కావాలి ,తమ మనుషుల మధ్య ఉండాలి ,తమ పిల్లలు అందరి ప్రేమాభిమానాల మధ్యా పెరగాలిఅని కోటి  కలలతో  అన్నీ వదులుకుని ఇండియాకి వచ్చాకా తమకి ఎదురైన అనుభవాలు అతని కళ్ళ  ముందు కదలాడాయి . సరిగ్గా యేడాది క్రితం హైదరాబాద్  విమానాశ్రయంలో దిగారు శ్రీకర్,రవళీ పిల్లలూ . స్వాగతం చెప్పడానికి వచ్చిన బందు బలగం తో విమానాశ్రయం కలకల  లాడిపోయిమ్ది . శ్రీకర్ తల్లిదండ్రులు ,అక్కబావగారూ ,వాళ్ళ ఇద్దరు పిల్లలూ ,రవళి అమ్మానాన్నలూ ,అన్నయ్యా వదిన,వాళ్ళ ఇద్దరు పిల్లలు ,ఇంకా ఇద్దరి కజిన్స్ ,... క్లోజ్ ఫ్రెండ్స్ . అంతమంది తమ వాళ్ళని చూడగానే శ్రీకర్ రవళీల ముఖాలు వెలిగిపోయాయి . అందరూ ఆప్యాయంగా చుట్టుముట్టారు ,పిల్లల్ని ముద్దుల వర్షంలో ముంచెత్తారు . సామాన్లతో వస్తున్న వాహనం కాకుండా అయిదు క్వాలిస్ లలో  మనుషులు ఇంటికి చేరారు . అప్పటికే బావమరిది జూబ్లీ హిల్స్ లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఒకటి అద్దెకి తీసుకుని ఉంచాడు . అసలు కొనేసి ఉంచుతామనే అన్నాడు . కానీ రవళి వచ్చి నాలుగు రోజులు సర్డుకున్నాకా అలాంటివి ఆలోచించచ్చు అని అన్నయ్యని వారించింది . అద్దె 30 వేలు ,ఫర్నిషిషుడు హౌస్  "అంతా, కాస్త అద్దె తక్కువున్న కూకట్పల్లి ఏరియా లో చూడాల్సింది... " అంటూ రవళి ఏదో అనబోతే "అమెరికా నుండీ వస్తూ నువ్వూ ఇలా మాట్లాడతావెంటి ? "అన్నాడు . సహజంగానే సాత్త్వికురాలైన రవళి ఏమీ మాట్లాడలేకపోయింది . బావమరిది చూస్తుండటంతో శ్రీకర్ కూడా జోక్యం చేసుకోలేదు . అతనూ స్వతహాగా మొహమాటస్తుడే. రవళి అన్నయ్య పద్ధతికి విసుక్కుంటుంటే ,శ్రీకర్ “ పోన్లేద్దూ ,  మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మా అమ్మానాన్నా పల్లెటూళ్ళో ఉంటున్నారు .ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాకా వాళ్ళూ మన దగ్గిరే ఉంటారు . మా చెల్లెలూ ,మీ అన్నయ్యా కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు .శని ఆదివారాల్లో రాకపోకలు ఉంటాయి ,ఆ  మాత్రం ఇల్లు కావాలి "అంటూ సముదాయించాడు. అందరి సుమోలూ సరాసరి శ్రీకర్ అద్దెకి తీసుకున్న ఫ్లాట్ కే నేరుగా వెళ్ళాయి . ఊళ్ళోనే ఉంటున్నా అతని చెల్లెలు కానీ,ఆమె అన్నయ్య కానీ "అయ్యో !ఇప్పుడే కదా రావడం ,మా ఇంటికి రండి "అన్నమాట ఎవరినోటా రాలేదు . పాపం రవళి తల్లికి మనసులో ఉన్నా కోడలు అననివ్వలేదు . "వాళ్ళ కొత్త ఇల్లు వాళ్ళకి చూపిద్దాం అత్తయ్యా !"అంటూ తియ్యగా లాక్కొచ్చింది . ఆ తల్లి కోడలి గురించి తెలిసీ ఏమీ అనలేకపోయింది . విశాలంగా ,అధునాతనంగా ఉంది ఫ్లాట్ .. నిద్రలేక తిక్క తిక్కగా ఉంది రవళికి ,పిల్లలకీ ,ముఖ్యంగా అది వాళ్ళ రాత్రి భోజనం వేళ కావడంతో ఆకలి కరకర లాడుతోంది . కాస్త తినడానికీ ఏదైనా ఉంటే బావుండుననిపించింది   ,పిల్లలకి కనీసం పాలు కలిపి ఇద్దామన్నా లేవు . ఇన్నేళ్ళుగా సంసారాలు నడుపుతూ ,పిల్లల తల్లులై ఉండి కూడా ఆ మాత్రం వాళ్లకి తట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది రవళికి .  ఎయిర్పోర్టుకి రావడం వల్ల నిద్ర చెడిన ఆడపడుచు పిల్లలు ఆకలి నిద్రా తోడవడంతో ఏడుపు అందుకున్నారు . పాపం అదే వయసు వాళ్లైనా ఆకాశ్ ఊరుకున్నాడు, కానీ యామిని తల్లి వెనకగా చేరి "అమ్మా ! ఆకలి వేస్తోంది"అంటూ మెల్లమెల్లగా అడుగుతోంది . ఆ ఇల్లు చూస్తే అందరికీ కొత్తేనాయె . "మా ఇంట్లో అయితే పాలు కలిపే దాన్ని ,అబ్బా ! రాత్రంతా నిద్రలేక తలనొప్పిగా ఉంది ,కాస్త కాఫీ పడితే బావుండేది"అంటూ కణతలు నొక్కుకుంది ఆడపడుచు . వదిన గారు మాత్రం అన్న దగ్గిరికి వెళ్లి "తెల్లవారింది కదా ! పాల పేకెట్లు రెండో మూడో తీసుకు రండి . ఏదైనా కిరాణా షాప్ తీస్తే బ్రూ ఇన్స్టెంట్  కూడా "అని చెప్పింది . బయలుదేరుతున్న బావమదిదితో శ్రీకర్ కూడా వెళ్ళాడు ... పాల పేకెట్లు,... ఏదో చిన్న స్టోర్ తీస్తుంటే కొన్ని బిస్కట్ పాకెట్లు ,చిన్న బ్రూ పేక్ తీసుకుని వచ్చారు . అప్పటికి కాఫీలూ పాలూ అందాయి . కాఫీలు కాగానే "యేం తెచ్చుకున్నారెంటి సూట్కేసుల్లో "అంటూ వచ్చింది ఆడపడుచు . అనడానికి తెచ్చుకున్నారు అని అడిగినా తెచ్చారు అన్నదే అక్కడి ఉద్దేశం . ఎలాగూ స్నానం చేశాకా కట్టుకోవాల్సిన బట్టలు తీసుకోవాలి  ,పనిలో పనిగా వేరే సూట్ కేస్ కూడా తెరిచింది రవళి . ఆడబిడ్డకీ ,వదినకి  మంచి పరఫ్యుమ్స్ ,చక్కని వాచీలు ,ఖరీదైన హేండ్బేగ్ లూ తెచ్చింది ... ఆడపిల్లలకి జేడ్స్,పడగాలూ ఇచ్చింది అబ్బాయిలకి గేమ్స్ తెచ్చింది. అన్నీ చేతిలో పెట్టినా ఆడపడుచు ముఖం అంత వికసించినట్లే లేదు . వదిన మాత్రం "చాలా బావున్నాయి" అంది . నిజానికి ప్రతిసారి వచ్చేటప్పుడు ఇంకా మంచి కానుకలే తెచ్చేవారు ...ఈసారి కొత్త ఎస్టాబ్లిష్ మెంట్ కి అయ్యే ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాత్రంతో సరిపుచ్చింది రవళి.  పిల్లలకి తెచ్చిన చాకలేట్ బాక్సులు తీసుకుని అన్నగారి కుటుంబం ,ఆడపడుచుకుటుంబం బయలుదేరారు స్కూళ్ళూ ఆఫీసులూ ఉన్నాయి అంటూ . అసలే జెట్లాగ్ తిక్కలో ఉన్న రవళికి ఎందుకో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి . చుట్టపుచూపుగా వచ్చినప్పుడు ఎంత బావుండేది . నీ సంగతి నువ్వే చూసుకో అన్నట్లు వదిలివెళ్లిపోయారు అంతా .ఆ రోజంతా టిఫిన్,భోజనాలూ హోటల్ నుండీ తీసుకొచ్చాడు శ్రీకర్  . తల్లి  తనని రిలాక్స్ అవమని కుదిరినంతలో వంటిల్లు అంతా కుదురుగా సర్ది వాచ్మెన్ కి లిస్ట్ ఇచ్చి వెచ్చాలన్నీ కొద్ది కొద్దిగా డబ్బాలలో ,సీసాలలో కనిపించేలా నింపి పెట్టింది . వాచ్మెన్ భార్యతో మాట్లాడి పనిమనిషిని కుదిర్చింది . రవళి కొంచెం అలవాటు పడి చేసుకోవడం మొదలు పెట్టగానే తల్లితండ్రి వెళ్ళిపోయారు . పిల్లలకి అన్నగారు లక్షలు ఫీజు కట్టించి ఇంటర్నేషనల్ స్కూల్ లో జాయిన్ చేయించాడు. వాళ్ల ఫీజు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు చూసి భార్యాభర్తలకి కళ్ళు తిరిగాయి . నెమ్మదిగా భారత దేశవాసం మొదలైంది . రవళి పెళ్ళికావడంతోటే అమెరికా వెళ్ళిపోయింది . అక్కడ ఎంత బాగా బ్రతుకుతున్నా అయిన వాళ్లందరికీ దూరమైన భావన ఏదో బాధ పెట్టేది . మధ్య మధ్య రెండేళ్ళకి ఒకసారి వచ్చినప్పుడు తమ వాళ్లందరూ చూపించే ఆప్యాయతా ,జరిగే రాజ భోగాలూ ... అన్నిటినీ మించి శ్రీకర్ కి తల్లితండ్రులు పెద్దవాళ్ళు అయిపోతుంటే తను వాళ్లతో వచ్చి ఉండి చేదోడు వాదోడు కావాలన్న కోరిక వేళ్ళూనింది . ముందుగా రవళి ఉద్దేశం అడిగాడు . ఆమె సంతోషంగా సరే అంది . ఇద్దరూ ఆ నిర్ణయం తీసుకున్నాకా పిల్లలతో చెప్పారు . వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేశారు . ఎన్నెన్నో కలలుకన్నారు అయిన వాళ్ళతో రాకపోకలూ ,కలిసిచేసుకునే పండుగలు ,ఆత్మీయానురాగాలు ,కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నీడగా అందరం అనుకుంటూ ... కానీ వచ్చాకా తెలిసిన విషయం రాకలే కానీ తమకి పోకలు ఉండవు . అన్నగారే కాకుండా అమ్మానాన్నా కూడా వూళ్ళోనే ఉండడంతో ఆడపడుచుకి పెద్ద పండుగ అయింది . శుక్రవారం రాత్రి వచ్చి ఆదివారమే వాళ్లు వెళ్ళేది . పోనీ సాయం ఏమైనా చేస్తుందా అంటే లేదు ... తల్లీ కూతుళ్ళు హాయిగా కబుర్లు చెప్పుకుంటారు . అదనంగా రవళికి ఆడపడుచు పిల్లల బాధ్యత కూడా పెరిగింది . పిల్లలు ఆకలి అన్నా ,పాలు కావాలన్నా ,"నేనూ అమ్మమ్మా మాటాడుకుంటున్నాం కదా !అత్తని అడగండి నాన్నా "అని రవళి దగ్గిరికే పంపించేసేది . చెప్పాలంటే ఆకాష్, మేఘన చాలా బుద్ధి మంతులు ... కానీ వాళ్ళు అలా కాదు . ఇల్లు పీకి పందిరి వేస్తారు . పిల్లల బొమ్మలన్నీ తీసి చెల్లాచెదురు చేసి ఇల్లంతా పరిచేస్తారు ,సోమవారం ఇల్లు సర్దుకునేసరికి రవళికి తలప్రాణం తోకకి వచ్చేది . అత్తగారూ మామగారు ఉండడంతో బంధువుల తాకిడీ ఎక్కువే . ఆప్యాయంగా చూడడానికి వచ్చేవారికి ఇంత అన్నం,కాఫీ ఫలహారాలకి రవళి ఎప్పుడూ ఏమీ అనుకోలేదు . కానీ వచ్చి వెళ్ళేవారికి పెట్టుపోతలకి ఘనంగా వదిలేవి . తన అన్నయ్యా వూళ్ళోనే ఉన్నా రమ్మన్న పిలుపే తక్కువ . వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు, ఆదివారం వస్తే వాళ్ళే పిల్లలతో బయటికి వెళ్ళిపోతారు .ఆ ఒక్క ఆదివారం పూటా వెళ్ళడానికి రవళి కే మనస్కరించేది కాదు . పాపం వారం అంతా పరుగులే పరుగులు . ఆ ఒక్క రోజు అయినా వాళ్ళ కుటుంబానికి కావాలి కదా అనుకునేది .  ఎప్పుడైనా ఒకసారి వెళ్దాం అనుకున్నా ..ఇంట్లో ఆడపడుచు ,పిల్లలూ ... ఒకసారి ఇలాగే వంట చేసేసి త్వరగా బయలుదేరింది .పిల్లలు కూడా మావయ్య ఇంటికి అంటూ ఉత్సాహంగా తెమిలారు, తీరా బయలుదేరుతుంటే అత్తగారు గబా గబా వచ్చి గొంతు తగ్గించి "అదేవిట్రా ,ఇంటల్లుడు మీ బావ మనింట్లో ఉంటే నువ్వు బయటికి వెళ్తావా ?తను ఏమనుకుంటాడు ?" అంది . శ్రీకర్ నీళ్ళు నమిలి రవళి వంక చూశాడు . చాలా మంది ఇల్లాళ్ళకి ఇదే సమస్య . మెత్తదనం ఎక్కువైన మగవాళ్ళు అటు తేల్చరు ,ఇటూ తేల్చరు ... భార్యమీదకే వదిలేస్తారు . కాస్త నోరు ఉన్న ,గడుసుతనం ఉన్న అమ్మాయి అయితే వ్యవహారం వేరేలా ఉంటుంది . రవళీ నెమ్మదస్తురాలు ,మొహమాటస్తురాలు కావడంతో నిస్సహాయంగా భర్తవైపు చూసింది . 'నువ్వూ పిల్లలూ వెళ్లి వస్తారా "అన్నాడు శ్రీకర్ . రవళికి ఏడుపు వచ్చింది . ఇండియా వచ్చింది మొదలు అసలు భార్యాభర్తలు స్థిమితంగా మాటాడుకున్నది లేదు,కుటుంబం అంతా ఒక్కరోజు అయినా వాళ్లు మాత్రమే  గడిపినది లేదు . భర్త రాకుండా తనూ పిల్లలూ మాత్రమే వెళ్ళాలనిపించ లేదు . బయటికి వెళ్ళడానికి సిద్ధమైన పిల్లలు ప్రోగ్రామ్ కేన్సిల్ అనడంతో గొడవ చేశారు . చివరికి సాయంత్రం శ్రీకర్, అతని చెల్లెలి కుటుంబం ,పిల్లలూ బయటికి వెళ్ళిపోయారు . శ్రీకర్ రవళిని కూడా రమ్మని బలవంతపెట్టాడు కానీ ... రవళి ఎంతమాత్రం ఒప్పుకోలేదు . చాలా సార్లు ఆ అనుభవం కూడా అయింది ,ఆడపడుచు కుటుంబంతో ,అన్నావదినలతో బయటికి వెళ్తే శ్రీకర్ జేబుకి చిల్లు పడాల్సినదే . అంతా అయ్యాకా డిన్నర్ కి పేరున్న హోటల్ కి వెళ్ళడం ,పిల్లలు అక్కర్లేనివీ కావలసినవీ ఆర్డర్ చెయ్యడం ,ఆబా ,ఆత్రం తప్ప ఏమీ తినలేక వదిలేయడం ,బిల్లు చూస్తే వేలల్లో .. తిండిలేక లోకంలో ఎందరో ఆకలికి అల్లాడుతుంటే ఇలా ఇంతింత వేస్టేజ్ . ఇలా నాలుగైదు సార్లు కాగానే రవళి తను వాళ్లని వెళ్ళిపోమని వాళ్ళు వచ్చేలోగా డిన్నర్ ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టింది . ఒక్క హోటల్ ఏమిటి? తిరుపతి వెళ్ళినా అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్లకి రెండు కుటుంబాల ఖర్చూ తప్పదు .   ఆడపడుచు కుటంబం బాగా కలిగినవారైనా  ,పొరపాటున కూడా ఎక్కడా రూపాయి తియ్యరు,వాళ్ళ పిల్లలు కనిపించినది ,కంటికి నచ్చినదీ ఉండడం ఆలస్యం మావయ్యా !అంటూ శ్రీకర్ దగ్గిరకే చేరతారు . ఇన్నాళ్ళూ ఇండియాలో ఉండక తెలియలేదు కానీ ... పెళ్ళిళ్ళకి ,పేరంటాలకీ ,ఒకొక్కసారి దగ్గిర వాళ్ళైతే చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా వెళ్ళవలసి వస్తోంది . అలాంటప్పుడు పిల్లల స్కూల్స్ మాన్పించలేక పిల్లలూ ,రవళీ ,డయాబెటిస్ ఉన్న మామగారు ఉండిపోతున్నారు . శ్రీకర్, తల్లి, చెల్లెలు వెళ్తారు . మరీ ముఖ్యం అయినవి అయితే తప్ప ఆడపడుచు తన పిల్లలు ప్రయాణాల్లో నలిగిపోతారని వదినగారి దగ్గిరే వదిలి వెళ్ళిపోతుంది . ఒకొక్కసారి రవళికి ఎందుకొచ్చామా ఇక్కడికి అనిపించేస్తోంది . ఒకరికి ఒకరం తోడూ ,అన్నీ పంచుకుంటాం అని వచ్చారు . ఇప్పటివరకూ తామే అన్నీ పంచుకున్నట్లు ,అందరికీ తోడు అవుతున్నట్లు అనిపిస్తోంది . ఎంత మంది అమెరికా నుండి వచ్చి ఇక్కడ ఆనందంగా అయినవాళ్ళ మధ్య బ్రతుకుతున్న వాళ్లు లేరు?తమకే ఎందుకు ఇలా ఉంది అనిపిస్తోంది పదే పదే మనసుకి . రవళి వేదనని గుర్తించిన ఒకే ఒక్క వ్యక్తి ఆమె మామగారు ఆనందరావు . ఆయనకి కొడుకు పెళ్లి కాగానే కోడలు కూడా అమెరికా వెళ్లిపోవడంతో ఆమెతో అంత పరిచయం లేదు .ఫోన్లలో ,స్కైప్ లలో పలకరింపులు తప్ప . నాలుగు రోజులు ఇండియా ట్రిప్ కి వచ్చినప్పుడు కూడా ఆయన అంత పట్టించుకోలేదు . పూర్వంలా ఒకే ఇంట్లో కలిసి ఉంటే స్వభావాలు తెలుస్తాయి తప్ప నాలుగు రోజులకే మనుషులని ఎలా అంచనా వేస్తాం అనుకునే మనిషి ఆయన . శ్రీకర్  బలవంతం మీద రెండు సార్లు అమెరికా వెళ్ళినప్పుడు అతనికి రవళి మీద మంచి అభిప్రాయమే  ఏర్పడింది . మాటలో నమ్రత, ఆత్మీయత, సంప్రదాయం పట్ల ఆదరణా ,ఇల్లు నేర్పుగా నడుపుతున్న దక్షత, పిల్లల్ని చక్కగా పెంచుతున్న తీరు ఆయనని ఆకట్టుకున్నాయి . కానీ అప్పటికీ అతను మనవలతో అంత అనుబంధం పెంచుకునే ప్రయత్నం చెయ్యలేదు . పెంచుకున్న అనుబంధాలు ఎంతగా బాధ పెడతాయో బాగా తెలిసిన మనిషి కావడం చేత . టిచర్ గా పనిచేయడం వలన స్వభావాలు అర్ధం చేసుకోగల నేర్పు అలవడింది . శ్రీకర్ వాళ్ళు వచ్చిన ఆరు నెలలుగా అన్ని పరిస్థితులూ గమనిస్తున్నా అతనికి రవళి వ్యక్తిత్వం విస్మయ పరచింది . చిన్న పిల్ల అయినా ,క్షణం తీరిక లేకపోయినా ,డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు అవుతున్నా ఒక్క నిష్టూరపు మాట ఆమె నోట రాలేదు . సాధారణంగా చిరునవ్వు చెదరని ఆమె ముఖంలో ఈ మధ్య దిగులు . అసలు కొడుకైనా కనిపెట్టాడా లేదా అని అతనికి సందేహం కలిగింది చాలా సార్లు . కూతురి తీరు,భార్య ప్రవర్తన అతనికి చికాకు కలిగించాయి . ఆరు నెలలుగా కేవలం సాక్షిగా మౌన ముద్రతో ఉన్న ఆయన నెమ్మది నెమ్మదిగా కుటుంబ పెద్దగా చొరవ తీసుకోవడం మొదలు పెట్టారు . ముందుగా ఇండియా సిలబస్ తో ఇబ్బంది పడుతున్న పిల్లలకి తనే మంచి టిచర్ గా మారారు . చక్కని కధలూ కబుర్లూ ,సాయంత్రం పార్కులో కాసేపు ఆటలు, రోజూ స్కూల్ బస్ వేళకి ఇల్లల్ని ఎక్కించి రావడం ,మళ్ళి బస్ వచ్చే వేళకి వాళ్లని తీసుకు రావడం . పిల్లలు కూడా తాతగారికి బాగా మాలిమి అయిపోయారు . ఇంటికి వచ్చింది మొదలు అన్ని విశేషాలు ఆయనతో చెప్తూ ఆయన వెంటే తిరుగుతారు . పిల్లలు భోజనాలకి పేచీలు పెట్టినా ,పోట్లాడుకున్నా ఓపికగా వాళ్ళ అలకలు తీరుస్తారు ఎంతో  మెత్తగా నచ్చ చెప్తారు . పిల్లల బాధ్యతా మామగారు పంచుకోవడంతో రవళికి ఎంతో హాయిగా ఉంది . క్రమ క్రమంగా ఆయన భార్యకి కూడా నచ్చ చెప్పడం మొదలు పెట్టారు . శ్రీకర్ గమనించాడో లేదో కానీ ఇప్పుడు బంధువులు ఎవరు వచ్చినా ఆయనే స్వయంగా వెళ్లి బట్టలు కొనుక్కోస్తున్నారు . మామూలు రోజుల్లో కాకపోయినా ఆడపడుచువచ్చిన రోజుల్లో అత్తగారు సాయం చేయడానికి వస్తున్నారు . పూర్వంలా కాకుండా కూతురూ అల్లుడూ పిల్లల్ని వదిలీ ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఆవిడే మనవలందరికి అన్నం పెట్టడం ,అమ్మాయిల జడలు వెయ్యడం లాంటివి చేస్తున్నారు . తన వరకూ,భార్య వరకూ అయితే చేయాలనుకున్న కొంత చేయగలిగారు కానీ కూతురి విషయమే ఆయనకీ సమస్య అయింది . ఎలా చెప్పాలి? ఏం చెయ్యాలి? ఇంతలో అనుకోకుండా  రవళి కజిన్ పెళ్లి వచ్చింది వైజాగ్ లో. ఎలా తెమల్చుకుని వెళ్ళాలా అని తటపటాయిస్తున్న రవళికి ,శ్రీకర్కీ మేం ఉన్నాం కదా ,పిల్లల్ని చూసుకుంటాం అని నచ్చ చెప్పి వాళ్ళిద్దర్నీ పంపించారు . శుక్రవారం సాయంత్రమే కూతురికి ఫోన్ చేసి ... "వాళ్ళమ్మా ,నాన్నా లేరు కదా , పిల్లలు బోర్ ఫీల్ అవుతున్నారు .ఈ సారి మేమే మీ ఇంటికి వస్తున్నాం "అంటూ  శనివారం పొద్దున్నే భార్యని మనవడిని ,మనవరాలినీ తీసుకుని కూతురి ఇంటికి వెళ్ళారు . ఆ మాత్రానికే తల్లి ఎంత సాయం చేసినా కూతురు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది . సెలవు వస్తే ముందు ఎన్ని చిరుతిళ్ళు తన పిల్లలకి సరిపోవు . అల్లరి లో సింహభాగం తన పిల్లలదే అయినా నలుగురూ కలిసి హోరెత్తిస్తుంటే తలపగిలిపోయింది ఆమెకి . ఆదివారం వచ్చేసరికి ఓపిక అయిపోయి బయటికి వెళ్దాం అని తనే ప్రపోజ్ చేసింది , మాల్ కి వెళ్ళారు . మామయ్యని అలవాటు పడ్డ పిల్లలు దొర్లి పొర్లి అడ్డమైనవి కొనిపించుకున్నారు . భోజనాలకి హోటల్ లో తిన్నకంటే వదిలించుకున్నదే ఎక్కువ అయింది . ఒక్క వీకెండే ఆడబిడ్డకి ,భర్తకీ చుక్కలు చూపించింది . ఆనందరావు గారు కావాలనే "ఇంకెక్కడికైనా వెళ్దామా "అనగానే కూతురు తుళ్లిపడి "అమ్మో ! వద్దు నాన్నా !రేపు సోమవారం కదా ,ఇంట్లో చాలా పనులు ఉన్నాయి "అనేసింది . భార్యకి చెప్పి ఆమెని వేడిగా చారు,పిల్లలకి ఇష్టమైన బంగాళా దుంపల వేపుడు చేయమని ,త్వరగా డిన్నర్ ముగించి మళ్ళి భార్యతో మనవలతో ఇల్లు చేరాడు ఆయన . పెళ్లికి వెళ్లి వచ్చాకా చాలా ఉల్లాసంగా ఉంది రవళి . ఎంతో కాలానికి భార్యాభర్తలు మనసారా మాట్లాడుకోగాలిగారు . మళ్ళి శుక్రవారం ఆడపడుచు నుండీ ఫోన్ వచ్చింది "వదినా ! ఇంట్లో చాలా పని ఉంది .ఈ వారం రావట్లేదు "అంటూ . రవళికి తను వింటున్నది కలో నిజమో అర్ధం కాలేదు . ఆనందరావు గారు తన పధకం ఫలించినందుకు లోలోన నవ్వుకున్నారు . అత్తగారు ముందు కూతురు రానందుకు అయ్యో అనుకున్నా ... ఇల్లంతా నీట్ గా,ప్రశాంతంగా ఉండేసరికి తెలియకుండానే మనసులో హమ్మయ్య అనుకుంది . శనివారం భోజనాలు అయిపోయాకా పిల్లలూ ,శ్రీకర్ ,రవళీ ఎన్నాళ్ళ తర్వాతో కేరమ్స్ ఆడుకున్నారు . ఆ కిలకిలలు వింటూ నడుం వాల్చారు ఆనందరావు గారు . ఆ తర్వాత పండుగలూ పబ్బాలూ అయితే తప్ప ఆడపడుచు రాకపోకలు తగ్గాయి . వచ్చినా ఇంట్లోనే గడిపి వెళ్ళడం తప్ప బయటికి తిరగడాలు లేవు . ఒకవేళ శ్రీకరే వెళ్దాం అన్నా చెల్లెలు ఏదో సాకుతో తప్పించు కుంటోంది . ఆ మార్పుకి ఆమె తండ్రి ఎంతో సంతోషించారు . అత్తవారింటి వైపు నుండీ పరిస్థితులన్నీ మెల్లమెల్లగా అనుకూలంగా మారాయి రవళికి . అన్నీ అనుకున్నట్లు ,అన్నీ రోజులూ ఒకే విధంగా సాగిపోతే జీవితం ఎలా అవుతుంది? ఎప్పుడూ లేనిది అన్నయ్యా వదినా ప్రేమగా ఇంటికి రమ్మన్నారు ఒకరోజు . చాలా కాలం కావడంతో కుటుంబం అంతా వెళ్ళారు . కాసేపు సరదాగా కాలక్షేపం జరిగాకా భోజనాల తర్వాత పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అన్నయ్య మనసులో ఉద్దేశం బయట పెట్టాడు . బంజారా హిల్స్ లో ఒక ఇండిపెండెంట్ హౌజ్ చూసాడట . కోటిన్నర పలుకుతోంది . కోటీ పాతికకి ఇస్తాం అన్నారట . ఇప్పుడు వాళ్ళున్న ఫ్లాట్ అమ్మేస్తే నలభై లక్షలు వస్తుంది . 50 లక్షలకి లోన్ పెడతాడట . "బావగారూ ! ఒక్క 35 (లక్షలు )అప్పుగా ఇవ్వండి ,మేం అమెరికా వాళ్ళం కాదు . వడ్డీ ఇచ్చుకోలేను . మరో పదేళ్ళలో తీర్చేస్తాను ", అన్నాడు. భార్యాభార్తలిద్దరికీ తలతిరిగిపోయింది . ఒకటా రెండా 35, అదీ పదేళ్ల తర్వాత అసలు తాహతుకు మించిన ఆ ఇల్లు కొనడం దేనికి ? ఇలా ఇవ్వలేని డబ్బు అప్పు అడగడం దేనికి? అమెరికా నుండి వచ్చారు అనేసరికి ప్రతి ఒక్కరికీ ఇదే భావన ." వీళ్ళకి డబ్బుకు కొదవేంటి ?"అని . చాలా సేపటికి గొంతు పెగాల్చుకుని శ్రీకర్ "బావగారూ !అప్పు గా కాకుండా అయితే 2 లక్షలు ఇవ్వగలను . అప్పు అయితే కష్టం మీద ఏదో చేసి అయిదో పదో సర్దగలను .కానీ 35 లక్షలు అంటే మాటలా  ?నా దగ్గిర లేదు ,"అన్నాడు .బావమరిది  ముఖంలో రంగులు మారాయి . అప్పటివరకు ఉన్న నవ్వు మాయమైంది . అతని భార్య చివాలున లేచి అక్కడినుండి వెళ్ళిపోయింది . "ఇవ్వడం ఇష్టంలేకపోతే ఇవ్వను అని చెప్పండి . లేదా ,నిర్మొహమాటంగా ఇస్తాను కానీ వడ్డీకి ఇస్తాను అని చెప్పండి. అంతే కానీ లేదని చెప్పడం ఎందుకు ?అమెరికాలలో సంపాదనలు ఎలా ఉంటాయో మాకు తెలియదా "అంటూ వెళ్ళిపోయాడు బావమరిది కూడా . తమాయించుకోవడానికి చాలా సేపు పట్టింది భార్యాభార్తలకి . అన్నావదినలు మళ్ళి కనిపించనే లేదు . ఇక బయలుదేరుతామ్ అంటూ తల్లికి చెప్పింది రవళి . ఆమె ఏమీ మాట్లాడకుండా పళ్ళు ,కుంకుమ తీసుకుని వచ్చింది . "అమ్మా ! విన్నావా ?అన్నయ్య ఏం అన్నాడో ?సంపాదనలే చూస్తున్నారు కానీ ఖర్చులు చూస్తున్నారా ? మాకు మాత్రం ఎక్కడినుండి వస్తాయి అన్ని లక్షలు ?పిల్లల చదువులూ బాధ్యతలు ఎంత ఖర్చుతో కూడిన వ్యవహారమో తెలుసుకదా "అంది రవళి బొట్టుపెడుతున్న తల్లితో . "వాడు ఆడపిల్లని అడగడం తప్పే . అయినా అప్పుగానే అడిగాడు కదా !ఇవ్వడం ,ఇవ్వకపోవడం మీ ఇష్టం కానీ డబ్బు ఉండి కూడా లేదు అనకు . లక్ష్మి కోపగించుకుని వెళ్ళిపోతుంది "అంది తల్లి నిదానంగా . భూమి రెండుగా చీలిపోతున్నట్లు  అనిపించింది రవళికి . అంటే కన్నతల్లి కూడా తనని నమ్మట్లేదు . అమెరికాలో ఇన్నేళ్ళు ఉన్నంతలో ఏదో అపార సంపద మూలుగుతోంది అనే భ్రమలో ఉంది . "రండి వెళ్దాం "అంది గొంతు పెగుల్చుకుని శ్రీకర్ తో . ఆమెకి దుఃఖం  ఆగలేదు . మానవ సంబంధాలన్నీ ఏమైపోయాయి ?అన్నీ డబ్బుచుట్టునే తిరుగుతున్నాయా ?ఉన్నంతలో జాగ్రత్త గడుపుకుంటూ వస్తున్నారు . ఎంతోమంది ఫ్రెండ్స్ యూరోప్ ట్రిప్స్ అంటూ వెళ్తుంటారు అలా కూడా తాము వెళ్ళింది లేదు . మన వాళ్ళు మనవాళ్ళు, అంటూ వచ్చినందుకు కనీసం కన్నతల్లి ,తోడబుట్టినవాడు కూడా నమ్మే స్థితిలో లేరు . ఇంటికి వచ్చాకా కూడా మామూలు మనిషి కాలేకపోయింది రవళి . ఆ తర్వాత అసలు అన్ననుండీ సమాచారమే లేదు . పొడిపొడిగా తల్లిమాత్రం నాలుగు సార్లు పలకరించి  ఉంటుంది . రెండుమూడు నెలలు గడిచాకా అత్తగారు పోరుగింటికి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్ లో ఉండగా ఆనందరావు గారు కొడుకునీ కోడల్ని పిల్చారు "చూడు తల్లీ! లోకమే ఇలా ఉంది ఇప్పుడు . అక్కడ ఉన్నన్నాళ్ళూ హాయిగా బ్రతికారు . దూరపు కొండలు నునుపు అన్నట్లు దూరంగా ఉన్నపుడే కొన్ని అనుబంధాలు తీయగా అనిపిస్తాయి . మీరు వచ్చి ఎంతో కాలం అయిపోలేదు . నా మాట విని మళ్ళి అక్కడికే వెళ్లి హాయిగా ఉండండి . మా గురించి దిగులు పడకండి . వస్తూవెళ్తూ ఉంటాం . పల్లెటూళ్ళో మా జీవితం హాయిగాసాగి  పోతుంది . ఫోన్లున్నాయి ,స్కైప్ లు ఉన్నాయి . ఇక్కడ ఇంటికి ఇచ్చే అద్దె, అవుతున్న ఖర్చులతో అక్కడ పది కుటుంబాలు బ్రతకొచ్చు . మీ తృప్తికి అక్కడ మాకు ఏసీ ,యూపీఎస్ పెట్టిమ్చంది . దర్జాగా బ్రతికేస్తాం . మీ మంచి కోసమే చెప్తున్నాను . " అన్నారు . భార్యాభర్తలకి నోటమాట పెగలలేదు . ఒక వారం రోజులు ఆలోచించాకా , అదే బావుంది అనిపించింది రవళికి. ఇప్పటికీ ఆమెకి అన్న వైఖరి, తల్లి తీరు తట్టుకోలేనివిగానే ఉన్నాయి . దగ్గిరలో ఉంటూ ఇలా దూరమైపోయే కంటే దూరంగా ఉంటూ అందరికీ చేరువగా ఉండడమే మేలు అనిపించింది . ఆమె బాధని చూస్తున్న శ్రీకర్ కూడా సరే అన్నాడు . తల్లి బాధ పడింది . కానీ ఆనందరావు గారు ఆమెకి చక్కగా సర్దిచెప్పేరు . తాతగారికి మచ్చిక అయిన పిల్లలూ తాతా ఎన్నెన్నో ప్రమాణాలు చేయించుకున్నారు. రోజూ ఫోన్ చేయాలి... వారం వారం స్కైప్ లో కలవాలి వగైరా వగైరా ... "నాన్నా !నాన్నా!"ఆకాశ్ తన చెయ్యి కుదపడంతో తుళ్లిపడి ఆలోచనల్లోంచి బయటికి వచ్చాడు శ్రీకర్ . "నాన్నా !వాళ్ళు మన ఫ్లయిట్నే అనౌన్స్ చేశారు"అన్నాడు ఆకాశ్ . నిట్టూర్చి కుడిచేత్తో పిల్లలను దగ్గిరకి తీసుకుంటూ ఎడమచేతిని రవళి భుజం చుట్టూ వేశాడు శ్రీకర్ లేద్దామా !అన్నట్లుగా .  

No comments:

Post a Comment

Pages