Tuesday, December 23, 2014

thumbnail

అక్షర తూణీరం అబ్బూరి ఛాయాదేవి

అక్షర తూణీరం అబ్బూరి ఛాయాదేవి
 - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
          
కథ , నవల, వ్యాసం, ప్రత్యేక శీర్షిక,సంపాదకత్వం, ఏదైనా అందులో తనదైన ప్రత్యేకశైలి కలిగిఉన్న అచ్చంగా తెలుగు  రచయిత్రి శ్రీమతి అబ్బూరి చాయాదేవి. 1933 అక్టోబర్  13 న రాజమండ్రిలో జన్మించారు.  జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటి లైబ్రరేరియన్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన ఈమె భర్త ప్రముఖ  సాహితీ వేత్త అబ్బూరి వరద రాజేశ్వరరావు. అటు పుట్టిలు, ఇటు మెట్టినిల్లు సాహిత్యాభిలాషులవటం చాయాదేవి గారికి కలిసొచ్చిన అంశం. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈమె   స్త్రీ కష్టాలు.. సామాజికంగా, ఆర్ధికంగా స్త్రీ ఎలా ఎదుర్కొంటుందో తన కథల్లో కళ్ళకు కడతారు.  అలంకారాలు లేని అతి సామాన్య వాక్య నిర్మాణం ఆమె సొంతం అయినా అడుగడుగునా ఉత్సుకత రేపడంలో ఆమెది ప్రత్యేక శైలని కొనియాడారు  ప్రతిభామూర్తి జీవితకాల పురస్కారం అందించే సమయంలో అజో- విభొ-కందాళం ఫౌండేషన్ వారు. అంటే ఆమె ప్రతిభ ఇట్టే అర్ధమౌతుంది.  ఛాయాదేవి గారు వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. విద్య  : 1951లో రాజమండ్రి నుంచి బి.ఎ,1953 లో నిజాం కాలేజ్ హైద్రాబద్ నుంచి, 1958 లో  డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ లో ఆంధ్రాయూనివర్శిటి నుంచి పట్టా పొందారు. 1953లో అబ్బూరి వరదరాజేశ్వరరావు గారితో వివాహం జరిగింది.   1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. పత్రికారంగం : 1954 లో ' కవిత సంచికలకు సంపాదకత్వం,   1956 లో ఆంధ్రాయువతి మండలి - హైద్రాబాద్ వారి వనిత మాస్సపత్రిక కు సంపాదకత్వం వహించారు అబ్బూరి చాయాదేవి.  ఇప్పటీ వరకు మూడు స్వీయ కథా సంపుటాలు , అనుసరణ కథల సంపుటి , పిల్లల కోసం  ప్రపంచ జానపద కథల అనుసరణ సంపుటి,  తండ్రి రాసిన లేఖల అధారంగా  నవలిక , మూడు సంపుటాల యాత్రా చరిత్ర,  జిడ్డు కృష్ణ మూర్తి అనువాద గ్రంధాలు , కేంద్ర సాహిత్య అకాడమీ వారికోసం 20 వ శతాబ్దంలొ తెలుగు రచయిత్రుల సంకలనం , అంతే కాక ఎన్నో కాలంస్ కూడా వ్రాయటం జరిగింది.   స్త్రీవాద రచయిత్రిగా... స్త్రీవాద రచయిత్రిగా ఆమెదో ప్రత్యేక శైలి. స్వేచ్చకు, విచ్చలివిడితనానికి మధ్య ఉన్న  తేడా స్పష్టంగా తెలిసిన  విద్వత్ శిరోమణి అబ్బూరి చాయాదేవి గారు.  సంక్లిష్ట అనుభవాలను నిరంతరం పరిశీలించి,  స్త్రీల నిత్య జీవిత అనుభవాలసారాన్ని రంగరించి,  సునిసితమైన శైలిలో చిత్రించి పాఠకలోకానికి అందించడంలో ఆమె కృషి అనిర్వచనీయం. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ 'బోన్ సాయ్ బ్రతుకు'. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి 'కథాభారతి' అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది. వీరి రచనలు జాతీయస్థాయిని చేరుకున్నాయి. వీరి రచనలలో, కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. వీరి అప్రతిహతమైన రచనా వ్యాసాంగంలో పిల్లల కథలకు పెద్దపీట వేశారు. అబ్బూరి చాయాదేవి రచనల్లో మరి కొన్ని : అనగనగా కథలు,మాటసాయం ,మృత్యుంజయ, వరదోక్తులు, ఓల్గా తరంగాలు, వ్యాసాలూ- వ్యాఖ్యలూ అవార్డులు - రివార్డులు : 1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి శ్రీ పొట్టి శ్రీరాములు  తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారం 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2005 లోనే సుశీలా నారాయణ రెడ్డి  సాహితీ పురస్కారం పి.వి. నరసింహరావు మెమోరియల్ స్వర్ణ కంకణం 2009 కలైంజర్ ఎం. కరుణానిధి పోర్ట్ లీ అవార్డు 2010 లో రంగవల్లి స్మారక పురస్కారం 2011 లో అజీ-విభొ- కందాళం , యుఎస్ ఎ వారి ప్రతిభామూర్తి పురస్కారం వంటివి ఎన్నో ఉన్నాయి. అబ్బూరి చాయాదేవి గారు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటంది అచ్చంగా తెలుగు.   ఉపయుక్తాలు : అజో- విబొ- కందాళం ప్రత్యేక సంచిక  

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information