Saturday, November 22, 2014

thumbnail

ఉయ్యాలవాడ సూర్యచంద్రులు

ఉయ్యాలవాడ సూర్యచంద్రులు
 - చెరుకు రామమోహనరావు

ఉయ్యాలవాడ పెద్ద వూరు కాదు. కానీ ఆ వూళ్ళో అస్తమించని సూర్యచంద్రులు చిరస్థాయిగా వున్నారు. వారే ఉయాలవాడ నరసింహా రెడ్డి మరియు ఉయ్యాలవాడ బుడ్డా వెంగళ రెడ్డి. సిపాయీల పితూరీకి ముందే తెల్ల దొరల తలలు తెంచిన అరివీర భయంకరుడు నరసింహారెడ్డి అయితే ఎముకలేని చేయి కలిగి అభినవ దాన రాధేయుడనిపించుకోన్నవాడుబుడ్డా వెంగళ రెడ్డి. 1846 లో నరసింహారెడ్డి ఉరికంబమేక్కితే 1900 వరకు జీవించినాడు బుడ్డా వెంగళ రెడ్డి. వెంగళ రెడ్డి గారి పుట్టుక 1922 లో జరిగినట్లు తెలియవస్తున్నదికానీ నరసింహారెడ్డి గారి పుట్టుకను గూర్చి నాకు ఎరుక కాలేదు. ఈ మహనీయులను గూర్చి ఎందరికి తెలుసునో నాకు తెలియదు కానీ ,నాకు తెలిసిన మేరకు ఒకసారి పునశ్చరణ చేయు ఉద్దేశ్యముతో వీరిని గూర్చి మీ ముందుంచే ప్రయత్నము చేయుచున్నాను. వీరిని గూర్చి వ్రాయుటకు నాకు ఆలంబన రెండు పుస్తకములు. నరసింహారెడ్డిని గూర్చి పాణెం నరసరామయ్య గారు వ్రాస్తే, బుడ్డా వెంగళ రెడ్డి ని గూర్చి గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వ్రాసినారు. ఇరువురు ఇప్పటి కర్నూలు వారే. అసలు నరసరామయ్య గారిది ఉయ్యాలవాడే.సారస్వతమున, జ్యోతిశామున మహా పండితుడు.ఒకప్పటి గవర్నరు పెండేకంటి వెంకట సుబ్బయ్య గారికి గురుతుల్యులు. వీరి పుస్తకములు పాఠ్యాంశములుగా వెంకటేశ్వర కర్ణాటక విశ్వవిద్యాలయములలో పాఠ్యాంశములుగా ఉండినవి. వీరు జ్యోతిశములో సిద్ధ హస్తులు.B.V. రామన్ గారి అష్ట్ర లాజికల్ మాగజిన్ కు ఎన్నో వ్యాసాలను అందించినారు. ఎందఱో నాయకులకువారి భవిష్యత్తును గూర్చి చెప్పినారు. వారు చెప్పినట్లు ఆయా నాయకులకు జరగడమే వారి విద్వత్తుకు కారణము. వారి స్వంత మేనల్లుడు నంద్యాల గోపాల్ మరియు నేను పక్క పక్క ఇండ్లవారమే కాకుండా సహా పాఠకులము చక్కని స్నేహితులము. బాల్యములో నా స్నేహితుని ఇంటికి వారు వచ్చినపుడు వారిని చూసేవాడిని. కాని వారి జ్ఞానమును గుర్తించే జ్ఞానము ఆ వయసులోనాకు లేదు. పూర్వ జన్మ సుకృతము వల్ల ఆయన నా 45 సంవత్సరాల వయసులో తారసిల్లినారు. అప్పుడు వారికి ఆతిథ్యము ఇచ్చే అదృష్టానికి నోచుకొన్నాను. వారు ఎంతో ఆప్యాయముతో స్వ దస్తూరి తో ఇచ్చిన 'స్వాతంత్ర్య వీరుడు' పుస్తకము నా పుస్తక మణిహారములోని పతకములో పొదిగిన అనర్ఘ రత్నము.ఇది 18.12.1984 న జరిగిన ఉదంతము. ఆ పిదప వారిని తిరిగి కలిసే అవకాశము భగవంతుడు నాకు సమకూర్చలేదు. వీరి మేనల్లుడు నంద్యాల గోపాల్ ఆంద్ర ప్రభ సబ్ ఎడిటర్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించి YSR, చంద్రబాబు వంటి నాయకుల మెప్పులు పొంది చిన్నవయసులోనే తనువు చాలించినాడు.   అసలు ఈ ఇద్దరి చరిత్రలను కావ్యముగా వ్రాసిన ఈ మహనీయులకు  ఆలంబనము  మరొక మహా మనీషి ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు. ఆయన పరిశోధనా ఫలితమే ఈ వాస్తవ గాధా కావ్యములకు ఆలంబనము. వీరు అటు నరసింహారెడ్డి గారిని గూర్చి వారి వంశీకులైన కర్నాటి అయ్యపురెడ్డి గారినుండి (రూపనగుడి అన్న వూరి గ్రామ మునసబు) బుడ్డా వెంగల రెడ్డి గారిని గూర్చి వారి వంశీకులైన బుడ్డా శివారెడ్డి గారు మరియు బుడ్డా దస్తగిరి రెడ్డి గారి నుండి అంతో విషయమును ఎన్నో వివరములను సేకరించి, తానూ స్వయముగా ఎంతో కృషిచేసి రెండు పెద్ద వ్యాసములుగా ఘారతి లో ప్రచురించి యుండినారు.1999 లో తిరిగీ వీరు బసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరియు ముక్కామల్ల నారాయణ రెడ్డి గారి ప్రోత్సాహముతో ఆ మహానుభావులకు 'రేనాటి సూర్యచంద్రులు' అన్న పేరును పెట్టి andhra సారస్వత వినీలాకాశము పై సూర్యచంద్రులుగా సుస్థిరము చేసినారు.ఎంతో మంది సుబ్బారావులు వారిలో 'అబ్బా' అనిపించే సుబారావులెంతమంది .   ఇక తిరిగి విషయానికొస్తే , ఈ 'స్వాతంత్ర్య వీరుడు' అన్న పేరుతో వ్రాయబడిన నరసింహారెడ్డి గారి చరిత్ర పూర్వాపరములు శ్రీయుతులు పెందేకంట్ వెంకట సుబ్బయ్య గారు (మాజీ బీహారు, కర్నాటక రాష్ట్ర గవర్నరుగానే గాక, కేంద్రములో గృహ మరియు ఉభాయసభా వ్యవహారమంత్రిగా యుండినారు.) ఈ విధముగా తెలిపి యున్నారు. " నా పర్యవేక్షకత్వమున ఉయ్యాలవాడలో జరిగిన రైతు మహా సభలో స్వాగతోపన్యాస సందర్భమున శ్రీ పాణ్యం నరస రామయ్య గారు ఈ క్రింది పద్యము చదివినారు: " అమిత ప్రాభవ సర్వసైన్య సముపెతాంగ్లేసామ్రాజ్య సిం హము మీసల్ నులిబెట్టి లాగుచు నుదగ్రాతోప వీరోచితో ద్యమ సంరంభమొనర్చునట్టి 'నరసింహారెడ్డి'కాస్థాన రం గముగా భూరి యశంము గాంచినది మా గ్రామంబు పూర్వంబునన్ " అప్పుడు సభనలకరించిన కీర్తి శేషులగు దామోదరం సంజీవయ్యగారు (ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి)కల్లూరు సుబ్బారావు గారు (1967 లో పద్మశ్రీ గ్రహీత, అనంతపురము కలెక్టరు రూథర్ ఫోర్డ్ తో కాంగ్రెసు సింహము అని అనిపించుకొన్న మహానుభావుడు)  కళా వెంకట్రావు గారు (మాజీ రాష్ట్ర అమాత్యులు ) ఆ పద్యమునకు ఆకర్షితులై ఆ వీరయోధుని చరిత్ర వ్రాయమనుట జరిగింది. అప్పుడు తంగిరాల వారి పరిశోధనా సారమును గ్రహించి స్థానికుల నుడి ఇంకను అనేక వివరములను సంగ్రహించి నరసరామయ్య గారు కాయ రచనకు పూనుకొన్నారు. " వీరికి కీర్తి శేషులు కర్నాటి అయ్యపురెడ్డి గారు మరియు K.C. వెంకట రెడ్డి గారు బాసటగా నిలిచి ఈ కావ్యమును బాహ్య ప్రపంచము చూడగలుగు అదృష్టము కలిగించినారు. ఈ పొత్తము రాశిలో చిన్నదే కానీ వాసి లో గొప్పది. ఇది వెంకటేశ్వరా విశ్వవిద్యాలయ విద్వాన్ విద్యార్థులకు పాఠ్య గ్రంథముగా యుండినది.వీరు కవిగా ఆంద్ర ప్రదేశ ప్రభుత్వముచే సన్మానింప బడినారు. వీరి మేనల్లుడు నంద్యాల గోపాల్ ఆంద్ర ప్రభ సబ్ ఎడిటర్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించి YSR, చంద్రబాబు వంటి నాయకుల మెప్పులు పొంది చిన్నవయసులోనే తనువు చాలించినాడు. ఆతని నిధనమునకు వీరందరూ స్వయముగా వచ్చుటయే ఆతని గొప్పకు తార్కాణము.   మొదలు వీర నరసింహా రెడ్డి గారిని గూర్చి తెలుసుకొందాము. దానికి ఉపోద్ఘాతముగా అచ్చటి రెడ్డి గార్ల మనస్తత్వము అవలోకించుదాము.రాయల సీమ రెడ్ల మానసిక స్వభావము శ్రీ గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మాటలలో   " కరుణ కల్గేనేని శరణన్న శత్రువు నైన కాచి విడుచు నాత్మ బలము పగయ గల్గెనేని పర తన భేదమ్ము చూపకుండా చంపనోపు ఛలము "   మెత్తనైన వారిచిత్తము మొత్తము నా మాటలలో మెత్తనైన మనసు మేలుచేయు గుణము ఆదరమ్ము యొప్పు అతిధి సేవ ముగుద జడన గల్గు  మూడు పాయలబోలు సీమ రెడ్డి గార్ల చిత్త మెపుడు   ఈ మాటను బలపరుస్తూ 40 సంవత్సరాల క్రితము  భారతీయ స్టేట్ బాంక్ లో నా ఉద్యోగ కాలములో జరిగిన ఉదంతము నొకదానిని తెలిబరచుతాను. అప్పటికి bank లో నేను  గుమాస్తా గా చేరి ఒక రెండు సంవత్సరములు అయి ఉండ వచ్చు.(కాకినాడ) రామచంద్ర పురము నుండి ఒక వ్యక్తిని తాత్కాలికముగా కడప జిల్లా లోని జమ్మలమడుగు కు బదిలీ చేసియుందడినారు . జమ్మలమడుగు, నేటి కడప కర్నూలు జిల్లాల ఎల్ల.రాయలసీమకు ఆతను క్రొత్త. కానీ అతని క్రొత్తదనము, నాతో మాత్రము రెండు మూడు రోజులలోనే, పోయి నాకు చాలా ఆప్తుడైనాడు. తాను చూడకముందు కడప పై ఏర్పరచుకొన్న అభిప్రాయమును పూర్తి గా మార్చుకొన్నాడు. కాలాంతరములో అతను తన స్వస్తలమునకు పోయినాడు కానీ మళ్ళీ అక్కడినుండీ వేరొక వ్యక్తిని CASH OFFICER గా  అక్కడినుండీనే post చేసినారు. నా మొదటి మిత్రుడు నా పేరు చెప్పి ఇతనిని పంపినాడు. (2 వ భాగం వచ్చే నెల ...) [audio mp3="http://acchamgatelugu.com/wp-content/uploads/2014/11/Saira-Narashima-Reddy.mp3"][/audio]

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information