భద్రగిరి శతకము - భల్లా పేరయకవి - అచ్చంగా తెలుగు
భద్రగిరి శతకము - భల్లా పేరయకవి
- దేవరకొండ సుబ్రహ్మణ్యం

కవి పరిచయము:
భద్రగిరి శతకము రచించిన భల్లా పేరయకవి కౌండిన్య గోత్ర వైదీక బ్రాహ్మణుడు. భల్ల లింగనకు పౌత్రుడు, భల్లా పెద్దన కుమారుడు. క్రీ.శ. 1769-70 ప్రాంతాలలో భద్రాచలముపై తురకలు దండెత్తినప్పుడు, ఆ ఆపదనుండి తప్పించమని ఆ భద్రాచల రాముని వేడుకొనుచు ఈ శతకాన్ని వ్యాజస్తుతిగా రచించినాడని ప్రతీతి.
రమణ కౌండిన్యగోత్రపవిత్రుఁడను లింగ, నకుఁ బౌత్రుడను, బెద్దనకు బుత్ర
వరుఁడఁ బేరయనామధరుఁడ భల్లావంశ, వనధిశోముఁద బుధవర్గ మలర
వలస వేంచేసిన వరుస యాస్పదము నా, మదిలోన భావించి ముద,ఎలర్ప
ఘనత వ్యాజస్తుతిగా నొనర్చితి సీస, శతక మష్టోత్తరశతము గాఁగ
చిత్తగింపుము హంసంబు క్షీరములను
గ్రాహ్య మొనరించుచందంబు గడలుకొనగ
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక.
ఇంతకంటే ఈ కవి గురించి ఎక్కువ వివరాలు తెలియరాలేదు.
శతక పరిచయం:
యవనులు సైన్యసమేతులై అనేక వచ్చి హైందవ దేవాలయాలను సర్వనాశనము గావించిరి. ఆసమయంలో సింహాచల క్షేత్రమున గోగులపాటి కూర్మనాథకవి సింహాద్రినారసింహ శతకము, తిరుపతిపై దండెత్తినప్పుడు వెంకటాచలవిహార శతకము, మట్టపల్లి నృసింహ శతకము మొదలైన శతకాలు ఆవిర్భవించాయి. ఆకోవకి చెందినదే ఈ భద్రగిరి శతకము.
ధాంసా అనే యవనుడు అనేకరాజ్యాలను ఆక్రమిస్తు, అనేకదురాగతాలను చేస్తూ భద్రాచలాన్ని ముట్టదించాడు. ఆ సమయంలో భద్రాచల దేవాలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేస్తాడనే భయంతో అప్పటి పూజారులు ఆవిగ్రహాలను పోలవరమునకు చేర్చి సుమారు అయిదు సంవత్సరాలు అక్కడనే ఉంచారు. తరువాత పూసపాటి విజయరామరాజు, సీతారామరాజుల కాలమున తిరిగి విగ్రహాలను భద్రాచలంలో ప్రతిస్టించినట్లు భద్రాచలంలో దొరికిన శాసనాలు చెప్తున్నాయి. పేరయ కవి ఈశతకాన్ని భుశా విగ్రహాలను పోలవరంకు తీసుకు వెళ్ళిన కాలంలో ఈశతకాన్ని ఆరంభించి విగ్రహాలు తిరిగివచ్చిన వెనుక శతకం పూర్తి చేసి ఉండవచ్చునని ఒక అభిప్రాయం. ఈ శతకం వ్యాజనింద సీసపద్య శతకమే కాక ఆనాటి కాలంలోని దేశ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.  అందుకే ఈ శతకాన్ని చారిత్రిక శతకము అని కూడా అనవచ్చును.
ఈశతకం ముందుగా బహుపరాకు తో మొదలయింది
పద్మభవస్తోత్ర, పావనచారిత్ర, పంకజదళనేత్ర బహుపరాకు
దైతేయశిక్షణ ధర్మవిచక్షణ, భక్తసంరక్షణ బహుపరాకు
వారిధిబంధన వరభక్తచందన, భరతాదివందన బహుపరాకు
తాటకభంజన తాపసరంజన, పరమనిరంజన బహుపరాకు
భద్రగిరినాఁడె వచ్చు నీపొరుషంబు
విశ్వవిఖ్యాతిసేయక విడువనింక
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక
మకుటంలో మహాభక్తుడగు భద్రాచలరామదాస పోషకుడని రాముని స్తుతించటంచేత ఈ కవి రామదాసుని భక్తుడని ఊహించవచ్చును. నిందాస్తుతిలో ఈ కవి అందెవేసిన చెయ్యి. ఆనాటి ఇంగ్లీషువారిపాలనలో నవాబు హయాములో పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వివరించారు. అనేకపద్యాలలో సందర్భోచితంగా తురకపదములు వాడి వ్రాసిన నిందాస్తుతి మనసునకు చుఱుకుగా తగులుతుంది.
సౌమిత్రికైనఁ దోఁచకపోయెనా యిట్లు, పోవరాదని నీకు బుద్ది దెలుప
సీతయైనను మీకుఁ జెప్పలేదాయెనా, యిటువెడలుట మహాహీనమనుచు
హనుమంతుఁ డిపుడు మీయాజ్ఞకు వెఱచెనా, యౌను గాదని మిమ్ము నడ్డగింప
శిష్టరాజగు మీవసిష్ఠు లేడాఁయెనా, యిది బుద్ధిగాదని యెఱుఁగఁజెప్ప
భద్రగిరినుండి శ్రీవీరభద్రగిరికి
వలసబోవుట యిదియేమి వాంఛలయ్య
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక
భద్రాచల దేవాలయం తురకలపాలయింది, యిక తురకమతం అవలంభించాలని కవి వ్రాసిన ఈ పద్యం చూదండి
భరతాది సహజన్మ నరులకు నీపాటి, "ఫారసీ" చెప్పించు పంత ముడిగి
వ్యాసాది మునిగణ ప్రతతికి నెలను "ఖు, రాన్" చదివింపఁ దలంపుసేయు
పరగ నింద్రాది దిక్పాలక శ్రేణికి, నెఱి "నమాజులు" సేయు నేర్పు నేర్పు
వారింపలేవు నాళ్వారాదులకు వేగ "సున్నితీల" ప్రయత్న మెన్నఁజేయ
చేయకుండిన తురకలు చెడుగువాండ్రు
హద్దువీడివచ్చి రింక మీ రాఁగలేరు
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక
విజయనామ సంవత్సరమున నీ తురకల యలజడిపోయి శ్రీరాముడు భద్రగిరియందు పట్టాభిషక్తుడైనట్లు కవి శతకాంతమున వ్రాసినాడు.
సర్వధా రనుపేర సంవత్సరంబున, ధంసాకు వెఱచి యిద్దయికి వచ్చి
పోలవరంబులోఁ బొలుపొంద నైదేండ్లు, వనవాసమొనరించి వరుసతోడ
శాక్తేయమతయతు సంహారమొనరించి, మంత్రాంగశక్తి యిమ్మహిని వెలయఁ
దగ పూసపాటి సీతారామరాజు వి, జయరామరాజుల సరసముగను
విజయసంవత్సరంబున విజయముగను
భద్రగిరి కేగి తౌనయ్య భద్రముగను
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక
మరికొన్ని అద్భుతమైన పద్యాలు మీకోసము
సోమకాసురునితోఁ జొచ్చి పాధోరాశి, మత్యమై సుఖలీల మరగినావొ
కూర్మరూపముచేతఁ గుంభిని జొరఁబాఱి, వ్రేగుచే బయలికి వెళ్ళలేదొ
వరాహావతారమై వసుధవర్తించిన, సిగ్గుచే మూలలఁ జేరినావొ
బాలుని పల్కు వెంబడి వేగరా నుక్కు, కంబములో దాఁగఁ గడగినావొ
కాక నిజరూపముననున్న ఖలులుజేయు
చేతలకు నూరకుందువే చేయమఱచి
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక
హరువిల్లువిఱువక వరపుత్రినీయంగ, జనకరా జేమి విచారపడెనొ
పరశురాముని భంగపఱుపఁగా నెంచిన, దశరథుం డేరీతి తల్లడిల్లెనొ
మిముఁ గాపుఁజేసి యాగముఁ బూర్తిచేసిన, కౌశికుం డేమి వ్యగ్రతఁ గొనియెనొ
వనరాశి గట్టి రావణుఁ ద్రుంచఁ గనిన వి, భీషణుం డేరీతిఁ బెగడువడెనొ
తురకలబలకోతివలని యాతురత పోల
వరము వేంచేసినట్టి దుర్వార్త వినిన
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక
ఆదిభిక్షునిఁ బెండ్లియాడిన పార్వతి, కన్నవస్త్రములకే మాపదయ్యె
కోరిబాఁపనిఁ జెసికొన్న సరస్వతి, కిడుములు వచ్చెనే యిల్లులేక
కాళ్ళులేని ఫణీంద్రుఁ గట్టుకొనినయుర్వి, కూరులెదాయెనే యుండుటకును
తనువులేనివయారిఁ దగిలి రతీదేవి, సుఖపడదాయెనే సురలు మెచ్చ
భళిర మీవంటిప్రభుఁ జెట్టవట్టి సీత
సకలవెతలకు లోనయ్యె సరవితోడ
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక
ఇల్లు నప్పులగంప ఇల్లాలు చలచిత్త, పాన్పు నాగులపుట్ట వదినె జ్యేష్ఠ
గొల్ల పెంపుడుతల్లి కోడలు రాఁగ కూఁ, తురు పాఱుఁబోతు ఆతురుఁడు సఖుఁడు
మనుమఁడు తండ్రి కామకుఁడు కుమారుండు, క్షయరోగి మఱఁది వంచకుఁడు తండ్రి
అన్న పానఘనుండు నరయ నిష్టుఁడు పేఁడి, వేసదారివి నీవు వేయునేల
ఇన్నియును నాదు నెమ్మది నెఱిఁగి యుండి
కొలిచితిని మిమ్ము విశ్వాసగుణము దలఁచి
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక
ఇటువంటి అద్భుతమైన పద్యాలు ఈశతకంలో ఎన్నెన్నో ఉన్నాయి. శ్రీరామ విగ్రహాలు భద్రగిరికి చేరిన తరువాత చెప్పిన పద్యాలు చూడండి
అంగ వంగ కళింగ బంగాళ నేపాళ, రాజులకెల్ల శ్రీరాములాజ్ఞ
ఘూర్జర టెంకన కుకుర టెంకణ చోళ, రాజులకెల్ల శ్రీరాములాజ్ఞ
చోట సింధు మరాట లాట మత్స్య విదర్భ, రాజులకెల్ల శ్రీరాములాజ్ఞ
పాంచాల సౌరాష్ట్ర బర్బర మగదాంధ్ర, రాజులకెల్ల శ్రీరాములాజ్ఞ
దివ్యతిరునాళ్ళకు సమస్తదేవవరులు
రావలయునంచుఁ జాటింపఁగావలయును
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక
నీలనీలకుముదసేనానాయకోత్తముల్, బలసి ముంగల బరాబరులు సేయ
హనుమయు జాంబవదాంగదాదులు నిల్చి, యంచలంచలను జోహారులిడఁగ
వరుస సుగ్రీవ గవయ గవాక్షాదులు, నొరసి మిన్నంటి చామరలు వీవ
పరమ భాగవత ఖేచరసిద్ధచారణుల్, జయజయ శబ్ధసంచయము నుడువ
సురలు విరులు గురియఁ బోలవరమునుండి
భద్రగిరి జేరు వేడ్కలు బ్రస్తుతింతు
భద్రగిరివాస శ్రీరామభద్ర దాస
పోషబిరుదాంక రఘుకులాంబుధి శశాంక
ఇటువంటి చక్కటి వ్యాజాస్తుతి, చారిత్రిక శతకము అందరిచే పఠనీయము. తప్పక మీరుకూడ చదవండి. ఇతరులచే చదివించండి.

No comments:

Post a Comment

Pages