శివం- 7 ( శివుడే చెబుతున్న కధలు ) - అచ్చంగా తెలుగు

శివం- 7 ( శివుడే చెబుతున్న కధలు )

Share This
శివం- 7 (శివుడే చెబుతున్న కధలు  )
-      రాజ కార్తీక్
9290523901
(రావణుడి శివభక్తిని గురించి చెప్తుంటాడు శివుడు...)

 వర్షం జోరున పడుతుంది. ఆ వర్షపు చుక్కల ప్రవాహానికి కొద్దిపాటి తడితో రావణుడు చేసుకున్న శివలింగం కరిగిపోతుంది. "ప్రభూ! ప్రమాణం చేయకుండా వెళ్తున్నావా ?" అని ఏడ్వసాగాడు."తిడితేనే భక్తి అనుకునే శంకరుడిని నేను. నాకోసం ఒక భక్తుడు విలపిస్తుంటేఎలా వుండగలను?" ఆ శివలింగం పూర్తిగా కరిగిపోయింది.... కానీ  రావణుడు  చేయిచాచి వున్నాడు.... "వెళ్ళకు తండ్రీ, వుండి వరమివ్వు"అని అన్నాడు. సరిగ్గా అప్పుడు.. ప్రకాశం...ఆ కరిగిపోయిన శివలింగం చోట వెలుతురు విస్ఫోటనం..ఆ కాంతిని చూడలేక కళ్ళుమూసుకున్నాడు. క్రమంగా అతనికి అర్ధం అయ్యింది తన చేతిలో ఒక చెయ్యి వుందని....కళ్ళు తెరచిచూసాడు ఆ భక్తుడు. నేను కూడా రావణునికి సమానంగా మోకాళ్ళ మీద ఉండి  ప్రమాణం చేసాను. నేను కనబడేసరికి అక్కడ వున్న ప్రేతాలు "హరహర మహదేవా" అని నినాదాలు చేయసాగాయ్. రావణుడు నిశ్చేష్టుడయ్యాడు. అతడు కొయ్యబొమ్మలాగా మారాడు. " రావణా, భక్తులారా! మరణ సమయంలో నన్ను తలవండి. నన్ను మీ మనోనేత్రంగా గాంచండి. నన్నే చేరెదరు." అని హామీ యిచ్చాను .రావణుడి కళ్ళు ఎంతో ప్రశాంతంగా వున్నాయ్. చిన్నగా అతడు "హరహరమహదేవా", అంటుంటే నా డమరుకం ఊగసాగింది. "మహదేవా...మహదేవా...మహదేవా...",అంటుంటే శంఖం శబ్దం చేయసాగింది. "హరహరమహదేవా" అంటే డమరుక శంఖ ధ్వనులు ప్రతిధ్వనించాయి. రావణుడు లేచి నిల్చొని నాయందు శ్రధ్ధతో పరికిస్తున్నాడు....నేను కూడా నిలబడ్డాను. " పిలిచిన వెంటనే వస్తే నీవు పలుచన కావా! పరమేశ్వరా! మాలాంటి మందమతులను ఆదరించు మహేశ్వరా!" అని గానం చేసాడు. "భక్తితో పిలిచిన వెంటనే రాకుండా ఎలా వుండగలను దానవేశ్వరా! మందమతి కాదు..మధురఫలశృతి   దశకంఠేశ్వరా!" అని చమత్కరించాను. అక్కడ స్మశానంలో ఉన్న ప్రేతాలు ఉత్సవంగా నాముందు నాట్యం చేస్తున్నాయి. "ప్రభూ! మీరు ఈ శవభస్మంతో అభిషేకం చేయించుకుంటారా?" అని నా సమాధానం వచ్చేలోపలే అక్కడ వున్న చితాభస్మంతో నన్ను అభిషేకంగావించుతున్నాడు. అక్కడ వున్న ప్రేతాలు మా ముందు కూచొని "స్వామీ,మా దేహాలకు ఇది కదూ పండగ..నీ అభిషేకానికి మా శరీర చితాభస్మాలను వాడుతున్న ఈ రావణునికి మా కృతజ్ఞతలు చెప్పండి అని, అన్ని ప్రేతాలు "నమో భూతనాధా" అని నినాదాలు చేయసాగాయి..రావణుడు ఎక్కడ కనబడితే అక్కడ భస్మం తీసుకుని నన్ను అభిషేకించసాగాడు. అక్కడ ఉన్న ప్రేతాలు ఇది నా శరీర భస్మం అని ఆనందంగా అంటున్నాయి.."హర భోలా హరహరమహదేవా" అని ఆ ప్రేతాలు నాట్యం చేయసాగాయి.. కొన్ని ప్రేతాలు "ప్రభూ!బ్రతికున్నంతకాలం తెలుసుకోలేకపోయాం. నీ భక్తి పారవశ్యత ఈసారి అయినా నిన్ను చేరుకునేజన్మ యివ్వమని ప్రాధేయపడ్డాయి. "తథాస్తు" అన్నాను.. భక్తి పారవశ్యతతో ఉన్న రావణుడు దూరం నుండి నృత్యం చేస్తూ నా దగ్గిరకి రాసాగాడు. వేరొక చితి దగ్గిరకి వెళ్ళిన రావణుడు.....అక్కడ చేయిపెట్టి "శివశివా"అన్నాడు నొప్పిగా.... (సశేషం...)

No comments:

Post a Comment

Pages